మనసున్న మారాజు

'Manasunna Maaraju' written by Lakshmi Sarma B
రచన : B. లక్ష్మీ శర్మ
అనసూయా! మన పిల్లలిద్దరూ ఎంత గొప్ప వాళ్ళయిపోయారో చూసావా! అసలు మన పిల్లలని చెప్పుకోవటం కాదు గాని, ఇంత గొప్పవాళ్ళయి పోతారని మాత్రం నేనూహించలేదు. అబ్బ! ఎంత మంది వచ్చారు మన మనవడి పెళ్ళికి. అందరూ మన పిల్లలను పొగిడే వాళ్ళే. ఎంతకన్నుల పండుగగా జరిగింది పెళ్ళి. సినిమాల్లో చూస్తుంటామే, అలా అనిపించింది. ఇదంతా మన అదృష్టమేనే! ఏమంటావు? అడిగాడు భార్యను రామచంద్రం.
“అవునండీ, నాకు చాలా ఆనందంగా వుంది చూస్తుంటే. ఇదంతా మీ దయవలనే కదండీ. మీ మంచితనమే మీ పిల్లలకు వచ్చింది” అంది అనసూయ.
“ఇందులో నా దయ ఏముంది? వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కోరుకున్న పిల్లలతో పెళ్ళిళ్ళు చేసాము. మనకు బాధ్యత తీరింది” అన్నాడు రామచంద్రం.
“ఏమండీ! మనము ఇంకా ఆ వూరిలో ఉండి ఏం చేస్తాము? ఉన్న పొలం అమ్మి హాయిగా ఇక్కడే పిల్లలతో వుండొచ్చు కదా. ఎంత కాలం పిల్లలకు దూరంగా వుంటాము చెప్పండి?” అన్నది.
“అనసూయా! నాకు మాత్రం రావాలని లేదు. అక్కడ ఆ పల్లె వాతావరణం అంటే నాకు ప్రాణంతో సమానం. అయినా మన పొలాలు, మన ఇల్లు.. అవన్నీ విడిచిపెట్టి ఇక్కడేం చేస్తాము? మనకు తోచొద్దూ ఇక్కడ? చూడు అనసూయా! నీకు రావాలని వుంటే గనుక, వాళ్ళంత వాళ్ళు రమ్మంటే అప్పుడు వచ్చి వుందువు గాని, సరేనా?” అన్నాడు రామచంద్రం.
“అదేంటండీ! మీరక్కడ, నేనిక్కడ ఉండడం కుదరని పని. మీరెక్కడ వుంటే అదే నా స్వర్గసీమ. అంతేకాని, వాళ్ళు పిలిచినా మీరు రాకుండా నేను రాను. ఏదో పిల్లల మీద మమకారంతో అలా అడిగాను” అంది అనసూయ.
పెళ్ళి చాలా గ్రాండ్ గా జరిగిందని అందరూ మెచ్చుకుంటుంటే పొంగిపోయారు రామచంద్రయ్య పెద్ద కొడుకు, కోడలు. అందరూ వెళ్ళి పోయారు. వచ్చినవాళ్ళకు కనీసం తల్లిని గాని, తండ్రిని గాని ఏ ఒక్కరికీ పరిచయం చెయ్యలేదు. కనీసం తిన్నారా, ఏమైనా కావాలా అని పెద్ద కొడుకు సతీష్ కానీ, కోడలు సరిత కానీ అడిగిన పాపాన పోలేదు. ఎవరో దూరపు చుట్టాలు వచ్చినట్టు ఒకసారి వచ్చి, పలకరించి వెళ్ళారు. పోనీ చిన్న కొడుకు మహేష్ అయినా పట్టించుకుంటాడేమో అంటే అతనూ అంతే. పిల్లలు పిలుస్తున్నారంటూ భార్య వెనకాలే వెళ్ళిపోయాడు. 'పాపం చాలా బిజీగా వున్నారు' అని సరిపెట్టుకున్నారు రామచంద్రయ్య దంపతులు.
"అమ్మా! అమ్మా!" అంటూ పిలుస్తూ వచ్చాడు సతీష్, వాళ్ళున్న గది దగ్గరకు. రామచంద్రయ్య అలసిపోయి పడుకున్నాడేమో కొడుకు పిలుపు వినిపించలేదు. అనసూయలేచి వచ్చింది కొడుకు పిలుస్తున్నాడన్న ఆనందంలో. “ఏమిటి బాబూ పిలిచావు?” అడిగింది అనసూయ.
మీ ఆయన తోటి మా పరువంతా పోతుందమ్మా! ఆ వేషమేంటి? అసలు ఆయన రాకుంటే ఏం? ముతక ధోతి మోకాళ్ళ వరకు కట్టుకొని, సిగరెట్లు తాగుతూ, కనిపించిన వాళ్ళందరికీ ‘సతీష్ మావోడే’ అంటూ చెప్పాడట. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? వచ్చిన వాళ్ళు ఒకచోట కూర్చుని చూడొచ్చు కదా. అందరూ వింతగా నా దగ్గరకు వచ్చి, ‘మీ నాన్న అని చెబుతున్నారు.. పిచ్చివాడిలా ఉన్నాడు’ అని ఒకరు, ఇంకొకరేమో ‘ఇంత అందగాడివి, నీకు అలాంటి తండ్రి ఏమిటి’ అని ఒకరు. వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్. వాళ్ళ ముందు నా పరువు పోయింది” రుసరుసలాడుతూ అన్నాడు సతీష్.
నోట మాట రాక అలాగే నిలబడిపోయింది అనసూయ. “అవునండీ! నాకూ అలానే జరిగింది. మీ మామగారు, అత్తగారు వచ్చారట కదా! పాపం, మీ అత్తయ్య చాలా బాగుంది, మీ మామగారేంటి బంట్రోతులా వున్నాడు? అసలు ఆ మనిషిని ఎలా భరిస్తావే? అంటూ మా ఫ్రెండ్స్ అంతా అడగడమే” అంటూ వచ్చింది సరిత.
అనసూయలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్క వుదుటున కొడుకు కాలర్ పట్టుకుని ఆ చెంప, ఈ చెంప వాయించింది. “ఎవర్రా బంట్రోతు? కన్న తండ్రిని పట్టుకుని అనే మాటలేనా ఇవి. ఏమన్నావు? మా ఆయన అంటే నీకు కన్నతండ్రి అన్న సంగతి కూడా మరిచిపోయావా! ఒరేయ్.. మీ నాన్న లాంటి వాడిని అంటే కళ్ళు పోతాయి రా! ఏమన్నావు? ముతక ధోతి కట్టుకున్నాడని కదూ! నువ్వేనాడైనా మన వూరు వచ్చి, అమ్మానాన్నలు ఎలా వున్నారని చూసి, కట్టుకోవడానికి నాలుగు గుడ్డలు తెచ్చి పెట్టావా! ఏం చేసారని మీరు ఆయనకు? ఆయనను అనే అధికారం మీకెక్కడుంది?
మీరు పుట్టిన నాటి నుండి నా కొడుకులు.. నా కొడుకులు.. అంటూ, మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా పెంచాడురా ఆయన! తాను ముతక బట్టలు కట్టుకున్నా మనకేనాడూ తక్కువ చెయ్యలేదు. మీరు స్కూల్ కి వెళ్తే బట్టలు నీట్ గా ఉండాలని, తనే ఉతికి ఇస్త్రీ చేసి నీకు, నీ తమ్ముడికి ఇచ్చేవాడు. అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడే వాడు. అలాంటి వాడు ఇవాళ మీ కళ్ళకు పరువు తీసే వాడిలాగా కనిపించాడా? దేవుడా! ఎలాంటి కొడుకులను ఇచ్చావయ్యా!”
“అమ్మా! నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను? అందరి ముందు అలా మాసిన బట్టలతో వుండద్దన్నాను. అంత మాత్రానికే నాన్నను అనరాని మాటలన్నట్టు బాధపడతావెందుకమ్మా! మాకు తెలీదా నీ గురించి, నాన్న గురించి. మా కోసం మీరెంత కష్టపడ్డారో మేము చూడలేదా ! ఒక్క మా కోసమేనా! మన వాళ్ళందరి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు. పరువు ప్రతిష్టలని నోరు మెదపకుండా నువ్వు చేసిన బండ చాకిరీ ఎలా మరచిపోతాననుకున్నావు.
ఎన్ని రాత్రులు నువ్వు పస్తులుండలేదు? మాకు ఊహ తెలిసాక ఎన్నిసార్లు నీ కంటి నీరు తుడవలేదు? అలాంటి మేము మిమ్ములను పువ్వుల్లో పెట్టి చూడాలనుకున్నాము. కానీ మీరేమో రమ్మంటే రారు మా దగ్గరకు. ఎంతసేపూ ‘పెద్దవాళ్ళున్నారు, వాళ్ళను వదిలి ఎలా రావడం?’ అంటారు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను. వారం ముందు రండి అని పిలిచినా మీరు రాలేదు. తీరా సమయానికి వచ్చారు. పోనీ వచ్చేటప్పుడు నాన్నగానీ, నువ్వుగానీ మంచి బట్టలు కట్టుకుని వచ్చి ఉంటే నలుగురిలో మనకే కదమ్మా గౌరవం!
అందరూ ఏమనుకున్నారో తెలుసా ? ‘ఎంత సంపాదన వుంటే ఏం లాభం? కన్న తల్లిదండ్రులను మంచిగా చూడకపోయిన తరువాత. పాపం వాళ్ళను చూస్తుంటే జాలేస్తుంది’ అని ఇలా తలోమాట అంటుంటే భరించలేకపోయాను. వీళ్ళేమో స్వర్గసుఖాలు అనుభవిస్తుంటే, పాపం వాళ్ళేమో కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళలా వున్నారు. అని అంటూ వుంటే సహించలేకపోయాను. నన్ను క్షమించమ్మా!” అంటూ రెండు కాళ్ళు పట్టుకున్నాడు.
“ఛ ఛ, అదేమిటిరా.. లే! “ అంటూ కొడుకును దగ్గరకు అదుముకుంది. గిర్రున వెనక్కి తిరిగి పోయింది, సతీష్ భార్య సరిత కోపంతో.
“ఒరేయ్! కోడలికి కోపం వచ్చినట్టుంది. వెళ్ళు, వెళ్ళి సముదాయించు. మన మాటలు మీ నాన్న గారు విని ఉంటే చాలా బాధ పడిపోయేవారు” అని కొడుకును పంపి లోపలికి వచ్చింది.
“ఏమండీ! మీరు పడుకోలేదా?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. కొడుకు మాటలు విన్నాడేమోనని కంగారుపడుతూ.
“మీ మాటలు నేను వినగూడదనుకున్నావు కదూ ! పిచ్చిదానా, నీకు ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను, మన పిల్లల మనస్తత్వం! ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. సరే కానీ మన బ్యాగులు సర్ది పెట్టు. రేపు పొద్దుటే మన వూరు వెళ్ళిపోదాం” చెప్పాడు. మంచం మీద పడుకుని నిండా దుప్పటి కప్పుకున్నాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా.
చేష్టలుడిగి పోయినదానిలా నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. ‘అంతా విన్నాడు! ఇక ఆయన ఎవరి మాట వినడు. వెళ్లిపోవాల్సిందే! పాపం సతీష్ ఎంత బాధపడతాడో. నా కర్మ కాకపోతే ఏదో నాలుగు రోజులు సంతోషంగా వుందామని వస్తే, ఆదిలోనే హంసపాదు అన్నట్టు అయింది. అంతేలే! సుఖపడే రాత నాకు లేదు’ అనుకుంటూ ముసుగు తన్ని పడుకుంది.
“సరితా! నాన్న లేచారా? కాఫీ ఏమైనా తాగారా!” అడిగాడు సతీష్ ఉదయం లేస్తూనే.
“ఏమోనండీ! నేను ఇంతకుముందే లేచాను. అయినా వాళ్ళకు పొద్దుటే లేచే అలవాటు కదా. లేచే ఉంటారు” అంటూ “నేను స్నానానికి వెళుతున్నాను. మీరు వెళ్ళి చూసి రండి” అంది. ఆమెలో ఇంకా నిన్నటి కోపం పోలేదు.
“సరే, నేను చూస్తాలే!” అని వచ్చాడు తల్లి తండ్రి వున్న గదిలోకి. గదిలో తల్లి, తండ్రి కనిపించలేదు. వాళ్ళకు సంబంధించిన వస్తువులు లేవు. అర్ధమైపోయింది సతీష్ కు. నాన్నకు కోపం వచ్చి వెళ్ళి పోయినట్టున్నారు. నిన్న జరిగిన సంభాషణను విన్నారేమో!
“ఛ.. ఛ! నేను ఆలోచన లేకుండా మాట్లాడేసాను. వాళ్ళెవరో అన్నారని ఆవేశపడి కన్న తల్లి, తండ్రిని బాధపెట్టాను. నా విచక్షణాజ్ఞానం ఏమయ్యింది? పాపం అంత దూరం నుండి రమ్మనగానే రెక్కలు కట్టుకుని వచ్చారు. కనీసం నేను వెళ్ళి వాళ్ళను నా కారులో కూడా తీసుకురాలేదు. కారుండికూడా!” మనసంతా బాధతో నిండిపోయింది.
“ఏమండీ! మీ అమ్మ నాన్న గారు లేచారా? కాఫీ, టీ తాగారటనా?” అడిగింది లోపలికి వచ్చిన భర్తను సరిత చిన్నబోయి వస్తున్న భర్తను చూసి.
“ సరితా! అత్తయ్య, మామయ్య అనలేవూ. వెళ్ళిపోయారు సరితా వాళ్ళు, మనం వేసిన నిష్టూరాలు భరించలేక వెళ్ళిపోయారు. బయట వాళ్ళు ఏదేదో అన్నారని, నువ్వు నన్ను బాగా ఉసిగొల్పావు. నా కన్న తల్లి తండ్రులని చూడకుండా వాళ్ళ మీద విరుచుకుపడ్డాను.నేను పుట్టి బుద్దెరిగినప్పటి నుండి వాళ్ళు నన్ను పల్లెత్తు మాటని ఎరుగరు. అలాంటిది నేను వాళ్ళ మనసు చాలా క్షోభ పెట్టాను. అందుకే అంటారు ఆడవాళ్ళ మాటలు వింటే ఇలాగే వుంటుందని” అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు సతీష్. అలా బయట తిరిగి తిరిగి, సాయంకాలం వచ్చాడు ఇంటికి అలసిపోయిన ముఖంతో. సతీష్ ను చూస్తేనే తెలుస్తుంది ఎంతగా బాధపడుతున్నది! అందుకే గమ్మున వుండిపోయింది. సాయంకాలం రంగన్న వచ్చాడు. వస్తూనే “బాబూ! నాన్నగారు ఏం చేస్తున్నారు?” అని అడిగాడు.
రంగన్న రామచంద్రంకు కుడిభుజం లాంటి వాడు. వ్యవసాయంలో తోడుగా వుంటూ ‘ఆయన ఎంత చెబితే అంత’ అన్నట్టుగా మసలుకుంటాడు. రంగన్న కొడుకు, కూతురు సిటీలోనే వుంటారు కాబట్టి , రంగన్నను తీసుకుని వచ్చాడు రామచంద్రం. ఆ పట్నంలో ఎటు వెళ్ళాలో తెలియదు.
రంగన్నను చూడగానే సతీష్ ముఖం వెలవెలబోయింది. ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అదేంటిబాబూ! అలాగున్నారేంటి, ఒంట్లో బాగోలేదా! నాన్నగారు ఏమైనా అన్నారా?” అడిగాడు.
“అబ్బే! అదేం లేదు రంగన్నా. నాన్నగారు మమ్మల్ని ఏనాడూ ఒక్క మాట అనలేదు. కానీ..” ఆగాడు సతీష్ ఎలా చెప్పాలో అని.
“ఏమైంది బాబూ! ఏం జరిగిందో చెప్పు బాబూ!” అడిగాడు రంగన్న.
“చెబుతా రంగన్నా! చిన్నప్పటి నుండి నీ చేతుల్లో పెరిగిన వాళ్ళం. నీ దగ్గర దాపరికమేముంది? నువ్వు చూసావు కదా!” అని జరిగింది చెప్పాడు సతీష్.
“ ఎంత పని చేసావు బాబూ! మీ నాన్న ఆ శ్రీరామచంద్రుడిలా మాట తప్పని మనిషి. తన సుఖం తాను కోరడు. ఎంత సేపు పరుల సుఖం కోసం కష్టపడే మనిషి బాబూ! ఏమన్నావూ? మీ నాన్న బంట్రోతులా వున్నాడని కదా ! మీ కోసం ఆయన పడ్డ కష్టాలకు మీరిచ్చే బహుమానమా బాబూ అది? ఆయన ఊరంతటికీ జమిందారు. కానీ మీ కోసం ఆయన చేసిన త్యాగం వింటే మీరెంత పొరబాటు చేసారో తెలుస్తుంది” అంటూ చెప్పడం ఆపాడు.
“ఏమిటి రంగన్నా అది? చెప్పడం ఆపావు ఎందుకు? చెప్పు! ఇప్పటికే మేము చాలా తప్పు చేసాము. వాళ్ళను పట్టించుకోకుండా, మా సుఖాలు మావి అనుకుని చాలా తప్పు చేసాము రంగన్నా. అమ్మానాన్నలను ఇక మాతో వుండేలా చూసుకుంటాము. చెప్పు రంగన్నా” కలచివేస్తున్న మనసుతో అన్నాడు సతీష్.
“బాబూ! ఈ విషయం ఇన్నాళ్ళుగా దాచి వుంచారు అంటే, అది కేవలం మీ నాన్నకు, నిన్ను కన్నతల్లికి , నా భార్య కవితకు మాత్రమే తెలుసనుకున్నారు మీ నాన్న. నాకు తెలుసన్న సంగతి మీ నాన్నకు తెలియదు బాబూ! రామచంద్రంగారు, అనసూయమ్మ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కారు బాబూ! మీ తల్లి చేసిన తప్పుకు మిమ్ములను అక్కున చేర్చుకున్న గొప్ప త్యాగమూర్తి.
రంగన్న చెబుతున్న మాటలకు పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు సతీష్.
“రంగన్నా! నువ్వు.. నువ్వు చెబుతున్నది..” గొంతులో నుండి మాట రావడం లేదు. బాధతో సుడులు తిరుగుతుంది. “జరిగింది ఇప్పటికైనా మీకు తెలియకపోతే ఎలా? ఆయనను బంట్రోతు అన్న మీ మాటకు అర్థం తెలియాలి. అందుకే మీకు చెప్పడానికే నిర్ణయించుకున్నాను. మొత్తం విన్నాక అప్పుడు ఏం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.
***
రామాపురం ఊరిలో జమీందార్లు అంటే రామచంద్రం. పేరుకు, ఊరికి తగ్గట్టుగానే పేరు తెచ్చుకున్నాడు. జమీందారులకుండవలసినంత ఆస్తిపరుడు కాకపోయినా, ఆ ఊరిలో ధనవంతుడిగానే చెప్పవచ్చు. ఇంటి బాధ్యతలే కాదు, ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగానే భావించేవాడు. ఇక ఆయన ఇల్లాలు అనసూయ చాలా ఓర్పు గల ఇల్లాలు. ఒకరి మనసు నొప్పించే రకం కాదు. ఇంట్లో అత్త, మామ, భర్త వదిలేసిన ఆడపడుచు, అవిటి మరిది ఇంతమందికి సేవ చెయ్యడంతో పాటు , ఊరిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇక్కడకు రావలసిందే. అనసూయ అందరికి చేసి పెట్టాల్సిందే. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుంది. భగవంతుడు సంతానం లేటుగా ఇచ్చాడు. తొమ్మిది నెలలు కష్టపడి మోసింది. కానీ చివరి నిమిషంలో పుట్టిన పిల్లాడిని బ్రతికించుకోలేకపోయారు. అదే సమయంలో కవలపిల్లలను కని కన్నుమూసిందో తల్లి.
అక్కడున్న ఆయమ్మ రామచంద్రం దగ్గరకు వచ్చి “అయ్యా! నీ భార్యకు పుట్టిన పిల్లాడు పోయాడు కదా! ఆ కవల పిల్లలను మీరు తీసుకొండయ్యా. పాపం తల్లి లేని పిల్లలు! వాళ్ళకు న్యాయం చెయ్యండి. లేకపోతే రోడ్డుమీద అడుక్కుతినే పరిస్థితి వస్తుంది వాళ్ళకు. ముక్కుపచ్చలారని పసికందులుబాబూ !” అంటూ ప్రాధేయపడసాగింది. “ఆయమ్మా! నువ్వు చెప్పింది బాగానే వుంది కాని, వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు, పిల్లల తండ్రి వచ్చి గొడవ చేస్తే ఎలా? బయట వాళ్ళకు తెలిస్తే ఏమనుకుంటారో కదా! రేపు వీళ్ళు పెరిగి పెద్దయ్యాక మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి? కడుపున పుట్టిన పిల్లలైతే కష్టమో సుఖమో కడవరకు కనిపెట్టుకుని వుంటారు” అని చెప్పాడు ఆయమ్మతో.
“బాబూ! మీరన్నట్టుగా ఈ విషయం వాళ్లకు తెలిస్తే కదా, మీకు నాకు తప్ప మూడోకంటివాడికి కూడా తెలియదు. పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. తల్లి మోసగించబడిన మనిషి , పైగా ప్రాణాలతో లేదు. అందుకని నా మాట కాదనకండి” అని బలవంతంగా ఒప్పించింది. ఇంకా మత్తులో నుండి బయటకు రాని అనసూయ పక్కలో పడుకోబెట్టింది ఆ కవలలను. రెండు చేతులు జోడించింది ఆయమ్మ.
“ఆయమ్మా! నీ మంచితనానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఎందుకంటే, రేపు మళ్ళీ మాకు పిల్లలు పుడతారో లేదో! ఆ భగవంతుడే ఈ రూపకంగా మాకు ఇచ్చాడు. కానీ ఈ విషయం మన ఇద్దరిలోనే వుండిపోతుందని ఒట్టు వేసి చెప్పు” అంటూ చెయ్యి చాపాడు రామచంద్రం.
“నేను మాటతప్పేదాన్ని కాదు బాబూ! నా ప్రాణం వున్నంతవరకు ఈ విషయం నాలో దాచుకుంటా. మీరు చూపిన మంచితనం చాలు నాకు. పెద్దదాన్ని, ఒక మంచిపని చేసానన్న తృప్తి చాలు” అని చేతిలో చెయ్యివేసింది.
ఈ విషయం ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ నా భార్య కవిత విన్న సంగతి వాళ్ళెవరూ గమనించ లేదు. మేము ఎవ్వరికీ తెలియనివ్వకుండా, ఈ రహస్యం ఇప్పటి వరకు మా తోనే వుండిపోయింది.
ఇక ఆ రోజు నుండి రామచంద్రం దంపతులకు మిన్నంటిన ఆనందం. అల్లారు ముద్దుగా కాలు కింద పెడితే ఎక్కడ దెబ్బలు తాకుతాయో అన్నంత అదిగా పెంచారు. మీ కోసం ఎంతగానో ఖర్చు చేసారు. మంచి చదువులు చెప్పించారు. ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ నాన్న. ఆ రోజు మిమ్ములను అక్కున చేర్చుకోక పోయినట్టయితే, ఎవరు బంట్రోతులు అయ్యేవారో మీకర్ధమైందనుకుంటా. అంతే కాదు మీరింత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టకోవడానికి అంత డబ్బు ఎక్కడనుండి వచ్చిందనుకున్నారు? మీ నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి మీకు పంపించారు. నాన్న డబ్బు పంపిస్తున్నారు కదా, ఎక్కడిదని ఏనాడైనా అడిగారా మీరు? ఎందుకు పంపిస్తున్నారు? మేము కష్టపడి సంపాదిస్తున్నాము కదా , మీరెందుకు కష్టపడుతున్నారని అనరు. ఎందుకంటే పుణ్యానికి వస్తుంది కదాని. అంతేనా బాబూ?” చెప్పడం ఆపాడు రంగన్న.
“రంగన్నా! నువ్వు చెప్పింది వింటుంటే సినిమాలోలాగా అనిపిస్తుంది. మేము ఎంత మూర్ఖంగా వున్నామనేది అర్ధమౌతుంది. మాకు ఇంత మంచి తల్లి తండ్రులు వున్నందుకు మేము చాలా అదృష్టవంతులం. మేము అన్ని మాటలు అంటుంటే గమ్మున వుండిపోయారే తప్ప, ‘మీరు ఎవరు మమ్మల్ని అనడానికి’ అనలేదు. అమ్మకు కూడా తెలియకుండా మమ్మల్ని తన స్వంత కొడుకుల కంటే బాగా చూశారు. అసలు నువ్వు చెబితే తప్ప నమ్మబుద్ది కావడం లేదు రంగన్నా!” బాధతో కళ్ళ వెంబడి నీళ్లు ధారగా వర్షిస్తుండగా అన్నాడు సతీష్.
“బాబూ! జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా వాళ్ళను అర్థం చేసుకుని వాళ్ళ ఋణం తీర్చుకోండి. మీ నాన్నకు ఈ విషయం నేను చెప్పినట్టు తెలియనివ్వకండి. నమ్మకాన్ని వమ్ము చేసాననుకొంటారు నన్ను. మా స్నేహం ఇప్పటిది కాదు. దాన్ని అలాగే కాపాడుకుంటాము” అని చెప్పాడు రంగన్న.
“రంగన్నా! నాకొక సహాయం చేస్తావా?” అడిగాడు సతీష్.
“తప్పకుండా చేస్తాను బాబూ! ఇంతకూ ఏమిటా సహాయం?” అడిగాడు రంగన్న.
“నాకు ఈ విషయాలు తెలియక ముందు నాన్నను, అమ్మను ఎలాగైనా ఇక్కడకు తీసుకు రావడానికి నేను, తమ్ముడు ముందుగా అనుకునే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాము. అందరం కలిసి వుందామనే ఆలోచనతో. అంతేకాదు, ఇక్కడకు ఒక మైలు దూరంలో రెండు ఎకరాల పొలం కూడా కొన్నాము. ఎందుకంటే ఇక్కడకు వచ్చి వూరకే వుండమంటే నాన్నకు తోచదు కదా ! అందుకని అక్కడ చేసే వ్యవసాయం ఇక్కడ దగ్గర వుండి చేయించుకుంటాడని అనుకున్నాము. కానీ అంతా తారుమారైంది. ఆవేశంలో నేను నోరుజారాను. నాన్నకు పట్టింపులు ఎక్కువ. నేను పిలిచినా ఇప్పుడు రాడు. అందుకని నాన్నను నువ్వు ఎలాగైనా తీసుకరావాలి. ఏం చెప్పి తీసుకవస్తావో నీ ఇష్టం. అంతేకాదు నాన్న వచ్చేవరకు తిండి తిప్పలు మానేస్తాను. ఇంకో విషయం నీకు చెప్పాలి , నువ్వు నాన్నతో పాటుగా ఇక్కడే వుంటున్నావు. అక్కడ ఒక్కడివే వుంటున్నావు కదా. నీ కొడుకు కూతురు ఇక్కడే వుంటారు కాబట్టి, అప్పుడప్పుడు వెళ్ళి చూసివద్దువుగాని” అని చెప్పడం ఆపాడు.
రంగన్న అమితానందంతో “బాబూ! ఇంత మంచి హృదయం వున్న మీరు ఆ తండ్రికి తగ్గ కొడుకులే బాబూ! ఇన్ని విషయాలు ముందే తెలిసుంటే మీ గురించి చెప్పక పోయేవాడిని. నేను తొందరపడ్డాను. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సరే బాబూ! మీ అమ్మ నాన్నను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది” అని చెప్పి ఆ పూట అక్కడ భోజనం ముగించుకుని బయలుదేరాడు రంగన్న.
సతీష్ మనసులో ఏదో ఆరాటం. తండ్రి వస్తే గాని తీరని వేదన. తమ్ముడితో, భార్యతో జరిగిన విషయాలు అన్నీ మాట్లాడుకున్నారు. వాళ్ళ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూడసాగారు.
అన్నమాట ప్రకారం రామచంద్రం, అనసూయలను తీసుకొచ్చాడు. ఎలా ఒప్పించాడో గాని, మొత్తానికి మాట నిలబెట్టుకున్నాడు రంగన్న. తల్లిదండ్రులను చూడగానే ఉప్పొంగిన ఆనందంతో గబగబా వచ్చి హృదయానికి హత్తుకుని, కాళ్ళకు నమస్కారం చేసి “అమ్మా! నాన్నా! మమ్మల్ని క్షమించండి” అంటూ కన్నీళ్ళతో కాళ్ళు కడిగారు. ఏమీ అర్ధం కాక రంగన్న వైపు చూసారు ఆ దంపతులు.
అప్పుడు రంగన్న ముందుకు వచ్చి “నేను మీకు అలా చెప్పకపోయి వుంటే మీరు వచ్చేవాళ్ళేనా? నీ పంతం పట్టుదల నాకు తెలియవా!” అన్నాడు.
రామచంద్రం,రంగన్న వైపు కోపంగా చూసాడు. “అబద్దాలు చెప్పడానికైనా అర్ధం పర్ధం వుండాలి. నోటికి ఏదొస్తే అది చెప్పెయ్యడమేనా” అని గదమాయించి “ఎంత హడలి పోయానో తెలుసా!” అంటూ కొడుకులను దగ్గరకు తీసుకున్నాడు.
“ఏం చెప్పావు రంగన్నా?” చిన్నబోయిన ముఖంతో నిలబడ్డ రంగన్నను అడిగాడు సతీష్.
మామూలుగా చెబితే మీ నాన్న రారు కదా. అందుకని చిన్న అబద్దం ఆడాల్సి వచ్చింది. మీకు యాక్సిడెంట్ అయిందని, 'నాన్నా! ' అని కలవరిస్తున్నారని చెప్పాను. అంతే! మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెరో రెండు బట్టలు గబగబా సంచీలో వేసుకుని నన్ను వాళ్ళతో రమ్మని హడావుడి చేసి, ఇదిగో ఇలా వచ్చాము” అని చెప్పాడు.
“నాన్నా! మా తప్పును క్షమించండి” అంటూ వాళ్ళకోసం ఏమేమి చేసారో రంగన్నకు చెప్పినవన్నీ చెప్పాడు సతీష్. అంతే కాదు, వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకున్నాక పొలం వైపు తీసుకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే పెద్ద కమాన్ లాంటిది కనపడింది. దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో “రామచంద్ర వ్యవసాయ క్షేత్రం” అని వుంది. అది చూసి వుబ్బి తబ్బిబ్బయ్యారు రామచంద్రం, అనసూయ. అనసూయకైతే కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు రాలాయి. లోపలకు అడుగుపెడుతూ ఆర్తిగా చూసుకున్నాడు పొలమంతా.
“చూసావా రంగన్నా నా కొడుకులు ఎంత ప్రయోజకులయ్యారో!నాకు చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళుగా నా పిల్లలకు నా మీద ప్రేమ లేదు అనుకున్నాను. ఇప్పుడర్ధమైంది, నేనెంత పొరపాటు పడ్డానో” అని అనసూయ వైపు తిరిగి చూసావటోయ్ నా కొడుకుల గొప్పతనం!” అంటూ మీసం మెలేసి, “నువ్వు కోరుకున్నట్టుగా మనం ఇక్కడే వుండిపోతున్నాము. నీకు ఇష్టమేగా? అని భార్య భుజం మీద చెయ్యివేసి అడిగాడు. ఆమె ఆనందంతో కొడుకుల వైపు చూసింది. ‘ఇకనైనా నాకు విశ్రాంతి దొరుకుతుంది’ అనుకుంది మనసులో.
ఇంటికి వచ్చేటప్పుడు చూసాడు గేట్ కి ఇరువైపుల వున్న బోర్డ్. “అనసూయ నిలయం” అని ఒకవైపు. “రామచంద్ర కరుణా”అని ఇంకోవైపు. అత్యంత వుత్సాహంతో కొడుకులిద్దరినీ కౌగిలిలోకి తీసుకుని, ‘నా పెంపకంలో లోటు లేదు’ అనుకుని మురిసిపోయాడు.
‘అనసూయా నేనెక్కడా పొరబాటు చెయ్యలేదు. ఎవరికి రాసి పెట్టి వుందో వాళ్ళు అనుభవిస్తున్నారు. నీకు నేను అన్యాయం చేసానని బాధ పడ్డాను చాలా సార్లు. మనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నీకు చెప్పకుండా. ఎందుకంటే ఈ కవలపిల్లలు అన్యాయమై పోతారేమోనని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడు కాకూడదని అలా చేసాను. నన్ను క్షమించు’ అని మనసులో అనుకున్నాడు.
“ఏమిటి అందరూ అలానే చూస్తున్నారు నన్ను? ఏమైంది” అడిగాడు రామచంద్రం.
“ఆ ఏముంది? నువ్వేదో కలగంటున్నావని, ఇంకో ఇద్దరు పిల్లలు పుడితే ఎలా వుండేదని ఆలోచిస్తున్నావు అని అనుకుంటున్నాను” అన్నాడు రంగన్న. మనసులో మాత్రం ‘నాకు తెలియదూ నువ్వేమి ఆలోచిస్తున్నావో’ అనుకున్నాడు.
‘నాన్నా! మేము ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో, రోడ్డుమీద అడుక్కుని తినవలసిన మా బ్రతుకులకు, పంచభక్ష్య పరమాన్నం తినగలిగే అదృష్టాన్ని కల్పించావు. ఏమి చేసి నీ ఋణం తీర్చుకోగలము?’ మనసులో అనుకుని , సతీష్ మహేష్ లు ఆనందంతో తండ్రి వైపు చూస్తున్నారు.
కోడళ్ళిద్దరూ అత్తను మామను కూర్చోబెట్టి పెద్ద పూలమాల తెచ్చి ఇద్దరికీ కలిపి వేసారు.
“మనసున్న మారాజు మా మామయ్యా” అంటూ ఆప్యాయతగా వాళ్ళ భుజాలమీద తలవాల్చి చెరొక పక్కగా కూచున్నారు. రంగన్న తన రెండు చేతి వేళ్ళతో ఫోటో తీస్తున్నట్టుగా ‘రెడీ’ అన్నాడు. అందరు గొల్లుమని నవ్వారు.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను, నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడమన్నా,చదవడమన్నా చాలా ఇష్టం. 1991 నుండి రాయడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను. కానీ ఎవరికి చూపలేదు, చెప్పుకోలేదు. ఈమధ్యనే మా అమ్మాయిలు, మావారు చూసి కథలు బాగున్నాయి కదా, ఏదైనా పత్రికకు పంపమంటే పంపిస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రికలో నేను రాసిన కవితలు, కథలు చాలా వచ్చాయి. నాకు ఇద్దరమ్మాలు, ఒక బాబు. అందరూ విదేశాల్లోనే వున్నారు. ప్రస్తుతం నేను, మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము