top of page

మౌనేన కలహం నాస్తి


'Mounena Kalaham Nasthi' written by Aduri Hymavathi

రచన : ఆదూరి హైమావతి

నగరం నడిబొడ్డునున్న పాతకాలంనాటి పెంకుటింటి ముందున్న

చొరస్తాలో అటూ ఇటూ తెగతిరుగుతున్నాడు నారప్ప. కొంతసేపు తిరిగి

వచ్చి, ఇంటిముందున్న వేపచెట్టు అరుగుమీద కూర్చుని సేదతీరి, తిరిగి

వెళ్ళి నాలుగు రోడ్లకూడలిలో అన్ని వేపులాచూస్తూ అటూ ఇటూ తిరిగి వచ్చి

కూర్చుంటున్నాడు. గత కొన్నాళ్ళుగా ఇదే అతని రోజువారీ రివాజు .

అలసిపోయి అరుగుమీది పెద్ద కొత్త బానలో నింపి వుంచిన మంచితీర్ధం

పొడవాటి గరిటెతో ముంచి గ్లాసులో పోసుకుని త్రాగి , ఉస్సురంటూ నిట్టూర్చి

మళ్ళీ అరుగుమీద చతికిల బడ్డాడు నారప్ప.

ఇంతలో ఒక వృధ్ధుడు వచ్చి "ఏం నారప్పా తెల్లారిందా! చిన్నకొడుకుకోసం

ఎదురు చూడను. ?" అంటూ నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు.

అతనికేసి నిరాశగా చూసి నారప్ప " యాందో యావాయనో గత

మూడునెల్నాల్లుగా నా సిన్న కొడుకు రాకపోయే రావప్పా! ఏటైందో యావోని

బిత్తరపోతాండా రావప్పా!"

"అజ్జెప్పనే గందే నే వొచ్చింది నారప్పా! మా వోడు ఈ ఉదయాన్నే

సెప్పిండులే. ’నారప్ప సిన్నకొడుకు మగర్జాతకుడే

అప్పా! అమేరికెళ్ళిపోయిండు భారియతో గలిసి. ఇద్దరికీ ఆడ్నే

ఉద్యోగాలొచ్చినయంట ' యని సెప్పిండు నారప్పా!. "

"యాంటీ.. నా సిన్నకొడుకు అమేరికెళ్ళిపోయిండా! కనీసం చెప్పనన్నాలేదు

రావప్పా! కనీసం ఎల్లెముందొచ్చి అయ్యను సూసి సెప్పి పోవద్దా !"

" ఎందుకు చెప్తడే నారప్పా! వాడేవన్నా నీపెద్ద కొడుకంటే! ఐనా నీ

పిచ్చిగానీ పెళ్ళికే పిలవ నోడు ఇప్పుడు అమేరికా యెళ్ళేప్పుడు చెప్పి

పోతడని ఎట్టనుకుంటన్నవ్ నారప్పా! నీ సిన్నకొడుకు తో పాటు పంజేసే

ఒకని పెల్లాం వాళ్ళాయనతో అంటే, అతగాడు మా వోడితో నిన్న రాత్తిరి

సెప్పిండంట. మావోడుదయన్నే నాతో అనిండు, నీకు సెప్పిపోదార నొచ్చిన"

"అమేరికంటె ఎంత దూర ఉంటది రావప్పా! నేనెల్లి సూసిరావచ్చా?"

“సూడు నారప్పా! నీవు నీ సిన్నకొడుకుని మాటీమాటికీ, అడుగడుక్కీ 'నన్ను

మీ ఇంటి కాడ కెత్తు కెళ్లరా! నీవుజేసే పనిసోటు సూపించరా! మీ యావిడ

పెద్దింటి పిల్లంటివిగందా! వాల్లిల్లు సూపరా ఎంతపెద్దగుంటదో!' అని

వచ్చినకాడ్నుంసీ యేధిత్తుంటవాయె! అందుకే కదే అమేరికాకి కూడ

వస్తానంటవని సెప్పకుండ్నే పోయిండు. అమేరికంటే మన ఆముదా

లొలసనుకున్నవేంటే! మావోడినడిగిన్నులే, యిమానంల 20 గంటలు

ఆకాశమారగాన పురవం మన మున్లు నారదులోరూ అట్టంటి మునులోల్లు

మబ్బుల్లో పయానం సేసినట్లు ఏడేడు సముద్రాలు దాటాలంట. ఆడికెల్లి

రాను టికెట్టుకే లచ్చవుద్దంట. నీకుమల్లే కాకీ పంచి కట్టు కున్నోల్లు

ఎక్కలేర్లేయే నారప్పా!. సూటూ బూటూ యేసు కున్నోల్లే ఎల్తరంట!

పెల్లిగ్గూడా నిన్నేగాక వోల్ల అన్నోదినెల్నే పిలవనోడు నీ సిన్నకొడుకు. పెల్లికి

కనీసం నిన్నన్న తోడుకెల్లిండే? పెల్లిసేసుకొనొచ్చి సెప్పోయిండు పెల్లాంత

వచ్చి. అప్పటికేన నీకల్లు తెరిసినయా! ఎబ్బే! యావ్ పేవయ్య నీ

సిన్నకొడిక్కి నీపేన. నెలకు ఒకపాలో రెండు పార్లోవొచ్చి

మొగుడూపెల్లాలిద్దరూ వదిన ఇంటికాడ తోటలో కట్టపడి పెంచిన కూర

లొండిపెడితే లొట్టలేసుకుంటాదిని పోడం తెలిసుద్దిగానీ నీ సిన్నకొడుక్కు

అన్నకన్నా సెప్పాలనే గ్యానం అనిపించలేదు. దవుర్ బాగ్యుడు " కోపం

ఆపుకుంటూ అన్నాడు రావప్ప.

మౌనమే శరణమైంది నారప్పకు.

" కనీసం పిల్లన్న వ త్తదనుకుంటా చూస్తాన్నా రావప్పా! ఆపిల్లా రాలేదే వాని

నాబాద"

" ఓచ్ ! ఇదీకూడా నీకు తెలవదన్నమాట! ఔలే సెప్తే నీవెక్కడ

వస్తనంటవోనీ నీపిల్లా సెప్పకండానే పోయినాది. ఒక్కపాలైన తనింటికి

తోలుకెల్లిన పాపానపోయిందానీ కూతురు పిల్ల నారప్పా! ఇన్నిమార్లొచ్చి తిని

పోయిందిగానీ వదిన్ని ఒక్కపాలైన పిలిచిందా ! స్వారదం, స్వారదపు

మడుసులు. "

"యాడ కెళ్లినాది రావప్పా! అదీ అమెరికెల్లినాదా!"

" కాదుగానీ మన దేశం యిడిసెల్లిందంట. కుటంబంతోగూడ. ఆవె పెనివిటికీ

మలేసియంట.. ఆదేసంల పెద్దుజ్జోగవైనదంట. అదీ నాకొడుకే సెప్పిండులే.

ఇగ ఇంటికాడే కూకో చౌరస్తలో అటూ ఇటూ తిరగాడ మాక.

ఏ కారుకిందో పడితివా పాపం పెద్దోడికి మరింత కట్టమవుద్ది. నాలుగురోడ్లల

తిరక్క , వోల్లకోసం ఇగ సూడమాక . " అంటూ నిప్పులాంటి నిజం చెప్పాడు

రావప్ప.

"మనసుకెంత సెగెట్టినవ్ రావప్పా. "అంటూ చతికిల పడిపోయాడు నారప్ప.

" సెగెట్టింది నీ సిన్నకొడుకూ, కూతురానా నేనా? అబ్బరంగా

పెంచుకుంటివిగా! పాపవ్ నోట మాటరాని మూగోడి వంటి పెద్దోడిని

పక్కనెట్టి, ఊరి సదువుతో ఆపేత్తివి. పట్టువట్టి యాగీ సేసి పంతం

నెగ్గించుకుండు సిన్నోడు. ఆడికి పొలవమ్మి పెద్ద సదూ సెప్పిస్తివి. ఇంజి

నీరు సదువని మురిత్తివిగానీ పెద్దకొడుక్కు అనియాయం సేస్తుండనని

ఆలోసిస్థివా? కూతురిపెల్లికి ఒక్కమ్మెని వాల్లడిగినంతీను పెద్ద పల్లతోట

, ఇల్లు, తలం అమ్మి ఆయప్ప క్కావల్చినవన్ని ఇత్తివి. ఏవియ్యక, సదూ

సెప్పించక అనియాయం చేసింది నీ పెద్ద కొడుక్కు నీవుకాదేంటే నారప్పా!.

యావీ యరగనట్టు నటిత్తావుమల్లా. నీ సేతిలో రెండు పళ్ళూ, రెండు చ్వీటు

ముక్కలు పెట్టిండ్రేకానీ నీ సిన్నకొడుకూ, కోడలు ఒక్కనాడైన పసిపిల్లలైన

అన్నపిల్లల్కు ఒక్క పండైనా తెస్తిరా! పోనీ నీవైన ఆపిల్లల్కు ఒక్కనాడైన

పండిత్తివా? అన్నీ నీవే తింటివి. నీవూ ఓమడిసివా!

నీకూతురొత్తే ఇంకా బాగా మరియాదలు సేయలేదని పెద్ద కొడుకూ కోడల్నీ

బండ తిట్టులు తిట్టితివి . యాడనుంచీ తెచ్చి మరియాదలు చేస్తారయ్యా

వాల్లు? నీకేన జానం ఉండొ ద్దే! నీవుగానీ ఇచ్చిన ఆత్తేవన్నా ఉందా ఆల్లకాడ.

పావం పెద్దకోడ్లు అన్న యేయిచ్చిన సిన్న ఉద్దోగంల వచ్చే కాత్తంత

జీతంతా నీ పెద్దకొడుకూ, వాళ్ళ అన్న పసుపూ కుంకుమ కిందిచ్చిన ఈ

రెండెకరాల పొలంలా కూరలు పండించుకంటా , ఆనాడు వాళ్ళన్న

కట్టించిచ్చిన పెంకుటింట్లా, ఇన్నేల్లనుంచి కాలంగడుపుతా , గుట్టుగా

సంసారం నెట్టుకొత్తున్న, నోరు తెరవని నీ పెద్దకోడలి మంచితనం నీకు

తెల్వదులే.

అసలు చిగ్గులేకండ ఎట్టా ఇంతకాలం ఈడుండవే! నీపెండ్లమే బతికుంటే

పెద్ద కొడుక్కింత అనియాయం జరగ తాంటె సూస్తంటదే

నారప్పా! ఎంతశాపటికీ సిన్నకొడుకు, కూతురని వారిమీద పడేడిత్తివి.

నీయావంతా ఆల్లమిదేనయ్య . ఏవాయె సివరాకర్కి? సెప్ప కుండా

లగెత్తెల్లిన్రు. దేశ్వొదలి. ఎంత తండి మీద పేవప్ప నాగప్ప! నీ

సిన్నకొడుక్కూ , కూతురికీనీ. "అని రావప్ప పెడుతున్న చీవాట్లతో కళ్ళు

తెరిచి తన తప్పు తెలిసి కళ్ళనీళ్ళ పర్యంత మవుతుండగా వచ్చాడు

పెద్దకొడుకు బావమరిదితో.

"నమస్కారం మామా! రామప్పగారూ నమస్కారం!. "అంటూ ఒంగి రావప్ప

పాదాలకూ, నారప్ప పాదాలకూ నమస్కారం చేశారు ఇరువురూ.

" మీరు ఇప్పుడు ఇక్కడుంటం మా అదృష్టం. మీలాంటి పెద్దల సమక్షంలో

శుభవార్త చెప్పడం నాకూ సంతోషం. నేను పసుపు కుంకుమ క్రింద

ఇచ్చినపుడు ఈ స్థలం ఆనాడు ఊరి చివరుంది. పొలంపని చేసుకోను

ఇబ్బందవుతుందని, ఇక్కడే ఆనాడు ఒక చిన్న పెంకుటిల్లు వేయించి

ఇచ్చాము మాచెల్లెలికి. ఈరోజున జాతీయ రహదారి మన ఊరి మీదనుంచీ

వెళ్లటాన , ఈ ఊరు నగరంగా మారింది. ఈ రోజుకు నగరం మధ్యకొచ్చింది

ఈ స్థలం . కాలేజీలు, ఆఫీసులూ పెరిగి ఈ పెంకుటిల్లు , స్థలానికి విలువ

పెరిగింది. 'మౌనముని' వంటీ మా బావ ఏనాడూ వాళ్ళ నాన్నను నా

కిదికావాలి, అని అడిగి ఎరుగడు.

' మౌనేన కలహం నాస్తి ' అనేది మా బావ స్వభావం. మేమింత కాలంగా మా

బావను చూసి అన్నిటికీ మౌనంగా ఉన్నాం. మనుషులు అన్యాయంచేసినా

భగవంతుడు న్యాయం చేస్తాడని ఋజువైంది రావప్పగారూ! మాబావను

వేధించి డిగ్రీ చేయించాను. పాసయ్యాడు. ప్రమోషన్ వచ్చింది. ఈ స్థలానికి

వైభోగం పట్టనుంది. దీని విలువపెరిగి డెవలపర్సు ఇక్క డ అపార్టు మెంట్లు

కట్టి అర్ధభాగం బావకు ఇస్తారు. అవన్నీ వీరు అమ్ముకోవచ్చు. అందాకా

అక్కడ కనిపించే ఆపెద్ద ఇంట్లో మకాం. వారే అద్దెకడతారు. నా చెల్లెలు

పిల్లలు ఇద్దరూ పదిపాసై, పై చదువులకు వచ్చారాయె. చదువుల

ఖర్చులకు కొంత పైకం అడిగాను. దీంతో మా చెల్లి కాపురం కుదుట పడి

ఇన్నాళ్ళకు నాబావ కూడా ఒక మంచి స్థితికి రావడం నాకూ ఆనందంగా

ఉంది. " అని ఊపిరిపీల్చుకున్నాడు బావమరిది భాస్కరం .

" స్తీ దనం గనక ఎవ్వురికీ దీనిమీద అక్కుబుక్తాలుండవని తెలుసా

బాసకరయ్యా!. అది కేవులం నీ సెల్లెలికే. యాంది ?తెలుసుగందా !" రావప్ప

భాస్కరయ్యకు ఎరుకచేశాడు.

"ఔను, అందుకే మాబావకూడా అంతా నాచెల్లెలుపేరనే వ్రాయించాడు. "

"ఔగందా! ఆపెకూ ఆపె బిడ్దల్కూ మాత్తరమే దీనిమీద అక్కుంటది.

నారప్పా! నీ సిన్న కొడుక్కూ కూతురికీభాగంఎడదారని అడక్కు. సిగ్గుపోద్ది.

వారి సొబావం తెలిసిందిగాదె! ఇక గుట్టుగుండు. మౌనం గుండు. పెట్టింది

తిని ఇంట్లనే పడుండు. సరా! బండ్లు ఓడలవడం అంటే ఇదేనే

నారప్పా!"అన్నాడు రావప్ప.

" సచ్చిన పావు నెందుకు కొడతావ్ రావప్పా! నా వంకొర బుధ్ధి తెలిసింది.

నేను నాపెద్ద కొడుక్కు సేసిన అన్నియాయం ఇప్పుడు

తెలిసొచ్చింది. ఇంతకాలం నీనోరిప్పి ఒక్క మాటన్న అన్నవా రావప్పా!

నోరుండేటోరిదే కాలమాయె ఇందాక. నా బుద్దిగడ్డితిందే రావప్పా!

బాసకరన్నట్టు దేవుడే నాయం సేసిండు. " అంటూ లెంపలేసుకున్నాడు

నారప్ప.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


పరిచయ వాక్యాలు .

శ్రీయుతులు మన తెలుగు కథలు సంపాదకుల వారికి , హృదయపూర్వక నమస్కారాలతో,

ఆర్యా! సాయిరాం!

నేను విశ్రాంత ఉపాధ్యాయినిని. పిల్లలతో 40 సం.కాలం మెలిగినందున ఎక్కువగా పిలల్లకోసం కథలు వ్రాయడం అభ్యసనమైంది .నాలుగు కథల పుస్తకాలు భగవంతునిదయతో అచ్చయ్యాయి. ఈ 2020 లో 108 మానవతావిలువలకు ఉపవిలువల తో ఒక శత కధా సుమమాల అనేపేర పుస్తకం అచ్చైంది.

కేవలం బాలలను దృష్టిలో ఉంచుకుని భగవంతుడు చేయించినది ఇది. సుమారుగా 10,12 పుస్తకాలు, జంతువులు, పక్షులు, పుషాలు,వృక్షాలగురించీ కథల పుస్తకాలూ ఇ బుక్స్ గా కినిగెలో ఉంచడం జరిగింది. అమెరికానుండీ వెలువడే వెబ్ మ్యాగజైన్లో గత కొంత కాలంగా వస్తున్న సామెతలతో చక్కని కథలు అనే పేర ప్రచురించబడిన కథలను ఇ బుక్ గ్రా క్రితం మాసంలో రూపొందింది. సమాజంలో విషయాలు చూస్తూ వింటూ కొన్ని కథలను రూపొందించడం జరుగుతున్నది.అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి, కొన్నింటికి బహుమతులుకూడా వచ్చాయి.

మొన్న కెనడా డే సందర్భంగా వారు నిర్వహించిన కథలపోటీలో ' క్షుత్తు ' అనేకథకు బహుమతి వచ్చింది

భగవాన్ శ్రీ సత్యసాయి బాలవికాస్ బాలవికాస్ గురువుగా గత 40 సం.రాలుగా మానవతా విలువలను సమాజంలో బాల బాలికలకు ఉచితంగా నేర్పించే గురువులకు ట్రైనింగ్ ఇచ్చేకార్యక్రమంలో రాష్ట్రమంతా గత 35 సం. సంచరించడం స్వామివారి కృపే.

పుట్టపర్తి ఆశ్రమసేవలో సేవ చేసుకుంటూ అక్కడే ఉంటుండగా కరోనాకారణాన ఆశ్రమం మూసేయటాన ,ప్రస్తుతం బెంగుళూరులో అమ్మాయి ఇంట్లో మకాం.

ధన్యవాదాలతో,

ఆదూరి.హైమావతి638 views0 comments

Comments


bottom of page