top of page
Original.png

బంగారు గాజుల జత

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #BangaruGajulaJatha, #బంగారుగాజులజత, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

ree

Bangaru Gajula Jatha - New Telugu Story Written By Vemparala Durga Prasad Published In manatelugukathalu.com On 19/12/2025

బంగారు గాజుల జత - తెలుగు కథ

రచన: వెంపరాల దుర్గాప్రసాద్


అన్నపూర్ణమ్మ గారు గుండె జబ్బు మనిషి. డయాబిటీస్ కూడా వుంది. ఆవిడ కొడుకు దగ్గర విశాఖపట్నం లో ఉండేది. ఆవిడకి ఒక ఊపిరితిత్తి సరిగా పనిచేయడం లేదు. అందువల్ల తరచూ, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ఆయాసపడడం జరుగుతోంది. ఊపిరి అందక, హాస్పిటల్ కి పరుగుపెట్టాల్సి వస్తోంది. ఆవిడ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి, డాక్టర్లు ఆవిడని వీలయితే విశాఖ వాతావరణానికి దూరంగా ఉంచమని చెప్పారు. ఇంక, కొడుకు శ్రీధర్ కి తప్పలేదు. ఆవిడని విజయవాడలో అక్క ఇంట్లో వుంచేడు. అన్నపూర్ణమ్మ భర్త ప్రభుత్వ వుద్యోగం చేస్తూ, అకాలమరణం చెందారు. ఆవిడకి భర్త పింఛను వస్తుంది. 


కూతురు లక్ష్మి దగ్గర ఆవిడ బాగానే కాలక్షేపం చేస్తోంది. శ్రీధర్ నెలకోసారి విజయవాడ వచ్చి, తల్లి యోగ క్షేమాలు కనుక్కుని వెళ్తూ ఉంటాడు. 


కూతురు లక్ష్మికి భర్త పోయి చాలా కాలం అయింది. పిల్లలపెళ్లిళ్లు కూడా అయిపోయాయి. వాళ్ళుండేది హైదరాబాద్ లో. తల్లి తన దగ్గర ఉండడం, ఆవిడకి కూడా బాగానే కాలక్షేపం అవుతోంది. 


అన్నపూర్ణమ్మ గారు గుండె జబ్బు మనిషి కనుక, రెగ్యులర్ గా మొగల్రాజపురం లో సుభాష్ హాస్పిటల్ లో చూపిస్తూ ఉంటుంది లక్ష్మి. 


ఆరోజు దసరా పండగ అని, కూతురిని తీసుకుని ఆటోలో ఖజానా నగల దుకాణంకి వెళ్లి తన పాత బంగారం గాజులు మార్చుకుని, కొత్త మోడల్ 2 జతలు గాజులు కొనుక్కున్నారు. ఆ డిజైన్ ఆవిడకి చాలా నచ్చింది. 4 తులాల బంగారం తో చేసినవి అవి. అవి పెట్టుకుని చాలా సంబర పడింది ఆవిడ. 


పండుగ వెళ్లి 3 రోజులయింది. ఆ రోజు సాయంత్రం నుండీ, అన్నపూర్ణమ్మ గారికి చాలా నీరసంగా అనిపించింది. కానీ, పెద్దగా పట్టించుకోలేదు ఆవిడ. ఎప్పటిలా భోజనాలు చేసి, కాసేపు టీవీ చూసి తల్లీ, కూతురు పడుకున్నారు. 


తెల్లవారుజామున 2 గంటలకి లక్ష్మి చెయ్యి నిద్రలో తల్లి శరీరం మీద పడింది. మంచులా చల్లగా తగిలేసరికి, ఉలిక్కిపడి లేచిన లక్ష్మి, తల్లిని తట్టి లేపుదామని చూసింది. ఆవిడలో చలనం లేదు. కంగారు పడి, వెంటనే 108 కి కాల్ చేసింది. 

ముసలావిడ చేతులు రుద్దుతూ కూర్చుంది. కనీసం ఆ మర్దనాకి అయినా, ఆవిడ లేచి కూర్చుంటుందేమో అని లక్ష్మి ఆశ. కానీ మార్పు లేదు. లక్ష్మి కి పిచ్చెత్తి నట్లు అయిపోతోంది. తల్లి చూస్తే ఉలుకూ, పలుకూ లేదు. కొద్దిగా శ్వాస ఆడుతున్న విషయం తెలుస్తోంది. పోనీ, విశాఖపట్నం లో వున్న తమ్ముడికి ఫోన్ చేద్దామా అంటే, ఇంత రాత్రి వేళ వాళ్ళకి చెప్పి, కంగారుపెట్టడం తప్ప, ఉపయోగం లేదని ఊరకుండిపోయింది. 


108సిబ్బంది వచ్చే వరకు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. 

మరో 10 నిముషాలలో 108 సిబ్బంది తలుపు తట్టేరు. 


వాళ్ళు ఇద్దరు, వీళ్ళ ఫ్లాట్ వరకు వచ్చేరు. డ్రైవర్ కాక ఇద్దరు వున్నారు వాళ్ళు. 

తలుపు తీసిన లక్ష్మి, తల్లి పరిస్థితి వాళ్లకి వివరించింది. 


వారిలో ఒకడు, " ఏ హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటారు?" అని అడిగేడు. 


“డాక్టర్ సుభాష్ హాస్పిటల్, మొగల్రాజపురం " చెప్పింది లక్ష్మి. 


వాళ్ళు తెచ్చిన స్ట్రెచర్ ని కింద పెట్టి, అన్నపూర్ణమ్మ గారిని వాళ్ళు ఎత్తుకుని పడుకోపెట్టారు. 


“ఆవిడ కి కప్పడానికి దుప్పటి ఇవ్వండి " అన్నాడు ఒకడు. 


వెంటనే ఒక దుప్పటి తెచ్చి ఇచ్చింది. “మీరు అమ్మని తీసుకెళ్లి వాన్ లో చేర్చండి. నేను ఈ లోపల ఇంటికి తాళం వేసుకుని వస్తాను " అంది లక్ష్మి. 


వాళ్ళు పేషెంట్ ని దుప్పటి కప్పి తీసుకుని వెళ్లిపోయారు. లక్ష్మి ఎదురు ఫ్లాట్ వాళ్ళని లేప వలసింది. కానీ, ఇంత అర్ధరాత్రి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని, ఊరుకుంది. 


తలుపులు తాళం వేసుకుని, కిందకి వెళ్లేసరికి అన్నపూర్ణమ్మ గారిని వాన్ లో ఎక్కించి, పూర్తిగా దుప్పటి కప్పేసి, ఆక్సిజన్ కనెక్ట్ చేసి ఉంచారు. 


లక్ష్మి వాన్ ఎక్కగానే, డ్రైవర్ వాన్ ముందుకి పోనిచ్చి, 10 నిముషాల్లో హాస్పిటల్ లోకి తీసుకెళ్లాడు. వీళ్ళ వాన్ చూస్తూనే, క్యాజువాల్టీ విభాగం అప్రమత్తమయ్యారు. 


ఇద్దరు వార్డు బాయ్స్ స్ట్రెచర్ ని మోసుకుని వచ్చేరు. అన్నపూర్ణమ్మ గారిని ఆ స్ట్రెచర్ మీదకి మార్చేరు. ఆవిడ అలాగే అచేతనంగా కనిపిస్తోంది. ఆవిడ శరీరం అంతా దుప్పటి కప్పి ఉందేమో, ఆవిడ వంటిమీద నగలు, అక్కడ కూడా లక్ష్మి చూడలేదు. 

లోపలికి లక్ష్మి ని రానివ్వలేదు. "ముందు ఆవిడకి ఆక్సిజన్ పెట్టి, పల్స్ మానిటర్ సెట్ చేసి, అప్పుడు మిమ్మల్ని పిలుస్తాము, అప్పటి దాక, బయట వెయిట్ చెయ్యండి" అన్నారు వాళ్ళు. 


108 వాన్ వెళ్లిపోయింది. మరో 10 నిముషాల తర్వాత ఒక లేడీ నర్స్ వచ్చి, “మీరు లోపలకి రండి” అని పిలిచింది. 


అన్నపూర్ణమ్మ గారికి చేతులకి ఇంజక్షన్ పట్టీ పెట్టేసి, ఆవిడకి పల్స్ మానిటర్ కనెక్ట్ చేసారు. 


డ్యూటీ డాక్టర్ ఆవిడని పరీక్ష చేస్తున్నారు. 

నర్స్ లక్ష్మి ని పక్కకి పిలిచి, "మీ అమ్మగారి నగలు జాగ్రత్త పెట్టుకోండి” అని ఒక బంగారు గొలుసు, ఒక జత గాజులు చేతిలో పెట్టింది. 


అవి చూసిన లక్ష్మి నిర్ఘాంత పోయింది. " గొలుసు కాక 2 జతలు గాజులు ఉండాలి. ఒకటే జత ఇచ్చారేమిటి?” అంది. 


"ఆవిడ వంటిమీద అవే వున్నాయి. వున్నవి ఇవ్వగలను గానీ, లేనివి నేను ఎక్కడ నుంచి తెస్తాను" అని నర్స్ విసుక్కుంది. 


లక్ష్మి కి అర్ధం అయింది ఒక జత గాజులు ఎవరో దొంగిలించారు. 

ముందు తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి, గాభరాగా వుంది ఆమెకి. ఆ నర్స్ ని ఏమీ అనలేక, తల్లి కేసి నిస్సత్తువగా చూస్తూ ఉండిపోయింది. 


డ్యూటీ డాక్టర్ అప్పుడు ఇలా అన్నాడు " మీకు ఏమవుతారు ఈవిడ?"


“మా అమ్మ” అంది లక్ష్మి. 


“సమయానికి తెచ్చారు. ఆవిడకి షుగర్ బాగా పడిపోయింది. అందుకే స్పృహ కోల్పోయారు. 2 ఇంజెక్షన్స్ చేసాము. సెలైన్ పెట్టాము. పూర్తిగా మానిటర్ చేస్తున్నాము. మరొక గంట తర్వాత స్పృహ వస్తుంది. ట్రీట్మెంట్ కి బాగానే ప్రతిస్పందిస్తున్నారు. మరేమీ పర్వాలేదు " అన్నాడు. 


అప్పుడు కాస్త రిలీఫ్ అనిపించింది లక్ష్మికి. 

రెండు గంటలు ఆవిడ మంచం పక్కనే కూర్చుంది. 

అప్పుడు నెమ్మదిగా అన్నపూర్ణమ్మ గారికి స్పృహ వచ్చింది. తనని హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది. 


కూతురు కేసి చూసి, "ఏం జరిగింది" అంది. 


లక్ష్మికి ప్రాణం లేచి వచ్చింది.. తల్లి మాట విని. " అమ్మయ్య, తెలివి వచ్చిందా.. సడన్ గా స్పృహ కోల్పోయావు. యెంత తట్టి లేపినా, లేవడం లేదు. అందుకే 108 వాన్ వాళ్ళని పిలిచి, ఇలా తీసుకొచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసేను " అంది. 


అప్పుడు చేతులు చూసుకుంది అన్నపూర్ణమ్మ గారు. "నా నగలు తీసేవా?" అంది కూతురు తో. 


లక్ష్మి కి గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు ఒక జత గాజులు కనపడడం లేదు అని చెపితే, ఆవిడ కి ఏమయినా అవుతుంది అని, ముక్తసరిగా, నగలు తీసెనులే అనేసింది. 

మర్నాడు ఉదయాన్నే తమ్ముడు శ్రీధర్ కి కబురు పెట్టింది. శ్రీధర్ వెంటనే బయలు దేరి విజయవాడ వచ్చేసేడు. 


తమ్ముడికి బంగారు గాజుల జత పోయిన విషయం చెప్పింది. శ్రీధర్, లక్ష్మి తో కలిసి దగ్గర లోని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేడు. 


“మీకు ఆ 108 వాళ్ళ మీద అనుమానమా" అన్నాడు డ్యూటీ లో వున్న సబిన్స్పెక్టర్. 


"అంతకంటే అవకాశం లేదు" అన్నాడు శ్రీధర్. 


హాస్పిటల్ లో స్ట్రెచర్ మీద చేర్చినప్పుడు ఆ గాజులు చూసేరా? అన్నాడు అతను. 

“చూడలేదు” అంది లక్ష్మి.


“మరి, అలాంటప్పుడు హాస్పిటల్ నర్సులు కూడా తీయచ్చు కదా " అన్నాడు. 


" అది మేము చెప్పలేము.. ఆలా కూడా జరగొచ్చు” అన్నాడు శ్రీధర్. 


" ఆమెని హాస్పిటల్ లో జేర్చినప్పుడు పేషెంట్ పక్కన ఎవరు వున్నారు? మీరు, అక్క ఉన్నారా? “ అన్నాడు.

 

“అక్క మాత్రమే వుంది. నేను ఈ రోజే వచ్చేను” అన్నాడు శ్రీధర్. 


“ఇక్కడ మీ అక్క చెప్పింది నమ్మాలి తప్ప, మనకి మరో అవకాశం లేదన్నమాట" అన్నాడు. 


అతని మాటల్లో వ్యంగ్యం అర్ధం అయింది శ్రీధర్ కి. 


“మా అక్క అబద్దం ఆడాల్సిన అవసరం ఏముంది. ఆవిడకి మా అమ్మ నగలు కొట్టేసే అగత్యం లేదు” అన్నాడు రోషంగా. 


"నా ఉద్దేశ్యం అది కాదు. మేము ఇన్వెస్టిగేషన్ చేయాలంటే, మాకు కొన్ని నిజాలు తెలియాలి అందుకే అడుగుతున్నాను. సుభాష్ గారి హాస్పిటల్ లో స్టాఫ్ తీసేరని మీరు అనుమానం చెపితే, వాళ్ళని విచారిస్తాను. 108 సిబ్బంది మీద అనుమానం అయితే, వాళ్ళని విచారిస్తాను. మీరు ఆలోచించుకుని రేపు రండి. అప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను " అన్నాడు. 


శ్రీధర్ కి అర్ధం అయింది “సబిన్స్పెక్టర్ అప్పుడు కేసు రిజిస్టర్ చేసే ఉద్దేశ్యం లో లేడు” అని. 


పైగా కేసు రిజిస్టర్ చేస్తే, వాడు అక్కని కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి, ఆమెని అవమానిస్తాడు అనిపించింది. 


అప్పటికే, లక్ష్మి మొహం చిన్నబోయింది. తల్లి ఆరోగ్యం మీద కంగారులో ఎదురు ఫ్లాట్ వాళ్ళని ఆమె లేపలేదు. లేపి ఉంటే, కనీసం 108 లోకి అన్నపూర్ణమ్మ గారిని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని అయినా తోడు పంపేదాన్ని అనుకుని, ఆమాటే బయటకి అంది. శ్రీధర్ అక్కని వారించాడు. "నీ తప్పు లేదు అక్కా. ఆ సమయం లో మనకి అమ్మ ఆరోగ్యం ముఖ్యం. ఇంకేమీ తోచవు లే ” అన్నాడు. 


“మేము, రేపు వస్తాములెండి” అని సబిన్స్పెక్టర్ తో చెప్పి, అక్కని తీసుకుని వెనుకకు వచ్చేసాడు. 


2 రోజులు గడిచేయి. అన్నపూర్ణమ్మ గారు కోలుకుంది. ఇంటెన్సివ్ కేర్ నుండి రూమ్ కి మార్చేరు. అప్పుడు చెప్పింది. గాజుల జత పోయిన విషయం. ముసలావిడ లబోదిబో మంది. 2 తులాల గాజులు పోయినట్లే అని ఆవిడ బాధ పడింది. తమ గ్రహస్థితి కి తిట్టుకుని ఏడ్చింది. మూడవ రోజుకి ఆవిడ బాగా కోలుకుంది. రెండు పూటలా భోజనం బాగానే తీసుకుంటోంది. మందులు ఆవిడ స్వయంగా వేసుకుంటోంది. 


సాయంత్రం డాక్టర్ ప్రకాష్ ఫోన్ చేసి పిలిచాడని, ప్రకాష్ రూముకి వెళ్ళేరు అక్కా, తమ్ముడు. 


“మీరు.. పోలీస్ స్టేషన్ లో మా స్టాఫ్ మీద కంప్లైంట్ ఇచ్చారా?“ అని అడిగేడు డాక్టర్. 


"లేదండీ” అన్నాడు శ్రీధర్. 


“చూడండి, మాది ప్రెస్టీజియస్ హాస్పిటల్. ఇక్కడ అలాంటివి జరగవు. మీరు బహుశా 108 లో ఎక్కించిన తర్వాత చూసుకోలేదేమో..వాళ్ళు తీసి ఉండచ్చు కదా” అన్నాడు. 


శ్రీధర్ కి అర్ధం అయింది. అంటే ఆ సబిన్స్పెక్టర్, డాక్టర్ ని కలిసి బెదిరించాడన్నమాట. 


ఇంక అప్పుడే నిర్ణయించుకున్నాడు శ్రీధర్..ఆ గాజుల కోసం కంప్లైంట్ ఇవ్వద్దని. డాక్టర్ తప్పుగా తీసుకుంటే ఇబ్బంది. తల్లి ఆరోగ్యం విషయంలో ఆయన మీద ఆధారపడాలి కదా. 


ఆ రాత్రి తల్లికి హాస్పిటల్ కి క్యారేజీ తీసుకుని వెళ్ళినప్పుడు డ్యూటీ డాక్టర్ ఇలా అన్నాడు:

“అమ్మగారికి పూర్తిగా నయమయిపోయింది. డాక్టర్ సుభాష్ గారు మీకు డిశ్చార్జ్ ఇచ్చెయ్యమన్నారు. మీరు అమ్మగారిని ఇప్పుడే తీసుకెళ్లి పోవచ్చు ”. 


శ్రీధర్ కి అర్ధం కాలేదు. సాధారణంగా బిల్ యెంత అయిందో చెప్పి, అది కట్టిస్తారు. అది కట్టించే ముందు, ఫార్మసీ, ల్యాబ్, విభాగాల నుండి, పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడానికి, చెల్లింపులు మిగిలిలేవని, పత్రాలు తెచ్చుకోవాలి. ఇదంతా ఒక 2 గంటల పని. 


“ఇవేవీ లేకుండా ఇలా అర్ధాంతరంగా డిశ్చార్జ్ అంటున్నారేమిటి?” అనిపించింది అతనికి. 


"మరి మా ఫైనల్ బిల్ ఏంటో చెపితే.. కట్టెస్తాము " అన్నాడు.


“మీరు పేషెంట్ ని తీసుకుని వెళ్లిపోండి. మీ ఫోన్ కి వివరాలు వస్తాయి. అప్పుడు వచ్చి కట్టచ్చు” అన్నాడు డ్యూటీ డాక్టర్. 


తల్లికి భోజనం తినిపించి, అన్నీ సర్దుకుని, టాక్సీ మాట్లాడుకుని ఆవిడని ఇంటికి తెచ్చేసాడు. 


అంటే.. జరిగిన సంఘటన ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రకాష్ గారు బిల్ కట్టించకుండా తమని పంపించేసాడని అర్ధం చేసుకున్నారు అక్కా, తమ్ముడు. 


మరునాడు శ్రీధర్ విశాఖపట్నం వెళ్ళిపోయాడు. ఫోన్ చేసి, “ మనకి ఆ నగలు యోగం లేవు అంతే.. అనుకుందాం” అన్నాడు శ్రీధర్, అక్కతో. 


4 రోజులయినా, హాస్పిటల్ నుండి బిల్ రాలేదు. బిల్ ఇచ్చే ఉద్దేశ్యం హాస్పిటల్ వాళ్ళు విరమించుకుని ఉంటారని అర్ధం చేసుకుంది లక్ష్మి. 


గమ్మత్తుగా.. ఆరోజు సాయంత్రం ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇంటి తలుపు తట్టేరు. 

తలుపు తీసిన లక్ష్మి వాళ్ళని పోల్చుకుంది. వాళ్ళు తల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్లిన 108 సిబ్బంది. 


అందులో ఒకతను అన్నాడు: "అమ్మా.. మీ అమ్మగారి నగలు మేము ఎందుకు తీస్తాము తల్లీ! మేము అలాంటి వాళ్ళము కాదు. ఆ సబిన్స్పెక్టర్ మమ్మల్ని ఏదో వంక పెట్టి అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నాడు. మేము బతిమిలాడుకుంటే, మీ దగ్గర కంప్లైంట్ ఉపసంహరించినట్లు వుత్తరం తెచ్చుకోమంటున్నాడమ్మా! “ అన్నాడు దీనంగా. 


లక్ష్మికి, అన్నపూర్ణమ్మ కి వాళ్ళ స్థితి చూస్తే జాలి వేసింది. 


“నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేను కానీ, నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఇంక ఉపసంహరించడం ఏముంది? “ అంది లక్ష్మి. 


" ఏమోనమ్మా మాకు ఏ పాపం తెలీదు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. ఆ పోలీసోల్ల చుట్టూ తిరగలేము తల్లీ. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అమ్మా. మీ కాళ్ళకి మొక్కుతాము. మమ్మల్ని కనికరించి ఒక ఉపసంహరణ పత్రం ఇవ్వు తల్లీ ” అని బ్రతిమాలాడారు. 


వాళ్ళ బాధ చూసి కరిగి పోయిన లక్ష్మి, సబిన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, చెప్పింది "108 సిబ్బంది మీద తనకి ఏమీ అనుమానం లేదని. వాళ్ళు కూడా ఆవిడ సమక్షం లోనే ఉన్నట్లు, తర్వాత ఎప్పుడూ వాళ్ళ మీద మరల కంప్లైంట్ ఇవ్వనని” హామీ ఇచ్చింది. 

ఆ సంభాషణ అంతా ఇన్స్పెక్టర్ రికార్డు చేసుకోవడం ఆమె గమనించలేదు. 

బ్రతుకు జీవుడా అని ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోయారు. 

***

మరొక పది రోజులు గడిచేయి. లక్ష్మి తో ఎదురింటావిడ చెపుతోంది.. " మేము ఈరోజు ఖాళీ చేసి గుంటూరు వెళ్ళిపోతున్నాము. ఇంటాయన వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చాడట. వాళ్ళు రేపు వస్తున్నారు” అంది. 


సాయంత్రం ఎదురిల్లు ఖాళీ అయిపోయింది. ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు కడిగించి రెడీ చేసాడు. 


మర్నాడు పొద్దున్నే ఎవరో ఇంట్లో దిగేరు. 

అన్నపూర్ణమ్మ మధ్యాహ్నం భోజనం చేసేక, వరండాలో పచార్లు చేయడం అలవాటు. ఎదురింట్లోనుంచి ఒక ముప్పయి ఏళ్ళ స్త్రీ బయటకి వచ్చి పలకరింపుగా నవ్వింది. 

“నీ పేరేమిటమ్మాయ్ పలకరిస్తూ” అడిగింది అన్నపూర్ణమ్మ. 


"పెద్దమ్మ గారూ! మేము పొద్దున్నే దిగేము. నా పేరు నీలిమ. మావారు వినోద్, త్రి టౌన్ లో సబిన్స్పెక్టర్ గా చేస్తున్నారు" అంది. 


అప్పుడు చూసింది ఆమె చేతికి బంగారు గాజుల జత. ధగధగా మెరిసిపోతున్నాయి. అన్నపూర్ణమ్మ పోల్చుకుంది. తన గాజుల్లాగే వున్నాయి. ఆ డిజైన్ తాను చాలా ఏరి మరీ తీసుకున్నది. 


"నీ గాజులు బావున్నాయమ్మా.. ఎక్కడ చేయించావు?” అంది. 


"పెద్దమ్మ గారూ, మా వారు ఈ మధ్యే కొనుక్కుని వచ్చారు. నేనంటే చాలా ఇష్టం మా వారికి “ అంది ముసి ముసి నవ్వులు నవ్వుతూ. 


“ఒక సారి మా ఇంట్లోకి రా “ అని, కూతురు లక్ష్మి ని పిలిచింది. 


నీలిమ వీళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. 


“నీలిమ వేసుకున్న గాజులు, నా గాజులు ఒకటే డిజైన్.. చూడు లక్ష్మీ !” అంది ఆవిడ కూతురిని ఉద్దేశించి. ఆ గాజులు చూసిన లక్ష్మి ఆశ్చర్య పోయింది. 


"అవునమ్మా.. నీ గాజుల డిజైన్, ఇదీ ఒకటే” అంది. 


లక్ష్మి కి నీలిమ ని పరిచయం చేసింది. ఆవిడ భర్త త్రి టౌన్ లో సబిన్స్పెక్టర్ అని చెప్పింది. 


ఇంతలో నీలిమ, మా వారు వచ్చే టైం అయింది. అంటూ లేచింది. లక్ష్మి ఆమెతో బయటకి వచ్చింది. అప్పుడే సబిన్స్పెక్టర్ వినోద్ ఎదురింటి తలుపు కొడుతున్నాడు. 

"ఏమండీ.. నేనుఇక్కడే వున్నా" అంటూ ముందుకెళ్లింది నీలిమ. 


అప్పుడు తిరిగి చూసేడు వినోద్. నీలిమ పక్కన లక్ష్మి ని చూసి బిత్తర పోయాడు. 

ఇవేవీ తెలియని నీలిమ పరిచయం చేస్తోంది.. " ఈవిడ లక్ష్మి గారు. మన ఎదురు ఫ్లాట్ వీళ్లది" అంటోంది. 


లక్ష్మి కూడా ఇన్స్పెక్టర్ ని పోల్చుకుంది. తల్లి నగల విషయం లో కేసు పెట్టకుండా ఎందుకు తాత్సారం చేసేడో అర్ధం అవుతోంది. ఆమె మొహం లో భావాలు కనిపెట్టేసేడు వినోద్. 


లక్ష్మి కి అతని మొహం లో భావాలు మారడం తెలుస్తోంది. 


నవ్వలేక నవ్వు నవ్వి, నీలిమ వైపు తిరిగి.. " రా త్వరగా భోజనం పెట్టు.. నేను వెళ్ళాలి" అన్నాడు.


అతని మాటల్లో తత్తరపాటు లక్ష్మి గమనించింది. 

లక్ష్మి కి విషయం అప్పటికి అర్ధం అయింది, కానీ అతను పోలీస్ సబిన్స్పెక్టర్. తమ అనుమానం బయట పెట్టడానికి అవకాశం లేక మిన్నకుండిపోయింది. 

విచిత్రంగా మర్నాడు ఉదయం నీలిమ అలికిడి లేదు. సాయంత్రం నుండీ నీలిమ వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంటోంది. 


మరో పది రోజుల తర్వాత తెలిసింది..”మళ్ళీ ఎదురు ఇల్లు ఖాళీ అయిందని, ఆ ఇంట్లో వాస్తు ఇబ్బందులుగా అనిపించి, వినోద్ వేరే ఇంటికి మారిపోయాడుట”. 


ఓనర్ మళ్ళీ ఆ ఫ్లాట్ కి " అద్దెకి ఇవ్వబడును" అని బోర్డు పెట్టేడు. 


తన తల్లి గాజుల జత హాస్పిటల్ లో కొట్టేశారా? లేక 108 వ్యాన్ లో కొట్టేశారా అన్న విషయం లక్ష్మి కి ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. కానీ ఒక విషయం అర్ధం అయింది, "దొంగలని మించిన దొంగ" వినోద్ అని. 


సమాప్తం

 

వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.

bottom of page