నిజమైన సంపాదన
- Karlapalem Hanumantha Rao

- 1 hour ago
- 6 min read

Nijamaina Sampadha - Telugu Inspirational Story | Karlapalem Hanumantha Rao
నిజమైన సంపాదన - తెలుగు ప్రేరణాత్మక కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 02/09/2026
“బాధలో ఉన్నవాడికి ముందుగా కావాల్సింది బలం కాదు… తోడు.” అనే భావనతో రవి తీసుకున్న నిర్ణయం అతని జీవితానికే కొత్త అర్థాన్ని ఇస్తుంది.
డబ్బు సంపాదించడం ఒక విషయం. కానీ ఒక మనిషికి ఉపాధి, ఆత్మవిశ్వాసం, గౌరవం, తోడు ఇవ్వగలగడం మరో విషయం. అదే ఈ కథ చెప్పే “నిజమైన సంపాదన”.
వాన ఆగిపోయినా మియాపూర్ రోడ్ల మీద నీళ్లు నిలిచే ఉన్నాయి.
ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగొస్తున్న వాళ్లంతా రోడ్డు పక్కన నిలబడి ఆటోలు, క్యాబ్‌లు, బస్సుల కోసం చూస్తున్నారు. ఆగేవి కొన్నే అయితే, ఫుట్‌పాత్ మీద నిలబడ్డవాళ్ల కాళ్ల మీద నీళ్లు చిమ్ముకుంటూ పోయేవే ఎక్కువ.
రవి మాత్రం ఓ టీ కొట్టు షెడ్ కింద నిలబడి ఫోన్‌లో బ్యాంక్ అకౌంట్ చూసుకుంటున్నాడు. ఖాతాలో ఉన్న మొత్తం మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు.
ఇంట్లో అద్దె బకాయి... అమ్మ మందుల ఖర్చు... చెల్లెలి కాలేజీ ఫీజు...
ఉద్యోగం పోయి నాలుగు నెలలయింది. ఆ నాలుగు నెలల్లో అతను విన్న మాట ఒక్కటే— “ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే.”
అతను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఉద్యోగాల కోసం అప్లై చేశాడు. ఇంటర్వ్యూలకు వెళ్లాడు.
కొన్ని చోట్ల అనుభవం తక్కువ అన్నారు. కొన్ని చోట్ల వయసు ఎక్కువ అన్నారు. ఒక చోట జీతం పదిహేను వేలు అన్నారు.
హైదరాబాద్‌లో పదిహేను వేలతో బతకగలవా అని రవి వాళ్లను అడగలేదు. సైలెంట్‌గా బయటికి వచ్చేశాడు.
ఆ సాయంత్రం ఫోన్‌లో ఒక ప్రకటన కనిపించింది.
“మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక్కరోజే చాలు.”
కింద పెద్ద అక్షరాల్లో—
“విజయ్ వర్మ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మాస్టర్‌క్లాస్.”
ఫీజు ₹4,999.
రవి చాలాసేపు ఆ ప్రకటన చూస్తూ కూర్చున్నాడు.
“నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది…”
అతని పక్కన టీ పోస్తున్న దుకాణం అబ్బాయి అదోలా నవ్వాడు.
“సార్, టీ చల్లారిపోతోంది.”
టీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు. ఒక నిశ్చయానికి వచ్చాడు.
‘ఉద్యోగం దొరక్కపోతే… ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి.’
ఆ రాత్రే ఫీజు కట్టేశాడు.
మరుసటి ఆదివారం హైటెక్ సిటీ దగ్గరున్న సన్‌రైజ్ హోటల్ బాల్‌రూమ్‌లో కార్యక్రమం జరిగింది.
వేదిక మీద పెద్ద తెర. దానిమీద ఒకే మాట—
“నువ్వు అనుకున్నదానికంటే నువ్వు గొప్పవాడివి.”
విజయ్ వర్మ వేదిక మీదికి వచ్చాడు.
నలభై ఏళ్ల వయసు. ఖరీదైన సూట్. మెరుస్తున్న షూస్. చేతిలో మైక్.
వెనక పెద్ద స్క్రీన్ మీద సముద్రం మధ్య నిలబడి చేతులు చాచిన అతని ఫొటో.
“మీరు ఎందుకు పేదవాళ్లుగా ఉన్నారో తెలుసా?”
హాల్‌లో నిశ్శబ్దం.
“మీ జేబులో డబ్బు లేకపోవడం వల్ల కాదు.”
ఒక్క క్షణం ఆగాడు.
“మీ లక్ష్యం పెద్ద కల కాకపోవడం వల్ల.”
చప్పట్లు మొదలయ్యాయి.
“మీ సమస్య పరిస్థితులు కాదు. బీయింగ్ నాట్ థింకింగ్ బిగ్.”
రవి చప్పట్లు కొట్టాడు.
ఆ రోజు అతనికి ఒక నోటుపుస్తకం ఇచ్చారు.
మొదటి పేజీలో రాయమన్నారు—“నేను ఓడిపోలేదు. నేను ఇంకా గెలవలేదు.”
రవి రాశాడు.
మధ్యాహ్నానికి—“నా గతం నా భవిష్యత్తును నిర్ణయించదు.”
రవి రాశాడు.
సాయంత్రానికి—“నా బాధే నా బలం.”
రవి రాశాడు.
ఆఖర్లో విజయ్ వర్మ అన్నాడు.
“మీ కథను ప్రపంచానికి చెప్పండి. మనిషి తన బాధను దాచుకుంటే అది బరువవుతుంది. బయటకు చెబితే అదే బలం అవుతుంది.”
రవి ఆ మాటను గట్టిగా నమ్మాడు.
మూడు నెలల తర్వాత రవి ఉద్యోగం కోసం తిరగడం మానేశాడు.
యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు.
పేరు—“రవి రైజ్.”
మొదటి వీడియోలో తన కథ చెప్పాడు.
"ఉద్యోగం పోయింది. అమ్మ అనారోగ్యం. అప్పులు. చెల్లెలి చదువు.... డిటో డిటో డిటో....
“కానీ నేను ఆగలేదు,” అన్నాడు.
వీడియోకి రెండు వందల వ్యూస్ వచ్చాయి.
రెండో వీడియోకి వెయ్యి.
మూడో వీడియోలో అతను ఒక మాట అన్నాడు—
“మీరు పడిపోయారంటే నేల తప్పు కాదు. లేవడానికి మీరు సిద్ధంగా లేరు.”
ఆ వీడియోను ఒక స్థానిక ఛానల్ తీసుకుంది.
అక్కడి నుంచి అతనికి చిన్న చిన్న కార్యక్రమాలకు పిలుపులు రావడం మొదలైంది.
మొదట వెయ్యి రూపాయలు. తర్వాత ఐదు వేలు. తర్వాత పది వేలు.
అతను మాట్లాడేవాడు.
“నీ పరిస్థితిని నిందించకు.”
“నీ కుటుంబాన్ని నిందించకు.”
“నీ అదృష్టాన్ని నిందించకు.”
“నిన్ను నువ్వు మార్చుకో.”
జనం చప్పట్లు కొట్టేవారు.
ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే అతనికి అది తన విజయానికి సంకేతంగా కనిపించేది.
ఒకరోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత... ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చాడు.
“సార్, నాకు ఉద్యోగం లేదు. ఇంట్లో నాన్నకు అప్పులు. నేను ఏం చేయాలి?”
రవి భుజం మీద చెయ్యి వేశాడు. “ముందు నీలోని భయాన్ని చంపు.”
“కానీ సార్… అప్పు వాళ్లు ఇంటికి వస్తున్నారు.”
“నువ్వు పెద్దగా ఆలోచించు.”
“అది ఎలా సార్?”
“చిన్న సమస్యల మీద దృష్టి పెట్టొద్దు. నీ లక్ష్యం మీద పెట్టు.”
ఆ యువకుడు తలవంచుకుని వెళ్లిపోయాడు. రవి తర్వాతి కార్యక్రమానికి బయలుదేరాడు.
ఆరు నెలల్లో... అతని పేరు సోషల్ మీడియాలో బాగా వినిపించింది.
“రవి రైజ్.”
అతని ఫొటోతో పోస్టర్లు. ఆన్‌లైన్ కోర్సులు. వాట్సాప్ గ్రూపులు. ప్రత్యేక శిక్షణలు.
“పేదరికం నుంచి పరిపూర్ణతకు—21 రోజుల ప్రయాణం.”
ఫీజు ₹11,111.
“జీవితాన్ని మార్చే 7 సూత్రాలు.”
ఫీజు ₹21,000.
రవి తల్లి అడిగింది.
“నాన్నా… ఇంత డబ్బు తీసుకుని వాళ్లకి ఏం నేర్పుతావు?”
రవి నవ్వాడు.
“అమ్మా, మనిషికి తన మీద నమ్మకం కలిగించడం.”
“నమ్మకం మంచిదే. కానీ నమ్మకంతో అన్నం వస్తుందా?”
రవి చిరాకుపడ్డాడు. “నీకు ఇవేమీ అర్థం కావు.”
“నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆకలి మాత్రం నాకు అర్థమవుతుంది.”
రవి మౌనంగా ఉండిపోయాడు.
ఆ రోజు అతని ఆఫీసుకి లక్ష్మి అనే మహిళ వచ్చింది.
సుమారు ముప్పై ఐదు ఏళ్లు. చీర అంచు మడతపెట్టుకుంటూ కూర్చుంది.
“సార్… మీ వీడియోలు చూసి వచ్చాను.”
“చెప్పండి.”
“నా భర్త చనిపోయి మూడేళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఇంట్లో టిఫిన్ సెంటర్ నడుపుతున్నాను. బ్యాంక్ లోన్ ఉంది. మీ ‘బిజినెస్ మైండ్‌సెట్’ కోర్సులో చేరితే వ్యాపారం పెరుగుతుందని అనుకున్నాను.”
రవి తలూపాడు. “మంచి ఆలోచన.”
“ఇప్పుడు లోన్ కట్టలేకపోతున్నాను సార్.”
“మీరు భయపడుతున్నారు.”
“అవును.”
“భయాన్ని జయించాలి.”
లక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి. “సార్, భయపడకపోతే బ్యాంక్ నోటీసు ఆగుతుందా?”
రవి సైలెంట్.
“మీరు నా మాటలు నమ్మి కోర్సులో చేరారు కదా?”
“అవును సార్.”
“అయితే మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి.”
లక్ష్మి లేచి నిలబడింది.
“సార్… నన్ను నేను నమ్ముతాను. కానీ నా పిల్లలకు రేపు భోజనం దొరుకుతుందన్న నమ్మకం లేదు.” ఆమె వెళ్లిపోయింది.
ఆ రోజు రవి మొదటిసారి తన ఆఫీసు గోడ మీద వేలాడుతున్న ఫ్రేమ్ చూశాడు.
“నీ బాధే నీ బలం.” ఆ మాట కింద అతని సంతకం.
ఆ రాత్రి రవికి ఫోన్ వచ్చింది.
“రేపటి కార్యక్రమానికి ఐదు వేల మంది వస్తున్నారు,” అన్నాడు నిర్వాహకుడు.
“గుడ్.”
“మీ కొత్త కోర్సు ప్రమోషన్ కూడా చేయాలి.”
“చేస్తాను.”
“చివర్లో ఎమోషనల్ టచ్ ఇవ్వండి. పోయినసారి ఒక అమ్మాయి ఏడ్చింది కదా… అలాంటి అట్మాస్ఫియర్ సృష్టించాలి.”
రవి ఫోన్ పెట్టేశాడు. కిటికీ దగ్గరికి వెళ్లి బయట చూశాడు.
కింద రోడ్డుమీద ఒక చిన్న టీ కొట్టు. వానలో తడిసిన ప్లాస్టిక్ కవర్లు. ఒక బండి. ఆ బండి దగ్గర కూర్చున్న ఓ ముసలాయన టీ తాగుతున్నాడు.
రవి కళ్లకు ఆ వృద్ధుడు కనిపించలేదు. నాలుగు సంవత్సరాల క్రితం తాను కనిపించాడు.
జేబులో మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు. అద్దె బకాయి. అమ్మ మందులు. చెల్లెలి ఫీజు.....
అప్పుడు తనకు ఎవరో ఒకరు “నువ్వు గొప్పవాడివి” అని చెబితే బాగుణ్ణు అనిపించింది.
కానీ తనకు కావలసింది అది కాదని ఇప్పుడు మొదటిసారి అర్థమైంది.
మరుసటి రోజు కన్వెన్షన్ హాల్ నిండిపోయింది.
వేదిక మీద రవి పేరు మెరుస్తోంది: RAVI RAISE
లైట్లు ఆరిపోయాయి.
చప్పట్లు మొదలయ్యాయి.
రవి వేదిక మీదికి నడిచాడు. “మీరు సిద్ధంగా ఉన్నారా?”
హాల్ అంతా ఒక్కసారిగా గర్జించింది.
“యెస్!”
రవి మైక్ పట్టుకున్నాడు.
కొద్దిసేపు అందరినీ చూశాడు.
తర్వాత—
“మీ జీవితాన్ని మార్చేది ఎవరు?”
జనం అరిచారు. “మీరే!”
రవి చిరునవ్వు నవ్వాడు. “అది అబద్ధం.”
హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం.
రవి కొనసాగించాడు.
“కొన్నిసార్లు మన జీవితాన్ని మనం ఒంటరిగా మార్చుకోలేం.”
ఎవరూ కదల్లేదు.
“ఉద్యోగం పోయినవాడికి ‘ధైర్యంగా ఉండు’ అనడం సులువు. కానీ ఉద్యోగం దొరకాలి.... అదీ ముఖ్యం.”
“అప్పుల్లో ఉన్నవాడికి ‘పెద్దగా ఆలోచించు’ అనడం సులువు. కానీ అప్పు తీర్చాలి... అదీ ప్రధానం.”
“పిల్లాడికి ఫీజు కట్టలేని తల్లికి ‘నీ మైండ్‌సెట్ మార్చుకో’ అనడం సులువు. కానీ ఆ ఫీజు ఎవరో కట్టాలి... అదీ అవసరం.”
వెనుక నుంచి ఎవరో చప్పట్లు కొట్టారు. మరికొందరు కలిశారు.
రవి గొంతు వణికింది.
“నేను మీ భయాన్ని అమ్ముకున్నాను.”
హాల్‌లో ఎక్కడో ఒకచోట ఒక మహిళ ఏడుపు వినిపించింది.
“మీ ఆశను కూడా అమ్ముకున్నాను.”
అతను మైక్ కింద పెట్టాడు.
“ఇక నేను మీకు ఉపన్యాసం ఇవ్వను.”
వేదిక వెనక నుంచి నిర్వాహకుడు పరుగెత్తుకొచ్చాడు. “రవి! ఏం చేస్తున్నావ్?”
రవి అతని వైపు చూడలేదు.
“ఈ రోజు నుంచి నేను మాట్లాడటం లేదు.”
అతను ప్రేక్షకుల మధ్యకు దిగిపోయాడు.
ఆ తర్వాత రవి కార్యక్రమాలు ఆపేశాడు. ఆన్‌లైన్ కోర్సులు మూసేశాడు.
తన దగ్గర మిగిలిన డబ్బులో కొంత మదుపు పెట్టి చిన్న ఉద్యోగ శిక్షణ కేంద్రం పెట్టాడు.
ఫీజు లేదు. “పని నేర్చుకోవాలంటే రండి,” అన్నాడు.
మొదట ముగ్గురు వచ్చారు. తర్వాత పదిమంది. తర్వాత ముప్పైమంది.
ఎవరైనా ఉద్యోగం దొరికిందని చెబితే రవి తృప్తిగా నవ్వేవాడు.
ఎవరైనా “సార్, జీతం తక్కువ” అంటే—
“ముందు పని నేర్చుకో. తర్వాత జీతం పెంచుకో” అని ఆప్యాయంగా భుజం తట్టేవాడు.
ఎవరైనా “ఇంట్లో సమస్యలు ఉన్నాయి. టెన్షన్‌గా ఉంటోంది” అంటే—
“మనసులోని బాధ బయటికి చెప్పుకో! బరువు తీరుతుంది. కొత్త దారి దొరుకుతుంది.”
అంతవరకే. గతంలోలా ఉచిత సలహాలు ఇవ్వడానికి సిద్ధపడేవాడు కాదు.
ఓపిగ్గా వినేవాడు.
ఒక సంవత్సరం తర్వాత....
ఒక సాయంత్రం అతని దగ్గరకు ఒక మహిళ వచ్చింది.
చేతిలో చిన్న కవర్.
“రవి సార్…”
రవి తలెత్తి చూశాడు.
ఆమె లక్ష్మి.
“ఇది మీకు.”
“ఏంటి?”
“నా మొదటి నెల జీతం.”
రవి ఆశ్చర్యపోయాడు.
“నాకు ఎందుకు?”
“మీరు నాకు పని ఇప్పించారు.”
“అది నీ కష్టం.”
లక్ష్మి నవ్వింది. “కాదు సార్.”
ఆమె కవర్ అతని చేతిలో పెట్టింది. “మీరు మొదటిసారి నా దగ్గర డబ్బు తీసుకోకుండా… నా మాట విన్న రోజు నుంచి నా మీద నాకు నమ్మకం కలిగింది. నా జీవితం మారింది.”
రవి కవర్ తెరవలేదు.
“వద్దు. ఇక ఎవరి బాధ మీదా నేను డబ్బు సంపాదించను.”
లక్ష్మి బలవంతంగా కవర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది.
రవి కవర్ తెరిచి చూశాడు.
అందులో ఐదు వందల రూపాయల నోట్లు. మొత్తం ఐదు వేలు.
కింద ఒక చిన్న కాగితం. “మీరు ఇచ్చింది ఉద్యోగం కాదు సార్… నా మాట వినే మనిషి ఒకడున్నాడనే నమ్మకం. ఆ నమ్మకమే ఇప్పుడు నాకు ఉపాధి కల్పించింది.”
రవి ఆ కాగితాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు.
గదిలో గోడకు వేలాడే "రవి రైజింగ్" ఫ్రేమ్ కనిపించింది... “నీ బాధే నీ బలం” అని అప్పట్లో రాసి ఉన్నది.
రవి లేచి దాన్ని తీసేశాడు. వెనక గోడపై పెన్సిల్‌తో నిదానంగా రాశాడు—
“బాధలో ఉన్నవాడికి ముందుగా కావాల్సింది బలం కాదు… తోడు.”
చాలా కాలం తర్వాత రవి ముఖంలో ప్రశాంతత కనిపించింది.
ఎప్పట్నుంచో టేబుల్ సొరుగులో పడేసి ఉన్న పాత వాలెట్ బయటకు తీశాడు.
నాలుగేళ్ల క్రితం రాసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు:
₹3,840
దాని కింద కొత్తగా అతను ఒక సంఖ్య రాశాడు:
₹5,000
అదే ఈ రోజు లక్ష్మి ఇచ్చిన డబ్బు.
ఆ రెండు సంఖ్యల మధ్య అతను ఒక్క మాట మాత్రమే రాశాడు.
“ఇదే నా మొదటి నిజమైన సంపాదన”
సమాప్తం.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.









Comments