top of page

కూతురు దిద్దిన కాపురం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Kuthuru Diddina Kapuram' New Telugu Story Written By Venku Sanathani

రచన: వెంకు సనాతని


తండ్రి ఇల్లు అమ్మబోతున్నాడన్న వార్త తెలిసిన వెంటనే భర్తకు ఓ మాట చెప్పి, వెంటనే బస్సు టికెట్ బుక్ చేయించి మరీ హుటాహుటిన ఊరికి బయలుదేరింది శ్యామల.

"నాన్నా.. నేను విన్నది నిజమేనా..!!" గుమ్మంలోకి అడుగు పెడుతూనే అంటుంది శ్యామల.

"అమ్మా..! శ్యామలా..!! ఇదేనా రావటం. అక్కడ అంతా బాగానే ఉంది కదా" అన్నాడు శేషయ్య, కూతురి ఆకస్మిక ఆగమనంతో..

"నాన్నా! అవన్నీ తర్వాత. ఇల్లు అమ్మకానికి పెట్టారట నిజమేనా..!!” గొంతు కాస్త పెద్దది చేసి అడుగుతుంది శ్యామల.

"అమ్మా.. ఇప్పుడేగా వచ్చావు. కొంచెం నెమ్మదించు." అంటూ పక్కనే బల్ల మీద ఉన్న నీళ్ళ గ్లాసు చేతికి అందించాడు. ఆబగా మంచినీళ్ళు అందుకుని తాగడంతో కొంత ఉపశమనం కలుగుతుంది శ్యామలకి.

"ఉరుకుల పరుగులతో హడావుడిగా, హఠాత్తుగా రావడానికి గల కారణం- మళ్ళీ ఇల్లు అమ్ముతున్నారని విన్నాను. ఎందుకు నాన్నా? ఇప్పుడేం అంత కష్టం వచ్చింది? ఉన్న ఈ గూడు కూడా లేకపోతే ఎలా?” చెప్పుకుంటూ పోతుంది శ్యామల. ఆ ప్రశ్నల పరంపరకు జవాబు చెప్పలేక మాటలకందని బాధను లోపలకు దిగమింగుకుంటూ మౌనంగానే ఉండిపోయాడు శేషయ్య.

"నాన్నా..!! నిన్నే అడిగేది. మళ్ళీ ఇల్లు అమ్మాల్సినంత అవసరం ఏం వచ్చింది?" మళ్ళీ అడిగింది శ్యామల. తండ్రి తొందర పడడని తెలుసు. అయినా ఆ విషయమేంటో వివరంగా తెలుసుకుందామని పదే పదే అదే అడుగుతుంది. తండ్రి మథన పడుతున్నాడని అర్థమైంది శ్యామలకి.

బోరున ఏడ్చేశాడు శేషయ్య. ఎన్నాళ్ళ నుండో దిగమింగుకుంటున్న దుఖం పొంగుకొస్తుంది. ఏడుస్తున్న తండ్రిని చూసి "ఏమైంది నాన్నా..!!" అంటూ శ్యామలకు కూడా ఏడుపొచ్చింది.

“చావలేక ఏడుస్తున్నానమ్మా..!!” చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాడు శేషయ్య.

"అవేం మాటలు నాన్నా..!!" తండ్రి కన్నీళ్ళను తుడుస్తూ అంది శ్యామల.

"ఏంటి నాన్నా ఇలా అయిపోయావ్! చాలా పాడై పోయావ్ మనిషివి!!" అంటూ బక్కచిక్కిన తండ్రి శరీరాన్ని చూసి ఇంకా ఏడుపొచ్చింది శ్యామలకి.

“నా దగ్గరకు వచ్చేయ్యమని, నీకెన్ని సార్లు చెప్పాను. ససేమిరా అంటావు. ఒక్కడినైనా ఉంటాను కానీ ఎక్కడికీ రానంటావు. ఎప్పుడో గానీ చుట్టపు చూపుగా వస్తావు. అలానే వెళ్తావు. అదేమంటే అల్లుడింట అన్నేసి రోజులు ఉండటం సరి కాదంటావు. నా మాట నాదే.. నీ బాట నీదే..” అంటూ తండ్రి పై ప్రేమని బాధ రూపంలో పలికింది శ్యామల.

*****

పొలాన్ని కౌలుకు తీసుకుని తిండి గింజలు సంపాదించే సాధారణ రైతు శేషయ్య. పెళ్ళైన పదేళ్ళకే భార్య చనిపోయింది. ఒక అమ్మాయితో పాటు ఇద్దరు మగ సంతానం. కూతురు సాయంతో కొడుకులిద్దరినీ పెంచి పెద్ద చేశాడు. పెద్దోడు పది వరకు చదివాడు. చిన్నోడి చదువు ఐదు వరకే.

తమ్ముళ్ళు చదువుకుంటే చాలని ఇంటికే పరిమితమై స్కూలు గడప కూడా తొక్క లేదు శ్యామల. బడికి వెళ్ళకపోతేనేం అన్నీ చక్కపెట్టగల లోకజ్ఞానం తెలిసిన పిల్ల. ఆ కారణంతోనే కట్నం కూడా లేకుండా కోడలిగా తీసుకెళ్ళారు అత్తింటి వారు. మంచి సంబంధమని, మైళ్ళ దూరమని కూడా ఆలోచించకుండా పెళ్ళి చేసి తనకు ఉన్నదే పెట్టి పంపించాడు తండ్రి. తల్లిలా వండి వార్చిన కూతురు గురించి ఎటువంటి దిగుల్లేదు శేషయ్యకి.

తన తాత ముత్తాతల దగ్గర నుండి వస్తున్న ఆ నాలుగు సెంట్ల స్థలంలో ఉన్న పూరింటిని రెండు భాగాలుగా చేసి కొడుకులిద్దరికీ సమానంగా పంచాడు శేషయ్య. కొడుకులు తలో పని చేసుకుంటూ, కుటుంబంలో ఎలాంటి కలతల్లేకుండా కొంతకాలం సజావుగానే సాగింది జీవనం.

కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. విధి తన పని తాను చేసుకుంటూ పోతుంది. అసమర్థతకు అప్పుల్లో తేలే సరికి ఇంటికి ఎసరు పెట్టాడు పెద్దోడు. చంకన చంటి పిల్లలున్నారు. నీడ నిచ్చే గూడును అమ్ముకుంటే చెట్టు కొకరు పుట్ట కొకరు అవుతారని నచ్చ చెప్పినా వినలేదు పెద్దోడు. పెద్దోడు పోరు పెట్టే సరికి చిన్నోడికి కూడా ఆశ పుట్టింది. తండ్రి నుండి, తోబుట్టువుల నుండి ఎప్పుడూ ప్రేమ తప్ప ఏం ఆశించలేదు శ్యామల. ఇప్పుడూ అంతే.

ఇల్లు అమ్ముడైంది. తండ్రి గురించి పట్టని తనయులు తలో బాట పట్టారు. కూతురు రమ్మని పట్టు బట్టినా వెళ్ళలేదు సరి కదా కొడుకు చేసిన పనికి ఆ ఊర్లో ముఖం చెల్లక పక్కూరు వెళ్లి ఆ ఉన్న డబ్బుతో 2 సెంట్లు భూమి కొనుక్కుని అందులోనే ఇల్లేసుకున్నాడు శేషయ్య.

కొంత కాలానికి అదే ఊరికి మకాం మార్చాడు పెద్దోడు. వాటా డబ్బుతో వ్యాపారం చేసి దివాళా తీశానని తండ్రి దగ్గర వాపోయాడు. తండ్రి పంచన చేరాడు. చిన్నోడి సంగతి ఏంటని అడిగిన శేషయ్యకి తెలీదు అనే సమాధానం వచ్చింది పెద్దోడి నుండి. కొడుకు, కోడలు, పిల్లల రాకతో శేషయ్య ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందం ఆవిరవ్వటానికి ఎంతో కాలం పట్ట లేదు.

కొడుకు కసుర్లతో, కోడలి విసుర్లతో పెట్టీ పెట్టక, తినీ తినక చిక్కి సగమయ్యాడు శేషయ్య. పిల్లల చేత కనీసం తాతయ్య అని పిలిపించుకోలేని దుస్థితి శేషయ్యది.

ఓ రోజు కంచం నిండా అన్నం పెట్టి వాళ్ళకున్న బాకీల గురించి ఏకరువు పెట్టారు కొడుకూ కోడలు. ఈ ఇల్లు కూడా అమ్మడం తప్ప వేరొక మార్గం లేదన్నాడు కొడుకు. వత్తాసు పలికింది కోడలు. ఆస్తులు, అప్పులు అంటూ రుణబంధాలు తప్ప అనుబంధాలు పట్టని కొడుకూ కోడలు. ఆ బాటలోనే పిల్లలు. నిట్టూర్పుగా నవ్వుకున్నాడు శేషయ్య. ఎందుకు నవ్వాడో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇద్దరూ.

*****

"బాగున్నారని అనుకున్నాను కానీ, ఇంత బాధలో ఉన్నారని ఊహించలేదు" అంది శ్యామల తండ్రిని ఓదారుస్తూ. "నిన్ను చూసుకోవడానికి అమ్మా కూడా లేదు నాన్నా అని చెప్పినా, వినిపించుకోకుండా దూరపు సంబంధం చేశావు. నా వద్ద ఉందువుగాని రమ్మంటే రావు. ఇప్పుడు నీ పరిస్థితి చూడు" అంది శ్యామల. తండ్రిపై ఎంత ప్రేముందో స్పష్టంగా కనిపిస్తుంది శ్యామల మాటల్లో..

"వాళ్ళు వెళ్ళి, ఎన్ని రోజులు అవుతుంది?" అన్న శ్యామల మాటకు "నెల పైనే అవుతుంది" అని శేషయ్య వైపు నుండి సమాధానం వచ్చింది.

"తోబుట్టువొచ్చిందని తెలుసుకుని ఇంటికొచ్చింది, ఆ ఊర్లోనే అద్దెకుంటున్న పెద్దోడి కుటుంబం. 'బాగున్నావా' అంటూ అందరూ పలకరించగా "కుశల ప్రశ్నలు తర్వాత. అసలు విషయం చెప్పండి" అంటూ నిలదీసింది శ్యామల.

“విషయం అంటే ఏముంది? ఈ ఇల్లు అమ్మితే సమస్యలు అన్నీ తీరుతాయి” అంటాడు పెద్దోడు. అందరూ అదే మాట వల్లె వేశారు. “సమస్యలు తీరతాయి అంటున్నారు సరే, మరి నాన్న సంగతి ఏంటి?” అంటుంది శ్యామల తమ్ముడి వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ. నీళ్ళు నమిలాడు పెద్దోడు. సమాధానం కోసం మరదలి వైపు చూస్తుంది. మరదలు తల తిప్పుకుంటుంది. పిల్లల వైపు చూస్తుంది. మాకేం తెలియదన్నట్టు నేలచూపులు చూస్తారు పిల్లలు.

మీ వద్ద నుండి సమాధానం రాదు. కాదు కాదు మీ వద్ద సమాధానం లేదు. “నీ తండ్రి ఎలా ఉన్నాడు? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? జీవితం అంటే ఎప్పుడూ డబ్బేనా..? ఇంకేం లేదా?” ప్రశ్నల్ని గుప్పిస్తూ పెద్దోడిని నిలదీసింది శ్యామల.

"సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఏం చేశావో, ఇప్పుడూ అదే చేస్తా అంటున్నావు. నీతో పాటు నీ భార్యా పిల్లలు కూడా. ఒక సమస్య ఎదురైందిదని, వద్దంటున్నా ఇల్లు అమ్మి పది సమస్యలు కోరి కొని తెచ్చుకున్నట్టై చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. మళ్ళీ ఈ ఇల్లే గతి అయ్యింది. మళ్ళీ అదే తప్పు చేస్తాను అంటున్నావు. అది ఎంతవరకు సమంజసమో నువ్వే చెప్పాలిరా పెద్దోడా" అని సూటిగా అడిగింది శ్యామల. “నీడనిచ్చే గూడుని అమ్మాలనే ఆలోచన ఎలా వస్తుందిరా నీకు!!” అంటూ గట్టిగ నిలదీసింది శ్యామల. తలదించుకున్నాడు పెద్దోడు.

"పెంచి, పెద్ద చేసిన తండ్రిని చూడనంటూ ముఖం చాటేశావు. ఇంటి కోసం మళ్ళీ తలుపు తట్టావు. నీ పాచిక పారక పోవటంతో గడప దాటావు. ఇల్లు అమ్మాల్సిందేనని ఫోన్లు చేసి మరీ పోరు పెడుతున్నావు. నీకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..!!' రేపు నీ పరిస్థితి ఇంతే.

విధి ఎవ్వరినీ వదలదు. ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇస్తుంది. అది మంచైనా.. చెడైనా.. అవసాన దశలో ఉన్న కన్న తండ్రిని కష్ట పెట్టడం తప్పురా, మీరైనా ఆనందంగా ఉన్నార్రా.. ఇలాంటి ప్రవర్తనతో అనర్థాలు తప్ప ఆనందాలు ఉండవు" అంటూ హితవు పలికింది శ్యామల.

శ్యామల మాటలకు సత్యం బోధ పడింది పెద్దోడికి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భార్యా పిల్లలతో సహా తండ్రి కాళ్ళ మీద పడతాడు. తల్లిదండ్రులకు ప్రేమించటం, క్షమించడం తప్ప ఏం తెలుసు. అదే చేశాడు శేషయ్య.

తండ్రి గురించి జాగ్రత్తలు చెప్పి, "చిన్నోడిని కూడా చేరదీసి అందరూ కలిసి ఉండండి. రెక్కల కష్టాన్ని నమ్ముకోండి. అది ఎన్నటికీ వమ్ము కాద"ని మంచి చెప్పి, వచ్చిన పని పూర్తి అవ్వటంతో తెల్లారి బస్సుకు విశాఖపట్నానికి బయలుదేరుతుంది శ్యామల.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

సమాప్తం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం :

పేరు : వెంకు సనాతని

అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత

ఊరు : బాపట్ల

జిల్లా : గుంటూరు

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్



108 views0 comments
bottom of page