మల్లక్క కయ్య
- Kasivarapu Venkatasubbaiah

- 3 hours ago
- 7 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #మల్లక్కకయ్య, #MallakkaKayya, #తెలుగుపల్లెకథలు, #TeluguHeartTouchingStories

Mallakka Kayya - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 20/12/2025
మల్లక్క కయ్య - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
అది జనవరి నెల. సంక్రాంతి ఇంకా ఇరవై రోజులే ఉంది ఆ యేడు వర్షాలు బాగా పడడం వల్ల గండేటికి నీళ్ళొచ్చి చదిపిరాళ్ళ చెరువు నిండింది. చెరువు కింద ఉన్న ఆయకట్టు భూమంతా బాగా పండి కోతకొచ్చి గాలికి బరువుగా ఊగుతూ ఉంది.
రైతులంతా ఆనందోత్సాహాలతో ఎవరికి అందిన కూలోళ్ళను వాళ్ళు గుంపు కట్టుకొని వరికోతను మొదలు పెట్టారు. వరికోత సమయంలో కూలోళ్ళ కొరత మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. ఏ రైతు ముందుగా కూలోళ్ళను వరి కోతకు పిలుస్తాడో వాళ్ళకే ముందుగా పనిలోకి పోతుంటారు కూలోళ్ళు. అందుకని రైతులు ఎవరికి వాళ్ళు ముందుజాగ్రత పడి కూలోళ్ళను ముందుగా పిలుస్తుంటారు. అప్పుడే కూలోళ్ళు కూడా కూలి రేట్లు పెంచుతుంటారు.
అదే గ్రామంలో పుల్లారెడ్డి అనే రైతుకు ఓ ఇరవై ఎకరాల వరి మడి ఉంది. పుల్లారెడ్డి భూమి కూడా బాగా పండి కోతకొచ్చింది. అరకొరగా అందిన కూలోళ్ళతో వరికోతకు దిగాడు పుల్లారెడ్డి. కూలితోపాటు మధ్యాహ్నం సంగటి పెట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు కూలోళ్ళు
ఊరంతా చర్రాబుర్రా వరికోతలు శరవేగంగా సాగిపోతున్నాయి. పదిరోజుల్లో పంటంతా కల్లాల్లోకి రావాలని సంక్రాంతి కల్లా ఇంటికి గింజలు చేరాలని పట్టుదలతో ఉన్నారు రైతులు.
పుల్లారెడ్డి తన భూమికి ఈశాన్యమూలన రాతి శిలలు పెట్టి పసుపు రాసి, కుంకుమ బొట్లుపెట్టి, రాతి శిలలను పూలతో అలంకరించాడు. పప్పులు బొరుగులు బెల్లం నైవేద్యంగా పెట్టాడు. ఆకు వక్కలు తాంబూలం పెట్టి, అందులో ఐదు రూపాయల బిళ్ళ దక్షిణ పెట్టి, టెంకాయ కొట్టి వరికోత ప్రారంభించాడు పుల్లారెడ్డి.
వరికోత వడివడిగా సాగుతుంది. కూలోళ్ళు తమ శ్రమను మరిచి పోవడానికి యాలపాటలు పాడుకుంటున్నారు. ఒకరి పాట ముగియగానే మరోకరు పాటను అందుకుంటూ ఒకిరి తర్వాత మరొకరు జానపద గీతాలను ఆలపిస్తూ తమ కష్టాన్ని మర్చిపోతున్నారు. ఆ గాన మాధుర్యపు అలలు అలలుగా సాగి పరిసరాలను పరవశింపజేస్తున్నవి. తరతరాలుగా జానపదాలను శ్రమజీవులే కాపాడుకుంటూ వస్తున్నారు.
. . *
సూరన్న పుల్లారెడ్డి జీతగాడు. అతనికి భార్య మల్లక్క, వారికి ఆరేళ్ల కూతురు, పాలుతాగే చంటిగాడు ఉన్నారు. చాల యేండ్లుగా పుల్లారెడ్డి పొలంలో పూరి గుడిసె వేసుకుని పొలానికి మడవ కడుతూ ఉంటున్నాడు. వాళ్ళ కాపురం పొరపొచ్చాలు లేని ముచ్చటైన సంసారం. ఈడు జోడు చక్కగా కుదిరిన చక్కని జంట. పొలంలో సూరన్న పనిచేస్తే జీతంలోకే సరిపోతుంది. అతని భార్య కూడా పనిచేస్తే ఆమెకు కూలి ఇస్తాడు పుల్లారెడ్డి.
సూరన్న భార్య మల్లక్క ఆత్మాభిమానం మెండుగా ఉన్న మానవతి. మాట పడకుండా అన్ని పనులు చక్కదిద్దుతూ ఉంటుంది. కష్టం చేయడానికే పుట్టినట్లు సహనం మూర్తీభవించిన స్త్రీమూర్తి. జీతానికి కట్టుబడ్డాక ఇష్టమొచ్చినట్లు ఉండడానికి అడ్డుకట్ట పడ్డట్టే. అందుకే మల్లక్క వినయ విధేయతగా, భయం భక్తిగా మసులుకుంట్టూ, చెప్పింది చెప్పినట్టు సకాలంలో చేస్తూ, యజమానితో పాటూ ఊరందరి నోట్లో నాలుకై అభిమానవతిగా, గుణవతిగా పేరు తెచ్చుకుంది. పల్లెత్తు మాట పడకుండా సాగుతున్న ఆమె జీవితంలో ఆ రోజు ఆఖరి దుర్దినం.
ఆరోజు సూరన్నతో పాటు అతని భార్య మల్లక్క కూడా పుల్లారెడ్డి మడిలో కోతకు దిగాల్సి ఉంది. ఆరోజు సద్ది కూడు లేనందున పనిలోకి దిగడానికి ఆలస్యమైంది. ఒక పావు బియ్యం కడిగి పొయ్యి మీద వేసి అన్నం వండింది. దానిలోకి పచ్చికారం నూరి కూతురి కింత పెట్టి, తానింత తిని, మొగుడికింత మిగిల్చింది మల్లక్క. అప్పటికే పుల్లారెడ్డి మల్లక్కను నాలుగైదు సార్లు పిలిచాడు పనిలోకి రమ్మని. "వచ్చాండయ్యా! పిల్లోల్లకు బువ్వ పెట్టి" అని వినయంగా భయంగా చెప్పుకుంది.
మొగుడు సూరన్న కూలోళ్లు కోసిన పంట చెత్తను పెద్ద పెద్ద మోపులుగా కడుతున్నాడు కల్లంలోకి మోసుకు పోవడానికి వీలుగా.
పుల్లారెడ్డి మరోసారి మల్లక్కను గద్దించి పిలిచాడు. అప్పుడే చంటిగాడు ఏడుపు అందుకున్నాడు. చంటిగాన్ని ఒళ్ళోకి తీసుకుని సముదాయిస్తుంది మల్లక్క. పుల్లారెడ్డి కోపం తారాస్థాయికి చేరింది.
" 'మెత్తగా మల్లమ్మా అంటే మరింత నీల్గిందట. వంగి చెప్పు తీసుకుంటే వొచ్చాండ పాయ్యా అందిట' అట్టా వుందే నీ యవ్వారం. ఒళ్ళేమన్న కొవ్వెక్కిందా? ఎంత పిలిచినా పన్లోకి రావ్ " అంటూ పుల్లారెడ్డిలో ఆధిపత్య ధోరణి బుసలు కొట్టింది. అతనిలో జాత్యహంకారం, పెత్తందారీతనం పడిగ విప్పి నాట్యమాడాయి.
అంతమంది కూలోళ్లలో అంతేసీ మాటలు అనేసరికి మల్లక్క ఆత్మాభిమానం ముక్కలైంది. ఎదను బాకుతో పొడిచినట్లైంది. కండ్లు చింత నిప్పులైనాయి. గుండె పగిలి నీరైంది.
ముఖంలో కత్తిగాటుకు నెత్తురు చుక్క లేదు. ప్రాణం పోయినా మానం పోకూడదన్నది మల్లక్క సిద్ధాంతం. పెత్తందారీతనం ఎంత బలంగా, ఎంత పదనుగా ఉంటుందో మల్లక్కకు తెలియంది కాదు. ఎదురు తిరిగి మాటకు మాట బదులిస్తే ఏం జరుగుతుందో మల్లక్కకు బాగా ఎరుకనే. అంతా తమకు అనుకూలంగా లాభదాయకంగా జరుగుతున్నంత వరకే మెత్తగా మంచిగా ఉంటారు.
ఏమాత్రం తేడా వచ్చి తమకు నష్టదాయికంగా పరిణమించితే జూలు విదిలించి కర్కశంగా పంజా విసురుతారు. అయితే ఆత్మాభిమానం దెబ్బ తిన్నాక బతికి ప్రయోజనమేముంది అనుకుంది మల్లక్క.
అంతా మౌనంగానే భరించింది. చంటిగాడికి పాలిచ్చింది. ఇంటిముందు ఉన్న మామిడి చెట్టుకు చీరెతో ఉయ్యాల వేసి అందులో చంటిగాడిని పడుకోబెట్టి జోల పాడి నిద్రపుచ్చింది. చంటిగాడికి పాలుగాచి సీసాకు పట్టి చంటిగాడికి దగ్గరగా పెట్టింది. ఆ తరువాత మల్లక్క చీరె కాశపోసి గోచీ కట్టింది. పైటకొంగు నడుము చుట్టూ చుట్టి గట్టిగా బిగించి రొండిలోకి దోపుకుంది. పిల్లాడిని తేరిపార చూసుకుంది. కూతుర్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొనింది "నాయన సెప్పిన మాటిని మంచిగా నడ్చుకోమ్మా, నాయన్ను కట్టబెట్టే పన్లు చేయేద్దు. " అని కూతురికి బుద్ధి చెప్పింది. కొడవలి తీసుకుని మడిలోకి దిగింది మల్లక్క.
అందరూ వరి కోతకు దిగిన దొంపులో కాకుండా పక్కనున్న ఎకరా దొంపులో తానొక్కతే ప్రత్యేకంగా వరి కోతకు వంగింది. తమ పక్కన కోత దిగనందుకు తోటి కూలోళ్ళు ఆశ్చర్యంగా చూశారు. ఆమె ముఖంలో గాంభీర్యాన్ని, కృతనిశ్చయాన్ని చూసి ఏమీ అనలేక పోయారు. పుల్లారెడ్డి కూడా మౌనంగా చూస్తూ ఊరుక ఉండిపోయాడు.
ఎన్నాళ్ళ నుంచో మల్లక్క మనసు తెలిసిన పుల్లారెడ్డి తొందర పడి అంతేసి మాటలు తూలినందుకు మనసులోనే నొచ్చకున్నాడు. "తరం నుంచి తరానికి అందిపుచ్చుకుంటూ వచ్చిన అగ్రవర్ణ దురహంభావమే నాతో అలా పలికించిదేమో!" అనుకున్నాడు.
పొద్దు ఎక్కే కొద్దీ ఎండ అంతకంతకూ తీవ్రమవుతున్నది. కూలోళ్ళు రోజు ఎండలో పనిజేస్తూ ఉండడంవల్ల వాళ్ళ ముఖాలు నల్లగా కమిలిపోయి ఉన్నాయి. పొలాల్లో పనిచేసే రైతులు, కూలోళ్ళు తక్కువ కాలంలోనే ముసలివాళ్ళై పోతుంటారు.
మల్లక్క వరికోత తీక్షణంగా ఎకాబికిన సాగుతుంది. మధ్యలో ఒకసారి కూలోళ్ళు పనిలో నుంచి లేచి, మంచి నీళ్లు తాగి, వక్కాకు వేసుకుని మళ్లీ పనిలోకి దిగారు. మల్లక్క భర్త సూరన్న కూడా లేచిపోయి బువ్వ తినొచ్చి పనిలోకి దిగాడు. మల్లక్క మాత్రం ఉలుకు పలుకు, పక్కచూపు లేకుండా పనిలో నిమగ్నమై చకచకా కోతలో ముందు కెళ్ళుతున్నది.
మిట్టమధ్యాహ్నమైంది. కూలోళ్ళందరూ లేచి పంట కాలువలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని సంగటి తినడానికి చెట్ల నీడకు పోయారు.
ఇంతలోపల పుల్లారెడ్డి పెద్ద కోడలు పద్మావతి పెద్ద వెదురుగంపలో రాగి సంగటి, కందిపప్పు, వేరుశనక్కాయ కారం తెచ్చి కూలోళ్ళ ముందర పెట్టింది. ఒక్కొక్కరు గంప ముందుకొచ్చి సంగటి ముద్దలు పెట్టించుకుంటున్నారు. పద్మావతి ఒక్కొక్కరికీ రెండేసి ముద్దలు పెడుతుంది. కూలోళ్ళు ఎడమచేతిలో ముద్ద మీద ముద్ద పెట్టుకుని, పైముద్ద పైభాగాన పప్పు వేసుకోవడానికి వీలుగా గులిగ (గుంత) చేసుకుని అందులో పప్పు, పుంజుకోవడానికి శనక్కాయకారం వేపించుకొని పక్కకు పోయి తింటున్నారు. తిన్నాక కొంత మంది మారు సంగటి పెట్టించు కుంటున్నారు.
తినడం అయ్యాక కూలోళ్ళు నీళ్ళు తాగి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పటికింకా మల్లక్క వరికోస్తూ ఉండడాన్ని అందరూ గమనించారు. వంచిన తల ఎత్తకుండా మల్లక్క కోస్తూనే ఉంది.
అయ్యో! పాపం వంచిన నడుము ఎత్తకుండా పొద్దునుంచి కోస్తూనే ఉంది బిడ్డా! అనుకొని కొంత మంది కూలోళ్ళు ఆమె దగ్గరకు పోయి "లేమ్మా మల్లమ్మా! సంగటి తిందవుగ్గాని, పైటాల గూడా దాటి పోతాంది" అని పిలిచారు. ఉలుకూ లేదు పలుకూ లేదు. ఎన్నో విధాల బతిమిలాడారు.
చంటిగాడు ఏడ్చేసరికి సూరన్న పోయి సీసా పాలు తాపి, నిద్రపుచ్చి, వచ్చి భార్యను కయ్యలోంచి బయటికి రమ్మని ప్రాధేయపడ్డాడు. కూలోళ్ళల్లో అమ్మలక్కలందరూ "కోతాపి గట్టెక్కి రమ్మని" చాల సేపు చెప్పి, బతిమిలాడి, భంగపోయారు. అయినా మల్లక్క నుండి ఎట్టి సమాధానం లేదు.
మల్లక్క దృష్టంతా వరికోతపైనే లగ్నమై ఉంది. ఒక యంత్రంలా కోత కోస్తూ ముందుకు సాగిపోతూ ఉంది. చేసేదిలేక అందరూ పనుల్లోకి పోయారు. సూరన్నకు బెంగ వున్నా, అస్వతంత్రుడు గనుక దిగులు పడుతూనే పనిలోకి పోవాల్సి వచ్చింది.
అప్పటికి అర్ద ఎకరా కోత కోసింది మల్లక్క. బహుశా ఈరోజు ఎకరా మొత్తం తానొక్కతే కోయాలని లక్ష్యం పెట్టుకున్నట్లుంది.
సాయంత్రం ఐదైంది. చుట్టు పక్కల పొలాల్లోని కూలోళ్ళందరూ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఊళ్ళో మల్లక్క వరి కోత విషయం గుప్పుమంది. ఊరు వూరంతా పుల్లారెడ్డి భూమి చుట్టూ ఆందోళనతో మూగారు. అందరి ముఖాల్లో పెను విషాదం అములుకుంది.
మల్లక్క ఎవరినీ ఎగాదిగా చూడలేదు. తనకున్న అతితక్కువ సమయంలో తన పని ముగించాలని ఆతృత పడుతుంది. తన కులపోళ్ళు కొందరు. ఆమెచేత ఎలాగైనా పని మాన్పించి ఆమె ప్రాణాన్ని నిలపాలని కయ్యలోకి దిగారు. అది గమనించిన మల్లక్క ఎక్కడ తన దీక్షకు భంగం కలిగిస్తారోనని తలచి తల తిప్పకుండా నడుం ఎత్తకుండానే ఆమె కోస్తున్న కొడవలిని తన మెడపై పెట్టుకుంది.
కయ్యలోకి దిగినవారికి " బలవంతంగా వరికోతను ఆపుతే మెడ నరుక్కుంటాను" అన్న సంకేతం అంది, వాళ్ళు భయంతో వెనుతిరిగి కయ్య గట్టు ఎక్కి నెత్తి నోరు కొట్టుకున్నారు. గుండెలు బాదుకున్నారు. బుజ్జగింపు మాటలు చెప్పుతున్నారు.
"అమ్మా మల్లమ్మా! పని చాలించి బయిట్కి రామ్మా! మనబోటోళ్ళు కోపడ్తే దెబ్బ తినేది మన్మేనమ్మా! అనేటోళ్ళకేమి మచ్చుగా అంటారు. పోయేది మన్మే తల్లీ. ' పేదోడి కోపం పెదవికి చేటంటారు' అట్టా పట్టుదల్కు పోవద్దమ్మా! ఇది మన కర్మ అన్కొని మంస్సు గెట్టి చేస్కోవాలమ్మా! " అంటూ సంఘంలో తమ స్థాయి ఎంత అధమస్థానంలో ఉందో పలురకాల విప్పిచెప్పి చూశారు.
"రోసానికి పోయి పాణం మీదికి తెచ్చుకోకమ్మా! పిల్లల్ను సూరన్నను ఒంటరోళ్ళను సేయకమ్మా!" అంటూ పరపరి విధాలుగా ఆవేదనతో చెప్పుతున్నారు. కానీ మల్లక్క అందర్లాంటి ఆడమనిషి కాదు. ఆత్మాభిమానానికి అగ్రతాంబూలం ఇచ్చే అభిమానవతి. వాళ్ళ అర్థింపులకు, బుజ్జగింపులకు మల్లక్కలో చింతాకంత కదిలిక లేదు.
సూరన్న చంటిగాన్ని సంకన వేసుకున్నాడు. వాడు ఒక్కటేమైన ఏడుస్తున్నాడు. కూతురు అమ్మకేమై పోతున్నదోనని ఏడుపు అందుకున్నది. చుట్టాలు పక్కాలు హాహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. సూరన్న భార్యను " నా మాటిని పనిచాలించి కయ్యలోంచి బయిట్కి రమ్మని" బొంగురుబోయిన గొంతుతో మొత్తుకుంటూ వేడుకుంటున్నారు.
పుల్లారెడ్డి "మల్లమ్మా! నువ్వు అభిమానవతివని తెల్సిగూడా పొరపాట్న మాటలు తూల్నాను. ఇంకెప్పుడూ ఇట్టా జర్గదమ్మా! మడిలోంచి బయిట్కి రావమ్మా! నన్ను చెడ్డోడిని చేయకు తల్లీ" అని బాధ వ్యక్తం చేస్తూ పిలుస్తున్నాడు.
కానీ అప్పటికే మల్లక్క గొంతు మూగబోయింది. మల్లక్కకు ఎవరి మాటలు వినడానికి చెవులు పని చేయడం లేదు. మాట్లాడడానికి నోరు రావడం లేదు. పొద్దున్నుంచి అన్నం నీళ్ళు అనుకోకుండా లక్ష్యం కోసం వేగంగా కోత కోస్తూ ఉండడం వల్ల ఆమెలోని శక్తి క్షణక్షణానికి హరించుకుపోతుంది.
ఆఖరు మొనం అయిపోయే దశ కొచ్చింది. పరమట ఎర్రపొద్దు పడింది. ఎర్రకాగు లేచింది. పక్షులన్నీ కలకల రావాలు చేస్తూ చెట్ల మీది గూళ్ళకు చేరుతున్నాయి. సూర్యుడు కుంకడానికి ఇంకా ఒక్క నిమిషమే ఉంది. మల్లక్క కోయడానికి ఇంకా పది వరిగంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చూస్తుండగానే కరకరామంటూ పొద్దు కుంకింది, ఈ బాధామయ దృశ్యాన్ని చూడలేనట్లు. మల్లక్క ఆఖరు వరిగంట విజయవంతంగా కోసింది.
ఆమె అవసాన దశకు చేరుకుంటున్నా ఆమె ముఖంలో విజయగర్వం క్షణకాలం పాటు మెరిసింది. ఎకరా వరిమడి కోత అయిపోయాక మల్లక్క వంచిన నడుమును మెల్లగా లేపి నిలబడింది. తలపైకెత్తి భర్తను పిల్లలను, చుట్టూ ఉన్న జనాన్ని తేరిపార చూసింది. అందరికీ ఒకసారి చేతులెత్తి దండం పెట్టింది. జనం కొద్ది క్షణాలు నోటమాట రాక స్తంభించి పోయారు.
మల్లక్క తన నడుము చుట్టూ చుట్టి రొండిలో దోపుకున్న పైటను ఒక్కసారిగా లాగి వేసింది. అంతవరకు పైటకొంగు బిగింపులో దాగి ఉన్న ఊపిరి బయటికి తన్నుకొచ్చి అనంత వాయువుల్లో కలసిపోయింది. మొదలు నరికిన చెట్టులా ఆమె విగత శరీరం భూమి మీద పడిపోయింది. అయినా ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం మాత్రం జ్యోతిలా వెలుగుతూ ఉంది.
జనమంతా నోటికి చేతికి కొట్టుకుంటున్నారు. గావు కేకలతో, గుండెలదిరే అరుపులతో ఆ ప్రాంతమంతా శోక సముద్రమైంది. వేదనా భరితమైంది. అంతటా విషాదం పరుచుకుంది. ఊరువూరంతా కన్నీరు పులుముకుంది.
పుల్లారెడ్డి తన అహానికి, అతిశయానికి బలైపోయిన మల్లక్క మరణానికి మూల్యం చెల్లించుకున్నాడు. మల్లక్క కోత కోసిన ఎకరా మడికయ్యను సూరన్నకు రాసిచ్చాడు. ఆమెకు సమాధి అదే కయ్యలో ఒక మూల నిర్మించాడు. కానీ పోయిన ప్రాణానికి వెలకట్టడడం ఎవరికి తరం కాదు.
నాటి నుంచి నేటి వరకు ఆ ఎకరా కయ్యను " మల్లక్క కయ్య" అంటూ జనం పిల్చుకుంటున్నారు. మల్లక్క జీవితం జనపథంలో కథలా కాలంతో పాటు దశాబ్దాలుగా ప్రవహించింది. ప్రవహిస్తూనే ఉంది.
-------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను




Comments