top of page
Original.png

లోకం, మనిషి, భగవంతుడు - మూడు మౌలిక సత్యాలు!

మాండూక్యోపనిషత్తు, లోకం మనిషి భగవంతుడు, ఆత్మ తత్వం, ఉపనిషత్తులు, అద్వైత వేదాంతం, ఓంకారం, తురీయ స్థితి, వైశ్వానరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, బ్రహ్మం, ఆధ్యాత్మిక వ్యాసం, తెలుగు వేదాంతం, సనాతన ధర్మం

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'లోకం, మనిషి, భగవంతుడు - మూడు మౌలిక సత్యాలు' వ్యాసంలో  మాండూక్యోపనిషత్తు బోధించిన ఆత్మ, ఓంకారం, నాలుగు చైతన్య స్థితులను ప్రతిబింబించే ధ్యానస్థ వేదఋషి.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'లోకం, మనిషి, భగవంతుడు - మూడు మౌలిక సత్యాలు' వ్యాసంలో  మాండూక్యోపనిషత్తు బోధించిన ఆత్మ, ఓంకారం, నాలుగు చైతన్య స్థితులను ప్రతిబింబించే ధ్యానస్థ వేదఋషి.

Lokam Manishi Bhagavanthudu - Telugu Inspirational Artical | Ramana Bandhakavi

లోకం, మనిషి, భగవంతుడు - మూడు మౌలిక సత్యాలు! తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | రమణ బంధకవి

Published in manatelugukathalu.com on 26/06/2026


మనిషి అంటే మనం; లోకం అంటే మనం జీవించే జగత్తు; ఈ రెండిటికీ కారణభూతమనబడే  భగవంతుడు - ఈ మూడూ మౌలిక సత్యాలు అనుకోవచ్చు. ఈ మూడూ నిజానికి ఏమిటి? వీటి మధ్య నెలకొన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలు అనాదిగా భారతీయ తత్వవేత్తలనే కాక పాశ్చాత్య తత్వవేత్తలను కూడా ప్రేరేపింపచేస్తూ, ఈ నాటికీ అవి మనలను అలోచింపచేస్తూనే ఉన్నాయి. మన ఉపనిషత్కాలపు ఋషులు మాత్రం ఈ మూల సత్యాలను విచారణ చేసి చక్కని సమాధానాలను పొందగలిగేరు. పై మౌలిక సత్యాలపై వారి ఆలోచనలు ఏమిటో కొంతవరకు మన పరిదిలో చూద్దాం.


లోకం:

లోకం అంటే ఎదో శూన్యం నుంచి ఒక్కసారిగా సృష్టించబడింది కాదు. కారణం లేకుండా ఏ కార్యమూ జరుగదు. శూన్యం నుండి దేనినీ సృష్టించలేము. అదే విధంగా, ఉన్న దేనినీ లేకుండా చేయడం సాధ్యం కాదు.  అది అత్యంత సూక్ష్మంగా మారవచ్చు. మళ్ళీ స్థూల వస్తువుగా మార్పు చెందవచ్చు. బీజం నుండి చెట్టు, చెట్టు నుండి బీజం ఇలా పునరావృతం అవుతాయి. జంతువులు, మానవులు కూడా ఇదే పరిణామక్రమానికి బద్ధులై ఉంటారు. స్థూలం నుండి సూక్ష్మం... మళ్ళీ సూక్షం నుండి స్థూలం; ఇలా జీవన చంక్రమణం సాగుతూ ఉంటుంది.


దీనిని బట్టి చూస్తే, ఈ లోకానికి ఆద్యంతాలు లేవని తెలుస్తోంది. సృష్టి ఆద్యంత రహితమైనదని వేదాలు చెపుతున్నాయి. కనుక సృష్టి లేనటువంటి కాలం ఎప్పుడూ లేదని తేలుతోంది. కొన్ని సమయాలలో లోకం నిష్క్రియ స్థితిలోనూ అంటే అవ్యక్తంగానూ, కొన్ని సమయాలలో క్రియాజనిత స్థితిలోనూ అంటే వ్యక్తంగానూ ఉంటుంది. ఇంకోవిధంగా చెప్పాలంటే, లోకం యొక్క పరిణామం లయం నుండి ఆవిర్భావం, ఆవిర్భావం నుండి లయంగా కొనసాగుతూ ఉంటుంది.


మనిషి:

ఇక మనిషి ఎవరన్న ప్రశ్నకు మన ఉపనిషత్తులు ఈ విధంగా సమాధానం చెబుతున్నాయి. మనిషిలో నాలుగు పరిమాణాలు(Dimensions) లేక స్థితులు నిండి ఉంటాయి అంటుంది మాండూక్యోపనిషత్తు. జాగ్రద్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులలో మనం మార్చిమార్చి సంచరిస్తూవుంటాము. వీటిలో మనం విభిన్నమైన అనుభవాలను పొందుతాము. మనం ఈ మూడు స్థితులలోనూ లోకంతో సంబంధం కలిగి ఉంటాము. ఈ మూడు స్థితులను ఇముడ్చుకున్న మొత్తం పరిమాణమే ఆత్మ. ఇది నాలుగవ పరిమాణం అని చెప్పబడుతోంది. వీటి గురించి మరి కొంత విపులంగా తెలుసుకుందాము.


మొదటి పరిమాణం- జాగ్రదావస్థ- వైశ్వానరుడు:

మనం జాగ్రదావస్థలో ఉన్నప్పుడు  పనిచేస్తూ ఉంటాము, చదువుతుంటాము, ఆడుతూ ఉంటాము, చింతన చేస్తూ ఉంటాము. ఇదంతా చేస్తూ, జాగ్రదావస్థలో ఈ జగత్తును అనుభవించేవాడు వైశ్వానరుడు. అంటే జగత్తును అనుభవించే స్థితిలో మనం వైశ్వానరుడు అనే పేరు పొందుతాము.  


మనం బాహ్య జగత్తును అనుభవించడం మన స్థూల శరీరంతోనే. అందుకే మన స్థూల దేహం బాహ్య జగత్తు యొక్క అంగంగా సూచించబడుతోంది. ఈ జాగ్రదావస్థలో పంతొమ్మిది ద్వారాల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము. అవి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు పంచప్రాణాలు, మనసు, బుద్ధి, అహం, చిత్తం అనేబడే నాలుగు మనోస్థితులు. ఓంకార మంత్రం మొదటి భాగమైన ‘అకారం’ జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. ఇది మన మొదటి పరిమాణం.


రెండవ పరిమాణం – స్వప్నావస్థ- తైజసుడు:

తరువాతది స్వప్నావస్థ. ఇక్కడ బాహ్య జగత్తు లేదు. అనుభవాలన్నీ మానసిక జగత్తులోనే కలుగుతాయి. శరీరం నిద్రలో విశ్రాంతి తీసుకుంటుంది.  ఆ సమయంలో కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. కానీ మనకు బాహ్య జగత్తు స్ఫురణ ఉండదు. ఎందుకంటే బాహ్య జగత్తును స్ఫురింపజేసే చేతన మనసు (conscious mind)నిద్రలో మునిగి ఉంటుంది. కానీ సుప్త చేతన మనసు(sub-conscious mind) మేల్కొనే ఉంటుంది. 


జాగ్రదావస్థలో పొందిన అనుభవాల ఆధారంగా ఆ మనసు ఒక నూతన లోకాన్ని సృష్టిస్తుంది. అదే కల - స్వప్న లోకం. ఈ స్వప్న లోకం గురించి బృహదారణ్యక  ఉపనిషత్తు ఈ విధంగా వివరిస్తోంది; "అక్కడ రధాలు లేవు, పూన్చడానికి జంతువులు లేవు, బాటలు లేవు, సుఖాలు లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు, కాసారాలు లేవు, జలాశయాలు లేవు, నదులు లేవు. అతడు అన్నిటినీ సృజిస్తాడు. ఎందుకంటే అతనే సమస్తాన్ని రూపొందించేవాడు కనుక" 


శరీరము, చేతన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుప్త చేతన మనసు ఇటువంటి పనులు చేస్తుంది. ఒక లోకాన్ని తనకంటూ సృష్టించి సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. స్వప్నలోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో మనిషి తైజసుడు అనబడతాడు. ఓంకార మంత్ర రెండవ భాగమైన ‘ఉకారం’ స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఇది రెండవ పరిమాణం.


మూడవ పరిమాణం - సుషుప్తావస్థ- ప్రాజ్ఞుడు:

కోర్కెలు, కలలు...ఏవీ లేని ఘాడనిద్రావస్థ మనిషి యొక్క మూడవ పరిమాణం. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవి వుండవు. కానీ ‘నేను’ అనబడే స్ఫురణ మెలకువగానే ఉంటుంది. అందువలన ఇది జాగ్రద్, స్వప్న అవస్థలకు ఆధారంగా  ఉంటుంది. 'నేను' అనే స్ఫురణ బయటకు వస్తున్నపుడు మొదటి స్థితిలో కల, ఇంకా బాహ్య స్థితిలోకి వస్తున్నప్పుడు జాగ్రదావస్థ అనుభవిస్తుంది. ఘాడ నిద్రలో ఉన్న ఒకే అనుభవం సుఖం. అందువల్లనే నిద్రనుండి లేవగానే ‘నేను సుఖంగా నిద్రపోయాను' అంటూ మనం చెప్పగలుగుతున్నాము.


బాహ్య జగత్తు యొక్క అనుభవాలు, మానసిక జగత్తులో పొందే అనుభవాలు కలగలిసినదే మన జీవితం. 'నేను' అన్న స్పురణ ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుభవాలను మనం పొందగలం. ఈ 'నేను' స్పురణ లేకపోతే ఏ అనుభవాలు ఉండవు. ఈ స్పురణకు ప్రాతిపదికగా ఉన్నది మూడవ పరిమాణమైన ప్రాజ్ఞుడు. కనుక ప్రతి జీవిలోనూ అధిష్టాన స్థితిలో ఉన్నవాడు ప్రాజ్ఞుడు. ఎందుకంటే, 'నేను' లేకుంటే 'నాకు' జగత్తు లేదు. అందుకే ప్రాజ్ఞుడు సమస్తానికి మూల కారణం. ఓంకార మంత్రం మూడవభాగమైన ‘మకారం’ సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు. ఇది మూడవ పరిమాణం.


నాలుగవ పరిమాణం - ఆత్మ:

నాలుగవ పరిమాణం అని చెప్పబడినప్పటికినీ, ఇది నిజానికి మొదటి మూడు పరిమాణాలు తనలో కలిగి ఉన్నది; కానీ వాటికి అతీతమైన ఒక స్థితి. మన యదార్ధ స్వభావం ఇదే. పై మూడు అవస్థలలోను ఆత్మ ఉనికి ఉన్నది. సూర్యుని సమక్షంలో లోకం నడుస్తోంది. కానీ ఏ కార్యంలోనూ సూర్యుడు ప్రత్యక్షంగా పాల్గొనడు. అలాగే మన సమస్త కార్యకలాపాలు ఆత్మను

సాక్షిగా, ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి.


ఆత్మను గురించి మాండూక్యోపనిషత్తు చక్కగా ఈ విధంగా వివరణ ఇస్తోంది:

"ఆత్మ అంతర్ముఖ స్థితికాదు, బాహ్య ముఖ స్థితి కాదు; చేతన స్థితి కాదు, అచేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతలు లేని, గ్రహించ శక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దానిని ఆత్మ చైతన్యంలో మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రపంచ చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది. ఇదే నాలుగవ పరిమాణం. ఇది ఆత్మ. దీనినే మనం తెలుసుకోవాలి"


భగవంతుడు:

భగవంతుడు అనే పదానికి అత్యున్నత స్థితి వివరణను మాండూక్యోపనిషత్తు ఇస్తోంది. భగవంతుడు ఎవరు అనే దానికి 'ఆత్మే భగవంతుడు' అనే మహావాక్యాన్ని 'అయమాత్మా బ్రహ్మ'  అని చెప్పింది. భగవంతుడు సర్వవ్యాపి కనుక ఆయన, సృష్టిలో అంతర్భాగమైన మనలోనూ కొలువై ఉన్నాడు. మన హృదయంలో కొలువై ప్రకాశించే స్థితిలో ఆయన ఆత్మగా పేరుగాంచాడు.



సమస్తమూ ఒకటే!

ఓంకారం  అనే ప్రణవనాదాన్ని భగవంతునికి ప్రతీకగా మాండూక్యోపనిషత్తు నెలకొల్పుతోంది. అంటే, భగవంతుడు = ఓంకారం అని చెప్పుకోవచ్చు. 

భగవంతుడిని ఓంకారంగా చెప్పినప్పుడు, ఆయన సర్వవ్యాపి కనుక, ఆయన సృష్టి అయిన లోకం కూడా ఓంకారంలోనే ఇమిడి వుంది. అంటే, లోకం = ఓంకారం అని చెప్పుకోవచ్చు. మనిషి లోకంలోని వాడు కనుక, మనిషి కూడ ఓంకారంలో ఉన్నట్లే. అంటే, మనిషి = ఓంకారం అని చెప్పుకొవచ్చు. అలాగే, ఆత్మ స్థితిలో మనిషి, భగవంతుడు ఒకటే అని చెప్పుకున్నాము కనుక మనిషి = భగవంతుడు. అవన్నీ పరిశీలించిన పిదప, లోకమూ, మనమూ, భగవంతుడు వేరు కాదన్న విశిష్టమైన అభిప్రాయం మాండూక్యోపనిషత్తు ప్రతిపాదిస్తుంది.


అనగా లోకం = మనిషి = భగవంతుడు అనే సమీకరణంగా సమస్తమూ ఒకటే అని చెప్పుకోవచ్చు.


***

రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రమణ బంధకవి
రమణ బంధకవి

రచయిత పరిచయం: రమణ బంధకవి

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

saamanya prajaaneekaaniki koodaa ardhamaiyetatlu chepparu

Like
Replying to

ధన్యవాదాలు

Like
bottom of page