మా ఇంటి టి.వి
- Anisa Tabassum Sk

- 1 hour ago
- 3 min read

Maa Inti Tv- Telugu Memories Story | Anisa Tabassum Sk
మా ఇంటి టి.వి - తెలుగు జ్ఞాపకాల కథ | అనిసా తబస్సుమ్ SK
Published in manatelugukathalu.com on 26/08/2026
90ల నాటి టి.వి జ్ఞాపకాలు గుర్తొస్తే చాలామంది 90's కిడ్స్ మనసుల్లో ఒక ప్రత్యేకమైన అనుభూతి మొదలవుతుంది. ఆ రోజుల్లో ఒక ఇంట్లో టెలివిజన్ ఉండటం అంటే ఆ ఇంటికే కాదు, చుట్టుపక్కల వీధి మొత్తానికీ ఒక సంబరం. దూరదర్శన్‌లో వచ్చే ఆదివారం సినిమా కోసం పనులు త్వరగా ముగించుకొని టి.వి ముందు చేరిన కుటుంబాలు, పిల్లల సందడి, ఆడవారి కబుర్లు, గేటు బయట కూర్చున్న మగవాళ్లు—ఇవన్నీ అప్పటి సామూహిక జీవనానికి అందమైన గుర్తులు. మా ఇంటి టి.వి లో అనిసా తబస్సుమ్ ఆ కాలపు మధురమైన జ్ఞాపకాలను, మనుషుల మధ్య ఉన్న ఆత్మీయతను, అమాయకత్వాన్ని ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ఈ కథ చదివితే మీ చిన్ననాటి రోజులు, దూరదర్శన్ సినిమాల కోసం ఎదురుచూసిన సాయంత్రాలు తప్పకుండా గుర్తుకొస్తాయి.
పాఠకులందరికీ నమస్కారం.... నేను మీ అనిసా. ఈ కథ మా అమ్మ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలతో రాయడం జరిగింది. ఈ కథ మీ చిన్నపాటి రోజులను గుర్తుచేస్తుంది. ఈ కథను మా అమ్మ, చిన్నమ్మకు మరియు ప్రతి 90's కిడ్స్ కు అంకితం చేస్తున్నాను. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాతో చెప్పడం మర్చిపోకండి.
90's లో బాగా సంపన్నుల ఇళ్లలోనే టి.విలు ఉండేవి, అంటే ఊరుమొత్తానికి కలిపి ఐదు, ఆరు టి.విలే ఉండేవి. ఆదివారం వస్తే ఆ టి.వి ఉన్న వీధిలో వాళ్లంతా పిల్ల, జల్లా కలిసి మూకుమ్మడిగా టి.వి ఉన్న ఇంటికి వెళ్లేవారు.
ఆ రోజు ఒక జాతరలా ఉండేది.
ఆ కాలంలోనే మా తాతయ్య కూడా కొత్త టి.వి తెచ్చారు. కొత్త టి.వి తెచ్చి ఇంటి వసారాలో పెట్టారు. ఇంటి పైకప్పు పై నుంచొని, యాంటెన్నా సరిచేస్తుంటే, వసారాలో అమ్మమ్మ, పిల్లలంతా కలిసి బొమ్మ సరిగ్గా వస్తుందో లేదో చూసేవారు. యాంటెన్నా తిప్పి "వచ్చిందా........." అని అరిచి అడిగితే, బొమ్మ వస్తే "వచ్చింది..... వచ్చింది....." అని అరవడం, రాకపోతే "పోయింది.... పోయింది...." అని అరిచేవారు.
టి.వి తెచ్చిన మొదటి రోజైతే ఒక పండుగ వాతావరణం కనిపించేది. యాంటెన్నా సరిచేస్తున్న తాతయ్యను చూసి ఆ దారిన వెళ్ళేవాళ్ళు ఆగి మరీ... "ఏం వాసు కొత్త టి.వి తెచ్చారా" అని అడగడం, "అవును... అవును సాయంత్రం వచ్చేసేయ్" అని పిలవడం కూడా అయిపోయేది.
అప్పుడే సాయంత్రం నమాజ్ చేసుకొని వెళ్తున్న మస్తాన్, ఊరందరికీ కనిపించేలా ఇంటి పైకప్పుపై ఎక్కి యాంటెన్నా సరిచేస్తున్న తాతయ్యను చూసి పెద్ద అరుపులాంటి కేకతో "ఏం వాసు టి.వి తెచ్చావూ....." అని అనడం, కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని "రా... రా... రా....." అంటూ పిలిచి మరీ సంగతి చెప్పడం అయిపోయేది.
చీకటిపడే వేళకు ఒక్కొక్కరుగా జనమంతా పోగయ్యారు. ఒక వాడ జనం మొత్తం ముస్తాబు చేసుకొని, పౌడర్ పూసుకొని, ఆడపిల్లలైతే రంగురంగుల రిబ్బన్లతో జాడలు కట్టుకొని, మంచి బట్టలు వేసుకొని, పూలు పెట్టుకొని, ముసలి.. ముతక, పిల్ల, జల్లా అంతా కలిసి ఆర్భాటంగా వచ్చేవారు.
మా అమ్మమ్మ ఇంటిముందు వసారాయే కాకుండా చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది. ఆ టి.విని వసారాలో పెట్టారు, ఇక వసారానుంచి ఇంటి బయట గేటు దాకా అంత జనాలతో కిక్కిరిసి ఉంది.
చూడటానికి హౌస్ ఫుల్ అయిన ఒక చిన్న సినిమా థియేటర్ లా ఉంది. అందరూ ఒక క్రమంలో కూర్చున్నారు. ముందు వరుసల్లో పిల్లల్తో నిండి ఉంటే, రెండో వరుసలో ఆడవారు కూర్చున్నారు, ఆ... పై మగవారు, స్థలం చాలక గేటు బయట అరుగుల మీద కూడా కూర్చున్నారు కొంతమంది మగ గుంపు.
మా తాతయ్యకు చుట్టాలన్న, తెలిసినవారన్న, తెలియనివారన్న, అందాక్యూందుకు... మనిషి అంటేనే మహా ఇష్టం, వారికి అతిథి మర్యాదలు చేయడం అంటే ఇంకా ఇష్టం.
అలాంటి వ్యక్తికి ఒకేసారి అంతమంది జనం, తమ ఇంటి ముందు కనిపించేసరికి యమా ఆనందంగా ఉంది. ఆ సంతోషంతో తబ్బిబ్బుపోయారు.
అప్పట్లో దూరదర్శన్ ఉండేది కావున వారానికి ఒక సినిమా చొప్పున వేసేవారు. ప్రతి శుక్రవారం చిత్రలహరి (సినిమా పాటలు) వచ్చేవి, ఆదివారం ఒక తెలుగు సినిమా.
ఇక ఆదివారం వచ్చిందంటే అందరూ సాయంత్రం ఐదింటి లోపు పనులు, వంటలు త్వరత్వరగా ముగించుకొని టి.వి ముందు కూర్చునేవారు.
అందరూ వారం మొత్తం ఆ సినిమా వచ్చే రోజు కోసం ఎదురుచూసే వాళ్ళు. సినిమానో, ధారావాహికనో ఆ రోజు వస్తే... తరువాత రోజులన్నీ దాని గురించే చెప్పుకుంటూ పనులు చేసుకునేవారు.
అప్పట్లో అంత శ్రద్ధతో, ఇష్టంతో టి.వి చూసేవారు. ఇకపోతే ఆ ఒక్క టి.వి చూడటానికి కొంత మంది పిల్లలు, ఆడవారు సినిమాహాల్ లాగా తినుబండారాలు కూడా తెచ్చుకునే వాళ్ళు. చూడటానికి చాలా సందడిగా, కళగా ఉండేవి ఆ దృశ్యాలు.
"అంత పెద్ద మనుషులు.... ఇంత చిన్న టి.విలో ఎలా పట్టారో..." అంటూ ఆశ్చర్యంగా చూసేవారు ఆ అమాయకపు మనసులతో. ఇంకొంత మందికైతే పాటలు చూసేటపుడు "అంత వెంట వెంటనే వాళ్ళ బట్టలు, ప్రాంతాలు ఎలా మారుతున్నాయి అబ్బా" అంటూ ఆసక్తిగా చూసేవారు.
ఇంకొంతమంది ఎంతో అమాయకంగా... అక్కడ టి.విలో జరుగుతుంది నిజమేనని అనుకోని టి.విలో వాళ్ళు నవ్వితే ఇక్కడ వీళ్ళు నవ్వడం, వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడవడం, వాళ్ళకి కష్టాలు వస్తే ఇక్కడ వీళ్ళు బాధపడిపోవడం చేసేవాళ్ళు.
ఒకరోజు టి.విలో "మాతృదేవోభవ" సినిమా వేశారు. ఇక అప్పుడు చూడాలి, ఆ సినిమా చూసిన వీళ్లంతా శోకాలు పెట్టి ఏడవడం మొదలుపెట్టారు.
కల్మషం లేని మనసులు, టి.విలో కనిపించేది నిజం అనుకునే రోజులవి. స్వార్థం లేని మనుషులు. కాలక్రమేణా మెల్లమెల్లగా అందరి ఇళ్లలో టి.విలు పుట్టుకొచ్చాయి. కానీ ఆ కాలంలాంటి ఆదరణ మాయమైంది. ఆ నాటి అమాయకపు ప్రజలు కనుమరుగవుతున్న రోజులు ఇవి. ఇదండీ మా ఇంటి మొదటి టి.వి ప్రహసనం.
కథ సమాప్తం
-*అనిసా తబస్సుమ్ Sk(Anisa Tabassum SK)
అనిసా తబస్సుమ్ SK గారి కొన్ని ఇతర రచనలు:
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అనిసా తబస్సుమ్ SK గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
కథ సమాప్తం

అనిసా తబస్సుమ్ SK







❤💫