'Mareechika' - New Telugu Story Written By Ashok Anand
Published In manatelugukathalu.com On 08/10/2023
'మరీచిక' తెలుగు కథ
రచన: అశోక్ ఆనంద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"నీ పెయింటింగ్స్ మా సార్ కి చాలా నచ్చాయ్. వచ్చే ఇరవై మూడో తేదీ ముంబైలో జరగబోయే ఎగ్జిబిషన్లో ప్రదర్శించడానికి మా సార్ నిన్ను రమ్మన్నారు" అంటూ అవతలి నుంచి ఫోన్లో గట్టిగా అరుస్తున్నాడు ఒక ప్రముఖ వాణిజ్య ప్రకటనా సంస్థ M. D గారి పర్సనల్ సెక్రటరీ.
"థాంక్యూ వెరీ మచ్ సార్. కానీ.. " అంటూ సంకోచిస్తున్నాడు శరత్.
"ఏంటయ్యా! పర్లేదు చెప్పు." అన్నాడు సెక్రటరీ.
"అంటే సార్.. రావడానికి నా దగ్గర డబ్బుల్లేవ్ సార్."
సెక్రటరీ ఓ పెద్ద నవ్వు నవ్వి, "భలేవాడివయ్యా! నీలాంటోడే ఊరికే కారు కొనిస్తారా బాబూ అంటే, వద్దులెండి పెట్రోల్ కొట్టించుకోడానికి డబ్బుల్లేవు అన్నాట్ట. లేకపోతే ఏంటయ్యా, ఇంత అరుదైన అవకాశం వెతుక్కుంటూ వస్తుంటేనూ.."
"సారీ సార్! నేనెలాగోలా వచ్చేస్తా" అంటూ ఫోన్ కట్ చేశాడు.
జరిగిన విషయమంతా తన తల్లికి చెప్పాడు. కొడుకు పదిహేనేళ్ళు దాటి పదమూడేళ్ళవుతున్నా, పావలా సంపాదన లేకుండా తిరుగుతున్నా, అతని పెయింటింగ్ పిచ్చి చూసి ఎప్పటికన్నా 'పికాసో' అంతతోడు కాకపోతాడా అని అతని కంటే తన తల్లే ఎక్కువ కలలు కనేది.
ఆవిడకి 'పికాసో' ఎవరో తెలీదు. శరత్ దగ్గరే ఆవిడ ఆ పేరును పదే పదే వినేది. ఎప్పుడో ఓసారి 'పికాసో' వేసిన 'The Weeping Woman' పెయింటింగ్ చూసి, పికాసో కంటే తన కొడుకే బాగా బొమ్మలేసే గొప్ప కళాకారుడని నిర్ధారించేసుకుంది ఆరవ తరగతిలోనే బాల్య వివాహం జరిగి భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి.
"చాలా సంతోషం నాయనా! ఇన్నాళ్ళకి నీ కల నెరవేరబోతోంది, అంతకంటే కావాల్సిందేముంది. ఒక్క నిమిషం ఉండు" అని వంటగదిలోకెళ్ళి రెండు నిమిషాల తర్వాత బయటకొచ్చి "ప్రస్తుతానికి ఈ పెన్షన్ డబ్బులు మాత్రమే ఉన్నాయ్, ఇవి నీకెందుకన్నా ఉపయోగపడచ్చు ఉంచు." అని అతని చేతిలో మూడు వేలు పెట్టి, ఓ కన్నీటి బొట్టుతో తన కొడుకు అరచేతిని ముద్దాడింది.
"ఎప్పుడు నాన్నా ప్రయాణం"
"మరో నాలుగు రోజుల్లో అమ్మా" అని బయటకెళ్ళిపోయాడు. రెండు నెలల నుంచి వడ్డీ డబ్బుల కోసం పీకల మీద కూర్చున్న ఓ వ్యక్తికి ఇవ్వటం కోసం పస్తులు చేసి, ఆ మూడు వేలు భద్రంగా దాచిందన్న విషయం శరత్ కి తెలుసో, తెలీదో!! ××
"ఈ అలలు - తీరంలా మనం కూడా ఎన్నటికీ కలిసే ఉండాలి కన్నా" అంటూ శరత్ ఒడిలోకి మరింత ఒదిగిపోతోంది వాణి.
"నేను ముంబై నుంచి తిరిగి రాగానే అమ్మని తీస్కుని మీ ఇంటికొచ్చి మాట్లాడతా" అని బదులిచ్చాడు. "నిజమా! మన ఏడేళ్ళ ప్రేమ త్వరలోనే ఏడడుగులు వేయబోతుందా!" అంటూ మరింత గట్టిగా శరత్ ని వాటేసుకుంది వాణి. ఆవేశంగా వచ్చిన అల తీరంలో మాయమైపోయింది. గూళ్ళకి చేరుకున్న పక్షులు వీళ్ళ జంటను చూసి ఈర్ష్య పడుతున్నాయి.
××
"సో.. రేపు మధ్యాహ్నమే ప్రయాణమన్నమాట" విస్కీ బాటిల్ మూత తీస్తూ అడిగాడు విజయ్.
"మామూలు ప్రయాణమా! తిన్నగా మనోడి గమ్యపు ఒడిలోకి తీస్కెళ్ళి పడేసే రైలు ప్రయాణం అది" రెండు గ్లాసులను ముందున పెడుతూ అన్నాడు కృష్ణ.
"అదేంట్రా రెండు గ్లాసులే తెచ్చావ్"
"రేయ్, ఇన్నేళ్ళు వాడు రెచ్చిపోయింది, నువ్వు వాడిని రెచ్చగొట్టింది చాలు. ఇకనుంచైనా వాడిని ఇవన్నీ మానేయనివ్వు"
"అంటే ఏంట్రా నీ ఉద్దేశ్యం! వాణ్ణి నేను చెడగొడుతున్నానా" కోపం తెచ్చుకుంటూ ఆగాడు విజయ్.
"నేనన్నది అది కాదురా, వాడికి గత రెండేళ్ళ నుంచి చెస్ట్ లో పెయిన్ వస్తుంది. ఈ మధ్య అదింకా ఎక్కువై నోట్లోంచి రక్తం కూడా వస్తుంది. జరగరానిది ఏదైనా జరిగితే.." కృష్ణ నోట్లో మాటింకా పూర్తవ్వలేదు.
"చాల్లే ఆపరా నీ సోది! పెద్ద వివేకానందుడిలా వాగుతున్నావ్. అసలు మనం ఈ భూమ్మీద పుట్టిందే అనుభవించడానికి, కోరికల్ని అణచుకోవడానికి కాదు. నీలాంటి పిరికిపందలే భవిష్యత్తుకి భయపడ్తారు. నాలాంటి 'మేధావులు' చేతిలో ఉన్న ప్రస్తుతాన్ని అనుభవిస్తారు." అని సిగరెట్ ఊదుతూ చాలా పెద్ద 'ఫిలాసఫీ' చెప్పబోయాడు విజయ్.
"సరే! నువ్వూ, నేనూ కాదు. వాణ్ణే అడుగుదాం. ఏరా! మానేస్తావా, తాగుతావా?" అని కొంచెం కఠినంగానే అడిగాడు కృష్ణ.
పదహారేళ్ళు దాటుతున్న ఒక టీనేజీ కుర్రాడి ముందు 'అబ్దుల్ కలాం' పుస్తకం చదువుతావా లేక బ్లూ ఫిల్మ్స్ చూస్తావా? అనే రెండు ఆప్షన్లు పెట్టి, ఏ ఆప్షన్ ఎంచుకున్నా రహస్యంగానే ఉంచుతామని చెప్తే ఆ ఉరకలేస్తున్న రక్తం దేన్ని కోరుకుంటుంది? ఎప్పుడో జరగబోయే పరిణామాలకి కాదు, తాత్కాలిక/క్షణికమైన సుఖాల 'ప్రభావం' మామూలుది కాదు.
నోట్లో నములుతున్న ఏదో ఇంగ్లీషు కంపెనీ గుట్కాను పక్కన ఉమ్మి, విస్కీ బాటిల్ అందుకున్నాడు శరత్.
××
శరత్ మెదడులో కూర్చున్న ఆలోచనలు, శరత్ కూర్చున్న రైలు ఒకదానితో ఒకటి పోటీ పడి కదులుతున్నాయ్. బ్యాగ్ లోంచి పేపర్ అండ్ పెన్సిల్ తీసి తీక్షణంగా గీయడం మొదలుపెట్టాడు. ఎండిపోయిన పడమటి కొండల మధ్య దీనంగా కూర్చుంది ఓ ముసలమ్మ. ఎందుకది గీశాడో శరత్ కి కూడా తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో విషాద చిత్రాన్ని గీయడం తనకి నచ్చలేదు. 'పడమర తూర్పుగా' మారితే బావుంటుంది అనుకున్నాడు.
గుండెల్లో ఏదో గందరగోళం. ఉన్నపాటుగా పడమర తిలకాన్ని దిద్దుకుంది. శరత్ నోటి నుంచి జారిన నిస్తేజమైన ఎర్రటి రక్తంతో! కొత్త తూర్పు! కృష్ణ అన్నది నిజమే. నేరుగా గమ్యపు ఒడిలోకి తీస్కెళ్ళి పడేసే రైలు ప్రయాణమిది. వేగంలో ఓడిపోయిన రైలు మెల్లగా ఆగిపోయింది. పరుగు పరుగున ప్రాణం ప్రకృతిలో కలిసిపోయింది.
స్నేహితుడు పోయిన బాధ అనే 'కారణం'తో విజయ్ 'మందు తాగడం'లో నిమగ్నమైపోయాడు.
అలిసిపోయిన చితి ఆరిపోయింది. హోరున మ్రోగిన శంఖం సాగర గర్భంలో మునిగిపోయింది. ఆ నిశీధిని నిశ్శబ్దం ఏలుతోంది.
××
నమ్మేవాళ్ళకి ఇప్పుడవి అస్థికలు నమ్మని వాళ్ళకి అది బూడిద ప్రేమించే వాళ్ళకి అవి జ్ఞాపకాలు కానీ.. తననే నమ్ముకున్న వాళ్ళకి మాత్రం బ్రతికున్నంత కాలం గుచ్చుకునే గుండుసూదులు.
***
అశోక్ ఆనంద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
అశోక్ ఆనంద్.
రచయిత, దర్శకుడు, సాహితీ వేత్త
Comentarios