లైక్ లే లైఫ్ కాదు
Updated: Mar 12
#BhallamudiNagaraju, #భళ్లమూడినాగరాజు, #LikeLeLifeKadu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Like Le Life Kadu - New Telugu Story Written By Bhallamudi Nagaraju
Published in manatelugukathalu.com on 07/02/2026
లైక్ లే లైఫ్ కాదు - తెలుగు కథ
రచన: భళ్లమూడి నాగరాజు
చుట్టూ కొండలు, గలగల పారే జలపాతాలు, పచ్చని ప్రకృతి మధ్య అలరారే రాయగడ జిల్లా. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామం గుణుపురం.
చురుగ్గా చదువుకుంటున్న ప్రదీప్ గుణుపురం కళాశాలలో చేరడంతో, ఓ మొబైల్ ఫోన్ అతని చేతిలో చేరింది. అదే అతని ప్రపంచం అయింది.
రోజూ కళాశాల నుంచి రాగానే కొంతసేపు పొలం పనుల్లో తండ్రికి సహాయం చేయడం పరిపాటి.
పొలం పనులు చేస్తూనే, మధ్య మధ్యలో ఫోన్ చూడటం, తండ్రి పిలిచినా
“ఒక్క నిమిషం నాన్నా” అంటూ జవాబు ఇచ్చేసి స్క్రీన్ కు అతుక్కుపోవడం అలవాటైపోయింది.
ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన ప్రదీప్ సహజ సిద్ధంగానే గాయకుడు. కాస్త చదువు అబ్బడంతో పల్లె పదాలతో జానపద గీతాలు రాసుకుంటూ తన పుస్తకాల్లోనే దాచుకున్నాడు.
ఒకరోజు తన స్నేహితుడు ప్రదీప్ పాటలు చూసి
“ఇవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యి, ఎవరైనా చూస్తే నీ లైఫ్ మారిపోతుంది” అని అన్నాడు.
****
ఎవరికైనా ‘తొలి’ అనేది తీపి గుర్తు.
ప్రదీప్ విషయంలో అది అతడ్ని నేల మీద నిలువనీయలేదు.
‘మొదటి పోస్ట్’,
‘మొదటి లైక్’,
‘మొదటి ఆశ’ మొదలయ్యాయి.
ఆశ మెల్లగా ఆసక్తిగా,
ఆసక్తి అలవాటుగా,
అలవాటు వ్యసనంగా మారాయి.
కొద్ది రోజుల్లోనే అతను రాసిన పాటలకు వేల లైక్‌లు, వందల కామెంట్లు.
ప్రతి క్షణం ‘ఎంతమంది చూశారు.. ఎన్ని కామెంట్లు వచ్చాయి’ అని చూడటంతోనే సగం రోజు గడిచిపోయేది. ఎక్కడ ఉన్నా.. ఏమి చేస్తున్నా.. ఫోన్ చూడటంలో మునిగిపోయేవాడు.
అప్పుడే వచ్చిన కామెంట్ చూసి ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు: “సూపర్ బ్రో.. నీ మాటల్లో నిజం ఉంది.. నీ పాటలో జీవం ఉంది.”
ఇప్పుడు గుణుపురంలో ప్రదీప్ ని అందరూ గుర్తిస్తున్నారు. అతని పాటల్ని మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో అతను చక్కర్లు కొడుతున్నాడు.
‘రాయగడ డాట్ కామ్ సోషల్ మీడియా ఛానల్’ వారు ఇంటర్వ్యూ చేశారు. దీంతో కాలేజీలో ఫ్రెండ్స్ అభినందనలతో ముంచెత్తారు.
ప్రదీప్‌లో నమ్మకం పెరిగింది. కామెంట్లు, ఫాలోవర్స్ మీద ఆసక్తి పెరగడంతో ఇప్పుడు అతను ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నాడు. పాటలు రాయడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. ఎప్పుడో ఒకటి రాసి పోస్ట్ చేస్తే,
“పాట పేలవంగా ఉంది” అని
“మట్టి వాసన లోపించింది”
“అర్థం లేదు” అంటూ నెగెటివ్ కామెంట్లతో, అతని గుండె బరువెక్కింది.
పాటలపై ట్రోల్స్ పెరిగాయి.
ప్రదీప్‌లో భయం మొదలయ్యింది.
పొలం పనులకే కాదు, కాలేజీకి వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. స్నేహితుల్ని కూడా కలవడానికి ఇష్టపడటం లేదు.
“ఏమైందిరా.. అలా ఉన్నావు.. ఆరోగ్యం బాగోలేదా?” అని తండ్రి అడిగితే ముక్తసరిగా సమాధానం ఇస్తున్నాడు. తల్లి పదే పదే అడుగుతే ఆమె వంక కోపంగా చూస్తున్నాడు.
ఆ రోజు ప్రదీప్‌లో మార్పుకు నాంది పలికింది.
అర్థశాస్త్రం అధ్యాపకుడు సత్యనారాయణ మిశ్ర దారిలో కనిపించి
“ఏంటి ప్రదీప్, కాలేజీకి సరిగ్గా రావడం లేదు?” అని అడిగారు.
“...........” మౌనమే జవాబు.
అతనే మరలా మాట్లాడుతూ,
“నువ్వు చాలా తెలివైన వాడివి. సహజంగా నీలో మంచి కవి, గాయకుడు ఉన్నాడు. గుర్తింపు అనేది నువ్వు కోరుకున్న వెంటనే వచ్చేది కాదు. దానికోసం నువ్వు ప్రాకులాడకూడదు.. నీ వంతు కృషి చేయడమే. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది,” అని అన్నారు.
“లైక్ లే లైఫ్ కాదు!”
“ఆలోచించు” అని చెప్పేసి అతను వెళ్లిపోయారు.
ఇంటికి వచ్చి రాత్రంతా ఆలోచించాడు.
అతనిలో మార్పు వచ్చింది.
ఫోన్ తీశాడు.
“ఇదే నా చివరి మెసేజ్!”
“సోషల్ మీడియా నన్ను గెలిపించింది,
కానీ నిజ జీవితంలో ఓడిపోయాను.”
అంతే! ఫోన్ ఆఫ్ చేసేశాడు.
రాత్రి హాయిగా నిద్రపోయాడు. మరునాడు
కాలేజీ నుంచి వస్తూనే పొలానికి వెళ్లి నాన్నకు సహాయం చేశాడు.
ఇప్పుడు పొలంలో నాన్నతో సెల్ఫీ తీసుకున్నాడు.
అప్‌లోడ్ కోసం కాదు,
గుండె గదుల్లో దాచుకోవడానికి.
ప్రదీప్ సెల్ఫీ తీస్తుంటే అతని నుదుటి నుంచి రాలిన చెమట చుక్క తండ్రి పాదాలమీద పడింది. ఇద్దరి మనసులు పులకించాయి.
***
భళ్లమూడి నాగరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం





Comments