top of page
Original.png

నేటి లోకం తీరు

నేటి లోకం తీరు, తెలుగు కథ, ఆధునిక జీవితం, కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు పిల్లలు, రెసిడెన్షియల్ స్కూల్స్, కార్పొరేట్ జీవితం, తెలుగు సామాజిక కథ, contemporary Telugu story, family values, modern lifestyle, parenting issues, Telugu short story, social satire, village vs city life, Telugu literature, emotional Telugu story, Mana Telugu Kathalu

 www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ నేటి లోకం తీరు కథలో గ్రామ బజారులో తన పూర్వ విద్యార్థితో ఆధునిక జీవనశైలి గురించి మాట్లాడుతున్న రావుగారు.
 www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ నేటి లోకం తీరు కథలో గ్రామ బజారులో తన పూర్వ విద్యార్థితో ఆధునిక జీవనశైలి గురించి మాట్లాడుతున్న రావుగారు.

Neti Lokam Theeru - Telugu Emotional Story | Chilakamarri Rajeswari

నేటి లోకం తీరు - తెలుగు భావోద్వేగ కథ | చిలకమర్రి రాజేశ్వరి

Published in manatelugukathalu.com on 20/06/2026 


నేటి ప్రపంచంలో సౌకర్యాలు పెరిగాయి... కానీ సమయం తగ్గిపోయింది.

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం దేశాలు తిరుగుతున్నారు. అయితే ఈ పరుగులో కుటుంబ బంధాలు, గ్రామాలతో ఉన్న అనుబంధం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు ఎక్కడో వెనుకబడిపోతున్నాయా?

"నేటి లోకం తీరు" కథ, ఆధునిక జీవనశైలిపై చురకలు వేస్తూనే మనల్ని మనం ఒకసారి ఆలోచించుకునేలా చేస్తుంది. వ్యంగ్యం, వాస్తవం, భావోద్వేగం కలగలిపిన ఈ కథ ప్రతి కుటుంబం చదవాల్సిన కథ.


బజారులో కనిపించిన స్నేహితుడి కొడుకు, శిష్యుడు అయిన అశోక్ ను "ఏమోయి, ఎప్పుడు వచ్చావు? ఈ మధ్య చాలా రోజులైనట్టుందే ఇంటికి వచ్చి?" అని అడిగారు రావుగారు.


“నాన్నగారు ఏదో ముఖ్యమైన పని ఉంది రమ్మంటే నిన్న వచ్చాను మాష్టారు. తరచూ రావాలంటే ఎలా కుదురుతుంది? నాది అసలే పర్యటనల ఉద్యోగం. గాలిలో తిరగడాలు తప్పితే నేల మీద నిలబడటానికి కూడా తీరిక ఉండటంలేదు. అయినా ఈ ఊరు వచ్చామంటే వళ్ళు హూనమైపోతుంది. ఈ రహదారిలో ఉన్నన్ని గుంతలు ఎక్కడా ఉండవు. ఎన్నేళ్లైనా వీటి రాత మారదు" అన్నాడు అశోక్.


"నీకు చాలా పలుకుబడి ఉందటగా, ఎవరినైనా ప్రముఖులను మన ఊరు చూడటానికి తీసుకురావచ్చుగా? ఆ వంకనైనా మన ఊరి రహదారులు బాగుపడతాయి" అన్నారు రావుగారు.


"భలే చెప్పారు మాష్టారు, మన ఊరిలో ఏముంది చెప్పండి ఎవరినైనా తీసుకురావడానికి?" అన్నాడు అశోక్.


"అంతేలే, మన ఊళ్ళో ఏముంది? ఏదో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక దేవాలయం, చెరువు, ఉదయమే లేచి పొలం గట్ల మీదకు వెళితే చల్లని గాలి, మీరు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల తప్ప. అయినా మీరందరూ గాలిలో తిరిగేవాళ్లు, మన ఊరిలో రహదారులు ఎలా ఉంటే మీకెందుకు? ఇంతకీ నువ్వు ఒక్కడివే వచ్చావా, భార్య పిల్లలను తీసుకువచ్చావా?" అన్నారు రావుగారు.


“మా ఆవిడ ఉద్యోగరీత్యా సమావేశానికి ముంబైకి వెళ్లింది. ఇంకా నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళని ఎప్పుడో చాలా పేరుగొన్న రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించేశాము. అన్నీ వాళ్ళే చూసుకుంటారు, సంవత్సరానికి ఇంత ఫీజు కట్టేస్తే ఇంక మనలను ఏమీ అడగరు" అని గొప్పగా చెప్పాడు అశోక్.


“అవును మరి, లక్షల కొద్దీ డబ్బులు గుమ్మరించినప్పుడు ఆ మాత్రం బాధ్యత ఉండాలి. మరి అయితే సెలవులు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? అప్పుడైనా ఇంటికి వస్తారా?” అని కొంచెం వెటకారంగా అన్నారు.


ఆ వెటకారాన్ని విననట్టే "ఆ పాఠశాల వాళ్ళు చాలా క్రమశిక్షణను పాటిస్తారు. ఇంటికి వస్తే వాళ్ల దినచర్య మారిపోతుందేమోనని, సెలవుల్లో కూడా వాళ్ళే విహార యాత్రలకు తీసుకెళతారు. చదువు, వ్యక్తిత్వ వికాసం, అన్ని రంగాలలో కొత్త విషయాలు నేర్పిస్తారు. మేము మాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్లి చూసి వస్తాం.


అయినా మా ఉద్యోగాలతో మా ఇద్దరికే ఒకరితో ఒకరు మాట్లాడు కోవడానికి సమయం ఉండదు. ఇంకా వాళ్లను ఎక్కడ చూస్తాం? ఇలాంటి బాదరాబందీ ఉండకూడదనే వెతికి, బాగా ఆలోచించి ఆ పాఠశాలలో చేర్పించాం. పాఠశాల రుసుములు చాలా ఎక్కువే అనుకోండి, అయినా మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ మాత్రం పెట్టలేమా!" అన్నాడు అశోక్.


"అవునులే బాబూ, అంత మంచి భవిష్యత్తు ఎలా వదులుకుంటాం. కాకపోతే అన్నిటి మధ్యలో పిల్లలు అమ్మ నాన్నలను మర్చిపోతేనే కష్టం. అవన్నీ పట్టించుకోవడానికి మీకు తీరిక ఎక్కడిది! మిమ్మల్ని మొన్న మా వాడు ఇలాగే పని ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోయింది అని గొడవ పెడుతున్నాడని, పోనీ ఒక రెండు రోజులు మన ఊరికి వచ్చి ఉండరా అన్నాను. 


వాడేమన్నాడో తెలుసా, నేనిప్పుడు 'క్షణం విశ్రాంతి' అనే విశ్రాంతి స్థలంలోనే ఉన్నాను, నా విశ్రాంతిని భగ్నం చేయకు అన్నాడు. అదేమిట్రా మన ఊరికే రావచ్చు కదా, ఇక్కడ హాయిగా అమ్మ చేతి వంట తిని, మాతో కబుర్లు చెబుతూ గడపవచ్చు కదా అంటే, ‘నీకేం తెలుస్తుంది నాన్న, అక్కడికి వచ్చాము అంటే మా సమయమంతా వృధాయే. ఇక్కడ ఒక్క నిమిషం కూడా మాతో వృధా చేయనీయరు. ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటారు. రోజుకు 5000 రూపాయలు వసూలు చేసినా మనం బాధపడక్కర్లేదు’ అని. 


ఈ మాట విని మా ఆవిడ హృదయం కొట్టుకు పోయిందనుకో, ‘రోజుకు 5000 రూపాయలు కట్టించుకొని మరీ పనులు చేయిస్తున్నారా’ అని. ఎంతైనా కన్నతల్లి మనసు కదా, బాధ ఉండటం సహజం. మీ నాన్న మనవడి పుట్టినరోజు వస్తోంది, ఇక్కడ ఏవేవో చేసేయాలి అని తెగ మురిసిపోతున్నాడు. మరి పుట్టినరోజుకైనా మీ వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తావా?" అన్నారు.


“నాన్నగారు అలాగే అంటుంటారు మాష్టారు, మా ఇబ్బందులు మీకేం తెలుస్తాయి? ఇక్కడ ఏం చేస్తాం? మాకు కావాలనుకున్నవి ఇక్కడ దొరకవు. అమెజాన్ డెలివరీ రాదు, స్విగ్గీ, బ్లింక్ ఇట్‌లు లేవు. ఏం కావాలన్నా పక్క ఊరికి వెళ్లి తెచ్చుకోవాలి. రెండు రోజుల ముందు నుంచీ సెలవు పెట్టి చేయడానికి మాకు సెలవు దొరకదు. అందుకని మేమే ఆ రోజు వాడి పాఠశాలకు వెళ్లి పిల్లలకు పార్టీ ఇస్తాం, ఆ సాయంత్రం ఒక గంట పర్మిషన్ తీసుకొని." చాలా కష్టపడిపోతున్నట్టు అన్నాడు అశోక్.


“అవునవును, మీ ఇబ్బందులు మాకేం అర్థమవుతాయి బాబూ. అదే మొన్న మా మనవడి పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పి, ‘ఇవాళ ఏం చేశారురా, అమ్మ నీకోసం ఏం చేసింది?’ అని అడిగితే 'నా పొట్ట నా ఇష్టం' అని ఫోన్ పెట్టేసాడు. 


నేను కంగారుపడి ఏమైందిరా అని మా అబ్బాయిని అడిగితే, వాడు ఒక నవ్వు నవ్వి, ‘నీకేం తెలియదు నాన్నా, అది మా ఊళ్ళో కొత్తగా పెట్టిన ఐదు నక్షత్రాల హోటల్ పేరు. ఇంకా 'తిని పో, పొట్ట పెంచుదాం'.. అవి కూడా కొత్తవే. అన్నింటికన్నా ఇదే బాగుంటుందని వాడి పుట్టినరోజు అక్కడ ఎంతో గొప్పగా చేస్తున్నాం, అదీ విషయం. నువ్వేం కంగారుపడకు’ అని చెప్పాడు. 


వాడు చెప్పిన హోటల్ పేర్లు విన్న తరువాత తెలుగుకి ఎంత మంచి రోజులు వచ్చాయి అనే ఆనందంతో నా కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి అనుకో. ఇదే నేటి లోకం తీరు, మిమ్మల్ని ఒక్కళ్ళనీ అనేదేముంది?" అన్నారు వ్యంగ్యంగా రావుగారు.

“సరే మాష్టారు, ఇంక నేను వెళతాను. సాయంత్రం బయలుదేరి మా ఊరికి వెళ్లిపోతున్నాను. రేపు తప్పనిసరిగా హాజరు కావాల్సిన సమావేశం ఉంది" అన్నాడు అశోక్, పొడిగిస్తే ఇంకా ఏం వినాల్సి వస్తుందో అని.


“అలాగే అశోక్, నీ విలువైన సమయం చాలా వృధా చేసినట్టున్నాను కదూ, ఏమీ అనుకోకు," నవ్వుతూనే ఒక చురక అంటించి కదిలారు రావుగారు.


***

చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page