లలితా సహస్రనామాల పారాయణ
- Rayala Sreeramachandrakumar

- Sep 30
- 5 min read
#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #లలితాసహస్రనామాలపారాయణ, #TeluguDevotionalArticle
దేవీ నవరాత్రుల్లో లలితా సహస్రనామాల పారాయణ విశిష్టత
Lalitha Sahasranamala Parayana - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 30/09/2025
లలితా సహస్రనామాల పారాయణ - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
మహిళలు అందరూ కలిసి వారానికి ఒకరి ఇంట్లో లేదా దగ్గరున్న గుడిలో వైభవంగా లలిత చదువుతారు. మహిళలే కాదు అందరూ చదవాల్సిందే. కానీ చదవడం అనే కన్నా పారాయణం చేయడం అంటేనే సముచితంగా ఉంటుంది. పరా అంటే అన్నిటికంటే శ్రేష్ఠమైన శక్తి. అయనం అంటే ప్రయాణం. ఉత్తమ గతి పొందడానికి శ్రేష్టమైన శక్తి వైపు చేసే ప్రయాణమే పారాయణం.
ఈ లలితా సహస్రనామాలు దివ్యమైనవి, రహస్యమైనవి. ఈ నామాలలో అమ్మవారి రూప వైభవం, లీలా వైభవం, మంత్ర వైభవం, యోగ వైభవం, తత్త్వ వైభవం దాగి ఉన్నాయి. అందుకే వీటిని రహస్య నామాలు అంటారు. అర్థం చేసుకొంటూ పారాయణం చేసినపుడు అందులో తేలికగా లీనమై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలం. అర్థమయ్యే కొద్దీ ఎక్కువగా సంతృప్తి, ఆసక్తి పెరుగుతాయి. చదవడానికి సరిగా రానివాళ్ళు ఇతరులు పారాయణం చేస్తుంటే విని శ్రవణానందం పొందుతారు. సన్మార్గంలో నడవడానికీ, ఆథ్యాత్మిక ప్రగతి సాధించడానికి సులభమైన ఉపాయం లలిత పారాయణం. విష్ణు సహస్రనామాల పారాయణానికి కూడా ఇదే వర్తిస్తుంది. విష్ణు సహస్రనామాలను వెలుగులోకి వచ్చింది భీష్మ పితామహుడు. మరి లలిత సహస్రనామాలను రచించింది ఎవరు, వెలుగులోకి తెచ్చింది ఎవరో తెలుసుకుందాం.
లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు కానీ వ్యాసుడు రచించిన బ్రహ్మాండ పురాణంలో దీని గురించిన వివరణ ఉంది. ఆ పురాణం ద్వారానే మనకు ప్రచారంలోకి వచ్చింది. లలితా సహస్రనామాలను సాక్షాత్తుగా అమ్మవారే ఒక దేవతాసభలో చెప్పారని పురాణ కథలు ద్వారా తెలుస్తుంది. ఎనిమిది దేవతల చేత అమ్మవారు ఈ నామాలను పలికించారని చెప్పడం జరిగింది. సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వాసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయని, మోదిని, సర్వేశ్వరి మరియు కౌలిని అనబడే ఎనిమిది మంది దేవతలు లలితా సహస్రనామాలను రచించారు. వీరినే వాగ్దేవులు అంటారు. శ్రీ చక్రంలో బిందుస్ధానం నుంచి మూడవ చక్రమైన సర్వరోగహర చక్రంలో ఉండే అమ్మవారి శక్తులే ఈ ఎనిమిది వాగ్దేవులు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. రావణాసురుడితో యుద్ధానికి ముందు ఈ అగస్త్య మహర్షే ఆదిత్య హృదయం శ్లోకాలను శ్రీరాముడికి ఉపదేశించి విజయాన్ని చేకూర్చాడు.
లలిత సహస్రనామాలను చదవడం వల్ల కుండలిని శక్తి జాగృతమై మనలో పాజిటివ్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అమ్మ వారే స్వయంగా శక్తి స్వరూపిణి. ఆవిడ ఆదిశక్తి, పరాశక్తి. ఆది అంటే తొలి, సనాతనం. పరా అంటే అత్యున్నతమైనది. కాబట్టి పరాశక్తి అంటే అత్యున్నతమైన శక్తి అని అర్థం. విశ్వానికి మూల శక్తిగా, సృష్టికి కారణమైన శక్తిగా అమ్మవారిని స్తోత్రం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. అమ్మలందరికీ జనని అయినది, అన్ని అమ్మలకు మూలమైనది, దేవతలందరికంటే పెద్దది, దేవతల కష్టాలు తొలగించేది, మరియు దేవతలలో కూడా అంతర్గతంగా ఉండే దైవం అమ్మవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తులు కూడా ఆదిపరా శక్తి నుండే సృష్టి స్థితి లయ కారకులుగా తమ విధులను నిర్వహించే శక్తిని పొందుతారు. లలిత అమ్మవారిని స్తోత్రం చేస్తే ముగ్గురు అమ్మవార్లకి చేసినట్టే. ముగ్గురమ్మల అమ్మ మూలపుటమ్మ ఆవిడే. లలిత సహస్రనామాలను చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
లలిత సహస్రనామాలను ఎవరయినా చదువ వచ్చు, కానీ అక్షర దోషం లేకుండా చదివే ప్రయత్నం చేయాలి. దీన్ని వడివడిగా చదవడం లేదా ఎక్కువ సమయం తీసుకుని మెల్లగా చదవడం చేయరాదు. ఒక నిర్ణీత సమయం అనగా సుమారు 40 నుంచి 50 నిమిషాల వరకు చదవచ్చు. లలితా సహస్రనామాల ఆరంభంలోనే ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరి అనే నామాలు వినిపిస్తాయి. ఈ మూడు నామాలు కూడా సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలు. ఆ తర్వాత అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు ఒకదాని వెంట ఒకటి వరుసగా గోచరిస్తాయి. ఒక నామాన్నించి మరో నామం గొలుసు కట్టు సూత్రాలుగా సాగిపోతూ ఉంటాయి. లలితా సహస్రనామాలు సాక్షాత్తు అమ్మవారికి సంబంధించిన పురాణమే. ఈ సహస్రనామాలలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన. కుండలిని జాగృతి ఇలా అనేక రకాల ఆరాధనలు కనిపిస్తాయి
తారకాసురుడనే లోకకంటకుడిని చంపాలనే దేవతల కోరిక మేరకు పూలభాణంతో శివుడిలో కోరికను పుట్టించి తపస్సుని భగ్నం చేసే ప్రయత్నం చేస్తాడు మన్మధుడు. ఆ సందర్భంగా శివుడు కోపంలో తెరిచిన మూడవ కంటితో మన్మధుడు కాలి బూడిదైపోతాడు. ఆ బూడిద నుంచి పుట్టుకొచ్చిన వాడే ముల్లోకాలను వణికించిన భండాసురుడు అనే రాక్షసుడు. ఆ భండాసురుడు చివరికి అమ్మవారి చేతిలోనే మరణిస్తాడు. లలితా సహస్రనామాలలో ఈ భండాసురవధ వృత్తాంతం సూచింపబడుతుంది.
లలితా సహస్రనామం చివరిలో శ్రీ లలిత రహస్య నామ సహస్ర స్తోత్రము అని ఉంటుంది. ఎందుకో తెలుసా ? అర్హులైన వారికే దీని గురించి చెప్పాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేసేవారికి, ఉపాసకులకు కావలసిన జ్ఞానాన్ని అందించే అనేకానేక రహస్యాలు ఇందులో ఉన్నాయి. అందుకే ఈ నామాలు దివ్యమైనవి, రహస్యమైనవి. అమ్మవారి బీజాక్షరాలు, సృష్టి రహస్యాలు, అష్ట విధులు, దశమహావిద్యలు ఈ నామాలలో నిఘూడమై ఉన్నాయి. లలిత అమ్మవారిని స్తుతించడానికి అనంతంగా వెయ్యి నామాలు ఎందుకంటే పారాయణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ గుణం మనస్సుకు హత్తుకుని నిలబడి పోవాలి. అందుకే ప్రతి నామానికి అర్థం తెలుసుకొని పారాయణం చేస్తుంటే విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. మచ్చుకు 130వ శ్లోకార్థాన్ని విశ్లేషించుకుందాం.
ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణీ |
సర్వధారా సుప్రదిష్ఠా సదసద్రూపదారిణీ ||
ఇచ్ఛాశక్తి - సంకల్పశక్తి, జ్ఞాన శక్తి - జ్ఞానకారకమైన శక్తి, క్రియాశక్తి - కార్యాచరణ (పనిచేయడం). ఈ మూడు శక్తుల స్వరూపిణిగా లలితా పరమేశ్వరి దేవి కొలువై ఉంది. సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది, సృష్టికి మూలాధారం. సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొన్నది. సదసద్ రూపధారిణీ - వ్యక్తమైనదిగా, అవ్యక్తమైనదిగా రూపములను ధరించునది, సాకార నిరాకార రూపాలను కలిగినది. ఇచ్చాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తి ఈ మూడు శక్తులు బిందు త్రికోణములను సూచిస్తాయి. లలితా పరమేశ్వరి అమ్మవారు ఈ త్రిశక్తుల బిందు త్రికోణ స్వరూపిణిగా, శ్రీ మాతగా విరాజిల్లుతున్నది ! సరస్వతి.. లక్ష్మి.. గౌరి.. వంటి దివ్య శక్తులుగా వ్యవహరింప బడుచున్నది.
ఈ నేపథ్యంలో బిందు త్రికోణం, శ్రీ చక్రం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. "బిందు త్రికోణం" అనేది శ్రీచక్రంలో ఒక భాగం. ఇక్కడ బిందువు అంటే పరమేశ్వరుడు, త్రికోణం అంటే శక్తి అని అర్థం. ఈ బిందు త్రికోణం శ్రీచక్రం (యంత్రం) లోపలి భాగంలో ఉంటుంది మరియు శ్రీచక్రం చుట్టూ చతురస్రం ఉంటుంది. శ్రీచక్రం విశ్వానికి సూచికగా పరిగణించబడుతుంది. బిందువు, త్రికోణం, చతురస్రం లేకుండా ఏ యంత్రమూ ఉండదు. శ్రీచక్రం మన చుట్టూ రక్షణాత్మక కవచాన్ని ఏర్పరుస్తుందని నమ్ముతారు, ఇది ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది. దీన్ని పూజా స్థలంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు.
ఇచ్చాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తుల ఉపాఖ్యానం :
-------------------------------------------------------------
ప్రతి మనిషిలోనూ భగవంతుడు ప్రసాదించిన ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడు శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇచ్చాశక్తి అంటే మనం ఏదైనా చేయాలనీ కోరుకొని సంకల్పం చేసుకునేది. ఉదాహరణకు ఒక శిల్పి గురించి చెప్పుకుందాం. ఒక శిల్పి ఒక పెద్ద రాయిని చూస్తాడు. "అబ్బా ఈ రాయి ఎంత బాగుంది! దీనిని అందమైన శివపార్వతులుగా చెక్కితే ఎంత బాగుంటుంది, " అని మనసులో అనుకుంటాడు. అతనిలో ఆ కోరిక రూపు దిద్దుకుంది. అది అతని ఇచ్చాశక్తి, దాన్నే సంకల్పశక్తిగా కూడా చెప్పొచ్చు. జ్ఞానశక్తి అంటే మనసులో ఏర్పడిన కోరికను ఎలా నెరవేర్చుకోవాలో తెలిపేది. ఆ పరిజ్ఞానమే కార్యసాధనకు ఉపయోగపడే పరికరం. ఆ శిల్పి తాను చూసిన రాయిని శివపార్వతులుగా చెక్కాలి అనుకున్నాడు కదా! దానికి ఎలాంటి పనిముట్లు కావాలి ఏ విధంగా చెక్కాలి అనే ఆలోచనతో ప్రణాళికను సిద్ధం చేయగలిగేది అతని జ్ఞానశక్తి. ఇక క్రియాశక్తి అంటే ఆ శిల్పి అనుకున్న కోరికను తన జ్ఞానంతో తయారు చేసుకున్న ప్రణాళికతో ఒక పద్దతి ప్రకారం పని మొదలు పెట్టడం. ఆ పనితనమే అతనిలోని క్రియాశక్తి. ఆ రాయిని శివపార్వతులుగా చెక్కే శక్తి ఏదైతే ఉందో అదే అతనిలోని క్రియాశక్తి, లేక కార్యశక్తి. ఈ మూడు శక్తుల సమ్మేళనంతో అతను కార్యసాధకుడు అవుతాడు.
ప్రతి మనిషిని పుట్టించేటప్పుడే భగవంతుడు ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను నిఘూడంగా పెట్టి పంపిస్తాడు. మనం వాటిని గుర్తించి, బయటికి తీసి సక్రమంగా ఉపయోగిస్తే అనుకున్న దానిని సాధించి విజయాన్ని పొందగలం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
"శ్రీ మాత్రే నమః"
ఆర్ సి కుమార్
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త





Comments