top of page
Original.png

మాయా లోకం

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #మాయాలోకం, #MayaLokam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, కొసమెరుపు


Maya Lokam - New Telugu Story Written By - Malla Karunya Kumar Published In manatelugukathalu.com On 27/01/2026

మాయా లోకం - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


"ఈ అవకాశం మిస్ కాకూడదు. ఎలాగైనా నేను సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి స్థానం సంపాదించాలి." అంటూ ఊహల్లో తేలిపోతుంది పల్లవి!. సాధారణంగా సినిమా ప్రయత్నాలకైతే వెళ్ళడం ఇష్టం లేదు. కానీ, తన మిత్రుడు, వరసకు అన్న అయిన దుర్యోధన ఉద్యోగం చూశానని చెప్పడంతో, ఉద్యోగం చేస్తూ, సినిమా ఇండస్ట్రీలో స్థానం సంపాదించవచ్చని ప్లాన్ చేసుకుంది.


దుర్యోధన ఆ ఊరి వ్యక్తే, పైగా అతని కుటుంబం పల్లవి తండ్రికి సంబంధించిన వాళ్ళే. ఎప్పుడో గ్రామం నుండి వలస వెళ్ళి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. చాలా రోజుల తర్వాత అతను ఊరు వచ్చి, తన గురించి వివరాలు చెప్తూ రాములను కలిశాడు. వివరాలన్నీ తెలుసుకొని, ఎప్పుడో ఆ గ్రామం నుండి వలస వెళ్ళిపోయిన తమ కుటుంబానికి సంబంధించిన వాడని దుర్యోధనను హక్కును చేర్చుకున్నాడు రాములు. అప్పటి నుండి పల్లవి కుటుంబంలో దుర్యోధన ఒకడైపోయాడు. ముందు తాను ఎటువంటి ప్రయత్నాలు చేయనని అనుకుంది. కానీ, దుర్యోధన చొరవ తీసుకొని, పల్లవి తల్లిని, తండ్రిని ఒప్పించాడు. దుర్యోధన కూడా నమ్మకస్తుడు కావడం తో, పల్లవి తల్లిదండ్రులు కూడా అంగీకారం తెలిపారు.


కిటికీ నుండి బయటకు చూస్తుంది. నెమ్మదిగా వెలుతురు తెరలు తెరలుగా చీకటిని నిద్రపుచ్చుతూ తాను మేల్కొంటుంది. ఊయల ఊపుతున్నట్టుగా రైలు నిదానంగా సాగుతుంది. ఇంకో స్టేషన్ సమీపించడంతో రైలు కూత పెడుతూ, నెమ్మదించింది. ఒక్కసారిగా తన ఊహల్లో నుండి బయటకు వచ్చింది పల్లవి. రైలు ఆగడంతో కొంతమంది జనాలు లోపలికి వస్తున్నారు. వాళ్ళను చూస్తూ ఉంది పల్లవి. వాళ్లు లోపల ఖాళీగా ఉండడంతో లోపలికి వెళ్ళిపోయారు. ఇంతలో పల్లవి ఫోన్ మ్రోగింది!. తీసి చూసేసరికి దుర్యోధన ఫోన్ చేస్తున్నాడు.


"వీడికి నేనంటే ఎంత బాధ్యత! ఈ సమయంలో కూడా నా గురించే ఆలోచిస్తున్నాడు." అని తనలో మురిసిపోతూ, "చెప్పరా అన్నా!, ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు?" ఫోన్ ఎత్తుతూ అడిగింది.


"అదే, నువ్వు ఈరోజు ట్రైన్ ఎక్కుతావని చెప్పావు కదా. బయలుదేరావా, లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను."


"పర్లేదు, ఈ చెల్లెలి మీద నీకు చాలా ప్రేమ ఉంది!"


"ఆ మాత్రం లేకపోతే ఎలా? జాగ్రత్త, అసలే రోజులు బాగాలేవు. నువ్వు నాకు టచ్లో ఉండు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు దుర్యోధన.


ఫోన్ తన బ్యాగ్‌లో పెడుతూ, మళ్ళీ ఊహల్లో తేలిపోతుంది పల్లవి. ఎవరో పిలిచినట్టు అనిపించడంతో, ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూసింది పల్లవి. ఎదురుగా సాదాసీదా చీర కట్టుకొని, చెదిరిన జుట్టుతో, పక్కనే ఒక పిల్లాడితో ఉంది ఒకామె. ఆమె వైపు ఎగాదిగా చూస్తూ, "ఎవరు నువ్వు? ఏం కావాలి?" ఆశ్చర్యంతో అడిగింది పల్లవి.


"అమ్మా!, బిస్కట్లు ఏమైనా కావాలా? కొంటారా?" ముఖాన బిస్కెట్ ప్యాకెట్ పెడుతూ అంది ఎదురుగా ఉన్న ఆమె.


ఆమెను ఎగాదిగా చూసింది, పక్కనే ఒక బ్యాగ్ ఉండడం గమనించి, ఆమె బిస్కట్లు అమ్మే స్త్రీ అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, "నాకేం అవసరం లేదు." అని ముఖం పక్కకు తిప్పుకుంది పల్లవి.


"మీదే మొదటి బేరం తల్లి, చూస్తుంటే మహారాణిలా ఉన్నావు! నీ చేతితో బోణీ కొట్టు తల్లి. ఒక ప్యాకెట్ కొను తల్లి. ఈ బిస్కెట్ ప్యాకెట్లు చెల్లితే మా రోజు గడుస్తుంది తల్లి." బ్రతిమాలుతూ అంది ఆమె.


"చూస్తుంటే వదిలే రకం లా లేదు!" అని అసహనంతో, తన హ్యాండ్ బ్యాగ్‌లో నుండి పది రూపాయలు తీసి, ఇచ్చి ఒక బిస్కట్ ప్యాకెట్ తీసుకుంది. నవ్వుతూ బిస్కట్ ప్యాకెట్ ఇచ్చింది ఆమె.


"ఏంటి, రోజూ ఇక్కడే తిరుగుతుంటావా?" ఆరా తీసింది పల్లవి.


"లేదమ్మా, తర్వాత స్టేషన్‌లో దిగిపోతాను. వేరే ఊరు నుండి వస్తున్నాను. ఎక్కడో ఒక దగ్గర తిరుగుతూ బిస్కట్లు అమ్ముతుంటాను." అని చెప్పింది ఆమె.


ఆమె సమాధానం వినకుండానే కిటికీ వైపుకు చూపు పోనిచ్చింది, బయటకు చూస్తూ ఉండిపోయింది పల్లవి. పల్లవి అటువైపుకు తిరగడంతో, ఒక నిట్టూర్పు తీసి, అక్కడ నుండి కదిలింది ఆమె.


కిటికీలోనుండి వెనక్కి పరుగుతీస్తున్న పొలాలు, చెట్లు ఇవన్నీ కూడా ఏదో తెలియని హుషారు కలిగిస్తున్నాయి!. జోరుగా వీస్తున్న గాలి ఆమె ముంగురులని తడుతూ ఆడుకుంటుంది. మెల్లగా పల్లవి నైనాలు నిద్రను అందుకుంటున్నాయి. కొంత సమయానికి ఆమె నిద్రలోకి జారుకుంది.


చాలా సమయం ప్రయాణం తర్వాత ఒక్కసారిగా ట్రైన్ కుదుపుతో తెలివిలోకి వచ్చింది పల్లవి. శ్రీకాకుళం స్టేషన్ రావడంతో జనాలు తాకిడి పెరిగింది. ఎక్కి దిగే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళను చూసింది. కానీ, తనకు ఏదో వెలితిగా అనిపించింది. ఏమిటా అని సందిగ్ధంలో పడుతూ తన మెడ తడుముకుంది. ఒక్కసారిగా తన గుండె ఆగినంత పనయ్యింది. రెండు తులాల బంగారం గొలుసు కనిపించడం లేదు! కంగారు పడుతూ వెతకడం మొదలు పెట్టింది. ఎక్కడా కనిపించలేదు! ఎవరో కొట్టేశారని అనుమానం కలిగింది.


'అయినా ఎవరు కొట్టేస్తారు? నేను తప్పించి ఇప్పటి వరకు ఇక్కడ ఎవరూ లేరు కదా?' అని అనుకుంటూ మరొక్కసారి వెతికింది. లాభం లేకుండా పోయింది. మెల్లగా ట్రైన్ హార్న్ శబ్దం వినిపిస్తుంది. ట్రైన్ కదలడానికి సిద్ధమవుతుంది. ట్రైన్ కదలడంతో పల్లవిలో కంగారు ఎక్కువైంది. ఏమి చేయాలో తెలియని స్థితి!


ఒక్కసారిగా ఆమె చూపు కిటికీ వైపుకు పోనిచ్చింది. అంతకు ముందు తనకు బిస్కెట్ ప్యాకెట్ అమ్మిన ఆ స్త్రీ, తన పిల్లాడితో దిక్కులు చూస్తూ, బెరుకుగా వెళ్ళడం పల్లవి కంట పడింది!. ఆమెను ఆ విధంగా చూసిన తర్వాత పల్లవి అనుమానం బలపడింది. వెంటనే తన బ్యాగ్ తీసుకొని, ట్రైన్ గబగబా దిగింది. చూసేసరికి ఆమె కనిపించడం లేదు.


'సందేహం లేదు ఆమె నా చైన్ కొట్టేసింది. మొదటిసారి నన్ను చూసినప్పుడు ఆమెను నేను గమనించాను. ఆమె చూపుల్లో తేడా!, ఆమె వాలకం అనుమానం కలిగించింది! కానీ, ఇలా నాకు తెలియకుండా ఎలా తీయగలిగింది? ప్రొఫెషనల్ దొంగ అనుకుంటా? ఇప్పుడు ఆ చైన్ నాకు దొరకాలి. దానికోసం అమ్మానాన్న ఎంత శ్రమ పడ్డారు. లక్షల రూపాయలు విలువ చేసే చైన్ ఎంత కష్టపడితే నా లాంటి వాళ్లకు అది దొరుకుతుంది." అని తనలో అనుకుంటూ చుట్టూ వెతుకుతుంది.


దూరంగా ప్లాట్‌ఫాం దాటుతూ కనిపించింది ఆమె. వేగంగా ఆమె వైపుకు పరుగుతీసింది. పల్లవి తనని పట్టుకోవడం అసాధ్యమని భావించిన ఆమె, ప్లాట్‌ఫారం దాటిన తర్వాత ఊపిరి పీల్చుకుంటూ, నెమ్మదిగా అడుగులు వేస్తుంది.


ఆమె ఎటువైపు వెళుతుందో చూసిన పల్లవి. వేగంగా ఆమె కంటే ముందే అక్కడికి చేరుకొని, ఆమె ముందు నిలబడింది!.


"చాలా బాగా ప్లాన్ చేశావు. మర్యాదగా నా చైన్ నాకు ఇవ్వు." అని అడిగింది పల్లవి. పల్లవి ఎదురుగా నిలబడి ఉండడం చూసిన ఆమె కంగారు పడి, షాక్ అవుతూ నిలబడిపోయింది.


పిల్లాడు ఏడవడం మొదలు పెట్టాడు. "రేయ్ నోరుముసుకోరా, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు చేసిన పనికి నేను ఎంత ఏడ్చేదానిని రా, మీరు నా కంట పడ్డారు కాబట్టి సరిపోయింది. ముందు నా చైన్ ఇవ్వండి." అంటూ వేగంగా తన ఫోన్ తీసి వాళ్ల ఫోటోలు తీసింది.


"మర్యాదగా నా చైన్ ఇవ్వండి. లేదంటే మిమ్మల్ని నలుగురిలో పెడతాను." బెదిరించింది పల్లవి. బిక్కుబిక్కుమంటూ తన బ్యాగ్‌లో నుండి చైన్ తీసి, పల్లవికి ఇచ్చి, ఒక్కసారిగా మోకాళ్ళ మీద కింద పడి, చేతులు జోడిస్తూ తల దించుకుంది. తన చైన్ తీసుకుంటూ, "ఇలాంటి బుద్ధి ముందే ఉండాలి. ఇలా ఎంతమంది దగ్గర కాజేశావు? మిమ్మల్ని ఊరికే వదలను. పోలీసులకు మీ ఫోటోలు ఇచ్చి, మీ మీద ఫిర్యాదు చేస్తాను." కోపంతో అంది పల్లవి.


"అమ్మా, చాలా ఇబ్బందుల్లో ఉండి, ఈ పని చేశానమ్మా. దయచేసి నన్ను విడిచిపెట్టు." చేతులు జోడిస్తూ అంది ఆమె.


"నీలాంటి వారు ఇలాంటి డ్రామాలు చాలా చేస్తుంటారు. తప్పించుకోవడానికి, నేను విడిచిపెట్టను." ససేమిరా అంది పల్లవి.


ఆమె ఇంకా కాళ్లు పట్టుకొని ప్రాధేయపడుతూ బ్రతిమాలుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే "కాంతం! ఏం జరిగింది?" స్వరం వినిపించడంతో పక్కకు తిరిగి చూశారు పల్లవి, కాంతం.


భర్త రాజేష్‌ను అక్కడ చూసి, "ఏవండీ!" అని అంటూ పరుగుతీసి, భర్త దగ్గరకు చేరుకొని, జరిగిందంతా వివరంగా చెప్పింది.


అంతా విన్న అతను, పల్లవి దగ్గరకు వస్తూ, "అమ్మా, క్షమించండి! ఆదాయం లేక, తినడానికి తిండి లేక, హఠాత్తుగా వచ్చి పడిన ఈ ప్రమాదం కారణంగా వైద్యానికి కూడా ఖర్చులు లేక, ఏమీ చేయాలో తోచక నా భార్య కాంతం ఈ పని చేసింది. ఈసారికి క్షమించండమ్మా, మళ్ళీ ఈ తప్పు జరగదు." రెండు చేతులు జోడిస్తూ అన్నాడు అతను.


అతన్ని చూసి ఆలోచనల్లో పడింది, 'ఈ వ్యక్తిని ఎక్కడో చూశాను.. కానీ, ఎక్కడన్నది గుర్తుకు రావడం లేదు?' తనలో అనుకుంటూ ఉండగా, తన మొబైల్ మ్రోగింది. చూసేసరికి ఇంటి నుండి ఫోన్ వస్తుంది. వేగంగా ఫోన్ ఎత్తి మాట్లాడింది. తల్లిదండ్రులు మాట్లాడి జాగ్రత్తలు చెప్పారు. మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేసింది.


సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తిని ఎక్కడ చూసిందో పల్లవికి గుర్తుకు వచ్చింది. 'అవును, ఇతన్ని దుర్యోధన అన్న చూపించిన గ్రూప్ ఫోటోలో చూశాను.' అని నిర్ధారణకు వచ్చింది. చాలా ఫోటోలు చూడటం కారణంగా, ఎక్కువగా ఆ ఫోటోలో ఈ వ్యక్తి ఉండడం కారణంగా తన మైండ్‌లో ఈ వ్యక్తి ఫోటో నిక్షిప్తమైంది.


వెంటనే ఆలోచనల నుండి బయటకు వస్తూ, "నీకు దుర్యోధన తెలుసా?" వేగంగా తన మొబైల్ తీసి, దుర్యోధన ఫోటో తీసి చూపిస్తూ అడిగింది.


ఆ ఫోటో చూసి, ఆ పేరు విని అతనిలో కంగారు పెరిగింది. కళ్లు పెద్దవి చేస్తూ, "అతను మీకు ఎలా తెలుసు? అతను మిమ్మల్ని ఇక్కడికి పంపించాడా?" అడిగాడు అతను కంగారు పడుతూ.


ఆశ్చర్యంతో, "లేదు, అతను నాకు అన్న వరస అవుతాడు. అతను చూపించిన గ్రూపు ఫోటోలో మిమ్మల్ని చాలాసార్లు చూశాను. కానీ, మీరు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఏమైంది?" అడిగింది.


ఆశ్చర్యపోతూ, "అతను నేను మంచి స్నేహితులం ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. అతను మీకు అన్న అవుతాడు అంటున్నారు?" అడిగాడు.


"అన్న అంటే మా బంధువుల అబ్బాయి. అతనే హైదరాబాద్లో ఉద్యోగం చూశానని చెప్పడంతో ఇప్పుడు వెళ్తున్నాను. ఇంతలో మీ భార్య నా చైన్ దొంగతనం చేసింది. అప్పుడు మీపై నమ్మకం కుదరలేదు. కానీ మీతో మాట్లాడిన తర్వాత, పైగా మీరు దుర్యోధనకు తెలుసన్న కారణంతో మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను."


"దుర్యోధన మీకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడా! వద్దు తల్లి, వాడొక దుర్మార్గుడు, నీలాంటి వారిని ఏమార్చి, తన దగ్గరకు రప్పించుకొని, విదేశాలకు అమ్మేసే వ్యక్తి. వాడికి మంచి ఉద్యోగం ఉండి కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడు." చెప్పాడు రాజేష్.


అతను చెప్పింది విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది పల్లవి. "ఏం మాట్లాడుతున్నారు! అతను అలాంటి వాడు కాదు. మీకు అతనికి ఏమైనా గొడవ జరిగిందా?"


"గొడవ జరిగిన మాట నిజమే, వాడి బాగోతం తెలిసి, స్నేహితుడని వాడిని మందలించాను. నా మీద కోపం పెంచుకొని, వాడి క్రిమినల్ మైండ్‌తో నా మీద లేనిపోని ఆరోపణలు చేసి, అబద్ధపు సాక్ష్యాలు చూపించి, కంపెనీకి నా కారణంగా నష్టం జరిగిందని తప్పుడు లెక్కలు చూపి, నా ఉద్యోగం పోయేలా చేశాడు. చివరికి కంపెనీ నా నుండి రికవర్ చేయడానికి సిద్ధమైంది. అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉంది. వాళ్ల నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నాను. ఇదుగో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి కాలు, చెయ్యి విరిగి ఇలా అయిపోయాను. నా భార్య ఇప్పుడు నన్ను, నా కొడుకును పోషిస్తుంది." చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ చెప్పాడు అతను.


'అతని మాటలు నమ్మశక్యంగా ఉన్నాయి. నిజం కాకపోతే తనకి ఈ దుస్థితి ఎందుకు కలుగుతుంది? అమ్మానాన్న ఆశీర్వాదం కారణంగా ఆ దుర్యోధన బాగోతం తెలిసింది ఈ విధంగా.' అని తనలో అనుకుంటూ, తనకు తోచిన సహాయం వాళ్లకు చేసి, రాజేష్ వివరాలు తీసుకొని అక్కడ నుండి బయలుదేరింది పల్లవి.


తిరిగి ఇంటికి బయలుదేరడానికి సిద్ధమైంది. "ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? మనిషిని నమ్మకూడదా?" తనకు తనే ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంది.


"ఒకవేళ ఆమె నా చైన్ దొంగలించక పోయి ఉంటే? ఇతను నాకు ఎదురుపడక పోయి ఉంటే.. నా పరిస్థితి ఏమిటి?" సమాధానం లేని ప్రశ్నకు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మాయ మాటలు చెప్పే జిత్తులమారి మనుషులు ఉన్న ఈ మాయా లోకంలో ప్రతి అడుగు వంద ప్రశ్నలు సంధించుకున్నాక వేయాలని విధి నేర్పిన పాఠం ద్వారా తెలుసుకుంది.


"ఇలాంటి దుర్మార్గులను విడిచిపెట్టకూడదు. ఇలా వదిలేస్తే ఇంకా ఎందరి జీవితాలతో ఆడుకుంటారో." అని అతని మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి పథకం సిద్ధం చేసింది.

 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page