top of page

నమ్మకము


'Nammakamu' - New Telugu Story Written By Dr. Jonnalagadda Markandeyulu

Published In manatelugukathalu.com On 09/10/2023

'నమ్మకము' తెలుగు కథ

రచన: డా: జొన్నలగడ్డ మార్కండేయులు​

చిరుతపూడి పల్లెటూరు.. వరదాచారి ఆయుర్వేదవైద్యుడు. కీళ్ళనొప్పులు నయముచేయడము అతని ఖ్యాతి.


అందువల్ల కీళ్ళనొప్పులకు చిరుతపూడి వైద్యము పేరుగా వ్యాపించింది. దీర్ఘకాలమునుండి బాధపడుతున్న ఎందరో చిరుతపూడికి ఆఖరి ప్రయత్నముగ వచ్చి స్వస్థత చెందారన్న కథనాలు వినిపిస్తాయి.


గోపాలపురములో కామాక్షి ఐదారు సంవత్సరాలనుండి కీళ్ళనొప్పులతో బాధ పడుతోంది.. ఆమె భర్త కనకయ్య కామాక్షిని తీసుకుని వరదాచారి వద్దకు వచ్చాడు.


‘’అన్నిరకాల వైద్యాలు ప్రయత్నించాము. ఇక మీదే భారము’’ అన్నాడు కనకయ్య.


వరదాచారి కామాక్షిని పరిశీలించాడు. ‘’నీ నొప్పులు తీవ్రమైనవికావు. మందు ఉంది. కాని నీకు మనోవ్యధ ఉన్నట్లుంది. నాడీమండలము రక్త ప్రసరణ, ఉద్విగ్నితకు గురవుతోంది. శరీరతత్త్వము సహకరించాలంటే మెదడు ప్రశాంతతకు రావాలి. ముందది జరగాలి. దేనికేనా వ్యాకుల పడుతున్నావా’’ అనడిగాడు.


“అవునండి! నాగ్రహస్థితి బాగోలేదట! జ్యోతిష్కుడు నాకు మనవడు పుట్టేవరకూ అనారోగ్య బాధలుంటాయని చెప్పాడు. నాకొడుకుకు పెళ్ళయి ఐదేళ్ళయింది. పిల్లలు పుట్టలేదు. నాకోడలు గొడ్రాలు అనే బాధ దొలిచేస్తోంది. కొడుకికి మరోపెళ్ళిచేసే దురాలోచనలేదు. కూతురులాంటి కోడలిని వదులుకోను. మీ మందు గొప్పది కావచ్చు. తగ్గితే ఋణము తీర్చుకుంటాను. అయినా నా మనసులో భయము తగ్గటములేదు’’ అంది.


వరదాచారికి తెలుసు కామాక్షిది మూఢనమ్మకమని. కామాక్షి వంటివారు అతనికి చాలామంది తారసపడ్డారు. మూఢనమ్మకానికి మందు మరో మూఢనమ్మకము ప్రయోగించి మూఢనమ్మకము తొలగించడం వరదాచారి వైద్య ప్రక్రియలో ఒకభాగము. అందుకు మూఢనమ్మకమునే సాయము తీసుకునేవాడు. కామాక్షి విషయంలో కూడ అలాగే చేద్దామనుకున్నాడు.


“పిల్లలు పుట్టకపోతే కోడలిది తప్పుకాదు. దేవుడి అనుగ్రహం ఉండాలి. కోడలిమీద నీకున్న ప్రేమ చాలా గొప్పది. నీకు మనవడు పుడతాడు. నువ్వు అదృష్టవంతురాలవు. అందుకే మా చిరుతపూడి వచ్చి నన్నుకలిశావు. నేను నీకు నొప్పులు తగ్గిస్తాను. ఇంకో విషయం. మా చిరుతపూడిలో సంతానగోపాల స్వామి గుడి ఉంది. నా మాటమీద నమ్మకముంచి ఇంటికి వెళ్ళాక నీకొడుకుని, కోడలిని మాగుడికి పంపగలవా?’’ అన్నాడు.


“ఎందుకు?” అడిగింది కామాక్షి కుతూహలంగా.


“మా ఊరి సంతాన గోపాలస్వామి గుడిపూజారి నాతమ్ముడు. గుడిప్రాంగణములో సంతానములేని దంపతులచేత పూజ చేయించి కొబ్బరి మొక్క పాతిస్తాడు. నాకు తెలిసినంత మట్టుకు అలామొక్కలు పాతిన దంపతులకు సంతానము కలిగింది. ఏడాది తిరిగొచ్చేసరికి కొడుకో కూతురో పుట్టి బారసాల ఇక్కడే చేసుకున్నారు.


నీ గ్రహస్థితి బాగుపడి ఇక్కడకు వచ్చావు. నా మందు కీళ్ళనొప్పులు తగ్గిస్తాయి. నీ కొడుకు కోడలు సంతాన గోపాలస్వామి అనుగ్రహము పొంది నీకు మనవడినో, మనవరాలినో ఇవ్వడం ఖాయము’’ అన్నాడు నవ్వి.


కామాక్షికి సంతోషమేసింది. వరదాచారి యిచ్చిన మందు తీసుకుని భర్తతో గోపాలపురం వెళ్ళిపోయింది. మందు వాడకం మొదలుపెట్టింది. కొడుకు, కోడలికి విషయం చెప్పి ఒక మంచిరోజున చిరుతపూడి పంపించింది.


కామాక్షి కొడుకు, కోడలు చిరుతపూడి వచ్చారు. వరదాచారి తమ్ముడు దేవస్థానము కొబ్బ రిమొక్కలమ్మే దుకాణానికి తీసుకువెళ్ళి కొబ్బరిమొక్క కొనిపించాడు. గుడిలోని కల్యాణ మంటపము మీద ఇద్దరిచేత పూజ చేయించాడు. గుడిది చాలా విశాలమైన స్థలము.. లేత, ముదురు మొక్కలతో కళకళలాడుతోంది. దేవస్థానము రైతు ఉన్నాడు. అతను చూపించిన స్థలమునకు వరదాచారి తమ్ముడైన పూజారి పూజ చేయించాడు. కొన్న మొక్కను తీసుకుని గర్భ గుడిలో కూడ పూజ చేసి కొబ్బరిమొక్కకు స్థలం చూపినచోట పాతించి పంపాడు..


తరువాత దంపతులిద్దరూ వచ్చి వరదాచారిని కలిసారు. సంతానలోప నిర్ధారణకు వరదాచారి దంపతులిద్దరినీ పరిశీలిస్తానన్నాడు. అయిష్టంగానే సరేనన్నారు. ఇద్దరినీ పరీక్షించాడు. ప్రశ్నలడిగి ఒక నిర్ధారణకు వచ్చాడు.


“కొబ్బరిమొక్క వంకమాత్రమే! మిమ్మల్నిద్దరినీ రమ్మన్నది ఎవరిలో అసలు లోపమున్నదనే పరీక్షకే!. మీ ఇద్దరి లోను లోపాలున్నాయి. ఆ లోపాలు తొలగి సంతానము కలగాలంటే మందులువాడాలి. నేను కీళ్ళ వైద్యుడిగానే ప్రసిద్ధి. కాని నేను అన్ని రుగ్మతలకు చికిత్స చేసే ఆయుర్వేద వైద్యుడిని. ఈ నమ్మకముతో మీరు మందు వాడాలి. మీరింటికి వెళ్ళి మొక్క పాతిన విషయం చెప్పండి. నేనిచ్చిన మందు ఇద్దరూ వాడాలి. నేను పరీక్ష చేసినట్లు, యిచ్చిన మందులు వాడుతున్న విషయం ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచగలిగితే మీ లోపాలు మరుగు పడిపోతాయి’’ అన్నాడు.


మందు వాడిన విషయం దంపతులు దాచారు. వరదాచారి నిజంగా గొప్ప వైద్యుడు. కామాక్షికి కీళ్ళనొప్పులు తగ్గాయి. కోడలు గర్భవతైంది. కొబ్బరిమొక్క పాతిన కోడలుకు మనవడు పుట్టడం జరిగి మందు పనిచేసిందని నమ్మింది.


ఘనముగా వైద్యకట్నమందుకుని మురిసిపోయాడు వరదాచారి. భార్యతో “తిరుగులేని నామందు వల్లేకామాక్షికి కీళ్ళ్నొప్పులు తగ్గాయి. కోడలు సంతానవంతు రాలయ్యింది’’ అన్నాడు పొంగిపోతు.


వరదాచారి భార్య నవ్వింది. ‘’ఇక్కడ అందరివి నమ్మకాలే పనిచేసాయి. మీకు మీ మందుమీద నమ్మకము. వైద్యుడిగ మీమీద మీకుగల అపార నమ్మకముతో అందరి నమ్మకాల్ని చక్కగా వినియోగించుకున్నారు. కామాక్షికి గ్రహస్థితి బాగుపడి తనకొడుకు కోడలు గుడిలో మొక్క పాతారు.

అందువల్ల మనవడు పుట్టి, మీ వైద్యం పనిచేసిందని నమ్మింది. జ్యోతిష్కుని మూఢనమ్మకము, గుడిపూజలు ఎలాఉన్నా కామాక్షి కొడుకు, కోడలు పిల్లలు పుట్టకపోవడానికి తమ యిద్దరి లోపాలను అంగీకరించి మందు వాడారన్నది నిజమైన నమ్మకమే. మూఢనమ్మకము మీద లోకానికి సందేశమవుతున్న వైద్యుడి విజయంగా మీరు నాకు నమ్మకమైన సంతోషము’’ అంది.

***

డా: జొన్నలగడ్డ మార్కండేయులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: డా: జొన్నలగడ్డ మార్కండేయులు​


71 views0 comments

コメント


bottom of page