top of page
Original.png

మట్టపాలెం అడ్డరోడ్డు


మండుటెండలో మట్టపాలెం అడ్డరోడ్డుపై గొడుగు పట్టుకుని నడుస్తున్న విశ్వేశ్వరయ్యను రిక్షాతో వెంబడిస్తున్న సింహాచలం.

Mattapalem Addaroddu - Telugu Comedy Story | J S V Prasad

మట్టపాలెం అడ్డరోడ్డు తెలుగు హాస్య కథ | జె ఎస్ వి ప్రసాద్

Published in manatelugukathalu.com on 08/08/2026


మట్టపాలెం అడ్డరోడ్డు కథలో ఒక సాధారణ రిక్షా ప్రయాణం చుట్టూ మనుషుల స్వభావాలు, పిసినారితనం, అనుమానం, జాలి, మానవత్వం ఎలా బయటపడతాయో హాస్యభరితంగా చూపించారు జె. ఎస్. వి. ప్రసాద్. విశ్వేశ్వరయ్య, రిక్షావాడు సింహాచలం పాత్రల మధ్య జరిగే సంభాషణలు కథకు సహజమైన హాస్యాన్ని అందిస్తే, చివర్లో ఎదురయ్యే అనుకోని మలుపు పాఠకుడిని ఆశ్చర్యపరుస్తుంది.


“మట్టపాలెం ఊళ్ళోకి వెళ్ళాలి.. వస్తావా? " అడిగాడు విశ్వేశ్వరయ్య, చింత చెట్టుకింద రిక్షాలో కూర్చుని తలగుడ్డతో గాలి విసురుకుంటున్న సింహాచలాన్ని.


అతను చటుక్కున రిక్షా దిగి తలగుడ్డతో గబగబా సీటు దులిపి “రాడానికే గదేటి బాబూ నేనున్నది!" అంటూ రిక్షాని రెండడుగులు ముందుకు లాగాడు.


"ఎంతిమ్మంటావ్?


"ఇరవై రూపాయలెప్పుడూ మామూలే గదేటి బాబూ!" అన్నాడు వినయంగా! 


విశ్వేశ్వరయ్య అదిరిపడ్డాడు.. బస్ ఛార్జీలే వృథా ఖర్చు అనుకుంటుంటే.. రెండు ఫర్లాంగుల దూరానికి ఇరవై రూపాయలా!" అని ఆశ్చర్యపోతూ ఆమాటే పైకి అన్నాడు.


ఈసారి సింహాచలం ఆశ్చర్యపోయాడు "రెండు ఫర్లాంగులు కాదు.. బాబూ.. రెండు కిలోమీటర్లుంటాది” అన్నాడు


“చాల్చాల్లే.. మా చిన్నబ్బాయ్ చెప్ప లేదూ! పైగా బస్సులో కూడా అడిగాను..”


సింహాచలానికి చిరాకేసింది.. “పదేళ్ళ నుంచీ ఈ ఊరికి పాసింజెర్ల ఎగుమతీ దిగుమతీ నేనే గదేటి బాబూ! ఖచ్చితంగా మూడు కిలోమీటర్లకి తక్కువుండదు".


విశ్వేశ్వరయ్య విలాసంగా నవ్వాడు. "నేనీ ఊరికి కొత్తేమోగానీ, అమాయకుణ్ణి మాత్రం కాదోయ్. మా అబ్బాయికి టోపీ వేసి వచ్చి, ఈ ఊళ్ళో దాక్కున్న దొంగ వెధవని పట్టి, చెవులు మెలేసి ముక్కు పిండేయడానికి వచ్చిన 'పోలీసు కుక్క' లాంటోణ్ణి. నువ్వు నన్ను పిండెయ్యలేవు.. పోనీ ఓ ఐదిస్తాను వచ్చెయ్” అన్నాడు.


ఆ మాటలకి సింహాచలానికి మరింత చిరాకొచ్చింది.

"ఈ ఎండలో తమరసుంటోళ్ళని మూడు కిలోమీటర్లాక్కెళితే నేను మూడ్రోజులు మంచమెక్కాల్గదేటి."అన్నాడు. 


“అందుకే ఇరవై" అంటూ విశ్వేశ్వరయ్యని ఎగాదిగా చూశాడు.


గతుక్కుమన్న విశ్వేశ్వరయ్య. తలవంచి తనని తాను చూసుకున్నాడు, పొట్ట వరకే కనుపించింది, కాళ్ళు కనుపించలేదు. చుట్టూ ఉన్నవాళ్ళంతా తననీ- రిక్షావాణ్ణి మార్చి మార్చి చూస్తున్నట్టనిపించింది. ఆయనకి చప్పున 'గాంధీ'గారు గుర్తొచ్చారు. 

“దర్జాగా తానెక్కి కూర్చుని సాటి మనిషి చేత రిక్షా లాగించుకోవడం అమానుష”మనిపించింది. 


"వద్దులే.. వెళ్ళగలనులే!" అన్నాడు వెంటనే.


“ఇంతెండలో.. ఈ వయసులో నడిచెళ్ళ గల్రేటి? " ఆశ్చర్యపోయాడు సింహాచలం.


ఒక సాధారణ రిక్షావాడు తన వయసుని గుర్తుచెయ్యడం ఆయనకి నచ్చలేదు.


"ఎండకి నా దగ్గర గొడుగుంది. కాళ్ళకి చెప్పులున్నాయ్. దాహమేస్తే..” అనబోతూ ఆగి అనుమానంగా వాటర్ బాటిల్ ఆడించి చూసుకున్నాడు. అందులో 'పేద రైతు పొలంలో బోరుబావి నీళ్ళ'లాగా ఎక్కడో అడుగున ఉన్నాయ్ నీళ్ళు.


బస్సులో తన పక్కన కూర్చున్న ముసిలోణ్ణి తిట్టుకుంటూ- విసవిసా 'మట్టపాలెం అడ్డరోడ్డు' మీద నడవడం మొదలుపెట్టాడు విశ్వేశ్వరయ్య.


 సింహాచలం ఉలిక్కిపడ్డాడు. “కొంపదీసి ఈ ముసలోడు నిజంగానే నడిచెల్లిపోతాడా?" అని కొంచెం భయపడ్డాడు. 


ఇంకోగంట వరకూ మరో బస్సులేదు. దొరక్క దొరక్క దొరికిన ఈ ఒక్కణ్ణి ఊళ్లో దింపితే నాల్గు డబ్బులు వస్తాయ్. అలాగే ఇంటికిపోయి నాల్గుమెతుకులు తిని మళ్లీ లైనుకి రావచ్చు అనుకున్నాడు తను. 


కానీ ఇప్పుడు ఖాళీగా ఇంటికెళ్ళాలి కాబోలు.. అనుకుంటూ కండువా తలకి చుట్టుకుని రిక్షా లాక్కుంటూ విశ్వేశ్వరయ్య వెనకాలే బయలుదేరాడు. మనసులో చిన్న ఆశ మెదులుతోంది.


అంత ఎండలో.. ఈదురుగాలిలో ముసలాయన ఖచ్చితంగా అంతదూరం నడవలేడు. ఎక్కడో ఓచోట తప్పకుండా రిక్షా ఎక్కుతాడు. ఆ ఆశతోనే అతను యముడి వెనుక సావిత్రిలా నడుస్తు న్నాడు. 


ఆ ఊరు ఒక రిక్షాకి ఎక్కువ, రెండు రిక్షాలకి తక్కువ! అందుకే అక్కడ రెండో రిక్షా బతకలేదు. దొరికిన ఒక్క పాసింజెర్ని వదులుకున్నా ఈ రిక్షా కూడా బతకదు. 


అందుకే సింహాచలం ఓపిగ్గా వెంటాడుతున్నాడు. కానీ కొంతసేపటికే అర్థమైపోయింది. ఇక ఆ ముసిలోడు తన రిక్షా ఎక్కడని! 


అందుకే ఆఖరిసారిగా “సరే బాబూ! నేనెలాగూ ఇంటికే గదేటి పోతంట.. ఓ పదిస్తారేటి? " అన్నాడు. 


విశ్వేశ్వరయ్య తల అడ్డంగా ఆడించాడు. "సగం దూరం వచ్చేశాను గదేటి! రెండ్రూ పాయల్తీసుకోవచ్చుగదేటి? " అన్నాడు, సింహాచలం భాషని అనుకరిస్తూ.


 "అబ్బో! ఈ ముసిలోడికి ‘శానా' ఉందే” అని మనసులో అనుకుని "సరే బాబూ నే పోయొస్తా! కాస్త అన్నం తిని నడుంవాల్చి అపుడొస్తా! అప్పటికొస్తారు తమరు సగం దూరం. అప్పుడెక్కుదుర్లెండి!" అంటూ విసురుగా బయల్దేరాడు సింహాచలం.


క్షణాల్లో రిక్షా దూరమైపోగానే..విశ్వేశ్వరయ్య మనసులో "తప్పు చేశానేమో..? " అన్న అనుమానం మొదలైంది. 


ఎండ తీవ్రత, గాలి జోరూ ఒక్కసారిగా ఎక్కువైన భావన కలగసాగింది. కాళ్లకి జోళ్లున్నా నేలలోని వేడి తెలుస్తోంది. నడచినప్పుడు రేగుతున్న ఎర్రకంకర ధూళి చెప్పుల్లోకి దూరి పాదం పైభాగాన్ని కూడా కాలుస్తోంది. గొడుగు ఎండనైతే కాస్త ఆపుతోంది కానీ, రివ్వున వీస్తోన్న వేడిగాలి చెవుల్లో నిప్పులు పోస్తోంది. విశ్వేశ్వరయ్య తలతిప్పి చుట్టూ చూశాడు. ఎక్కడా నర సంచారం లేదు!


"ప్చ్...!" అనుకున్నాడు భయంగా.


"చిన్నబ్బాయ్ చెప్పినట్లు తను ఎనిమిది గంటల బస్సుకే వచ్చేయాల్సింది. కానీ అది డీలక్స్ బస్సు కదా.. ఛార్జీ ఎక్కువని ఆర్డినరీ బస్సుకోసం ఎదురు చూస్తే.. అదేమో గంటన్నర లేటుగా వచ్చింది. లేక పోతేనా.. ఈపాటికి తను ఊళ్లో ఉండే వాడు గదూ!"

వాటర్ బాటిల్ ఖాళీ అయిపోయింది.. నాలుకతో పెదవులు తడుపుకుంటూ లేని ఓపిక, ధైర్యం తెచ్చుకుంటూ నడక వేగం పెంచాడు విశ్వేశ్వరయ్య.


మనసులో "నాది పిసినారితనం కాదు. జాగ్రత్తతనం మాత్రమే! నేనేమీ తప్పు చేయడంలేదు" అంటూ తనకి తానే నచ్చచెప్పుకుంటున్నాడు.


సింహాచలం ఊళ్ళోకి ప్రవేశించేసరికి అడ్డాల శివన్నారాయణ ఇంటిముందు చిన్న పంచాయితీ జరుగుతోంది. అరుగు మీద కుర్చీల్లో ఐదారుగురు కొత్తవాళ్ళు న్నారు. శివన్నారాయణ నిలబడి వాళ్ళతో ఏదో చెబుతున్నాడు, అతని బావమరిది ఎర్రబాబు గుమ్మానికి జేరబడి నుంచుని పైకి చూస్తూ వాసాలు కాబోలు లెక్కపెడు తున్నాడు..! 


శివన్నారాయణ భార్య లోపలి వైపు తలుపుకి ఆనుకుని నిలబడి ఉంది. రోడ్డుమీద రెండు చిన్నకార్లున్నాయ్. వాటి వెనుక నిలబడి, అక్కడ జరుగుతున్న దంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని- చెవులు చేసుకుని- చూస్తూ వింటున్నారు ఊరి జనం.


సింహాచలం కూడా కుతూహలంగా రిక్షా ఆపి దిగి నిలబడ్డాడు.


"ఇంకే బాకీలూ లేవని వీడంటున్నాడు. ఉన్నా లేకపోయినా- నేను చేయగలిగిందేమీ లేదింక. వీడికున్న 'ఎకరన్నర' పొలం అమ్మగా వచ్చిన డబ్బంతా మీకే పంచేశాను- వీళ్ళ అక్కని చేసుకున్న పాపానికి. నా నలభైవేలకీ నీళ్లొదులుకుని పంచగా మిగిలిన పాతికవేలూ ఇదుగో వీడికే ఇచ్చేస్తున్నాను. 


ఇకనుంచీ వీడికీ-వీడి అప్పులకీ- నాకూ ఏ సంబంధమూ లేదు. ఈ డబ్బైనా జాగ్రత్త చేసుకుని మర్యాదగా బతకడం నేర్చుకుంటేనే నా గడప తొక్కుతాడు. లేకపోతే ఈ రోజుతో చుట్టరికం కూడా తెగిపోయినట్టే..!” అన్నాడు ఆవేశంగా శివన్నారాయణ అక్క డున్నవాళ్ళని ఉద్దేశించి... ఎర్రబాబు వైపు కోపంగా చూస్తూ..!


కుర్చీలలోని వాళ్ళు ఒకరితో ఒకరు ఏదో గుసగుసలాడుకున్నారు. వాళ్ళకి తెలుసు, ఇంకా 'అప్పులు' ఉండే ఉంటాయని..! కానీ పంపకాలన్నీ అయిపోయాక మళ్ళీ కొత్త బాకీలు పుట్టుకొస్తే.. వ్యవహారం మళ్ళీ మొదటికొస్తుంది. అప్పుడు రూపాయికి ముప్పావలాయే రావచ్చు లేదా అర్ధరూపాయే మిగలొచ్చు. కాబట్టి గప్చుప్గా వెళ్లిపోవడమే మంచిదనుకున్నారు వాళ్లు..


అడ్డాల శివన్నారాయణ తన భార్య చేతిలో ఉన్న పాతికవేల రూపాయలూ అందరూ చూస్తుండగా బావమరిది చేతిలో పెట్టేశాడు. 


“చూడబ్బాయ్- నీ గొడవలతో ఇప్పటికే నా తల వాచిపోయింది. నువ్విక్కడున్న సంగతి ఈ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. ఇంకే బాకీలూ లేవని నువ్వంటున్నావ్ గానీ.. ఏమో ఎప్పుడెవరు వచ్చి నా పీకలమీద కూర్చుంటారో అని భయంగా ఉంది. కనుక నువ్వీ క్షణమే ఎక్కడికెళతావో వెళ్ళిపో... ఎక్కడో చోట స్థిరపడ్డాకే మళ్ళీ రా!" అంటూ రోడ్డు వైపు చెయ్యి చూపించాడు.. 


సరిగ్గా ఆ చేతి వేలి చివర సింహాచలం కనిపించాడతనికి. “సమయానికి వచ్చావ్.. ఇలారా.. సింహా చలం!" అంటూ పిలిచాడు.


"చచ్చాన్రా బాబూ..!" అనుకుంటూ దగ్గరకు వచ్చాడతను.


ఇదిగో ఈ బాబుగార్ని అర్జంటుగా తీసుకెళ్ళి దగ్గరుండి ఏదో ఒక బస్సెక్కించేసి రా. మధ్యలో ఎక్కడా ఆగకు సుమా..!” అంటూ కంగారు పెట్టాడు.


"మీ మాట కాదంటానేటి గానీ బాబూ.. బాగా ఆకలేస్తోంది.ఇంటికెళ్ళి, ఐదునిముషాల్లో వచ్చెయ్యనేటి..!" అంటూ కదలబోయాడు సింహాచలం.


"వద్దోదొద్దు" అంటూ కంగారుపడి.. "ఇదుగో.. ఏమేవ్.. ఈ సింహాచలంగాడికి తినడానికేమయినా పెట్టి.. వద్దొద్దు.. కట్టిచ్చి ఓ గ్లాసుడు మజ్జిగ ఇయ్యి" అన్నాడు, శివన్నారాయణ భార్యతో. 


ఆమె తన తమ్ముడి వైపు బాధగా, జాలిగా చూస్తూ లోపలికి వెళ్ళి- చిన్న 'క్యారీబ్యాగ్' లో ఏవో తినుబండారాలూ.. ఓ పెద్ద గ్లాసెడు మజ్జిగతో వచ్చింది. సింహాచలం ఆ సంచీ తీసుకుని మజ్జిగ తాగేశాక, ఆమె

కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపో యింది.


శివన్నారాయణ సింహాచలం చేతిలో ఇరవైరూపాయలు పెట్టి జాగ్రత్త.. ఏదో ఓబస్ ఎక్కించెయ్. వెనక్కిమాత్రం తీసుకు రాకు" అన్నాడు ఖచ్చితంగా- అతనికి వళ్ళంతా చాలా కంపరంగా ఉంది.


"బావా..!" అంటూ ఏదో చెప్పబోతున్న ఎర్రబాబు మాటలు వినిపించుకోకుండా గబగబా లోపలికి వెళ్ళిపోయాడు శివన్నారాయణ. ఇక తప్పదన్నట్లు వెళ్ళి రిక్షాలో కూర్చున్నాడు. ఎర్రబాబు. అప్పటికి కార్లన్నీ హుషారుగా వెళ్ళిపోయాయ్.


సింహాచలం బరువుగా రిక్షా వెనక్కి తిప్పాడు.


★ ★


ఆ రోడ్డులో నీడనిచ్చే పెద్ద చెట్లేమీ లేవు. కొబ్బరి, తాడిచెట్లు ఉన్నాయ్. వాటి నీడలు కూడా ఎండకు భయపడి ఎక్కడో దాక్కున్నట్టున్నాయ్..!



ఆ చెట్లకింద నుంచే వేడివేడి ఎర్ర కంకరలో కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నాడు విశ్వేశ్వరయ్య. సరిగ్గా అప్పుడే ఒక కొబ్బరి చెట్టు నుంచి కాయ ఒకటి రాలి సూటిగా అతని తలవైపు ప్రయాణించింది! కానీ అది అదృష్టవశాత్తూ అతని చేతిలోని గొడుగు మధ్యలో ఉన్న స్టీలురాడ్డుకి గుచ్చుకుని ఆగిపోయింది. 


దురదృష్టం కొద్దీ-అతని తలకి జానెడెత్తులో ఉన్న గొడుగు, ఆ బరువుకీ వేగానికీ చేతి నుంచి రెండు అడుగులు కిందకి జారింది. కొన్ని ఊచలు విరిగిపోయాయ్. గుడ్డ చిరిగి మొహాన్ని కప్పేసింది. అదృష్టవశాత్తూ అతని తలకు గాయాలవలేదు కానీ, సరిగ్గా అప్పుడే మట్ట పాలెం ఊళ్ళోంచి వస్తున్న రెండు కార్లలోని మనుషులనూ అతను చూసే అవకాశం లేకుండా పోయింది.


గొడుగు చిరిగి పోయినందుకు బాధ పడుతూనే.. మండుటెండలో కొబ్బరిబోండం ఫ్రీగా దొరికినందుకు సంతోషించాడు విశ్వే శ్వరయ్య. ఆ గొడుగు ఊచతోనే కాయకు రంధ్రం చేసి ఆత్రంగా నీళ్ళు తాగేశాడు. ప్రాణం లేచివచ్చింది. అక్కడే ఓ చెట్టు మొదట్లో కొంచెం నీడగా ఉన్నచోట విశ్రాంతిగా కూర్చున్నాడు.


కొంతసేపటికి- రిక్షాలో ఎర్రబాబుని ఎక్కించుకుని వస్తున్న సింహాచలం చూశాడతన్ని.


"ఏంబాబూ! కాళ్ళులాగినయ్యేటీ.. కూసుండిపోయారు? " అన్నాడు.


ఎవరితో మాట్లాడుతున్నాడా అని తొంగి చూసిన ఎర్రబాబు షాక్ తిన్నట్టు అదిరిపడ్డాడు. చటుక్కున అటువైపు తిరిగిపోతూ-“త్వరగా పద బస్సందదు!” అంటూ కంగారుపెట్టాడు.


ఎండవల్ల కళ్ళు బైర్లు కమ్మిన విశ్వేశ్వరయ్యకి రిక్షాలో ఎవరున్నారో కనిపించలేదు.


ఎర్రబాబుని దగ్గరుండి బస్సెక్కించాక, సింహాచలం మరో కిరాయి కోసం ఎదురు చూడలేదు. అతనికి ఎందుకో విశ్వేశ్వరయ్య మీద చాలా జాలి కలిగింది. వెంటనే వెనక్కి బయలుదేరాడు. అతను వెళ్ళేసరికి ఇంకా అక్కడే ఉన్నాడు విశ్వేశ్వరయ్య, కండువాతో గాలి విసురుకుంటూ..!


 "ఏం బాబూ.. ఇప్పుడైనా రిక్షా ఎక్కుతా రేటి... లేక నడిచేగల్రా?” అన్నాడు సింహాచలం నవ్వుతూ


ఇబ్బందిగా చూశాడు విశ్వేశ్వరయ్య.


"నేనింటికే గదేటిపోతుంట.. డబ్బులొద్దులెండి.. రండి రిక్షా ఎక్కండి ఊళ్ళో దించుతాను..!”


ఒక క్షణం తటపటాయించి రిక్షాఎక్కాడు విశ్వేశ్వరయ్య. రిక్షా ఊళ్ళోకి బయల్దేరింది.


 "అవును గానీ బాబూ తమరెవరి కోసం వచ్చారేటి మా ఊరు..?" అడిగాడు సింహాచలం. 


దాయాల్సిన అవ సరం కనిపించలేదు, ఆయనకి.


విశ్వేశ్వరయ్య భేషజం లేకుండా చెప్పాడు.

"ఈ ఊళ్ళో అడ్డాల శివన్నారాయణగారని ఉన్నారట కదా? వాళ్ళ బావమరిది కాంతారావు మా ఇద్దరబ్బాయిలకీ వ్యాపారంలో ముప్ఫైవేలకి టోపీపెట్టి పారిపోయి ఈ ఊరొచ్చాడని..”


రిక్షాకి సడెన్ బ్రేక్ పడింది, గిర్రున వెనక్కి తిరిగాడు సింహాచలం.


“శివన్నారాయణ బాబుకి ఒక్కడే బామ్మర్ది కదేటి.. పేరు ఎర్రబాబు గదేటి..? " అడిగాడు ఆశ్చర్యంగా ఏదో ఆలోచిస్తూ!


విశ్వేశ్వరయ్య కళ్ళలో కుతూహలం తొంగిచూసింది.


 "అవునవునవును.. పేరు కాంతారావే కానీ ఎర్రబాబని కూడా అంటారట్లే!”


 "ఆ బాబుని ఇప్పుడే గదేటి... మీ ముందే గదేటి తీస్కెళ్ళి బస్సెక్కించా..!? " అన్నాడు. సింహాచలం, చాలా ఆశ్చర్యపడి పోతూ..


విశ్వేశ్వరయ్య బుర్ర గిర్రున తిరిగిపో యింది. అతనివైపు జాలిగా చూస్తూ ఇందాక ఊళ్ళో శివన్నారాయణ ఇంటిదగ్గర జరిగిందంతా వివరంగా చెప్పాడు సింహాచలం.


విశ్వేశ్వరయ్యకి పూర్తిగా అర్థమైపో యింది. ఇక ఊళ్ళోకి వెళ్ళడం అనవసరమని, అదృష్టానికీ దురదృష్టానికీ మధ్య తేడా భీమవరం బస్టాండ్లో అయితే గంటన్నర అనీ..!


మొహంలో ఏ భావమూ లేకుండా వేదాంతిలా కూర్చున్న విశ్వేశ్వరయ్యని జాలిగా చూస్తూ-'మట్టపాలెం అడ్డరో డ్డు'లో రిక్షాని మళ్ళీ వెనక్కి తిప్పాడు సింహాచలం!

***


జె ఎస్ వి ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జె ఎస్ వి ప్రసాద్

పరిచయం: జె ఎస్ వి ప్రసాద్



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page