top of page
Original.png

జాబ్ కవచం


Job Kavacham - Telugu Story on Social Problems | Vasundhara Rani Munipalle

జాబ్ కవచం తెలుగు సామాజిక కథ | వసుంధర రాణి మునిపల్లె

Published in manatelugukathalu.com on 04/04/2026


హైదరాబాద్‌లోని ఆ హైటెక్ సిటీ గాలిలో ఎప్పుడూ ఒక రకమైన వేగం ఉంటుంది. కానీ ఈ సోమవారం ఉదయం నియో టెక్ సాఫ్ట్‌వేర్ పార్కులో వాతావరణం కాస్త భిన్నంగా ఉంది. ఆఫీసు మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ చెకింగ్ కంటే ఎక్కువ రద్దీ బేస్‌మెంట్ వైపు వెళ్లే దారిలో కనిపిస్తోంది. అది కొత్త ప్రాజెక్ట్ కిక్‌ఆఫ్ మీటింగ్ వల్ల కాదు, అక్కడ వెలిసిన ఒక వింత స్టాల్ వల్ల.


శ్రీకాంత్ తన డెస్క్ దగ్గర కూర్చుని గ్లాస్ విండో గుండా బయట కనిపిస్తున్న వర్షాన్ని, తన మానిటర్ మీద ఉన్న కోడ్ ని మార్చి మార్చి చూస్తున్నాడు. పక్కనే ఉన్న విష్ణు ముఖం వెలవెలబోయి ఉంది. విష్ణుకి ఇప్పుడే హెచ్ఆర్ నుంచి మెయిల్ వచ్చింది—అది పింక్ స్లిప్. ఏఐ (AI) తో వచ్చే ఆటోమేషన్ వల్ల మా కంపెనీలో చాలా పాత్రల అవసరం లేదు అని ఆ మెయిల్‌లో స్పష్టంగా ఉంది. పదేళ్ల అనుభవం, వందల సక్సెస్‌ఫుల్ డెలివరీలు ఉన్నా, ఈ ఏఐ గండం ముందు అవన్నీ తలవంచక తప్పలేదు. రేపటి నుంచి విష్ణు ఈ డెస్క్ మీద ఉండడు.



సరిగ్గా అదే సమయంలో కింద నుంచి మైకులో ఒక గంభీరమైన అనౌన్స్‌మెంట్ వినిపించింది. ఐటి మిత్రులారా! రిసెషన్ భయం వద్దు, ఏఐ (AI) టెక్నాలజీ వల్ల ఉద్యోగం కోల్పోయే భయం వద్దు! మా జాబ్ కవచం ధరించండి. ఇది కేవలం మాల కాదు, మీ కెరీర్‌కు ఒక సాఫ్ట్‌వేర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ధరిస్తే పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది, ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటుంది. గ్రహగతులు మారతాయి, ప్రమోషన్లు వరిస్తాయి!


అర్థం కాలేదు. కానీ ఆశ్చర్యకరంగా, లక్షల్లో జీతాలు తీసుకునే ఇంజనీర్లు, టీమ్ లీడర్లు కూడా క్యూ కట్టి ఆ మాలలు కొంటున్నారు. ఆ మాల అమ్మే వ్యక్తి సాదాసీదా పూజారిలా లేడు. ఖరీదైన టై కట్టుకుని, చేతికి లేటెస్ట్ స్మార్ట్ వాచ్ పెట్టుకుని, పిపిటి ప్రెజెంటేషన్ ఇస్తున్నంత కాన్ఫిడెంట్‌గా మార్కెటింగ్ చేస్తున్నాడు.


విష్ణు కూడా నెమ్మదిగా తన సీట్లో నుంచి లేచి ఆ క్యూ వైపు వెళ్లబోయాడు. శ్రీకాంత్ వెంటనే అతడిని అడ్డుకున్నాడు. “ఏంట్రా విష్ణు ఇది? పీజీలు చేసి, లాజిక్ తో బతికే నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతున్నావా?” అని అడిగాడు. 


దానికి విష్ణు నీరసంగా నవ్వి, “లాజిక్ పని చేయనప్పుడు మ్యాజిక్ ని నమ్మక తప్పదు శ్రీకాంత్. కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్‌లను ఏఐ రీప్లేస్ చేస్తుంటే, నా స్కిల్ మీద నాకు నమ్మకం ఉన్నా, కంపెనీ తీసేస్తుంటే నా చేతుల్లో ఏముంది? అదృష్టం ఏమైనా తోడవుతుందేమో అని ఒక చిన్న ఆశ” అని అంటూ వెళ్లి ఆ మాల మెడలో వేసుకుని వచ్చాడు.


మరుసటి రోజు ఆఫీసులో ఒక వింత దృశ్యం ఆవిష్కృతమైంది. సగం మంది డెవలపర్ల మెడలో ఆ నల్లటి కవచ మాలలు మెరుస్తున్నాయి. మీటింగ్‌లలో అందరూ కోడ్ కంటే ఎక్కువగా మెడలోని మాలల గురించే చర్చించుకుంటున్నారు. కానీ విధి వైపరీత్యం ఏంటంటే, సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మేనేజ్మెంట్ నుంచి రెండో లిస్ట్ బయటికి వచ్చింది. అందులో ఆ మాల వేసుకున్న సీనియర్లు కూడా ఉన్నారు.


​మాల వేసుకున్నా ఉద్యోగం ఊడిపోవడంతో, బాధితులంతా ఒక్కసారిగా తిరగబడ్డారు. ఆగ్రహంతో బేస్‌మెంట్‌లో ఉన్న ఆ స్టాల్ దగ్గరికి వెళ్లారు. “మాల వేసుకుంటే ఉద్యోగం పోదని లక్షల రూపాయలు వసూలు చేశావు కదా, మరి ఇప్పుడేమైంది?” అని ఆ వ్యక్తిని నిలదీశారు. విష్ణు కూడా వాళ్లలోనే ఉన్నాడు.


వాళ్ళ గొడవకు అస్సలు తడబడకుండా, ఆ వ్యక్తి ఎదురుదాడి మొదలుపెట్టాడు. “సార్! ఇది మీ కర్మ ఫలం. మీరు కేవలం మాల వేసుకున్నారు కానీ, మీ సిస్టమ్‌లోని నెగటివ్ ఎనర్జీని తీసేయడానికి సర్వర్ గ్లిచ్ శాంతి హోమం చేయించుకోలేదు కదా! మాల అనేది కేవలం ఒక ఫైర్‌వాల్ లాంటిది. మీ కెరీర్ డేటా మొత్తం క్లీన్ అవ్వాలంటే, రేపు మేము నిర్వహించబోయే పింక్ స్లిప్పు గండ నివారణ పూజలో ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. అప్పుడే మీ అకౌంట్‌లో సక్సెస్ ప్యాకెట్లు లోడ్ అవుతాయి” అని చాలా తెలివిగా వాదించాడు.


ఆ సాయంత్రం ఆఫీసు బయట అదే మైకు మళ్ళీ మోగింది. “మాల వేసుకున్నా ఉద్యోగం పోయిందా? అయితే మీ మీద రిసెషన్ దోషం తీవ్రంగా ఉంది. రేపు మా దగ్గర పింక్ స్లిప్పు గండ నివారణ పూజ జరుగుతుంది, సీట్లు పరిమితం, వెంటనే రిజిస్టర్ చేసుకోండి!”


శ్రీకాంత్ తన బ్యాగ్ సర్దుకుంటూ ఆ దృశ్యాన్ని చూసి నిట్టూర్చాడు. ఐటి రంగంలో రిసెషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే తినవచ్చు కానీ, దాన్ని ఆసరాగా చేసుకుని మనుషుల భయం అనే వ్యాపారాన్ని నడిపే ఇలాంటి కిలాడీలకు మాత్రం ఎప్పుడూ లాభాలేనని అతనికి అర్థమైంది. నైపుణ్యం మీద నమ్మకం లేని చోట మూఢనమ్మకం రాజ్యమేలుతుందని అనుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు.


సమాప్తం

ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం www.manatelugukathalu.com సందర్శించండి. 


వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page