top of page
Original.png

మరణ మృదంగమా మరణ వేణుగానమా?

#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #మరణమృదంగమామరణవేణుగానమా, #TeluguphilosophicalArticle

ree

 

Marana Mrudangama Marala Venuganama - New Telugu Article Written By R C Kumar Published In manatelugukathalu.com On 24/11/2025

మరణ మృదంగమా మరణ వేణుగానమా - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


'మరణం' అనే మాట వినగానే మనసులో కొద్దిగా భయం కలగడం సహజమే. అది ఒక గంభీరమైన సబ్జెక్ట్. చరమాంకంలో జీవితాన్ని గడుపుతున్న వయోధికులు కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన నగ్నసత్యాలు భగవద్గీత, గరుడ పురాణం వంటి గ్రంథాలలో ఉన్నాయి. మనకు తెలియని దాని గురించి మాట్లాడటానికి లేదా ఆలోచించడానికి మనం ఆసక్తి చూపము. అందులోనూ మరణం గురించి మాట్లాడడానికి, చదవడానికి చాలామంది ఒప్పుకోరు, అది ఒక విచారకరమైన సంఘటన అనే భావన నెలకొని ఉంటుంది. నిజానికి, జీవితాన్ని ఉత్తమంగా మలుచుకోవడానికి మనకు లభించే అతిపెద్ద అవకాశం మరణం. అందుకే మరణం గురించిన చేదు నిజాలు అనుకుంటున్న కొన్ని తీపి నిజాలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అది సహజమైన, నిశ్చితమైన జీవశాస్త్ర ప్రక్రియ. మరణం జీవితానికి మరొక ముఖం. అది ఒక ముగింపు కాదు, ఒక ప్రయాణం. 


ఒక నిరాశావాది సాధువుని కలిసి నేను ఎంతకాలం బతుకుతాను ? అని అడుగుతాడు. నువ్వు చనిపోయేంతవరకు అంటాడు సాధువు. ఎంతకాలం బతుకుతాము అనేదాని గురించి విచారణ చేయడం విచారించడం మూర్ఖత్వం. ఉన్నఫళంగా మరణం సంభవించడం అనేది సామాన్యంగా జరగదు. ఆకస్మాత్తుగా మరణం సంభవిస్తే అది ఒక ప్రమాదం లాగా అనిపించవచ్చు. కానీ జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి విధానాలు మన ఆయుష్షును నిర్ణయిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే భగవంతుడు ఇచ్చిన ఆయుష్షును నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం తినే ఆహారం, రోజువారీ చేసే వ్యాయామం, ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొనే విధానం వంటి మన జీవనశైలే, మనం ఎంత కాలం ఉంటామో నిర్ణయిస్తుంది. నిండు నూరేళ్లు జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ అది చాలా కొద్దిమందికే సాధ్యం. అంత్య సమయంలో శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. అవయవాల కార్యకలాపాలు నెమ్మదిగా తగ్గుతాయి, శ్వాస మారుతుంది. వైద్యులు దీన్ని గుర్తిస్తారు. కొన్ని సందర్భాలలో "ఈ రోగి ఎక్కువ కాలం బ్రతకడు" అని అందుకే చెప్పగలుగుతున్నారు. జీవితం శాశ్వతం కాదని మనకు అర్థమైనప్పుడు, చిన్న చిన్న గొడవలు, కోపాలను అధిగమించి నిజమైన సంతోషం వైపు దృష్టి పెడతాము.


మనిషి సగటు వయసు ఎనభై ఏళ్లు అనుకుంటే, ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. మొదటి ఇరవై ఏళ్లూ జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. రెండో భాగం (20 నుంచి 40) యవ్వనం, జీవితంలో స్థిరపడడానికి చేసే ప్రయత్నాల్లో కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. మూడో భాగంలో (40 నుంచి 60) సంసార భారం, బాధ్యతలతో సత మతమవుతాము. నాలుగో భాగంలో (60 నుంచి 80) ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఉత్సాహం సన్నగిల్లుతుంది. జీవన పోరాటంలో బాగా అలసిపోయి ఉంటాము. మొదటి చివరి భాగాలలో గొప్పగా చేసేది ఏమి ఉండదు. దాన్ని మినహాయిస్తే ఇక మిగిలింది మధ్యలో ఉన్న నలభై ఏళ్లే. గిర్రున తిరిగే కాలచక్రంలో అవి ఇట్టే గడిచిపోతాయి. జీవితం చాలా చిన్నది, మరణం దాని గమ్యం అని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మేలు. 


మనం మరణాన్ని ఏ కోణంలో చూస్తాము అనేది, మనం జీవించిన విధానం మరియు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. అనేక దేశాలలో మరణాన్ని ఒక ముగింపుగా చూడరు. ఉదాహరణకు, ఆత్మకు నాశనం లేదు అది పునర్జన్మ తీసుకుంటుందని మన హిందూ మతం చెబుతుంది. ఆత్మ దేవునితో కలుస్తుంది అని సిక్కు మతం వారు నమ్ముతారు. కొన్ని సంస్కృతులలో, మరణాన్ని ఒక ఉత్సవంగానే జరుపుకుంటారు. మృత్యువు అంచుదాక వెళ్లి తిరిగి వచ్చిన కొందరు మృత్యుంజయుల అనుభవం ప్రకారం మరణించబోతున్నాము అని తెలుసుకున్న సమయంలో వారికి చెప్పలేని ఒక విధమైన శాంతిని అనుభవిస్తూ, ప్రకాశవంతమైన కాంతి వైపు వెళుతున్నట్లుగా అనిపించడం, గాలిలో తేలియాడుతున్న అనుభవం కలిగినట్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరణం అనేది భయపడాల్సిన ఒక భూతం కాదు. అది జీవితంలో ఒక భాగం. అది ఎప్పుడైనా రావచ్చు అని అర్థం చేసుకుంటే, మనకు లభించిన ఈ జీవితంలోని ప్రతి క్షణాన్ని మనం సంతోషంగా, అర్థవంతంగా, ప్రేమతో జీవిస్తాము.


మానవ జన్మ ఎత్తాక సుఖాలు, దుఖాలు పలకరిస్తూనే ఉంటాయి. జయాపజయాలు, మానావమానాలు, సుఖదుఃఖాలు, ఆశా నిరాశల వంటి ద్వంద్వాలు ఉంటాయి కదా. నిరాశ విస్పృహలకు లోను కాకుండా ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా జీవించాలి. భోగభాగ్యాలతో తులతూగుతూ గొప్పగా జీవించి ఉండకపోవచ్చు కానీ సుఖ సంతోషాలతో ఓలలాడుతూ ప్రశాంతంగా జీవించాను అన్న తృప్తి మిగిలితే చాలు. వీలైతే ఎదుటివారికి ఆనందం కలిగించే పనులు చేయాలి. అదే జీవిత పరమావది. మరణంతో పోరాడటం ఆపివేయాలి మరియు ఆ క్షణం వచ్చినప్పుడు ప్రశాంతంగా, గౌరవంగా దాన్ని ఆహ్వానించాలి. అందుకే ఏ గుడికి వెళ్ళినా, దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మందిర ప్రాంగణంలో కూర్చొని ఈ క్రింది శ్లోకంతో భగవంతుని ప్రార్థించాలి.

అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం | దేహాంతే తవ సాన్నిధ్యమ్ దేహిమేపర మేశ్వరమ్ || ఎటువంటి బాధలు లేని మరణం...

ఒకరిపై దయనీయ స్థితిలో ఆధారపడకుండా జీవనం, అంత్యకాలంలో నీ సన్నిధికి చేరుకోవడం...అనే మూడు వరాలు ప్రసాదించు పరమేశ్వరా.


మరణమా, అమరత్వమా

+++++++++++++++++

జనన మరణాలు సృష్టి నియమాలు కదా ! విశ్వం యొక్క సమతుల్యతకు (biological balancing) ఇది చాలా అవసరం. ఉదాహరణకు పులులు సింహాలు లేని అభయారణ్యంలో జింకలు, అడవి పందులు వంటి వాటి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. వాటి వల్ల జరిగే అనర్ధాలు పంట పొలాలకు కలిగే నష్టం అపారంగా ఉంటుంది కాబట్టి వాటిని వేటాడి తినే జంతువులు కూడా అరణ్యంలో ఉండాలి. మనుషులకైనా మరణం అనేది లేకుంటే ఎన్నెన్ని అనర్థాలు జరుగుతాయో ఊహించలేము..! అదెలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. 

 

ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న జపం చేసుకుంటున్న సాధు సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి “ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి” అని అడిగాడు. అప్పుడా సన్యాసి “ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు.”అని చెప్పాడు. రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు నేలమీద పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా, “నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు. గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను.”

 

రాజు ఆలోచించాడు... “అమరత్వం లభించి వృద్ధాప్యం వస్తే ప్రయోజనం ఏమిటి?” నేను అమరత్వంతో పాటు నిత్య యవ్వనం పొందితే బాగుంటుంది కదా అనుకున్నాడు. పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. “నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలపండి" అని. సన్యాసి సరే అని “సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు.” అనగానే రాజు బయలుదేరి సన్యాసి చెప్పినట్టుగానే ఎదురొచ్చిన మరో పర్వతాన్ని దాటాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నవనవలాడుతున్న చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు. నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా అరుచుకుంటూ ఈ మారుమూల ప్రాంతంలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. 


వారిలో ఒకరు “నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు... “నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ ముక్తకంఠంతో రాజుతో చెప్పారు. రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, “మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు.” తెలుపగా ఆ సన్యాసి ఇలా అన్నారు. “మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని అడ్డుకునే బదులు, మీరు ప్రతిరోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచమే మారుతుంది. 


భగవద్గీత అక్షర బ్రహ్మ యోగంలో శ్రీ కృష్ణ భగవానుడు "మరణ సమయంలో నన్ను మాత్రమే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు" అని బోధిస్తూ "నాస్త్యత్ర సంశయః" ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదంటారు. అంతేకాకుండా అవసాన దశలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఒక వ్యక్తి ఏ ఏ భావాలను స్మరించుకుంటూ ప్రాణం విడుస్తారో మరుజన్మలో ఆయా రూపాలనే పొందుతాడు. అంటే మరణ సమయంలో ఏదైతే మన ఆలోచనలలో ప్రధానంగా ఉంటుందో, అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. ఇది నూటికి నూరు శాతం నిజమని శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. 


భరతుడు & జింకపిల్ల : 

++++++++++++++

జంబుద్వీపానికి చక్రవర్తి అయిన భరతుడు ధర్మబద్ధంగా పరిపాలించి, అన్ని భోగాలను అనుభవించి చివరికి వైరాగ్యంతో కుమారులకు రాజ్యాన్ని అప్పగించాడు. తపస్విగా మారి గండకి నది తీరాన ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే భగవంతుని పూజా కైంకర్యములలో నిమగ్నమై ప్రశాంతమైన ఆశ్రమ జీవితాన్ని గడుపుతుండగా, ఒక రోజు పులి గాండ్రింపు విని గర్భంతో ఉన్న ఒక జింక భయంతో నీటిలోకి దూకటం చూసాడు. భయానికి నీటిలోనే జింక పిల్లని ప్రసవించింది. ఆ జింక పిల్ల నీటిలో తెలియాడటం చూసి భరతుడు జాలిపడి దానిని రక్షించాడు. అతను దానిని తన కుటీరానికి తీసుకువెళ్ళి పెంచటం మొదలుపెట్టాడు. అపారమైన వాత్సల్యంతో దాని ఆటపాటలను చూస్తూ ఉండేవాడు. దాని కోసం గడ్డి తెచ్చేవాడు, వెచ్చగా ఉంచటం కోసం దానిని ఆలింగనము చేసుకునేవాడు. క్రమక్రమంగా ఆయన మనస్సు భగవంతుని నుండి దూరమయి, ఆ జింకపై నిమగ్నమయింది. ఈ అనుబంధం ఎంత గాఢంగా అయ్యిందంటే రోజంతా ఆ జింకకు సేవలు చేస్తూ దాని గురించే ఆలోచించేవాడు.


ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడిపిల్ల ఆశ్రమం విడిచి పారిపోయింది. ఆ లేడిపిల్ల కనిపించకపోయేసరికి భరతునికి మనసు చెదిరిపోయింది. మాటిమాటికీ జింకను తలచుకుంటూ వాపోయాడు. దీనితో భరతుడు యోగబ్రష్టుడయ్యాడు. అంత్యకాలంలో కూడా ఆ జింకనే తలంచుకుంటూ మరణించాడు. తరువాత జన్మలో భరతుడు ఒక లేడి పిల్లగా పుట్టాడు. కానీ, ఆయన ముందు జన్మలో ఏంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వలన, ఆయన చేసిన తప్పు యొక్క అవగాహన ఉండినది. ఈ జన్మలో దాన్ని సరిచేద్దుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి జింకగా ఉన్నా సరే, ఆయన, అడవిలో సాధు జనుల ఆశ్రమాల దగ్గరే నివసిస్తూ భగవత్ ద్యాసలో ఉండేవాడు. అందువల్ల తన జింక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత, ఆయనకి తిరిగి మానవ శరీరం ఇవ్వబడింది. ఈ సారి, ఆయన ఒక గొప్ప ఋషి "జడభరతుడు" అయినాడు. సుదీర్ఘకాలం పరిపాలించి తన ఆధ్యాత్మిక సాధన పూర్తి చేసుకొని భగవత్ ప్రాప్తి సాధించాడు. భరత వర్షం అనే పేరు ఆయన ద్వారానే వచ్చింది.


భగవంతుడిని మరణ సమయంలో ధ్యానం చేస్తే సరిపోతుందిలే అని అనుకోకూడదు. మొదటి నుండి అభ్యాసం చేయకపోతే ఇది సాధ్యపడదు. ఎందుకంటే అంతర్లీనంగా ఏదైతే స్వభావం బలపడి ఉంటుందో చివరి రోజుల్లో కూడా మనస్సు ఆవైపే మొగ్గు చూపుతుంది. నిత్యము రామనామ స్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంత్య సమయములో కూడా రామ నామ స్మరణ చేయడము వలన తులసీదాసు గా జన్మించగనే (1498-1623) అందరు పిల్లలవలె ఏడవకుండా "రామ్ రామ్" అని పలకాడట. అందుకని మొదలు ఆయన పేరు "రాంబోలా" అని అందరూ పిలవడము జరిగింది. ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏమంటుంది.


శ్రీకృష్ణార్పణమస్తు


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page