నా కోడలు బంగారం

'Na Kodalu Bangaram - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 13/10/2023
'నా కోడలు బంగారం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
సీత..గీత ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ తమ కొడుకులకి పెళ్ళిళ్ళు చేసారు. కొత్త కోడళ్ళ తో సేవలు చేయించుకుంటున్నారు. ఇద్దరూ.. పక్క పక్క కాలనీ లో ఉంటారు. ఒక రోజు.. సీత హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్న దారిలో...గీత కనిపించింది.
"ఓ గీతా! ఎలా ఉన్నావు? ఇద్దరమూ ఫ్రెండ్స్ అనే మాటే గానీ.. బొత్తిగా..కలుసుకుని కష్ట సుఖాలు మాట్లాడుకోడానికి అసలు టైం ఉండట్లేదనుకో!"
"ఇలా ఉన్నాను.. చూస్తున్నావు కదా! ఈ అరవై వయసులో ఎలా ఉంటాను చెప్పు!"
"నువ్వు ఎలా ఉన్నావు సీతా?"
"నాకేమైనా తక్కువేమిటి.. నేనూ అరవై దాటాను కదే! బి.పి, షుగర్ జీవితంలో భాగం అయిపోయాయి"
"ఏమిటో విషయాలు సీతా! మీ అబ్బాయి, కోడలు కులాసా? "
"అంతా కులాసానే....లేవే!"
"అలా నీళ్ళు నములుతావేమిటి?"
"ఏమీ లేదే! మా అబ్బాయికి ఈ మధ్యే పెళ్ళి చేశాను కదా!..నాకు ఇష్టం లేక పోయినా..అబ్బాయి ప్రేమించానంటే.. ఆ అమ్మాయితో పెళ్ళి చేశాను"
"ఏమిటి! ఇద్దరూ సరిగ్గా ఉండట్లేదా?"
"ఛా! అలాంటిది ఏమి లేదు లేవే!"
"మరి ఏమిటి? చెప్పు!"
"ఇద్దరూ బాగానే ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు.. మధ్యలో నన్నే పట్టించుకోవట్లేదు"
"నీకేమి తక్కువ చేసారు?"
"ఏం చెప్పమంటావు! మా అబ్బాయి పెళ్ళికి ముందు...ఇంట్లో పెత్తనం అంతా నాదే...వంట నేనే చేసేదానిని...తృప్తిగా తినేదానిని.."
"ఇప్పుడు ఏమైంది చెప్పు?"
"మా కోడలు...వాళ్ళ కోసం మంచి వంటలు చేసుకుని...నాకు ఏమో ఒకటో అరో...ఉప్పు, కారం తక్కువ తో వంటకాలు పెడుతుంది.."
"అయ్యో!...అందుకే కాబోలు..కొంచం చిక్కావు సీతా!"
"పోనీ.. స్నాక్ ఐటమ్స్ ఏమైనా...పెడుతుందా? మీ కోడలు"
"మా అబ్బాయి..ఏమైనా తినే ఐటమ్స్ తెస్తే...నాకు అందకుండా చేస్తుంది...నోరు కట్టేస్తుంది! అంతే కాదు..రోజూ...పాలు పోయించుకు రమ్మని...మూడవ అంతస్తు నుంచి..కిందవరకు దిగి వెళ్ళాల్సి వస్తుంది. నాకేమో బి.పి, షుగర్ ఉన్నాయి కదా!...కొంచం ఇబ్బంది పడుతున్నాను...ఏం చెయ్యమంటావు?"
"మీ అబ్బాయితో చెప్పు సీతా!"
"వాడు పెళ్ళాం మాటలకు తల ఊపుతాడు...వెర్రి మాలోకం!"
"పోనిలే...అన్నీ అవే సర్దుకుంటాయి...కొంచం ఓపిక పట్టు సీతా.."
"నేను వస్తానే...ఇంట్లో మా కోడలు.. నా కోసం చూస్తూ ఉంటుంది...నచ్చిన వంటలు అన్నీ చేస్తుంది నా కోసం" అంది గీత
"రేపు నా టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ చెప్పింది...రేపు మళ్ళీ కలుద్దాం గీత...వస్తావు కదా! నీతో మాట్లాడితే.. మనసు తేలిక అవుతుంది.."
"అలాగే సీతా!"
రిపోర్ట్స్ వచ్చాయని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే, సీత హాస్పిటల్ కు బయల్దేరింది..
"రండి సీత గారు ! ఎలా ఉన్నారు?"
"బాగున్నాను డాక్టర్!"
"మీ రిపోర్ట్స్ చూసాను...అన్నీ నార్మల్ గా ఉన్నాయి… ఇంతకుముందు తో చూస్తే, చాలా బెటర్. బి.పి, షుగర్ అన్నీ కంట్రోల్ లో ఉన్నాయి...ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న డైట్.. ఎక్సర్సైజ్.. అలాగే ఫాలో అవండి...త్వరలో మీ నొప్పులు కుడా తగ్గిపోతాయి..."
"అలాగే డాక్టర్!"
***
హాస్పిటల్ బయట గీత కనిపించింది…
"గీతా! ఏమిటి ఇక్కడకు వచ్చావు?...అంతా కులాసా కదా!"
"ఏదో నీరసంగా...కళ్ళు తిరుగుతూ ఉంటే, హాస్పిటల్ కు వచ్చాను...సీత"
"డాక్టర్ ఏమిటి చెప్పారు?"
"షుగర్ చాలా ఎక్కువ ఉందంట...బీపీ కూడా చాలా హై అంట...డైట్ సరిగ్గా పాటించట్లేదని తిట్టి.....మందులు రాసారు..."
"మా కొత్త కోడలు...వద్దంటే, అన్ని వంటకాలు చేసి పెడుతుంది...నా మీద ఎంత ప్రేమో అనుకున్నాను… ఇప్పుడే తెలిసొచ్చింది.. ఎంత ప్రమాదమో అని..
నీకు డాక్టర్ ఏమని చెప్పారు సీతా?"
"ఇప్పుడే డాక్టర్ ను కలిసాను...రిపోర్ట్స్ నార్మల్ అంట...డైట్ అలాగే ఫాలో అవమన్నారు...మా కోడలు నిజంగా బంగారమే..
నా కోసం ఉప్పు, కారం తక్కువ ఉన్న ఫుడ్ వేరేగా చేసి పెట్టేది...నేను వాకింగ్ చెయ్యనని.. రోజూ పాల కోసం నన్ను పంపించేది.. కాళ్ళు నొప్పులు కుడా తగ్గాయి...తిండి ఎక్కువ పెట్టకపోవడం.. నా మంచికే అని ఇప్పుడు అర్ధమైందే గీత!”
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ





Comments