మీసాల తాత చిరునవ్వు రహస్యం

Meesala Thatha Chirunavvu Rahasyam - Telugu Moral Story | Merla Srilakshmi
మీసాల తాత చిరునవ్వు రహస్యం - తెలుగు నీతి కథ | మెర్ల శ్రీలక్ష్మి
Published in manatelugukathalu.com on 02/09/2026
మీసాల తాత చిరునవ్వు రహస్యం ఒక చక్కని తెలుగు నీతి కథ. రామాపురం గ్రామంలో అందరికీ ఇష్టమైన మీసాల తాత తన రుచికరమైన పెసరట్లతో పాటు మంచితనం, మానవత్వం, చిరునవ్వుతో అందరి మనసులను గెలుచుకుంటాడు.
ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకుని మనశ్శాంతిని కోల్పోతున్న ఈ రోజుల్లో, కోపాన్ని జయించడం, ఎదుటివారిని క్షమించడం, చిరునవ్వుతో స్పందించడం ఎంత గొప్ప గుణాలో ఈ కథ మనకు ఎంతో సరళంగా చెబుతుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చదవాల్సిన మంచి సందేశాత్మక తెలుగు కథ ఇది.
అనగనగా రామాపురం అనే ఊరిలో మీసాలతాత అనే ముసలాయన ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ ఉదయాన్నే తన ఇంటి ముందు కూర్చుని పెసరట్లు వేసేవాడు. ధర పది రూపాయలే. రుచి అమోఘంగా ఉండటంతో పక్క ఊర్ల నుంచి కూడా జనం వచ్చేవారు.
తాత ఉదయం టిఫిన్ వేసి, అయ్యాక తన రెండు ఆవులు, మూడు గేదెలను మేపుకుని పొలం వెళ్ళేవాడు. సాయంత్రం వచ్చేటప్పుడు రైతులు ఇచ్చే వంకాయలు, ములక్కాడలు, ఆనపకాయలు తెచ్చుకునేవాడు. వాటిని వీధిలో వాళ్లకు, పక్కింటి వాళ్లకు పంచేవాడు.
పిల్లలకైతే దారిలో దొరికే తేగలు, చింతకాయలు, మామిడికాయలు తెచ్చి ఇచ్చేవాడు. అందుకే ఊరంతా మీసాల తాత అంటే గౌరవం, అభిమానం.
ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన గోపి అనే పిల్లవాడు, తాత మామిడికాయలు ఇస్తుంటే తినకుండా మొహం మీదకి విసిరి వెళ్ళిపోయాడు. తాత ఏమీ అనుకోకుండా నవ్వి ఊరుకున్నాడు.
అది చూసిన ఆ వీధిలో ఉండే రజని, “తాతా! వాడు అలా విసిరినందుకు నీకు కోపం రాలేదా?” అని అడిగింది.
దానికి తాత నవ్వుతూ, “కోపంతో ఏమి వస్తుందమ్మా? వాడికి నేనెవరో తెలియదు కాబట్టి వద్దని విసిరాడు. తెలిస్తే ఇలా చేయడు కదా!” అన్నాడు.
“ఏమో తాతా, నాకైతే చాలా కోపం వచ్చింది” అంది రజని.
“ఎందుకమ్మా కోపం? కోపం వల్ల లాభం ఏముంది? మనసు పాడు చేసుకోవడం ఎందుకు? నలుగురితో హాయిగా నవ్వుతూ బ్రతకాలి” అన్నాడు తాత.
రోజూలాగే తాత పెసరట్టు, ఉప్మా చేస్తుంటే గోపి వచ్చి నిలబడ్డాడు. తాత చిరునవ్వుతో ప్లేట్ అందించాడు. గోపి కడుపునిండా తిని, “డబ్బులు మర్చిపోయాను, మళ్ళీ ఇస్తాను” అని వెళ్ళిపోయాడు.
“సరే బాబూ, పుస్తకంలో రాసుకుంటాను” అన్నాడు తాత.
అలా వారం రోజులు వరుసగా తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయేవాడు గోపి.
రజని, “తాతా! ఈ పిల్లాడు కావాలనే నాటకం చేస్తున్నాడు” అంది.
“ఇస్తానని చెప్పాడు కదా, ఎదురు చూద్దాం” అన్నాడు తాత, మొహంలో చిరునవ్వు చెదరకుండా.
రజని ఊరుకోలేక గోపి వాళ్ళ అమ్మకు చెప్పింది. గోపి మాత్రం “నేను తినలేదు” అని అబద్ధం చెప్పాడు.
రజని బాధపడుతూ తాతతో చెప్పింది, “ఇక నీ డబ్బులు పోయినట్టే తాతా!”
తాత నవ్వి, “పర్లేదులే తల్లీ! వాడెంత తిన్నాడు? వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు. డబ్బుతో ఏముంది?” అన్నాడు.
మర్నాడు గోపికి తాత పెసరట్టు తినాలని బాగా కోరిక కలిగింది. కానీ డబ్బులు ఇవ్వకుండా అబద్ధం చెప్పినందుకు తాత ముందుకు వెళ్ళలేకపోయాడు. తల దించుకుని వెళ్ళిపోయాడు.
చివరకు తట్టుకోలేక, తను దాచుకున్న డబ్బాలోని డబ్బులు తీసుకుని ఉదయాన్నే తాత దగ్గరికి వచ్చాడు.
“తాతా! నేను చాలా తప్పు చేశాను. ఇదిగో నీ డబ్బులు!” అని ఇచ్చి వెళ్ళబోయాడు.
తాత ఆపి, “బాబూ! ఈ తాత పెసరట్టు తినకుండా వెళ్తావా?” అన్నాడు.
“ఈరోజుకి డబ్బులు లేవు తాతా” అన్నాడు గోపి.
“పర్లేదు బాబూ! ఇప్పుడు ఇచ్చినట్టు తర్వాత ఇవ్వు. ఖాళీ కడుపుతో బడిలో పాఠాలు బుర్రకెక్కవు. కడుపు నిండా తిని వెళ్ళు” అన్నాడు.
గోపి నవ్వేసి కడుపునిండా తిని వెళ్ళాడు. అది చూసి రజని ఆశ్చర్యపోయింది.
“తాతా! మీ మొహంలో చిరునవ్వు ఎప్పుడూ అలాగే ఉంటుంది, కోపమే రాదా?” అని అడిగింది.
అప్పుడు తాత చెప్పాడు –
“జీవితంలో ప్రశాంతంగా బ్రతకాలంటే ప్రతి విషయానికి స్పందించడం మానేయాలి. బదులుగా చిరునవ్వు, లేదా మౌనంగా ఉండాలి. అదే అన్ని సమస్యలకి సమాధానం.”
రజని, “నిజమే తాతా! ఇక నుండి నేను కూడా ఎవరితో గొడవపడను, కోప్పడను. అందరితో మంచిగా ఉంటాను!” అంది.
కథలో నీతి: కోపం వల్ల మనశ్శాంతి పోతుంది. క్షమ, చిరునవ్వు, మౌనం మనల్ని ప్రశాంతంగా ఉంచుతాయి, ఎదుటివారిలో కూడా మార్పు తెస్తాయి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మెర్ల శ్రీలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నా పేరు మెర్ల శ్రీలక్ష్మి






Comments