నేర్పితే వచ్చేది కాదండీ బాబు!
- Nallabati Raghavendra Rao

- 4 days ago
- 8 min read

Nerpite Vacchedi Kadandi Babu | Telugu Fun Story | Nallabati Raghavendra Rao
నేర్పితే వచ్చేది కాదండీ బాబు | సరదా కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 25/03/2026
“ప్రపంచ జ్ఞానం నేర్పిస్తే వస్తుందా… లేక తానే నేర్చుకోవాలా?” 'నేర్పితే వచ్చేది కాదండీ బాబు' కథలో ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు ఏం చెబుతారో తెలుసుకుందాం. |
శివప్రసాద్ మోటార్ సైకిల్ నడుపుతున్నాడు. అతని వెనుక అతని అన్న సాంబశివం కొడుకు చక్రం కూర్చున్నాడు.
శివప్రసాద్ సెల్ మోగింది. డ్రైవింగ్ చేస్తూనే తీసి ఆన్ చేసి.. హలో.. అన్నాడు.అవతల కంఠం ఏదో అడిగింది.
''నేను గుడిలో పూజలో ఉన్నాను.. తర్వాత మాట్లాడతాను.'' అంటూ సెల్ ఆఫ్ చేసి జేబులో పెట్టేసుకున్నాడు.
''అదేమిటి బాబాయ్ మనం బండి మీద ఉన్నాం కదా అలా అబద్ధం ఎందుకు చెప్పావు?'' అడిగాడు చక్రం.
''ఒరేయ్ నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు. మైనారిటీ తీరింది. పెళ్లీడుకొచ్చావు. అయినా ప్రపంచ జ్ఞానం వీసమెత్తు కూడా లేదురా నీకు. వాడు అనవసరపు కాండిడేట్. వాడిని మాట్లాడకుండా చేయాలంటే ఇలాగే చెప్పాలి. ఇప్పుడు ఎవరి కొంపలు మునిగిపోలేదు కదా!''
''అయినప్పటికీ అంత పెద్ద అబద్ధం చెప్పడం తప్పు కదా బాబాయ్''' మళ్లీ అన్నాడు చక్రం.
''నీ మొఖం.. ఏమాత్రం తప్పు కాదురా. వారం క్రితం మీ అమ్మనాన్న విదేశాలకు మీ అన్నయ్య దగ్గరికి వెళుతూ నిన్ను నా ఇంటి దగ్గర ఉంచుతూ నాకు ఏం చెప్పారో నీకు తెలుసా? నీకు ప్రపంచజ్ఞానం అబ్బటం లేదని, ముఖ్యంగా మాట్లాడటం అసలు తెలియటం లేదని, అవన్నీ వాళ్లు తిరిగి వచ్చే ఈ మూడు నెలల లోపున నీకు అలవాటు చేయమని చెప్పి వెళ్లారు.''
''అందులో ఫస్ట్ లెసన్ ఇదే అన్నమాట. ఒక్కోసారి నిజం మాట్లాడితే ప్రమాదం వస్తుందిరా. అందుకని పరిస్థితులను బట్టి ఆయా సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చు, తప్పులేదు. వాళ్లు వచ్చే లోపులో మా ఇంట్లోనే ఉంటావు కనుక నన్ను చూసి అవన్నీ నేర్చుకో. వాళ్ళు వచ్చేసరికి నువ్వు మొనగాడిలాగా తయారవ్వాలి. అర్థమైందా?'' అంటూ చక్రానికి బోధించాడు అతని బాబాయ్ శివప్రసాద్.
మళ్లీ సెల్ మరోసారి రింగ్ అయింది. శివప్రసాద్ సెల్ ఆన్ చేసి.. ఏమీ వినపడని వాడిలా ''హలో కృష్ణ.. నేను బస్సులో ఉన్నాను. నీ మాటలు అస్సలు వినబడటం లేదు. తర్వాత నేనే ఫోన్ చేస్తాను'' అంటూ సెల్ జేబులో పెట్టేసుకున్నాడు.
'' మరి వాళ్ళు నీకు సడన్గా అనుకోకుండా ఇప్పుడు ఎదురైతే ఏం చెప్తావ్ బాబాయ్?''ప్రశ్నించాడు చక్రం.
''మరి వాళ్ళు నీకు సడన్గా అనుకోకుండా ఇప్పుడు ఎదురైతే ఏం చెప్తావు బాబాయ్?'' ప్రశ్నించాడు చక్రం.
''నోరు ముయ్యరా. అడ్డగోలు ప్రశ్నలు వేయకు. అలా జరిగితే మళ్లీ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకొకటి ఏదో చెప్తాను. ఇదే ప్రపంచ జ్ఞానం అంటే. అదే కదా మీ అమ్మా నాన్న నన్ను చూసి నేర్చుకోమన్నది.'' అని శివప్రసాద్ చెబుతూ శ్రీ లక్ష్మీ బ్యాంకు దగ్గర బండిని ఆపాడు. ఇద్దరూ బ్యాంకు లోపలకు వెళ్లారు.
విత్ డ్రా ఫారం పూర్తి చేసి ఇచ్చాడు క్యాష్ కౌంటర్లో శివప్రసాద్.
''మీకు ఏటీఎం లేదా? నిన్న కొంత ఈరోజు కొంత తీసుకుంటే సరిపోను కదా. సరే పాస్ బుక్ ఇవ్వండి'' అడిగాడు క్యాషియర్.
'' తేలేదండీ'' అన్నాడు శివప్రసాద్.
'' 50,000 అలా ఇవ్వడం కుదరదు. వెళ్లి పుస్తకం తీసుకు రండి'' అన్నాడు క్యాషియర్.
''సార్ మా అన్నగారు హాస్పిటల్లో ఉన్నాడు సార్. అర్జెంటుగా డబ్బు కట్టాలి. పుస్తకం రేపు తెచ్చి అప్డేట్ చేయించుకుంటాను సార్ ప్లీజ్!'' బ్రతిమలాడాడు శివప్రసాద్.
'' సార్ మా అన్నగారు హాస్పిటల్ లో ఉన్నాడు సార్ అర్జెంటుగా డబ్బు కట్టాలి. పుస్తకం రేపు తెచ్చి అప్డేట్ చేయించుకుంటాను సార్ ప్లీజ్.'' బ్రతిమలాడాడు చక్రం.
క్యాషియర్ ఒకసారి శివప్రసాద్ ముఖం పరిశీలనగా చూసి కంప్యూటర్ లో కూడా చూసుకొని చెక్ చేసుకుని మాట్లాడ కుండా డబ్బులు ఇచ్చేశాడు.
చక్రానికి మతి పోయినట్లు అయిపోయింది. బయటకు వచ్చాక బండి ఎక్కుతూ.. ''అదేమిటి బాబాయ్ నాన్న హాస్పిటల్లో ఉన్నాడని చెప్పావేమిటి?'' చిత్రంగా కళ్ళు తిప్పుతూ అడిగాడు చక్రం.
''సమయాన్నిబట్టి మాట్లాడటం అంటే అదేరా. ఆ క్యాషియర్ నోరు మూసుకొని డబ్బులు ఇచ్చాడా లేదా? అంతే మనకు కావలసింది. ఇది లెసన్ నెంబర్ 2. ఇంటికి వెళ్లి పుస్తకం తేవాలంటే ఆరు కిలోమీటర్లు. ఎవడు వెళ్తాడురా? ఇలా చెప్పడం వల్ల ఏదో కొంపలు మునిగిపోతాయా? నోరు మూసుకో.'' అంటూ శివప్రసాద్ బండి స్పీడ్గా పోనిచ్చాడు.
అలా అలా మూడు నెలలు గడిచిపోవచ్చింది కానీ తన బాబాయ్ అంటున్న ఆ ప్రపంచ జ్ఞానం కొంచెం కూడా అలవాటు కాలేదు చక్రానికి. బాబాయ్ అప్పుడప్పుడు తన గదిలో చక్రాన్ని కూర్చోపెట్టి బ్రతకటం నేర్చుకోమని కౌన్సిలింగ్ ఇస్తూ గట్టిగా చీవాట్లు కూడా పెట్టాడు.
ఆరోజు ఉదయం శివప్రసాద్ బాత్రూంలో ఉన్నాడు.
ఎవరో ఇద్దరు వ్యక్తులు బయట కారు మీద వచ్చి 'శివప్రసాద్ ఉన్నాడా...' అని అడిగారు బయట అరుగు మీద కూర్చున్న చక్రాన్ని.
వాళ్ళిద్దరూ గుబురు మీసాలతో చూడడానికి భయంకరంగా ఉన్నారు. ఇప్పుడేదో ప్రమాదం ముంచుకు రాబోతుంది అనుకున్న చక్రం ఇప్పటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పి బాబాయిని ఎలాగైనా రక్షించాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. తనకు ప్రపంచజ్ఞానం పూర్తిగా అబ్బేసిందని బాబాయి తనను మెచ్చుకోవాలి అంటే బాబాయ్ ఇంట్లో లేడని అబద్ధం చెబితేనే కరెక్ట్గా సెట్ అవుతుందని తీర్మానించుకుని ఇలా అన్నాడు...
''మా బాబాయ్ ఇంట్లో లేరండి, విజయవాడ వెళ్లారు. రెండు రోజుల్లో వస్తారు'' అని చెప్పి పంపించేశాడు. కాసేపటికి బాత్రూంలో నుంచి వచ్చిన శివప్రసాద్ విషయం తెలుసుకుని పిచ్చెక్కినట్టు అయిపోయాడు.
''వాళ్లు నాకు లక్ష రూపాయలు ఇవ్వాలిరా. సంవత్సరం నుంచి ఇవ్వటం లేదు. పెద్దల్లో పెడితే ఇప్పుడు పట్టుకొచ్చారు. వెధవ అబద్ధం ఎందుకు చెప్పావు? నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నీ మాటలతో వాళ్ళు డబ్బు పట్టుకుని
వెళ్ళిపోయారు. నా డబ్బు అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏదో లిటిగేషన్ పెట్టి ఇంకో రెండేళ్ల దాకా డబ్బు ఇవ్వరు.''.. అంటూ లబోదిబోమని తల బాదుకున్నాడు శివప్రసాద్.
చక్రానికి విషయం బొత్తిగా అర్థం కాలేదు.
''ఒరేయ్ చక్రం.. భలేగా చెప్పి వాళ్ళని పంపించావురా శభాష్..'' అంటూ తన బాబాయ్ తనను మెచ్చుకుంటాడు అనుకుంటే.. ''ఇదేమిటి ఇలా తిడుతున్నాడు..'' అనుకుంటూ తల విదిలించుకొని బయటకు వెళ్ళిపోయాడు.
ఆ మర్నాడు చక్రం, అతని బాబాయ్ శివప్రసాద్ ఇద్దరూ మార్కెట్కి వెళ్లారు మోటార్ సైకిల్ మీద. చక్రానికి 500 నోటు ఇచ్చి అక్కడ షాపుల్లో చిల్లర అడిగి తెమ్మన్నాడు శివప్రసాద్. చక్రం ఎవరిని చిల్లర ఇవ్వండి అని అడిగినా ఇవ్వలేదు. బాబాయ్ దగ్గరకు వచ్చి తెల్లముఖం వేసుకొని చెప్పాడు.
అప్పుడు శివప్రసాద్ చక్రాన్ని తీసుకొని అదే షాపుల దగ్గరికి వెళ్ళాడు.
''సార్ అక్కడ మా లేడీస్ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆటో అతనికి ఇవ్వాలి, 500 చిల్లర ఇవ్వండి..'' అంటూ అడిగాడు. ఇదివరకు చక్రం అడిగితే లేదు అన్నవాడే వెంటనే జేబులోంచి తీసి చిల్లర ఇచ్చాడు.
''ఇలా బ్రతకాలి.. అర్థమైందా.'' అన్నట్టు చూశాడు చక్రం వైపు శివప్రసాద్.
కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఎవరో ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది. జనం పోగుపడిపోయారు. పోలీసులు కూడా వచ్చేసారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరిది తప్పో స్వయంగా చూసిన చక్రం పోలీసులకు జరిగింది చెప్తాను అన్నాడు తన బాబాయ్తో.
''వద్దురా కొంపముంచుతావు. చూసినా చూడలేదని అబద్ధం చెప్పాలి. లేదంటే కోర్టుల చుట్టూ మనం సాక్ష్యం ఇవ్వడానికి తిరగవలసి వస్తుంది.. రా..'' అంటూ తీసుకెళ్ళిపోయాడు అక్కడ నుండి చక్రాన్ని.
''అదేమిటి బాబాయ్.. ఒక్కొక్కసారి అబద్ధం చెప్పకూడదు అంటావు. సరే అనుకొని ఫిక్స్ అయిపోతే మళ్లీ ఒక్కొక్కసారి నిజమే చెప్పకూడదంటావు..?'' అంటూ తనలో తానే గొణుక్కున్నాడు చక్రం.
ఇంకొంచెం దూరం వెళ్ళాక శివప్రసాద్, చక్రం ఇద్దరూ వెళ్తున్న మోటార్ బండిని రాంగ్ రూట్లో వేరొక ఎర్రబండి అతను వచ్చి తన బండితో గుద్దేశాడు. శివప్రసాద్ బండి డామేజ్ అయింది. శివప్రసాదుకు కవుకు దెబ్బలు కూడా తగిలాయి.
జనం.పోలీసులు..పోలీసులు చక్రం దగ్గరకు వచ్చి..
''ఏం జరిగింది బాబు?'' అని అడిగారు.
''అంతా నువ్వు చూసావు కదరా చెప్పు.. ఆ ఎర్రబండి అతనే మనల్ని గుద్దేశాడు కదా చెప్పు'' అన్నాడు శివప్రసాద్ చక్రంతో.
చక్రం బాగా ఆలోచించి.. ''నాకు తెలియదండి నేనేమీ చూడలేదు'' అన్నాడు పోలీసులతో.
జనం ఒకరు ముఖాలొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
''మీరు మీరు ఒకటే అనుకుంటాను. రాజీ చేసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోండి..'' అంటూ పోలీసులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. గుద్దేసిన ఎర్రబండి అతను అంతకుముందే జారుకున్నాడు.
ఈసారి శివప్రసాద్కు చక్రంని చూస్తే ఎక్కడో కాదు మొత్తం ఒళ్లంతా మండినట్టు, కాలినట్టు అయిపోయింది.
***
అప్పుడే తన అన్నగారు సాంబశివం ఇంటికి వచ్చేసినట్టు ఫోన్ రావడంతో బండి రిపేర్ కోసం షెడ్లో ఇచ్చి అర నిమిషం ఆలస్యం చేయకుండా ఆటో మీద చక్రంని తీసుకుని తన అన్నగారింటికి వెళ్లిపోయాడు శివప్రసాద్.
''ఇదిగో అన్నయ్య నీ కొడుకు... నువ్వు వెళ్లేటప్పుడు వీడికి కాస్తంత ప్రపంచ జ్ఞానం అలవాటు చేయరా అన్నావు. ఈ మూడు నెలల కాలంలో నాకే వీడు బోల్డంత ప్రపంచజ్ఞానం అలవాటు చేశాడు. ఇదిగో ఈసారి.. వీడికి ప్రపంచజ్ఞానం లేదని దాన్ని వీడికి అలవాటు చేయమని ఎవరికీ ఇలా అప్పచెప్పకు ఎందుకంటే ప్రపంచజ్ఞానం అనేది ప్రపంచమే నేర్పిస్తుంది.. అది నేర్పితే వచ్చేది కాదులే.''
''సరే మీరు క్షేమమే కదా. ఇక నేను వెళ్తాను. ఆ దేశంలో ఉన్న మీ పెద్దోడు క్షేమమే కదా. మీ మరదలుని తీసుకుని ఒకసారి వస్తాలే.'' అంటూ శివప్రసాద్ తన వదినగారిని కూడా పలకరించాడు..
''సరే నీ మోటార్ బండి ఏది? కొద్దిగా కుంటుతూ నడుస్తున్నట్టున్నావు.. ఏం జరిగింది?'' ఆత్రుతగా ప్రశ్నించాడు అతని అన్నగారు సాంబశివం.
''బండి వాటర్ సర్వీసింగ్కి ఇచ్చానులే.. నాకైతే ఒంట్లో బాగానే ఉంది. కొద్దిగా ఒళ్ళు నొప్పులు మామూలే కదా.'' అంటూ.. వెనుతిరిగి చూడకుండా గబగబా వెళ్లిపోయాడు శివప్రసాద్.
అతని అన్నగారికి విషయం అర్థం కాక.. మట్టిబొమ్మలా ఉండిపోయాడు.
చక్రం తండ్రికి జరిగిన విషయాలన్నీ మొత్తం పూసలు గుచ్చినట్టు చెబుదామనుకున్నాడు. కానీ అప్పటికే మొత్తం మీద ఏదో కాస్తంత ప్రపంచజ్ఞానం అబ్బిన వాడిలా ఇకిలిస్తూ నిలబడ్డాడు.
సాంబశివానికి ఏదో జరిగి ఉంటుంది అన్న అనుమానం వచ్చినట్టు అనిపించి గట్టిగా కేకలు పెట్టి అడిగితే చక్రం జరిగింది జరిగినట్టు చెప్పేశాడు.
''అర్థమైందిరా బాబు. ప్రపంచ జ్ఞానంలో ఎన్నో వందల కోణాలు ఉంటాయి. అందులో ఒక కోణం అబద్ధం ఆడడం. బ్రతకటం కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడడం మీ బాబాయికి బాగా తెలుసు. నాకు ఆ మాత్రం కూడా తెలియదు, ముక్కుసూటి మనిషిని. అందుకనే నేను ఏ వ్యవహారం చక్కబెట్టలేక మీ బాబాయ్ మీద పెడుతూ ఉంటాను.''
''మంచో చెడో అలాంటి కొన్ని విషయాలు నీకు ప్రాక్టికల్గా నేర్పుతాడు అనుకున్నాను. నేర్పే ఉంటాడు కానీ నీకే అలవాటు కాలేదు.''
''ఇలా చిన్నచిన్న అబద్ధాలు ఆడటం కాకుండా మరో కోణం ఏమిటంటే సమయాన్ని బట్టి మాట్లాడకుండా మౌనంగా ఉండి అదో రకంగా వెకిలిగా నవ్వడం.. ఇంకా దగ్గు రాకపోయినా దగ్గడం.. ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆ రకంగా ప్రవర్తించడం... ఇవి కూడా మీ బాబాయ్కి బాగా వెన్నతో పెట్టిన విద్యలు. ఇలాంటివి నేర్పించమని వాడికి నిన్ను అప్పచెప్పడం నాదే తప్పు. మీ బాబాయి చెప్పినట్టు అంతా కాలమే చూసుకుంటుందిలే..'' అంటూ కొడుకుని అతని గదిలోకి పంపించేశాడు చక్రం తండ్రి సాంబశివం.
అంతా చూస్తూ వింటున్న చక్రం తల్లి ఆండాళమ్మ మాత్రం విషయం కొంచెం కూడా అర్థంకాక తల గోక్కుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది బొత్తిగా ప్రపంచ జ్ఞానం లేనిదానిలా.
****
సమాప్తం
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #అశ్వవిన్యాసం, #AshwaVinyasam, #MoralFolkStoryTelugu, #జానపదకథ
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments