top of page

మస్తాన్‌ బాబా



'Masthan Baba' - New Telugu Story Written By Ch. C. S. Sarma

'మస్తాన్‌ బాబా' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

మధ్యతరగతి మాధవయ్య, గౌరీల పెద్ద కూతురు సుజాత. రెండవ అమ్మాయి పేరు సుమలత. సంబంధాలు వచ్చి సుజాతను చూచి.. వారు పెట్టిన ఫలహారాలను ఆరగించి, కాఫీలు సేవించి బయలుదేరే ముందట ‘వూరికి వెళ్ళి ఆలోచించుకొని తెలియజేస్తాము’ అనే మాటను చెప్పి వెళ్ళిపోయారు.


వారం పదిరోజులు గడిచినా జాబు.. ఫోనూ ఏమీలేదు. సుజాత హైస్కూల్లో తెలుగు పండిట్‌. వయస్సు ఇరవైఐదు. సుమలత కలక్టర్‌ ఆఫీసులో గుమస్తా, మాధవయ్య రిటైర్డ్‌ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌. వారిది పల్లెటూరు. రెండు ఎకరాల మాగాణి ఒక పెంకుటిల్లు వారి ఆస్తులు. మాధవయ్య ఖచ్చితమైన మనిషి. డాంబికాలంటే అతనికి నచ్చదు. గౌరి మంచి లక్షణాలు గల ఇల్లాలు. మాధవయ్య తన సర్వీస్‌లో డ్రింగ్ డ్రింగ్ (లంచం) ఏమీ స్వీకరించలేదు. నిజాయితీపరుడు.


వచ్చిన మూడు సంబంధాలూ.. మధ్యతరగతి వారే. కానీ వారి ఆశలు.. చంద్రమండలాన్ని నిచ్చెనలతో చేదుకోవాలనే కోరిక. తొలి సంబంధం.. తండ్రి నటుడు. బాగా పాడుతాడు. ఆయన పేరు సింహాద్రి. సతీమణి పేరు గంగాబాయి. వీరికి ఇరువురు మొగపిల్లలు. పెద్ద అబ్బాయిపేరు కళ్యాణ్‌. రెండవవాడి పేరు ఈశ్వర్‌. కళ్యాణ్‌ డిప్లమా సివిల్‌ ఇంజనీర్‌. ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు పదిహేనువేల జీతం. మనిషి పరమ మోడ్‌రేట్‌.

అతని జీవిత ఆశయం బాగా కలవారి అమ్మాయిని పెండ్లి చేసికొంటే కట్నకానుకలు బాగా వసూలు చేసికోవచ్చుననే తత్వం. వయస్సు ఇరవైఏడు. పది సంబంధాలు చూచారు. ఎవరూ వీరు ఆశించే కట్నకానుకలను ఇచ్చేదానికి సిద్ధపడలేదు. తల్లితండ్రుల మాటలను లెక్కచేయడు. ఇద్దరు మ్యారేజ్‌ బ్రోకర్లను పరిచయం చేసికొని, తన వధువును వెతుకుతూ వున్నాడు మూడు సంవత్సరాలుగా. ఫలితం శూన్యం.


సింహాద్రి నాటకాలు మూలపడిపోయిన కారణం.. టీవీ నాటకాల్లో ఫాదర్‌ వేషంలో అప్పుడప్పుడూ జనాలకు కనబడుతూంటాడు. వయస్సు అరవైఐదు.


రెండవ కొడుకు ఈశ్వర్‌కి తాను సినిమా నటుడిని కావాలనే ఆకాంక్ష. ఫోటో ఫోజులతో తీసి ‘కొత్తవారు కావలెను’ అనే యాడ్‌ల అడ్రస్‌లకు పంపుతుంటారు. వయస్సు 22. బి. ఎ ఫెయిల్‌. వీరికి తల్లిగారు గంగాబాయి బాగా సపోర్టు.


రెండవ సంబంధం. పేరు పార్వతీశం. ఒక్కడే కొడుకు. తండ్రి పాపన్న, తల్లి మంగమ్మ. రెండు మూడు కాన్పులు పోగా.. నాల్గవసారి వీరు జన్మించారు. పార్వతీశం అంటే తల్లిదండ్రులకు ప్రాణం. పార్వతీశం మంచి అందగాడు. తెలివైనవాడు.. గర్విష్టి.


పార్వతీశానికి రైల్వేలో గూడ్స్‌ క్లర్కు ఉద్యోగం. తండ్రి పాపన్న చిల్లర అంగడి యజమాని. మంగమ్మ మాహా దైవభక్తురాలు. తనకొడుకు రైల్వే ఉద్యోగని ఆమెకు ఎంతో గర్వం. వీరూ రెండు మూడు సంబంధాలు చూచారు. నచ్చలేదు. పార్వతీశం వూహల్లో తమన్నా వుంటుంది. అలాంటి అందాల అమ్మాయి తనను అర్థాంగిగా రావాలని అతని ఆశ. కోరిక.


పార్వతీశానికి సుజాత సాంప్రదాయపు చీర రవిక ధారణ రంగు (ఛామనఛాయ) నచ్చలేదు. మాధవయ్యగారు చెప్పిన మాట ప్రకారం జవాబు ఇవ్వలేదు. అహంకారి.


మూడవ సంబంధం : పేరు ఆనందరావు. తండ్రి లేడు. ఉన్నది తల్లి శాంతమ్మ. హైస్కూలు హెడ్‌ మాస్టర్‌. ఆనందరావు మెకానికల్‌ ఇంజనీరు. యల్‌. యన్‌. టి చెన్నై హెడ్‌ ఆఫీసులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.


వీరి మనో ఆశయం. తనకు రాబోయే భార్య మోడరన్‌గా, బాగా అందంగా తెల్లగా ఉండాలి. ఉద్యోగం చేస్తూ వుండాలి. తన తల్లిని ఆమె తన సొంత తల్లిలా భావించి అభిమానించాలనేది అతని నిర్ణయం.


సుజాత రంగు, ఉద్యోగం రెండూ అతనికి నచ్చలేదు. ఆకారంణంగా మాధవయ్యగారికి ఎలాంటి సమాధానాన్ని తెలియజేయలేదు. మూడు సంబంధాలలో ఏ ఒక్కరూ ఎలాంటి (అవును, కాదు) అనే విషయాన్ని తెలియ జేయనందున మాధవయ్య, గౌరీలు చాలా ఆవేదనకు గురి అయ్యారు.

మాధవయ్యగారి మిత్రుడు నారాయణమూర్తి. సహోద్యోగి. వారు రిటైర్డ్‌ అయినారు. నారాయణమూర్తి గారికి ఆయనకు ఒక కొడుకు. పేరు మస్తాన్‌బాబు.



మస్తాన్‌బాబూ ముస్లిం. చిన్నతనం నుండి ఎంతో దైవభక్తి పరుడు. అతని తల్లితండ్రి చిన్నతనంలోనే ఏడేళ్ళ ప్రాయాన గతించారు. ఆ గ్రామంలో వుండే హిందువుల ఇండ్లలోనే పెరిగాడు. వాళ్ళు చెప్పే పనులు చేసేవాడు. పెట్టింది తినేవాడు. అలాగే పెరిగి పెద్దవాడైనాడు. దినచర్యల ముగించి ఏ తల్లో పెట్టిందో తిని ఎక్కువ సమయం మహాలక్ష్మమ్మ గుడిముందు కూర్చొని ఆ దైవాన్ని ధ్యానించేవాడు.


కొంతకాలం తర్వాత ఏకభుక్తం చేసేవాడు. ఎప్పుడూ దైవచింతనతోనే గడ్డం మీసాలతో ఎదిగిన జుట్టుతో యోగిలా తయారయ్యాడు.


వయస్సు పెరిగింది. వెంట్రుకలు నెరిశాయి. సర్వకాల సర్వావస్తలయందునా దైవచింతనే. కళ్ళుమూసుకొని ధ్యానంలో వుండేవాడు. ఆ వూరిలో మహాలక్ష్మమ్మ గుడి వుంది. గుడి ప్రక్కన వేపచెట్టు. చెట్టు చుట్టూ అరుగు. రాత్రి సమయంలో మస్తాన్‌ ఆ అరుగు. రాత్రి సమయంలో మస్తాన్‌ ఆ అరుగుపైనే పడుకునేవాడు.


గ్రామస్తులు ఆడవారు ఆ చెట్టును పూజించేవారు. చెట్టు మొదట్లో కుంకుమ, పసుపును చల్లి పూలను వుంచుతారు.


నారాయణకు చాలాకాలం పిల్లలు లేరు. మస్తాన్‌ అంటే అతనికి ఎంతో అభిమానం. అతను అతని భార్య మాలిని మస్తాన్‌కు ఆహారాన్ని ఇచ్చేవారు. మస్తాన్‌ తినకుండా కాకులకు పక్షులకు పెట్టేవాడు. సదా మాహాలక్ష్మమ్మను ధ్యానించేవాడు.


ఒకనాడు మాలినీకి తీవ్రజ్వరం. నారాయణకు ఏమిచేయాలో తోచలేదు. మస్తాన్‌కు ఆహారం ఇచ్చే సమయమయింది. పరుగున వేపచెట్టు దగ్గరకు వచ్చి విషయాన్ని మస్తాన్‌కు చెప్పాడు. మస్తాన్‌ చెట్టు మొదట్లో వున్న కుంకుమ పసుపును తీసికొని.. మహాలక్ష్మమ్మ శిలను ఒకసారి చూచి నారాయణతో అతని ఇంటికి వెళ్ళాడు.


తన చేతిలోని కుంకుమను పసుపును మాలినీ నొసటన కళ్ళు మూసికొని కొన్ని క్షణాలు ధ్యానించి వుంచాడు. ‘‘భయపడకు నారాయణ అమ్మ నీ ఇల్లాలిని కాపాడుతుంది వస్తా’’ వేగంగా తన నిలయం వైపుకు నడిచాడు మస్తాన్‌బాబా.


పావుగంట గడిచింది. మాలినీ జ్వరం తగ్గిపోయింది. ఈ వార్త వూరంతా పాకింది. మస్తాన్‌ మాలినీ జ్వరాన్ని కుంకుమ పసుపుతో నయంచేశాడని.. అది మొదలు ఆ వూరిలో ఎవరికి ఏ బాధ కలిగిన మస్తాన్‌ చెంతకు వచ్చేవారు.


వారు చెప్పింది విని అనారోగ్యంగా వున్న వారిని తాకి పసుపు కుంకుమలను వారి నొసట రాచి పంపేవాడు మస్తాన్‌. బాధితులకు బాధా విమోచనం కలిగేది.


క్రమంగా ఈ వార్త చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రాకింది. ఆయా ప్రాంతాలవారు కూడా వచ్చి.. మస్తాన్‌ను చూచి వారి వైద్యంతో ఆనందంగా తిరిగి వెళ్ళేవారు. మస్తాన్‌ పేరు మస్తాన్‌బాబాగా మారిపోయింది. నారాయణమూర్తి.. మస్తాన్‌ బాబాను సమీపించి ఎదురుగా కూర్చున్నాడు. అతని వదనంలో విచారం. కళ్ళు తెరిచి మస్తాన్‌ బాబా నారాయణమూర్తి ముఖంలోకి చూచాడు.


‘‘ఏం నారాయణా!.. చాలా విచారంగా వున్నావ్‌!.. ’’ అడిగాడు మస్తాన్‌బాబా.


‘‘బాబా.. !’’


‘‘ఏమిటి.. ?’’


‘‘నా సమస్య మీకు తెలియదా!.. ’’


‘‘నీవు చెప్పికపోతే నాకు ఎలా తెలుస్తుంది నారాయణా!.. ’’ చిరునవ్వుతో అడిగాడు మస్తాన్‌బాబా. క్షణం తర్వాత.. ‘‘ముందు నేను చెప్పేది విను.. ’’ అన్నాడు.


‘‘చెప్పండి బాబా!’’


మస్తాన్‌ బాబా కళ్ళు మూసుకొన్నాడు. నారాయణమూర్తి తదేకంగా వారి ముఖంలోకి చూస్తున్నాడు.

‘‘నారాయణా!.. ’’ మెల్లగా పిలిచాడు మస్తాన్‌బాబా.


‘‘నేను వెళ్ళిపోవాలి. నన్ను అరుగు పడమటి భాగంలో సమాధి చేయగలవా!.. ’’


‘‘బాబా!.. ’’ ఆశ్చర్యపోయాడు నారాయణమూర్తి.


‘‘అవును నారాయణా!.. నేను చెప్పింది నిజం. నా కోర్కెను నీవు తీర్చగలవా!.. ’’


నారాయణ నయనాల్లో కన్నీరు..

‘‘బా.. బా.. !’’ బొంగురుపోయిన కంఠంతో పలికాడు నారాయణ.


‘‘నా ప్రశ్నకు నీ జవాబు?.. ’’


నారాయణ కన్నీటితో తలదించుకొన్నాడు. అతనికి దుఃఖం పొంగివస్తూవుంది.

‘‘నా.. రా.. య.. ణా!.. ’’ ప్రయాసతో పిలిచాడు మస్తాన్‌బాబా.


‘‘తీరుస్తాను బాబా!.. ’’ ఏడుస్తూ చెప్పాడు నారాయణమూర్తి.


‘‘నేను చచ్చి నీ కడుపున పుడతాను.. ’’ కళ్ళు మూసుకొని మస్తాన్‌ బాబా చెప్పాడు.


నారాయణమూర్తి.. తన చెవులను తనే నమ్మలేకపోయాడు. ముఖంలో విచారం.. కళ్ళల్లో కన్నీరు.. మనస్సున మూగబాధ.. అతని వాలకాన్ని చూచిన మస్తాన్‌బాబా పెదవులపై చిరునవ్వు.

‘‘నారాయణా!.. ఈ లోకంలో పుట్టిన ప్రతిప్రాణీ గతించవలసిందే. అంతా ఆ పైవాడు ఆడిరచే నాటకం. మనం అంతా పాత్రధారులం. ఏ పాత్ర ఎంతవరకూ వుండాలో అంతవరకూ వుండి నటించి వెళ్ళిపోతుంది. నేను చెప్పింది నా పాత్ర ముగిసేసమయం ఆసన్నమైనదని అర్థం అయిందా.. నేను కోరిన రీతిగా నా గోతిని నిర్మించగలవా!.. ’’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు మస్తాన్‌బాబా.


‘‘నిర్మిస్తాను బాబా!.. ’’ కన్నీళ్ళతో చెప్పాడు నారాయణమూర్తి.


‘‘సరే!.. ఇక నీవు ఇంటికి వెళ్ళు.. ’’


లేచి నిలబడి బాబాకు నమస్కరించి నారాయణమూర్తి విచారంగా ఇంటికి వెళ్ళాడు. బాబా చెప్పిన మాటలు తన భార్య మాలినీకు చెప్పాడు. ఆమె కూడా బాధపడింది.


మరుదినం బాబాకు ఇష్టమని మినపవడలను భార్య చేతితో చేయించి, భార్యాభర్తలు మస్తాన్‌ బాబాను చూచవచ్చారు. బాబా అరుగుపై వెల్లికిలా అచేతనంగా పడుకొనివున్నారు.

సమయం ఉదయం ఏడుగంటలు..


నలుగురు ముసలివారు బాబాను చూస్తూ..

‘చచ్చిపోయాడు', అనుకొంటున్నారు.


వారు అన్న ఆ మాటలను విన్న నారాయణ అతని భార్య వేగంగా మస్తాన్‌బాబాను సమీపించారు.

‘‘పోయారు.. ’’ అన్నాడు ఒక వ్యక్తి.


నారాయణ ముక్కుదగ్గర వేళ్ళువుంచి, శరీరాన్ని తాకిచూచి వారి మరణం యదార్థమని భావించి భోరున ఏడుస్తూ వారి పాదాలపై పడిపోయాడు.


అరుగునిండా వూరిజనం చేరారు. నారాయణమూర్తి గ్రామ సర్పంచ్‌కి మస్తాన్‌బాబా చివరి కోరికను తెలియజేశారు. కొంతచర్చ జరిగింది. చివరకు.. మస్తాన్‌ బాబా కోరిక ప్రకారమే అరుగు వెనుక భాగాన వారిని సమాధి చేశారు. పొరుగువూళ్ళ వారికి విషయం తెలిసి కొందరు బాబా సమాధి కాకముందు.. మరికొందరు బాబా సమాధి అయిన తర్వాత వచ్చి చూచి కన్నీళ్ళతో వెళ్ళిపోయారు.


రెండు మాసాలు గడిచాయి. నారాయణమూర్తి భార్య మాలినీ.. నెలతప్పింది. నారాయణమూర్తికి పరమానందం. బాబా సమాధి చెంతకు వచ్చి.. ‘‘బాబా!.. నీమాట నిజం అయింది. ’’ నమస్కరించి వారిని పదేపదే తలచుకొన్నాడు.


మాలినీకి నవమాసాలు నిండాయి. ఒకరోజు ఉదయం ఆరుగంటలకు మగశిశువును జన్మించింది. తల్లి బిడ్డ కుశలం. ఆ బిడ్డకు నారాయణమూర్తి ‘మస్తాన్‌ బాబా’ అని నామకరణం చేశాడు. అందరూ మస్తాన్‌బాబు అని పిలిచేవారు.


*** *** *** ***

ఆ మస్తాన్‌బాబుకు ఇప్పుడు పాతిక సంవత్సరాలు. పోలీస్‌ ట్రైనింగ్‌ ముగించి సబ్‌ ఇన్స్‌పెక్టర్‌గా వూరికి వచ్చాడు.


నారాయణమూర్తికి మాధవయ్య కూతురు సుజాత అంటే ఎంతో ఇష్టం. అదే భావన వారి సతీమణి మాలినీకి, మాటల సందర్భంలో తన మనోభావాన్ని మాధవయ్య గ్రహించాలని..


‘‘మాధవయ్యా!.. నీ కూతురు ఏ ఇంటికి కోడలవుతుందో వారు చాలా అదృష్టవంతులయ్యా!.. ’’ ఒకసారికాదు గతంలో నాలుగైదుసార్లు సుజాతను తన కోడలిగా చేసికోవాలనే ఉద్దేశ్యంతో అన్నారు.


మాధవయ్యగారికి నారాయణమూర్తి, ఆ మాటలు అర్థం అయినాయో కాలేదో ఆ దైవానికే ఎరుక. నారాయణముర్తి మస్తాన్‌ బాబా గోరీకి మొక్కడం. కొడుకుకి అదే పేరు పెట్టడం అతనికి నచ్చలేదు. ఆ కారణంగా నారాయణమూర్తి కుమారుడు మస్తాన్‌బాబాను అతను లెక్కచేయలేదు.

మూడు సంబంధాలు వచ్చి.. బదులు ఇవ్వనందున మాధవయ్య సింహావలోకనం చేసికొన్నాడు. ఒకే కులం.. గోత్ర బేధం.. అన్నీ సరే.. అబ్బాయి పేరే మాధవయ్యకు మింగుడు పడలేదు. ఒకనాడు..


కానీ ఈనాడు.. మెల్లగా నారాయణమూర్తి ఇంటికి వచ్చాడు. వాకిట్లో మస్తాబ్‌బాబా చిరునవ్వుతో..

‘‘అంకుల్‌ రండి.. రండి!.. ’’ గౌరవంగా ఆహ్వానించాడు మస్తాన్‌బాబు.


వ్యంగ్యపు నవ్వుతో ‘‘బాబూ!.. నాన్నగారు వున్నారా!’’


‘‘లేరు. బాబాగారి దగ్గరకు వెళ్ళారు. ఈరోజు శుక్రవారం. మస్తాబ్‌బాబా సిద్ధిపొందిన రోజు. నైవేధ్య దీపారాధనలు చేసి నైవేధ్యాన్ని పంచివస్తారు. వెళ్ళి చాలాసేపయింది. ఈపాటికి వస్తుంటారు. రండి కూర్చోండి సార్‌.. ’’ గౌరవంగా ఆసనాన్ని చూపించాడు మస్తాన్‌బాబు.


అతని వినయవిధేయతలకు మాధవయ్య ఆశ్చర్యపోయాడు. అతను చూపిన కుర్చీలో కూర్చున్నాడు.


మస్తాన్‌ పేరుతో ఇతన్ని నేను ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను. పేరులో ఏముంది?.. ప్రతి మనిషికీ వుండవలసింది మంచి మనస్సు. ఈ బాబు మనస్సు చాలా మంచిది. నాలోని అజ్ఞానంతో ఇంతకాలం ఆ విషయాన్ని గమనించలేక పోయాను. నేను ప్రస్తావించబోయే విషయానికి నారాయణమూర్తి, ‘‘గౌరీ జావాబు ఎలా ఉంటుందో!.. అడగాలని వచ్చాను. అడగడం నా అవసరం. అడగాలి’’ అనుకొన్నాడు మాధవయ్య.


నారాయణమూర్తి వచ్చారు. చిరునవ్వుతో మాధవయ్య నమస్కరించారు.

‘‘ఏం సార్‌! ఇలా వచ్చారు. కబురు పంపి వుంటే నేనే వచ్చేవాడినిగా!.. ’’ వినయంగా పలికాడు.

మాధవయ్య లజ్జతో తలదించుకొన్నాడు.


‘‘ఏమిటి సార్‌ విషయం?.. ’’ అడిగాడు నారాయణమూర్తి.


‘‘నారాయణా!.. ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలని వచ్చాను. ’’


‘‘విషయం ఏమిటో చెప్పండి.. ’’


‘‘మాపెద్ద అమ్మాయి సుజాత.. ’’


‘‘బంగారుతల్లి!.. ’’ మాధవయ్య పూర్తిచేయక ముందే నారాయణమూర్తి నవ్వుతూ అన్నాడు.


‘‘మీ అబ్బాయికి, మా అమ్మాయి సుజాతకు వివాహం జరిపించ మీరు అంగీకరిస్తారా!’’ ప్రాధేయపూర్వకంగా అడిగాడు మాధవయ్య.


నారాయణమూర్తి అర్థాంగి మాలిని.. కాఫీ గ్లాసులతో వచ్చి ‘‘అన్నయ్యగారూ! కాఫీ తీసికొండి’’ చిరునవ్వుతో గ్లాసును మాధవయ్యకు అందించింది.


మాధవయ్య గ్లాసును ఆశ్చర్యంతో అందుకొన్నాడు.


‘ఈమె నా రాకను గమనించి, ప్రీతిగా నాకు కాఫీగ్లాసును అందించింది. ఉత్తమ ఇల్లాలు అనుకొన్నాడు’ మాధవయ్య.


నారాయణముర్తి వారి ఎదుట కుర్చీలో కూర్చున్నాడు. ‘‘మీ అబ్బాయి నాకు, మా కుటుంబ సభ్యులకు.. ముఖ్యంగా నా కూతురు సుజాతకు ఎంతో ఇష్టం సార్‌!.. ‘‘ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు మాధవయ్య.


నారాయణమూర్తి భార్య ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.

‘‘మాలినీ!.. మాధవయ్యగారి మాటలను విన్నావుగా నీ అభిప్రాయం ఏమిటి?.. ’’ భార్యను అడిగాడు నారాయణమూర్తి.


‘‘మీ అభిప్రాయమే నా అభిప్రాయమండి!’’ చిరునవ్వుతో చెప్పింది మాలినీ.


‘‘బాబూ!.. నీవేమంటావ్‌?.. ’’ కొడుకు మస్తాన్‌బాబా ముఖంలోకి చూచి అడిగాడు నారాయణమూర్తి.


‘‘నాన్నా!.. అమ్మకు మీకూ సమ్మతం అయితే.. ’’ ఆగిపోయాడు మస్తాన్‌బాబూ.


నారాయణమూర్తి వదనంలో చిరునవ్వు. కారణం, తన భార్య తనయులు ఏనాడూ తన మాటలను ధిక్కరించలేదు. ఆక్షేపించలేదు. ఆనందంగా ఏకీభవించారు.


‘‘నాకు సుజాత అంటే ఎంతో ఇష్టంరా బాబు, నీ నిర్ణయాన్ని చెప్పు.. ’’ అడిగాడు నారాయణమూర్తి.


‘‘నాన్నా!.. అమ్మ, మీ నిర్ణయమే నా నిర్ణయం’’ చిరునవ్వుతో చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.


‘‘మాధవయ్యగారు ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌, నేను ఆ వాక్యాన్ని ఎంతగానో అభిమానిస్తాను.. గౌరవిస్తాను.. నాకు ఆ కొడుకు మస్తాన్‌ బాబా ఆశీర్వాదంతో పుట్టాడు. అందుకే వాడికి వారి పేరును పెట్టాను. చరచరా జగత్తుకు రక్షకుడు ఆ సర్వేశ్వరులు. వారి నిర్ణయంతోనే ఈ జగతిలో ప్రతి ఒక్కరి జీవిత విధానం ముందుకు సాగుతూ వుందని నా నమ్మకం. నా దృష్టిలో హైందవ, ఇస్లామ్‌, క్రిష్టియానిటీ మూడు ఒక్కటే. నాకు పరమత ద్వేషం లేదు. నా దృష్టిలో అన్ని మతాల సారం ఒక్కటే.


ఆచార ఆరాధనా విధానాలు వేరుకావచ్చు. కానీ అందరి మనోసంకల్పం దైవ విషయంలో ఒక్కడే. ఇది నాకు తెలిసిన సత్యం. నేను మనోవాక్కాయ కర్మలా ఆచరించే విధానం. నా కొడుకు తత్వం కూడా నా తత్వమే. ఇది మీకు మీ కుటుంబానికి నచ్చితే.. మీ అమ్మాయి సుజాతను నా కోడలిగా చేసికొనేటందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.


మీరు మీ కుటుంబసభ్యులు బాగా ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయండి. మీరుగా వచ్చారు. మీ అభిప్రాయాన్ని చెప్పారు. నేను నావారు, మా నిర్ణయాన్ని మీకు తెలియజేశాము. ఫైనల్‌ నిర్ణయం మీదే. ’’ చిరునవ్వుతో చెప్పాడు నారాయణమూర్తి.

మాధవయ్య కళ్ళల్లో కన్నీరు. గట్టిగా కళ్ళు మూసికొన్నాడు. కొన్ని క్షణాల తర్వాత..

‘‘నారాయణమూర్తి!.. మీరు మీ మంచిమాటలతో నాలోని అజ్ఞానాన్ని తొలగించారు. సుజాతా, మస్తాన్‌బాబుల వివాహానికి నాకు నావారికీ కూడా పరిపూర్ణంగా సమ్మతం.. మీరు నా కోర్కెలను ఆమోదించినందుకు మీకు నా ధన్యవాదాలు. నిశ్చితార్థానికి, వివాహానికి ముహూర్తాలను నిర్ణయించి వచ్చి మీకు చెబుతాను. శలవు.. ’’ ఆనందంగా చేతులు జోడిరచి, పరమానందంతో తన ఇంటివైపుకు నడిచాడు మాధవయ్య.


నారాయణమూర్తి, మాలిని, మస్తాన్‌బాబా చిరునవ్వులతో వేగంగా వెళుతున్న మాధవయ్యను చూచి ఒకరినొకరు చూచుకొని నవ్వుకొన్నారు.


*** *** *** ***

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.





51 views0 comments
bottom of page