top of page
Original.png

మధుమేహుడు @ వాట్సప్

మధుమేహుడు @ వాట్సప్, మధుమేహం కథ, వాట్సాప్ హాస్య కథ, తెలుగు హాస్య కథ, డయాబెటిస్ తెలుగు కథ, సోషల్ మీడియా వ్యంగ్యం, బంధువుల సలహాలు, తెలుగు వ్యంగ్య కథ, రమణ బంధకవి, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'మధుమేహుడు @ వాట్సప్' కథలో గ్లూకోమీటర్‌లో అధిక చక్కెర స్థాయి కనిపించడంతో ఆశ్చర్యపోతున్న మధ్యవయస్కుడైన తెలుగు వ్యక్తి, చేతిలో మొబైల్ ఫోన్‌కు వరుసగా వస్తున్న వాట్సాప్ ఆరోగ్య సలహా సందేశాలు, నేపథ్యంలో నవ్వుతూ చూస్తున్న కుటుంబ సభ్యులతో హాస్యభరితంగా రూపొందించిన దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'మధుమేహుడు @ వాట్సప్' కథలో గ్లూకోమీటర్‌లో అధిక చక్కెర స్థాయి కనిపించడంతో ఆశ్చర్యపోతున్న మధ్యవయస్కుడైన తెలుగు వ్యక్తి, చేతిలో మొబైల్ ఫోన్‌కు వరుసగా వస్తున్న వాట్సాప్ ఆరోగ్య సలహా సందేశాలు, నేపథ్యంలో నవ్వుతూ చూస్తున్న కుటుంబ సభ్యులతో హాస్యభరితంగా రూపొందించిన దృశ్యం.

Madhumehudu @ WhatsApp - Telugu Comedy Story | Ramana Bandhakavi

మధుమేహుడు @ వాట్సప్ తెలుగు హాస్య కథ | రమణ బంధకవి

Published in manatelugukathalu.com on 11/07/2026


మధుమేహం వచ్చిన వ్యక్తికి మందుల కంటే ముందుగా వచ్చేవి ఉచిత సలహాలే! ఒక్క రిపోర్ట్ బయటపడగానే వాట్సాప్ గ్రూపులు, ఇంటి చిట్కాలు, ఆరోగ్య సలహాలు, వైద్య నిపుణుల్లా మాట్లాడే బంధువులు ఎలా ఒక మనిషిని విసిగిస్తారో చమత్కారంగా చూపించే హాస్య వ్యంగ్య కథ "మధుమేహుడు @ వాట్సప్". నవ్విస్తూ ఆలోచింపజేసే ఈ కథ నేటి సోషల్ మీడియా సంస్కృతికి అద్దం పడుతుంది.


ఈ మధ్య మా దగ్గర బంధువు ఒకరు చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చారు. ఆయన అరవైయ్యవ వసంతంలో అడుగుపెట్టినప్పటికి చూడటానికి బాగా తంపట వేసిన తాటి తేగ లాగా ధృడంగా ఉంటాడు. ఆరోజు పొద్దుటే నేను దేహంలోని చక్కర నిలువలు ఏపాటి ఉన్నాయో తెలుసుకోవటానికి గ్లూకోమీటర్ వాడుతున్నాను. పేపర్లో కొత్త రాజధాని అమరావతి విషయాలు తేగలాగా నమిలేస్తున్న ఆ పెద్దమనిషి ఒక్క


“పలుకే అంత కరుకుగా ఉండే నీకు షుగర్ ఎందుకు ఉంటుందయ్యా చోద్యం కాపోతేను” అని జోకేను.


పరవాలేదు చూడు అని ముచ్చట పడ్డాడు. సరేలే అని సూదితో ఒక పోటు పొడిచి మీటర్ లోకి ఎక్కించాను. వెంటనే మీటర్ కుయి..కుయి మని అలారం మోగింది. ఇద్దరు రీడింగ్ చూసి బిత్తర పోయాం. శుబ్రంగా మూడు సెంచరీలు కొట్టాడు శేవాగ్ లాగ!


ఇదేవిటి చెప్మా, చూడబోతే చెక్కర నల్లమార్కెట్ బడా వ్యాపారిలా ఉన్నాడే అని విస్తుపోయా. 


"ఇదేమిటయ్యా, ఇదేమన్నా తప్పు రీడింగ్ చూపిస్తోందా కొంపదీసి" అని కంగారుగా అడిగాడు. 


“అలాంటి దాఖలా ఎప్పుడూ లేదే” అన్నాను నేను.


“సరే ఎలాగా అల్పాహారం తినాలి కదా, టిఫిన్ తిని రెండు గంటల తరువాత పోస్ట్ ప్రాన్డియల్ రీడింగ్ మళ్ళీ చూద్దాం. అపుడు బండారం బయటపడుతుంది” అన్నాను.


"ఎవరిదీ? నాదా, దానిదా?" అన్నాడు అనుమానంగా!


“ఇద్దరిదీను” అన్నాను గుంభనగా.


“మార్నింగ్ వాక్ చేసినట్టు ఉంటుంది, నచ్చినవి తిన్నట్టూ ఉంటుంది, మీటర్ పని పట్టినట్లూ ఉంటుంది కనుక అలా నడచి వెళ్లి, ఉడిపి హోటల్లో టిఫిన్ తిని వద్దాము” అన్నాను.


ఉడిపి హోటల్ మాకు షుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడకు వెళ్లి మన మామూలు పద్దతిలో మొహమాటం లేకుండా ప్లేట్ ఇడ్లి, సింగల్ వడ, ప్లేట్ పూరి ఆలుగడ్డల కూరతో సహా తిని, కప్పు ఫిల్టర్ కాఫీ తాగి, క్రేన్ వక్కపొడి వేసుకుని మళ్ళీ నడుచుకుంటూ ఇంటి దారి పట్టేము. దారిలో మధుమేహము దాని పుట్టు పూర్వోత్తరాలు, ఆహారము, వ్యాయామము వాటి పాత్ర మొదలైన విషయాలపై ఘాటైన వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఇంటికి వచ్చాము.


అనుకున్న క్షణం రానే వచ్చింది. మళ్ళీ సూదితో ఒక పోటు పొడిచి మీటర్లో చూసాము. "ఈసారైనా కరెక్టుగా చూపిస్తోందా?" అని ఆత్రంగా అడిగాడు.


"ఆహా భేషుగ్గా! సత్య హరిచంద్రుడి మునిమనవడు లాగ....ఇంకే నాలుగు సెంచరీలు చితక బాదేవు" అన్నాను. 


హతవిధీ! అని కొంచెము కమిలి పోయిన నీటి తేగలాగ అయిపోయాడు.


ఇక అప్పటినుండి మేధోమధనం ప్రారంభం. ఆరోజే అతని తిరుగు ప్రయాణం. వెళ్ళిన వెంటనే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షలు చేయించుకుని, తగిన మందులు మొదలు పెట్టమని సలహా ఇచ్చాము. మామూలప్పుడు ఏమి చెప్పినా పెద్దగా చెవిపెట్టని వాడు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాబోలు సరే నన్నాడు. విషయాలన్నీ మాకు వాట్సప్ లో పెట్టమన్నాము. ఎందుకన్నా మంచిదని, ఈ విషయం గురించి వాళ్ళావిడకి వాట్సప్ లో రెండు ముక్కలు తగిలించాము.

తను వెళ్ళిన మర్నాడు నుండి నాకు ఎదో తెలియని అలజడి. ఈ విషయం, మన దగ్గర బంధువులకు చెప్పకపోతే ఎలా అన్న ఒక విధమైన ‘ఆండ్రాయిడ్ దురద’ మొదలుపెట్టి చేతిని నమిలేయసాగింది. ఇక తప్పదనుకుని ఒకరిద్దరు దగ్గరవాళ్ళకు వాట్స్ ప్ లో ఉప్పు అందించా.


ఒక రోజు గడిచేసరికి వేసవిలో శేషాచలం కొండలలో వ్యాపించే దావాగ్నిలాగ ఈ వార్త రంగులద్దుకుని బంధువర్గాలలో సుళ్ళు తిరుగుతూ వ్యాపించి చివరాఖరుకు నా వాట్స్ ప్ లో సంచలన వార్తగా వచ్చింది. ‘ఫలాన మన బంధువు మధుమేహంలో డాక్టరేట్ డిగ్రీ కొట్టేసాడని, స్కోర్ శతకాల మీద శతకాలు బాదేస్తున్నాడని...’ హౌరా ! అనుకున్నాను.


రెండు రోజులు పోయేటప్పటికి బాగా సామాజిక సృహ కలిగిన బంధువొకరు ఇది ఇలా వదిలేస్తే కుదరదు, మన వంతు సహాయం మనం చెయ్యాలని చెప్పి హుటాహుటిన 'మధుమేహుడు' అన్న వాట్స్ అప్ గ్రూప్ ఒకటి తయారు చేసి అందరిని ‘గుంపులో గోవింద’ చేసాడు. ఇక పరిస్థితులు చేయిదాటిపోయాయి. సలహాల, పరామర్శల పరంపర, కోటలూ పేటలూ దాటిపోయాయి.


"అసలు రెండుపూట్లా అన్నం తినటం వలెనే ఈ ముప్పు" అన్నారు ఒకరు.


"ఊరగాయ సీసాలు కళ్ళ ముందు వుండటమే నేరం” అన్నారు ఇంకొకరు.


"రోజూ డబల్ టిఫిన్స్ వద్దురా అంటే విన్నాడు కాదు" అని మరొకరు.


"అలాగా పాపం! పుంజీడు దోశలు, పది ఇడ్లీలు తిని చక్కగా నిభాయింకునేవాడు" అని వేరొకరు.


"అసలు నెయ్యి వాడటమే వీటన్నిటికీ మూలకారణం " అన్నాడొక ఘ్రుత ద్వేషి. ఆయన నెయ్యి కంచంలో వేసుకోడు, పక్కవాళ్ళు ఎవరైనా వేసుకుంటే, ఎర్రబారిన తన కళ్ళలో ఆజ్యం పోసుకుంటాడు. అందుకే ఆయన చూస్తుండగా నెయ్యి వేసుకోవటానికి జంకుతారు.


"అది సర్లేవయ్యా! ఇక జరగవలసింది చూడండి" అన్నాడు పెద్దరికం వొలకబోస్తూ ఒకాయన.


"ఏముంది జొన్న కూడు, రాగి సంకటే దీనికి మందు"


"పొద్దుటే గ్లాసుడు కాకరకాయ రసం పట్టిస్తే యిట్టే గుణం కనిపిస్తుంది"


"ఎవరో పెద్ద మనిషి చెప్పినట్లు పీచు పదార్ధం బాగా తీసుకుంటే జీర్ణకోశం కుంచెతో కడిగిన ఫ్లాస్క్ లాగా శుభ్రపడుతుందిట"


"వాము, చేదు జీలకర్ర, మెంతులు, నేల గోకుడు తీగ కలిపి నూరి పుచ్చుకోవాలి" ఎవరిదో ఉచిత సలహా.


"ఇంకా నయం నూతి గట్టు మీది పాకుడు" అన్నావు కాదు అని చిరాకు పడ్డాడు మధుమేహుడు.


"గంగ వెర్రి కూర, దొంగ గలిజాకు కలిపి పప్పు చేసుకోవాలి" ఇంకో పోస్ట్!


"దాంట్లో తిక్కరేణి గింజలు పోపు పెట్టాలా" అని తిక్క గా అడిగాడు మధు మేహుడు.


"ఇవేమీ కుదిరెట్లు లేవు కాని, చక్కగా వంతెన దాటి మంతెన దగ్గరకు పోవటం మేలు " అన్నాడొక ప్రాస కవి.


"అర్జెంటు గా అమెజాన్ లో రుజుతా దివేకర్ పుస్తకాలు పురమాయించి చదువు" అన్నాడొక పుస్తకప్రియుడు.


ఇలా వారం గడిచేసరికి వాట్స్ అప్ సందేశాలు హనుమంతుడి తోకలా, అలనాడు సభలో ద్రౌపది కట్టిన ‘కృష్ణా బ్రాండ్’ సిల్క్ చీరలా, ఇంతింతై, వటుడింతై అన్నట్లు తారా ప్రమాణానికి చేరుకున్నాయి.


నిన్న ఉదయం ఫోన్ అందుకుని చూద్దును కదా, గ్రూప్ నుండి 'మధుమేహుడు లెఫ్ట్' అని కనిపించింది. అవాక్కయ్యాను. ఇదేమిటి తనకోసం ప్రత్యేకంగా కట్టిన దేవాలయంలోంచి దేవత మాయమైనట్లు, తన కోసం పెట్టిన గ్రూప్ లోంచి తానే మాయమయ్యాడు? ఇదేమిటి చోద్యం అని తికమక పడ్డాను. ఇక సలహాలు, చిట్కాలు ఎవరికి చెప్తాం అని సామూహికంగా వాపోయ్యారు గ్రూపీయులు.


ఏమి జరిగిందో తెలుసుకుందామని వాళ్ళ ఆవిడకు వాట్స్ ప్ కాల్ చేసాను. 


ఆమె ఎంతో విషాదంగా "ఏమి చేస్తారు చెప్పండి. అహోరాత్రాలు, పరామర్శలు, సలహాలు, చిట్కాలు. అది తినొద్దు..ఇది తిను, అది తాగొద్దు..ఇది తాగు..ఈ పొడుం తిను...ఆ రసం తాగు అన్న సలహాల సునామీకి ఆయన చీకాకు బాగా పెరిగిపోయి వేసుకున్న మందు కూడా వంటబట్టటం లేదు. ఈ సలహాల గుండు సూదులతో బుర్ర పిన్ కుషన్ లాగ అయిపోయిందని బాధపడుతున్నారు. అందుకునే గ్రూపు నుండి వచ్చేసారు. మీరైనా అర్థం చేసుకుంటే అదే పదివేలు" అని వాపోయింది.


"ఒహో అదా సంగతి! నువ్వేమి బాధ పడకమ్మా! నేను చూసుకుంటానులే. అయినా జనాలకి వేళాపాళ, సమయం సందర్భం, వివేకం విచక్షణ ఉండొద్దూ!" అని సానుభూతి తెలిపా.


"అన్నట్లు విషయం మరిచా, నేరేడు గింజలు, మెంతి గింజలు వేయించి, పొడిచేసి, గోరు వెచ్చని నీటితో…” 


కుయి...కుయి...కుయి...ఇదేంటి ఫోన్ కట్ అయిన శబ్దం వస్తోంది. కట్ అయిందా...లేక చేసిందా..? అయినా నేనేమీ తప్పు చెప్పలేదే!" అని అయోమయంగా బుర్ర గోక్కున్నాను.

*** 

రమణ బంధకవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రమణ బంధకవి
రమణ బంధకవి

రచయిత పరిచయం: రమణ బంధకవి

రమణ బంధకవి, ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. సాహిత్యాభిలాష, తెలుగు మరియు ఆంగ్లంలో రచనాభిలాష కలిగినవారు. కథలు, కవితలు, నవలలు, అనువాద నవలలు వ్రాయడం హాబీ. ఇప్పటివరకు ముప్పై పైచిలుకు కథలు, ఎన్నో కవితలు, రెండు అనువాద నవలలు ప్రచురింపబడ్డాయి. రెండు స్వీయ నవలలు ప్రస్తుతం ప్రచురణలో ఉన్నాయి. ఒకటి 'సంచిక' వెబ్ మాగ్జైన్ వార పత్రికలో ధారావాహికగా వస్తోంది. ఇంకోటి 'ప్రతిలిపి' లో ధారావాహికగా వస్తోంది.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
pbandhakavi55
2 hours ago
Rated 5 out of 5 stars.

చాలా హాస్యంగా, వ్యంగ్యంగా కథ అల్లారు రచయిత. చక్కటి హాస్య పదాలతో జోరుగా ఉంది కథ. మధుమేహుడు వాట్సాప్ గ్రూప్ ఐడియా నవ్వు తెప్పించింది.

Like
bottom of page