'Mathrudevobhava' - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy Published In manatelugukathalu.com On 27/01/2024
'మాతృదేవోభవ' తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ రోజు నేను క్లాస్ కి వెళ్ళేసరికి విద్యార్థులంతా నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఆరోజు నేను వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక వైకల్యం గురించి కొత్త టాపిక్ చెప్పబోతున్నాను.
ఇది చాలా క్లిష్టమైన పాఠ్యాంశం. సైన్స్ తో పాటు సైకాలజీ కూడా జోడించి చెప్పవలసి ఉంటుంది. అందుకే నేను శని, ఆదివారాలు పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు క్లాస్ కి వచ్చాను.
ఎనిమిదేళ్ళ కిందట ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసి ఆ తరువాత ఎయిమ్స్ లో న్యూరాలజీ లో ఎండీ చేసాను. ఆతరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయ వైద్యకళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి క్రితం సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందాను. చేరిన అనతి కాలంలోనే మంచి ప్రొఫెసర్ నని పేరు తెచ్చుకున్నాను. నేను తరగతి గదిలోకి వెళ్ళగానే విద్యార్థులంతా లేచి నిలబడ్డారు. నేను వాళ్ళందరికీ హాజరు వేసి, డిజిటెల్ బోర్డు మీద పాఠం చెప్పటం మొదలు పెట్టాను.
"డియర్ స్టూడెంట్స్! ఈరోజు మనం మెంటల్ రిటార్డేషన్ అంటే ఇంటలెక్ట్యువల్ డిసెబిలిటీ గురించి నేర్చుకోబోతున్నాము. అసలు మెంటల్ రిటార్డేషన్ అంటే ఏమిటి? ఇది ఉన్న వ్యక్తికి సాధారణంగా అందరికీ ఉండే తెలివితేటల కన్నా తక్కువ ఉంటాయి. దీనివల్ల అతను అందరిలా చదువుల్లో రాణించలేడు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు కొత్త విషయాలను త్వరగా ఆకళింపు చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ మానసిక వైకల్యం సాధారణంగా బాలికల్లో కన్నా బాలురలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది పుట్టుక నుంచో లేకపోతే బాల్యం నుంచో వస్తుంది.
ఈ రుగ్మతను పిల్లలకున్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాల ద్వారా పోల్చుకోవచ్చు. ఆ లక్షణాలలో ముఖ్యమైనవి ఏంటంటే మొదటిది వీళ్ళు మిగతా పిల్లల్లా తెలివితేటలు ప్రదర్శించలేకపోవడం, రెండవది మిగతా వారికన్నా ఆలస్యంగా కూర్చుకోవడం, మెల్లగా నడవటం. అలాగే మిగతావారిలా స్పష్టంగా మాట్లాడలేకపోవటం. ఆ తరువాత ముఖ్యమైనది జ్ఞాపకశక్తి లేకపోవటం.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చర్యలకు వీళ్ళు సరిగ్గా స్పందించ లేకపోవడం. అంటే ప్రతి చర్యలు ఉండవు. లాజికల్‌గా ఆలోచించ లేకపోవటం. వయసు ఎక్కువున్నా చిన్నపిల్లల్లా ప్రవర్తించటం, ఆసక్తి లేకపోవటం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో నిరాసక్తత, సాధారణ జీవనం గడపడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం.
ఇవన్నీ ఈ రుగ్మత లక్షణాలు. ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా సరే ఆ పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు భావించాలి . వీళ్ళ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఫిషెంట్ 10 స్కేలు మీద 4 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ రుగ్మత లేని పిల్లలికి ఈ ఐక్యూ 6 కన్నా ఎక్కువ వుంటుంది.
సాధారణంగా గర్భందాల్చిన తరువాత అతిగా మద్యపానాన్ని సేవించడం, పుట్టుకలో ఏర్పడిన సమస్యలు, జన్యుపరమైన సమస్యలు, వంశపారంపర్యంగా ఉన్న రుగ్మతలు. ఇలా ఇది రావడానికి ఎన్నో కారణాలు,
ముఖ్యంగా తల్లి తండ్రులలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు ఈ రుగ్మత వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాగే పి. కె. యు. అంటే ఫినైల్ కెటోనూరియా లాంటి జీన్సు పరమైన సమస్యలు, క్రోమోజోముల సమస్యలు ఇలా ఈ రుగ్మత రావడానికి వీటిలో ఏదైనా కారణం కావచ్చు.
అలా ప్రవాహంలా 3 గంటల సేపు వాళ్ళకు మెంటల్ రిటార్డేషన్ గురించి సమగ్రంగా చెప్పాను.
ఆ తరువాత వడివడిగా బయటకు వచ్చి ఇంటికి బయలుదేరాను. అప్పటికే అరగంట ఆలస్యం అయింది.
ఇంటి దగ్గర నా కోసం నా భార్య మిథున ఎదురుచూస్తూ ఉంటుంది. ఉదయం నేను లేచి పేపరు చదువుకుంటున్న సమయంలో తనకు రెండు నెలల నుంచి నెలసరి కావటంలేదని చెప్పటంతో సాయంత్రం మా ఫేమిలీ డాక్టర్ ఇందిర గారి అపాయింట్‌మెంట్ తీసుకున్నాను.
అర గంటలో ఇంటికి చేరుకుని ఫ్రెషప్ అయి మిథునని తీసుకునీ ఇందిర గారి నర్సింగ్ హోంకి వెళ్ళాను. ముందే అపాయింట్‌మెంట్ తీసుకోవడం వల్ల పది నిముషాల్లో మమ్మల్ని లోపలికి పిలిచారు డాక్టర్ ఇందిర.
ఆ తరువాత మిథునకి గర్భధారణ పరీక్ష చేసి, గర్భం దాల్చినట్లు నిర్ధారణ చేసి మా ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపింది డాక్టర్ ఇందిర.
ఆ తరువాత మా ఇద్దరి రక్త నమూనాలు తీసుకొని కొన్ని పరీక్షలు చేయడానికి పంపించింది. ఆమె చేయిస్తున్న పరీక్షలు ఒక డాక్టరుగా నాకు తెలుసు. గర్భం దాల్చగానే భార్యాభర్తలిద్దరికీ రక్త పరీక్షలు జరపడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా జన్యు లోపాలుంటే అవి తెలుస్తాయి. దాని వల్ల వాటిని సరిచేసుకునే అవకాశం కలుగుతుంది. అది కుదరకపోతే గర్భస్రావం చేయించుకోవచ్చు. దానివల్ల అనారోగ్య శిశువు లను నివారించవచ్చు.
గంట తరువాత రక్త పరీక్షల ఫలితాలకోసం మమ్మల్నిద్దరినీ రేపు సాయంత్రం రమ్మనమని చెప్పారు డాక్టర్ ఇందిర.
ఆమర్నాడు సాయంత్రం మేమిద్దరం మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళేసరికి డాక్టర్ ఇందిర పిడుగు లాంటి వార్త చెప్పింది.
``మిస్టర్ వంశీ! మీ ఇద్దరికీ జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్ష జరిపాను. ఆ పరీక్షల్లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. మీ భార్య శరీరంలో కొన్ని ఎబ్‌నార్మల్ జీన్స్ అంటే అసాధారణ జన్యు కణాలు కనిపించాయి. దానివల్ల మీకు పుట్టబోయే బిడ్డకు సిస్టిక్ ఫైబ్రోసిస్ (సి. ఎఫ్), స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ (ఎస్. ఎం. ఎ), మెంటల్ రీటార్డేషన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మెంటల్ రిటార్డేషన్‌తో పుడితే ఆ బిడ్డతో మీరు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. ఒక డాక్టర్‌గా మీకు నేను ఆ విషయం చెప్పనవసరం లేదు. అందుకే బిడ్డను కనలా వద్దా అని మీ దంపతులు నిర్ణయించుకోండి. లేకపోతే ఆ బిడ్డ తల్లితండ్రులుగా మీరిద్దరూ జీవితాంతం బాధపడవలసి ఉంటుంది`` అని చెప్పింది డాక్టర్ ఇందిర.
ఆమె మాటలు విని మిథున స్థాణువైంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించసాగింది నాకు.
నేను ఆమె చేతిని నొక్కతూ ``గాబరాపడకు. ఇంటికెళ్ళి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం`` అని చెప్పాను.
వెంటనే మిథున ఆందోళన నిండిన స్వరంతో ``డాక్టర్! పుట్టబోయే శిశువుకు మీరు చెప్పిన వ్యాధి వచ్చే అవకాశం ఎంత వరకూ ఉంటుంది?`` అని అడిగింది.
``మిథునా! 80 శాతం ఆ వ్యాధితో పుట్టే అవకాశం ఉంది. నీ రక్తంలో దానికి సంబంధించిన జీన్స్ కనిపించాయి. ఆ వ్యాధితో పుడితే ఆ శిశువు జీవితాంతం చిన్నపిల్లల్లాగే ప్రవర్తిస్తుంది . వాళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉండదు. సరిగ్గా మాట్లాడలేరు . నడవ లేరు . మెదడు సరిగ్గా పనిచెయ్యదు. తమ పనులు తాము చేసుకోలేరు . మిగతా విషయాలు వంశీ మీకు చెబుతారు`` అని చెప్పింది.
ఆ తరువాత మేమిద్దరం కారులో ఇంటికి బయలుదేరాము.
కారులో మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం చోటుచేసుకుంది. ఆమెను ఎలా ఓదార్చాలో నాకర్థం కావటం లేదు.
నాకా సమయంలో అంతకు రెండు రోజుల ముందు నేను నా విద్యార్థులకు చెప్పిన మెంటల్ రిటార్డేషన్ పాఠం గుర్తుకు వచ్చింది. ఆ పాఠం వాళ్ళకి చెబుతున్నప్పుడు అలాంటి సమస్య నాకే ఎదురౌతుందని నేనూహించలేదు. ఇదంతా యాదృచ్ఛికమా లేక సిక్త్ సెన్స్ నాకు ముందే చెప్పిందా అన్న సంశయం నాకు కలిగింది.
ఇంటికి వెళ్ళిన తరువాత మిథునకు ఆ వ్యాధి గురించి, పుట్టబోయే బిడ్డ వల్ల ఎన్ని కష్టాలు పడవలసి ఉంటుందో వివరించి చెప్పి, అబార్షన్ చేయించుకోమని చెప్పాను.
కానీ మిథున ఎట్టిపరిస్థితుల్లోను గర్భ విచ్ఛిత్తికి ఒప్పుకోలేదు. పైగా డాక్టరు 80 శాతమే అలా పుట్టడానికి అవకాశం ఉందని చెప్పిందనీ, అంటే మామూలుగా పుట్టే అవకాశం 20 శాతం వరకు ఉందనీ, కాబట్టి తాను 20 శాతాన్ని నమ్ముతాననీ, ఒక తల్లిగా బిడ్డ ఎలా పుట్టినా స్వీకరిస్తానని చెప్పి అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోలేదు.
ఆ తరువాత మా ఇద్దరి మధ్య ఎడం పెరిగింది. నెల్లాళ్ల పాటు ఇద్దరం మాట్లాడుకోలేదు. మొదటి సారి గర్భం దాల్చినపుడు భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందించి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటారు. భర్త భార్యను కాలు కింద పెట్టనీయకుండా అన్ని పనులు తానే చేస్తూ ఒక దేవతలా చూసుకుంటాడు.
కానీ మా విషయంలో అది తప్పైంది. నేను ఓ డాక్టర్ని కావడం వల్ల వాస్తవంగా ఆలోచించడంతో ఈ సమస్య జటిలం అయింది.
నేను ఆ మర్నాడు మరొకసారి మిథునతో తల్లిగా ఆమె ఎదుర్కోబోయే కష్టాల గురించి మళ్ళీ చెప్పాను.
“తల్లిని చేస్తాడన్న కారణంతోనే ప్రతీ స్త్రీ తన భర్త మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది. నెల తప్పిన దగ్గర్నుంచీ ఆ స్త్రీ తనకు పుట్టబోయే బిడ్డ గురించే కలలు కంటుంది.
"అమ్మ అని విన్నప్పుడే ఆడబతుకు గెలుపు!
అందుకే ప్రతి నిత్యం ప్రసవించును తూరుపు"!
అంత గొప్పది మాతృత్వం. అటువంటి మాతృత్వాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ప్రసవించే ప్రతీ తల్లికీ భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది. నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని బాధలు పడటానికైనా నేను సిద్ధం`` అని మిథున నాకు కరాఖండీగా చెప్పడంతో నాకేం చెయ్యాలో తోచలేదు.
*** *** ***
9 నెలల తరువాత మిథున ఒక మగ పిల్లవాణ్ణి ప్రసవించింది. డాక్టరు చెప్పినట్లే ఆ పిల్లవాడు నల్లగా, పెద్దతల, సన్నటి కాళ్ళు, చేతులతో వికృతంగా మానసిక వైకల్యంతో పుట్టాడు.
నెలరోజుల దాకా వాడు పాలు తాగలేదు. చొంగకారుస్తూ, తల వాలుస్తూ నిస్తేజంగా ఉన్నాడు. ఆ తరువాత వాడిని డాక్టరుకి చూపిస్తే కొన్ని మందులు వాడమని సూచించారు.
ఆరు నెలల తరువాత వాడికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. వాడికి పాలు తాగించటం ఓ పెద్ద సమస్యగా మారింది. ప‌్రతీ గంటకు మలమూత్ర విసర్జన, కళ్ళు తేలవేస్తూ ఉండటంతో వాడు ఎప్పుడు ఏమౌతాడో నన్న భయం మాకు కలుగుతూ ఉండేది. నేను విసుక్కుంటానేమోనని మిథునే వాడిని కంటికి రెప్పలా చూసుకునేది.
అలా రెండు సంవత్సరాలు వాడితో ఎన్నో బాధలను అనుభవించింది మిథున. దాంతో ఇంట్లో మా ఇద్దరికీ మానసిక ప్రశాంతత కరువైంది. ప్రతీరోజూ నా మాట విని అబార్షన్ చేయించుకోనందుకు మిథున మీద నాకు విపరీతమైన కోపం కలుగుతుండేది. ఈ రెండు సంవత్సరాల పాటు నేను ఆ పిల్లాణ్ణి ఒక్కసారి కూడా ఎత్తుకొని ముద్దాడ లేదు. వాడిని ఓ శతృవులా, ఓ అంటరాని వాడిలా చూసాను తప్పా నా రక్తం పుట్టిన కొడుకుగా భావించలేదు. వాడు ఎప్పుడు చనిపోతాడో తెలియక వాడికి పేరు కూడా పెట్టలేదు నేను .
రెండు సంవత్సరాల ప్రత్యక్ష నరకం తరువాత ఆ పిల్లడు చనిపోయాడు. ఏనాటి ఋణమో తీర్చుకునేందుకు మిథున కడుపున పుట్టినట్లున్నాడు. ఋణం తీరగానే వెళ్ళిపోయాడు.
వాడు చనిపోయిన తరువాత నేను ఊపిరి పీల్చుకుంటే మిథున మాత్రం కన్నీరు మున్నీరైంది. ఆమె దుఃఖాన్ని ఆపటం నావల్ల కాలేదు. అంతటి మానసిక అంగవైకల్యంతో పుట్టిన వాడి మీద ఎందుకంత ప్రేమ పెంచుకుందో నా కర్థం కాలేదు. కొన్నాళ్ళ తరువాత ఆమె మామూలౌతుందని నేను మౌనం దాల్చేను.
కానీ అప్పుడప్పుడు నాక్కూడా ఆ పిల్లడు గుర్తుకొచ్చి కంటనీరు తిరుగుతుండేది. దుఃఖం ముంచుకొచ్చేది. ఎంతైనా ఇంట్లో మాతో పాటు రెండేళ్ల ఉన్నాడు. వాడి ఏడుపుతో లేచే వాడిని. వాడి ఏడుపు వింటూ పడుకునే వాడిని. అటువంటిది ఒక్కసారిగా ఇంట్లో నిశ్శబ్దం ఆవరించటంతో నాక్కూడా ఇంట్లో ఉండబుద్దేసేది కాదు.
వాడు చనిపోయి సంవత్సరం అయిపోయినా మిథున మామూలు మనిషి కాలేకపోయింది. నిర్లిప్తత ఆమెని ఆవహించింది. మౌనం ఆమె భాష అయింది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే ఆమె ఏమౌతోందన్న భయం నన్నావహించి డాక్టర్ని కలిసాను.
డాక్టరు ఇందిర నా బాధ అర్థం చేసికొని ``వంశీ! మీరు ఇంకో బిడ్డ కోసం ప్రయత్నించండి. మళ్ళీ తల్లైతే ఆమె మామూలు మనిషయ్యే అవకాశం ఉంది`` అని చెప్పింది. ఆమె మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి.
"డాక్టర్! మీరేం చెబుతునారో నాకు అర్థం కావటం లేదు. మళ్ళీ మిథున గర్భం ధరించినా మామూలు శిశువుకు జన్మనిస్తుందన్న భరోసా ఉందా ? ఈసారి కూడా అలాంటి శిశువే జన్మిస్తే ఏం చెయ్యాలి?. అప్పుడు మిథున పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది" అన్నాను.
"వంశీ! ప్రతీసారీ అలాగే పుట్టే అవకాశం లేదు. ఒక్కోసారి మనం రిస్కు తీసుకోక తప్పదు. అంతకన్నా మీకు మరో అవకాశం లేదు. ఒక్కోసారి ప్రకృతి మనకు మంచి చేస్తుంది. ఎంత డాక్టర్లమైనా మనం కూడా మనుషులమే. దేవుణ్ణి నమ్మక తప్పదు. ప్రయత్నించండి. తలుపు తట్టబోయే అవకాశం కోసం దాని దగ్గర ఓపిగ్గా నిలబడక తప్పదు. సైన్స్ ఒకోసారి అద్భుతాలను సృష్టించి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది" అంది డాక్టరు ఇందిర.
ఆమెను ఆ సమయంలో చూసినప్పుడు దేవదూతలా కనిపించింది నాకు.
*** *** ***
కాలచక్ర భ్రమణంలో సంవత్సరం తిరిగింది. మిథున గర్భం ధరించి ఈరోజే ఒక అందమైన పిల్లని ప్రసవించింది. అదృష్టవశాత్తూ డాక్టరు ఇందిర చెప్పినట్లు ఆ పిల్ల ఆరోగ్యంగా, అందంగా, పెద్ద పెద్ద కళ్ళతో, అందమైన ముఖంతో చలాకీగా పుట్టి మా దంపతులిద్దరికీ ఆనందాన్ని తెచ్చింది. రెండేళ్ళ క్రితం పోయిన వసంతాన్ని తిరిగి తెచ్చింది. మోడులా మారిన మా జీవితాలను చిగురింపచేసింది.
ఇప్పుడు మిథునకు ఆ పిల్ల తోడిదే జీవితం. ఒక తల్లిగా ఆ పిల్లను చూస్తూ మురిసి పోతోంది.
మోడు వారిన జీవితం మళ్ళీ చిగురించినందుకు నాకు ఆనందంగా ఉంది. ఆ సమయంలో ఆనాడు మిథున చెప్పిన
“తల్లిని చేస్తాడనే మగని పైన వలపు
నెల తప్పిన నాటి నుంచి బిడ్డడిపై తలపు"
అన్న మాటలు గుర్తుకొచ్చి నాకు కంటనీరు తిరిగింది. మాతృత్వం యొక్క గొప్పతనం తెలిసింది.
(సమాప్తం )
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments