నరసదాస కీర్తన
- Sudha Vishwam Akondi

- 3 days ago
- 2 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguArticle, #Devotional, #NarasadasaKeerthana, #నరసదాసకీర్తన

Narasadasa Keerthana - New Telugu Article Written By Sudhavishwam Akondi Published in manatelugukathalu.com on 02/03/2026
నరసదాస కీర్తన - తెలుగు వ్యాసం
వివరణ: సుధావిశ్వం ఆకొండి
పూర్వం AIR భక్తి రంజనిలో ఎప్పుడూ వచ్చేది ఈ కీర్తన. చాలా అద్భుతమైన అర్థంతో ఉంటుంది. నరసదాసు అనే భక్తుడు తన కీర్తనలతో స్వామిని అర్చించి, తరించాడు. ఈయన శ్రీరాముని పైన కూడా కీర్తన చేశాడు. అది మరొకసారి చెప్పుకుందాం. ఇక్కడ ఈ కీర్తనలో శ్రీమన్నారాయణుని తనను అనుగ్రహించమని వేడుకున్నాడు.
-----
కేశవ గోవింద మాధవాయని కీర్తన చేయుట ఎన్నటికో
నాశము లేని మోక్షము పొందుట నారాయణ నాకెన్నటికో
// 2 //
భక్తి మృదంగము తాళాదులతో భజనలు చేసేదెన్నటికో
శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో
// 2 //
// కేశవ గోవింద //
పూవులతో నీ పాదంబులకు పూజలు చేసేదెన్నటికో
నైవేద్యమిడి పరమ భక్తిని ఆరగించుట నాకెన్నటికో
// 2 //
// కేశవ గోవింద //
పాహి పాహియని పరమపురుష నీ పాదంబుల బడుటెన్నటికో
దేహి దేహియని నీ కృప కొరకై దేవురులాడే దెన్నటికో
// 2 //
// కేశవ గోవింద //
రామదాసాదులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో
భామామణి రుక్మిణితో గూడి బాసలు చేసేదెన్నటికో
// 2 //
// కేశవ గోవింద //
దాసదాసుడగు నరసదాసుని దాసుగనేలేదెన్నటికో
వాసవ విలాస రమణా వందనము గొనుటెన్నటికో
// 2 //
// కేశవ గోవింద //-----భావం:
ఓ కేశవా! మమ్మల్ని రక్షించే గోవిందా! ఓ మాధవా! అంటే మా అమ్మ అయిన మహాలక్ష్మికి పతి అయిన తండ్రీ! అంటూ నిన్ను నిరంతరం నేను స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నశించిపోని మోక్షము పొందగలుగుతాను. నా ఈ కోరికలు ఎప్పటికి తీరుతాయో? ఆ భాగ్యం నాకు ఎప్పుడు లభిస్తుందో తండ్రీ! అందుకు నీ అనుగ్రహం కావాలి. నారాయణా! నశించిపోని మోక్షాన్ని నాకు నువ్వే కటాక్షించాలి.
ఓ పద్మముల వంటి కన్నులు కలవాడా! ఎంతో భక్తిగా మృదంగం వాయిస్తూ తాళం తప్పకుండా నీ భజనలు చేయాలి. నా శక్తిని మించిన ఆర్తితో నీ ముందు మైమరచి నృత్యం చేసే భాగ్యం ఎప్పుడో నాకు.
మంచి సుగంధభరితమైన పువ్వులతో నీ పాదాలకు పూజలు ఎప్పుడు చేయగలుగుతానో!
పరమ భక్తితో నైవేద్యాలు నీకు సమర్పించి, నీ ప్రసాదాన్ని పరమ భక్తితో ఎప్పుడు ఆరగిస్తానో!
ఓ పరమపురుషా! పాహి పాహి అంటూ నీ పాదపద్మములపై ఎప్పుడు వాలిపోతానో!
నీ కృపారసాన్ని నాపై కురుపించు తండ్రీ! అంటూ ఎప్పుడు నిన్ను ప్రాధేయపడతానో!
రామదాసు వంటి భక్తులను కటాక్షించినట్లుగా నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావో తండ్రీ!
అమ్మ రుక్మిణీదేవితో కలిసి వచ్చి ఎప్పుడు నాకు అభయం ఇస్తావో!
నీ దాసులకు దాసుడనైన నరసదాసును నీ దాసునిగా ఎప్పుడు ఏలుకుంటావో!
ఇంద్రుని వైభవానికి కారణమైన ఓ తండ్రీ నా నమస్కారములు ఎప్పుడు స్వీకరించి, నన్ను అనుగ్రహిస్తావో తండ్రీ!
అంటూ వేడుకున్నాడు. చదివితే
మనమూ వేడుకున్నట్టే.
సర్వం గోవిందార్పణమస్తు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుధావిశ్వం
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం




Comments