top of page
Original.png

శూన్యం నుండి శిఖరానికి

2 minutes ago
8 min read

శూన్యం నుండి శిఖరానికి కథలో అమ్మ వంటిల్లు వ్యాపారంతో విజయం సాధించిన అరుంధతి, ఆమె పిల్లలు రవి, పల్లవి

Shoonyam Nundi Sikaraniki - Telugu Inspirational story | Kanakadurga Lakshmirathna

శూన్యం నుండి శిఖరానికి - తెలుగు స్ఫూర్తిదాయక కథ  | కనకదుర్గా లక్ష్మీరత్న

Published in manatelugukathalu.com on 18/10/2026


శూన్యం నుండి శిఖరానికి అనేది కష్టాలను అధిగమించి స్వయం ఉపాధితో విజయాన్ని సాధించిన అరుంధతి జీవిత ప్రయాణాన్ని వివరించే స్ఫూర్తిదాయక తెలుగు కథ. ఆత్మవిశ్వాసం, పట్టుదల, కుటుంబ బాధ్యతలు, మహిళా సాధికారతకు ఈ కథ ఒక చక్కని ఉదాహరణ.


"అమ్మా! అరుంధతికి డిగ్రీ చదివించే స్థోమత నాకు లేదు. నాకొచ్చే జీతంతో ఎలాగో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం.


నాన్న దాని పెళ్లికోసమని కొంత డబ్బు దాచి పెట్టారు కదా! దానితో పెళ్లి చేసేస్తే దాని బతుకు అది బతుకుతుంది. హేమ వాళ్ల పిన్ని కొడుకు పెళ్లికి ఉన్నాడుట. జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్. వాళ్లకు పెద్ద చదువులు అక్కర్లేదు, ఇంటిని చక్కదిద్దుకుంటే చాలు అన్నారట. నువ్వేమంటావ్?" అని అడిగాడు కొడుకు వేణు.


"నీ పరిస్థితి నాకు తెలియంది కాదు. ఈ మాట దానితో కూడా చెబుతాను," అంది తల్లి.

పక్క గదిలో పడుకున్న అరుంధతి వారి సంభాషణ అంతా విని, తల్లి వస్తుంటే పడుకున్నట్లు గబుక్కున కళ్లు మూసుకుంది.


వారం రోజుల తర్వాత అరుంధతి, తాను గత ఏడాదిగా ప్రేమిస్తున్న తన కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఆనంద్ అనే కుర్రాడిని చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని తల్లి ముందుకొచ్చి నిలబడింది. ఊహించని ఈ సంఘటనకు ఇంట్లో వాళ్లంతా కొయ్యబారిపోయారు.


వేణు తేరుకుని ఆ కుర్రాడిని విచారించగా... ఆనంద్ డిగ్రీ చదివి చిన్న కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా చేస్తున్నాడని, తమ కులం కాదని తెలిసి అరుంధతి కుటుంబం ఉగ్రరూపం దాల్చింది.


అరుంధతి వదిన హేమ, "అయ్యో! ఏ మొహం పెట్టుకుని ఈ విషయం మా పిన్నికి చెప్పేది? పోనీ కదా మంచి చేద్దామని చూస్తే మీ కూతురు చేసిన నిర్వాకం చూశారా అత్తయ్యా! ఊరంతా పొక్కితే మనకెంత అప్రతిష్ఠ? రేపు నా పిల్లలను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు?" అని ఆవేశపడిపోయింది.


"అన్నయ్య నిక్షేపం లాంటి సంబంధం తెస్తే, దాన్ని కాలరాసి, సరైన చదువు, ఉద్యోగం లేనివాడిని కళ్లు మూసుకుపోయి చేసుకున్నావా? పైగా మనవాడు కూడా కాదు!" అని తల్లి విరుచుకుపడింది.


"ఇంట్లో మాట మాత్రమైనా చెప్పకుండా పోయి పెళ్లి చేసుకుని, సిగ్గులేకుండా మా ఆశీర్వాదం కోసం వచ్చావా? వాడిలో ఏమి చూసి చేసుకున్నావ్? అసలు నిన్ను ఎలా పోషిస్తాడనుకున్నావ్? వాడితో నీ బతుకు కుక్క బతుకే! ఇక్కడి నుండి తక్షణం పో! మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావ్. నిండా ఇరవై కూడా లేవు, వీధిలో తలెత్తుకోకుండా చేశావ్! నీకు సిగ్గుంటే మళ్లీ ఈ గడప తొక్కకు!" అని వేణు తలుపేసేశాడు.


ఆనంద్‌కి తల్లి లేదు. తండ్రి మందుల కంపెనీలో పనిచేస్తాడు. ఆయన నిరాదరించకపోయినా, "పెద్దింటి అమ్మాయివి, ఇక్కడ ఏమి సుఖపడతావని పెద్దగా సంపాదన లేని మా అబ్బాయిని చేసుకున్నావ్?" అన్నాడు.


"ఒక్క కులం మినహాయిస్తే, ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మాది కూడా మీ స్థాయే. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తుంటే ఇక ఆనంద్‌తో పెళ్లి తప్ప వేరే మార్గం లేదనుకున్నాను," అని బిక్కమొహంతో చెప్పింది అరుంధతి.


"నాన్నా! ఇక్కడ ఉంటే అరుంధతి వాళ్ల అమ్మవాళ్లు సూటిపోటి మాటలు అంటారు. మేము హైదరాబాద్ పోతాము. అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి, అక్కడే సేల్స్‌మ్యాన్‌గా చేరుతాను," అన్నాడు ఆనంద్.


తాను సంపాదించిన డబ్బులు, తండ్రి కొంత ఇచ్చినవి తీసుకుని హైదరాబాద్‌లో ఒక చిన్నఇంట్లో కాపురం పెట్టాడు ఆనంద్. ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరగ్గా తిరగ్గా ఆనంద్‌కి ఒక కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా ఉద్యోగం వచ్చింది. చాలీచాలని జీతంతో వాళ్లకు రోజులు ఇబ్బందిగా గడుస్తున్నాయి.


ఒకరోజు అరుంధతి, "డిగ్రీ లేని నాకు ఉద్యోగం కూడా రాదు. నీకు తెలుసు కదా, మా అన్నయ్యకు ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదని మా అమ్మ వంటపని చేస్తుండేది.


సెలవుల్లో ఆవిడతో పాటు సాయంగా నేను వెళ్లేదాన్ని. నాకు వంట ఒక్కటే తెలిసిన విద్య. సిటీలో ఎక్కువమంది ఉద్యోగాలకు వెళుతుంటారు కాబట్టి వారికి వంటకి మనిషి అవసరం పడుతుంది. ఎక్కడైనా అపార్ట్‌మెంట్‌లో వంటకి వెళ్తాను," అంది.


"నువ్వు మీ అన్నయ్య తెచ్చిన టీచర్‌ని చేసుకుంటే ఇలా వంటలు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. మనం తొందరపడ్డామేమో?" అని దిగాలుగా అన్నాడు ఆనంద్.


"కష్టమో, సుఖమో నీతో జీవితం అనుకుని వాళ్లను కాదనుకుని వచ్చేశాను. నేనిక వెనక్కి చూడదలచుకోలేదు. 'మమ్మల్ని కాదనుకుని ఎలా బతుకుతావో చూస్తాను' అన్నాడు మా అన్నయ్య.


మనం బతికి చూపించాలి! నువ్వేమీ అడ్డు చెప్పకు. రేపు మన కుటుంబం పెరుగుతుంది, అప్పుడు నీ ఒక్కడి సంపాదనతో కుటుంబం ఎలా గడుస్తుంది? మన పక్కింటి అమ్మాయి ఆ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో వంట చేస్తుంది. అక్కడ పని ఉందని చెప్పింది, రేపు వెళ్తాను," అంది.


అరుంధతికి అపార్ట్‌మెంట్‌లో వంటపని దొరికింది. వంట బాగా చేస్తుండటంతో మరిన్ని ఇళ్లల్లో కుదురుకుంది. ఇప్పుడు ఇద్దరి సంపాదనతో ఇల్లు ఇబ్బంది లేకుండా నడుస్తోంది. ఆనంద్ అప్పుడప్పుడు తండ్రి ఊరు వెళ్లి చూసి వస్తున్నాడు.


రోజులు గడుస్తున్నాయి. అరుంధతి పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది. ఆనంద్ తండ్రి వచ్చి చూసి వెళ్లాడు. పిల్లాడికి ఏడాది వచ్చేవరకు అరుంధతి వంటపని మానుకుంది. మళ్లీ 'కటాకటి' జీవితం మొదలైంది.


ఇలా అయితే పిల్లాడి పెంపకం కూడా కష్టమైపోతుందని అరుంధతి తాను పనిచేసే అపార్ట్‌మెంట్‌లో తనంటే అభిమానం చూపే ఆవిడ దగ్గరకు వెళ్లి, "నాకు కొంచెం ఒక రెండుమూడు వేల డబ్బు సహాయం చేస్తే, దానితో స్నాక్స్, స్వీట్స్ చేసి మీ అపార్ట్‌మెంట్‌లోనే సేల్ చేస్తాను. పిల్లవాడిని చూసుకుంటూ పని చేసుకోవడానికి నాకు ఇదొక్కటే మార్గం.


డబ్బు చేతికి అందగానే మీ బాకీ తీర్చేస్తాను," అని ప్రాధేయపడింది.

ఆవిడ పెద్ద మనసుతో డబ్బు సహాయం చేసింది. పిల్లవాడు పడుకున్నప్పుడు, ఆనంద్ ఇంట్లో ఉన్నప్పుడు అరుంధతి స్వీట్స్, స్నాక్స్ చేసి అపార్ట్‌మెంట్‌లో అమ్మడం మొదలెట్టింది.


అరుంధతి హస్తవాసి తెలిసి ఉండటంతో అమ్మకాలు కూడా బాగా సాగుతున్నాయి. వారాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఆనంద్ సాయంతో స్టాల్స్ పెట్టి స్వీట్స్, స్నాక్స్‌తో పాటు పొడులు, పచ్చళ్లు కూడా అమ్మడం మొదలెట్టింది. అన్న ప్రకారం అరుంధతి పెట్టుబడి డబ్బు తీర్చేసింది.


ఆ రాత్రి భోజనాల వేళ ఆనంద్‌తో, "ఇప్పుడు రవికి మూడేళ్లు నిండాయి కాబట్టి ఇంట్లోనే టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే వ్యాపారమూ పెరుగుతుంది, దానికి తగ్గట్టు ఆదాయమూ వస్తుంది.


ముందుముందు రవిని స్కూల్లో వేస్తే ఫీజులు కట్టడానికి ఇబ్బంది కూడా ఉండదు," అంది.

"సరే! కానీ నీ శక్తికి మించిన పని పెట్టుకోకు. మూలపడితే మొత్తానికే మోసం," అన్నాడు.


మొదట తేలికగా ఉంటుందని ఇడ్లీ, దోశలతో మొదలుపెట్టింది. ఆరంభంలో పలచగా మొదలైనా నెమ్మదిగా చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ల వాళ్లు, ఆఫీసుకి వెళ్లే బ్యాచిలర్స్, డెలివరీ బాయ్స్, ఆటోవాళ్లు రావడం మొదలెట్టారు. కొన్నాళ్లకు ఇంకొక రెండు వెరైటీలు పెంచింది.


ఆనంద్ ఇంట్లో ఉన్నప్పుడు అరుంధతికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేసినా, తప్పుడు మనిషిని చేసుకోలేదని అరుంధతి గర్వపడింది.


రవిని స్కూల్లో వేశారు. జీవితం ఒక కొలిక్కి వచ్చింది. ఆనంద్ తండ్రి కూడా కొడుకు జీవితం గాడిలో పడినందుకు సంతోషించాడు.


అరుంధతి రెండవసారి తల్లయింది. ఇలాంటి పరిస్థితిలో ఇల్లు, పెరుగుతున్న వ్యాపారం సంబాళించడం ఎలాగా అని తల్లడిల్లింది. ఆనంద్ బజారు పనులు, తనకు వీలైనంతవరకు వ్యాపారంలో సాయపడుతున్నాడు. అరుంధతి మహాలక్ష్మి లాంటి ఆడపిల్లని ప్రసవించింది.


పల్లవి అని నామకరణం చేశారు.

వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంటోంది. పగలు టిఫిన్ సెంటరు, వారాంతాల్లో పచ్చళ్లు, స్వీట్స్, స్నాక్స్ బిజినెస్‌తో జీవితం ఇబ్బంది లేకుండానూ, బిజీగానూ గడిచిపోతోంది.


ఒక్కోసారి ఆనంద్ కన్నా అరుంధతి ఆదాయమే ఎక్కువ వచ్చేది.

పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులూ పెరుగుతున్నాయి. వారి ఫీజులు, పుస్తకాలకి ఇబ్బంది లేకుండా సాయంత్రం పూట బజ్జీలు, పుణుకులు పెడతానని, భర్తను పనిలో తనకు సాయపడమని అడిగింది.


సాయంత్రం మొదలెట్టే బజ్జీల అమ్మకాలు రాత్రి తొమ్మిది దాకా జోరుగా సాగేవి. ఆఫీస్ నుండి వచ్చాక ఆనంద్ సాయంత్రం వ్యాపారం చూసుకుంటుంటే అరుంధతి పిల్లల చదువులు, ఇంటి పని చూసుకునేది.


వ్యాపారం బాగా నడుస్తుండటంతో పిల్లలను ఏ లోటూ లేకుండా చదివించసాగారు. అరుంధతి శుచిగా, శుభ్రంగా చేస్తుందని పేరు ఉండటంతో వ్యాపారం పుంజుకుంది. పిల్లలు కూడా చక్కగా చదువుకుంటూ పెద్దవాళ్లయ్యారు. అక్కడే సెంటర్లో వసతిగా ఉండే ఇంట్లోకి మారారు.


ఒక రాత్రి సేల్స్ పని మీద ఊరు వెళ్లి తిరిగొస్తున్న ఆనంద్ బైక్‌ని హైవే మీద లారీ గుద్దేయడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వార్త విన్న అరుంధతి చలనం లేని శరీరంలా మ్రాన్పడిపోయింది.


గ్రీష్మ రుతువులో ఎండిపోయిన నదిలా ఆమె కళ్లల్లో కన్నీరు ఇంకిపోయింది. అప్పుడప్పుడే విచ్చుకోబోతున్న పువ్వును పూర్తిగా విచ్చుకోకముందే కోసేసినట్లయింది అరుంధతి జీవితం. అప్పటికి రవి డిగ్రీలోనూ, పల్లవి పదవ తరగతి పరీక్ష రాసి ఉన్నారు.


పిల్లలు బిక్కచచ్చిపోయారు. జీవితం అగమ్యగోచరమైపోయింది.


ఆనంద్ తండ్రి వచ్చాడు. కొడుకు పోయిన దుఃఖంలో, "నిన్ను చేసుకున్నందుకు మీ వాళ్లు శాపనార్థాలు పెట్టారు, అవే వాడిని కొట్టేసాయి.


ఏదో మాకు తగ్గ పిల్లని చేసుకుంటే నా కళ్ల ముందే ఉండేవాడు, గంజి తాగాయినా బతికేవాళ్లం! నిన్ను, పిల్లలను సుఖపెట్టాలని ఇదిగో ఇలా ఊళ్లు తిరిగే ఉద్యోగం అయితే డబ్బులు ఎక్కువ వస్తాయని ఒప్పుకున్నాడు, ఇప్పుడు మనిషే లేకుండా పోయాడు," అని ఏడ్చి ఏడ్చి వెళ్లాడు.


అరుంధతికి నోట మాట రాలేదు. 'తాను, పిల్లలు దిక్కులేని వారైపోతే ఓదార్చాల్సింది పోయి, ఈ అనర్థానికి నన్నే కారకురాలిని చేస్తాడా ఈ పెద్దమనిషి?' ఆ క్షణంలోనే పెళ్లి చేసుకుని వచ్చిన తనను తల్లి, అన్నయ్య అన్న మాటలు గుర్తుకొచ్చి, అంతవరకు గుండెల్లో బండగా మారిపోయిన ఆమె దుఃఖం, తుఫాను తాకిడికి సముద్రం ఉప్పొంగినట్లుగా ఉప్పొంగింది.


ఆనంద్ ఆఫీసు వాళ్లు లక్ష రూపాయల భరణము, అతనికి రావలసిన జీతము అరుంధతి చేతిలో పెట్టి, "మీకు సమ్మతమైతే మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తాం," అన్నారు. అరుంధతికి ఆ డబ్బులో ఆనంద్ ముఖం కనిపించి, ఉబికివస్తున్న కన్నీళ్లతో, పిల్లాడిని పంపడం సమ్మతం కాదని తల అడ్డంగా ఆడించింది.


పిల్లలతో, "మీ చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు. చదువుకుంటే మీ కాళ్ల మీద మీరు నిలబడగలరు, నాకూ చేయూతనివ్వగలరు. అప్పుడే మీ నాన్నకు శాంతిగా ఉంటుంది," అని ధైర్యాన్ని నూరిపోసింది.


టిఫిన్ సెంటర్ బదులు "అమ్మ వంటిల్లు" అని బోర్డు పెట్టింది. ఉదయం టిఫిన్లతో పాటు, 'ఆఫీసులకు వెళ్లేవాళ్లకు క్యారేజీ ఇవ్వబడును' అని రాసింది. కూతురికి పదవ తరగతి పరీక్షలు అయిపోవడంతో తల్లికి సాయం చేస్తోంది. బాక్సులు కట్టి ఇవ్వడానికి రైస్ ఐటమ్స్ మొదలెట్టింది. పులిహోర, బిర్యానీ, బిసిబేళా బాత్, టమాటో రైస్ మొదలైన వెరైటీస్ ఉండేలా చేస్తోంది. ఐటమ్స్ కట్టి ఇవ్వడానికి గానూ పల్లవి బోర్డు మీద "Bring Your Own Box" అని రాసింది. ఉద్యోగం చేసే బ్యాచిలర్స్ వచ్చి బాక్సులు తీసుకెళ్తున్నారు. సాయంత్రం బజ్జీల వ్యాపారం కొడుకు సాయంతో సాగిస్తోంది.


అలా కొన్నాళ్లు సాగింది. ఇదివరకు ఇద్దరి సంపాదనతో ఇల్లు, టిఫిన్ సెంటర్ నడిపేవారు, ఇప్పుడు ఒక్క చేత్తో రెండూ నడపాల్సి వస్తోంది. రవి చిన్న చిన్న పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.


పల్లవి పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయింది. "నీకు ఏ సబ్జెక్టు ఇష్టమైతే అదే తీసుకో. నాకు ఫీజు కట్టడం కష్టమవుతుందని ఆలోచించకు, నువ్వు చదువుకుని వృద్ధిలోకి వస్తే అదే నా కష్టానికి ఫలితం," అంది. పల్లవి ఇంజనీరింగ్ అంటే ఇష్టమని MPC తీసుకుంటానంది. కాలేజీలో రవి, పల్లవి ఆర్థికంగా బలహీనంగా ఉండే వారికిచ్చే స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేయగా ఇద్దరికీ మంజూరయ్యాయి.


అరుంధతి వంట చేసుకోలేని పెద్దవాళ్లకు క్యారేజీ సర్వీస్ కూడా మొదలెట్టింది. ఇప్పుడు అరుంధతి ధ్యేయం ఒక్కటే... పిల్లల చదువులకు ఏ ఇబ్బందీ రాకూడదని! పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుంటూ, వారి ఖాళీ సమయంలో తల్లికి వీలైనంత సహాయం చేస్తున్నారు.


అరుంధతి భర్త విషయం తెలిసి కాలనీలోని వాళ్లు, అపార్ట్‌మెంట్‌లోని వాళ్లు తమ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు ఆర్డర్లు ఇవ్వడం మొదలెట్టారు. ఒక రోజు రవి కాలేజీ హాస్టల్లో అరుంధతి చేసిన పొడులు, ఊరగాయలు శాంపిల్స్ ఇచ్చాడు. వారికి నచ్చి కందిపొడికి, గోంగూర పచ్చడికి ఆర్డర్ ఇచ్చారు.


అరుంధతికి అది చాలా పెద్ద ఆర్డర్! తల్లి కష్టంలో తమ వంతు పాలుపంచుకుంటూ బాసటగా నిలుస్తున్న పిల్లలను చూస్తే అరుంధతికి ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి.


రవి స్నేహితుడు తన పాత స్కూటీ అమ్ముతుంటే, "అమ్మా! స్కూటీ తీసుకుంటే నీకు క్యారేజీ సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నీకు సైకిల్ తొక్కడం వచ్చు కనుక, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే నీకు నడపడం వచ్చేస్తుంది. ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఇస్తానన్నాడు," అన్నాడు.


మంచి ఐడియాగానే అనిపించింది అరుంధతికి. సాయంత్రాలు రవి సాయంతో అరుంధతి, పల్లవి ఇద్దరూ స్కూటీ నడపడం నేర్చుకున్నారు. క్యారేజీ సర్వీసుకి స్కూటీ బాగా ఉపయోగపడుతోంది.


రవి డిగ్రీ పూర్తయింది. "అమ్మా! నేను కొన్నాళ్లు నీతో పాటు వ్యాపారం చూసుకుంటాను, తర్వాత MBA చేస్తాను," అన్నాడు. పల్లవికి కూడా ఆ ఊర్లోనే ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. ఆ రోజు అరుంధతి, పల్లవి ఇంజనీరింగ్‌లో చేరుతోందని, రవి తనతో పాటు వ్యాపారం చూసుకుంటున్నాడని భర్త ఫోటో దగ్గరకు వచ్చి చెప్పింది.


ఒక రోజు అరుంధతికి ఒక బర్త్‌డే పార్టీకి ఆర్డర్ వచ్చింది. పాస్తా, శాండ్‌విచెస్ అడిగారు. సంప్రదాయ వంటలు తప్ప అరుంధతికి ఈ వంటలు అసలు తెలియవు, ఆర్డర్ కాస్తా పోయింది. ఆ రోజు ఇంట్లో చెబితే పిల్లలు, "అవునమ్మా! ఇప్పుడు అందరూ ఎక్కువగా అవి ఇష్టపడుతున్నారు. కష్టమేమీ కాదు, యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు," అన్నారు.


కొద్ది రోజులు అరుంధతి పనులన్నీ అయ్యాక రాత్రుళ్లు యూట్యూబ్‌లో కొత్త కొత్త వంటలు చూసి నేర్చుకోవడం మొదలెట్టింది.


రవి బోర్డు మీద మెనూ కింద నూడుల్స్, శాండ్‌విచెస్, పాస్తా, వడాపావ్ చేర్చాడు. "అమ్మ వంటిల్లు" గురించి ఆ నోటా ఈ నోటా వ్యాపించి ఒడుగు, పెళ్లికూతురు ఫంక్షన్లకు బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్స్ రావడం మొదలెట్టాయి.


అంచెలంచెలుగా వ్యాపారం ఎదుగుతుండటంతో వ్యాపారం నిలబడటానికి, తానూ నిలదొక్కుకోవడానికి అరుంధతి తనకు సహాయంగా ఇద్దరు మనుషులను పెట్టుకుంది. వారికి వంటలో మెళకువలు నేర్పించింది.


రవి "అమ్మ వంటిల్లు" గురించి మార్కెటింగ్ చేస్తూ కొత్త ఆర్డర్స్ తేవడానికి ప్రయత్నిస్తున్నాడు. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి రవి బ్యాంక్ లోన్ తీసుకుందామన్నాడు.


అరుంధతి కస్టమర్ ఒకావిడ బ్యాంకులో పనిచేస్తుంది. ఆవిడ అరుంధతి వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి తన బ్యాంకులో లోన్ ఇచ్చే ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే అరుంధతి తన ఊరగాయలు, పొడులు, స్వీట్స్, స్నాక్స్ శాంపిల్స్ బ్యాంకులో స్టాఫ్‌కిచ్చింది. వారికి నచ్చి ఆర్డర్స్ ఇచ్చారు, లోన్ కూడా శాంక్షన్ అయింది.


రవి పెద్ద వంటలు చేయడానికి అనువుగా ఒక కమర్షియల్ స్పేస్‌ని అద్దెకి తీసుకుని పెద్ద పెద్ద స్టవ్‌లు కొందామని చెప్పాడు. దానితో ఇంకో నలుగురిని సహాయానికి పెట్టుకుంది.


ఫుడ్ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టడానికి రవి మార్కెటింగ్ చేశాడు. పని ఒత్తిడి పెరగడంతో చిన్నా చితకా అనారోగ్యాలు చేసినా తిప్పుకుని మళ్లీ పనుల్లో పడుతోంది. రవి సహాయంతో విస్తరించిన వ్యాపారం వల్ల అరుంధతి తీసుకున్న లోన్ తీర్చేసి, మరికొంచెం ఎక్కువ అమౌంట్ లోన్ తీసుకుని పెద్ద స్థాయిలో కేటరింగ్ సర్వీస్ మొదలెట్టింది.


ఎక్కువ మంది మనుషులను పెట్టుకుని పెళ్లిళ్లు, గృహప్రవేశం మొదలైన కాంట్రాక్ట్స్ తీసుకోవడం మొదలెట్టింది. వ్యాపారం ఎంత వృద్ధి అయినా నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంది. ఇదే అరుంధతికి మంచి పేరు తీసుకొచ్చింది. అంతే కాకుండా తన వద్ద పనిచేసే వారికి అవసరం పడితే డబ్బు సాయం కూడా చేస్తోంది.


కేటరింగ్ బిజినెస్ పుంజుకుంది. పల్లవి ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో బహుళ జాతీయ సంస్థలో ఉద్యోగం తెచ్చుకుంది. రవి, పల్లవిని చెరో పక్క పట్టుకుని భర్త ఫోటో దగ్గరికి తీసుకెళ్లి, "మన పిల్లలు ప్రయోజకులయ్యారు. నాకు ఈ శక్తిని నువ్వే ఇచ్చావు.


నేను డీలా పడినప్పుడల్లా నీ ఫోటో దగ్గరకు వచ్చి నిలబడేదాన్ని, వెంటనే నాకు నా కర్తవ్యం గుర్తుకొచ్చేది. ఇక పల్లవి పెళ్లి చేస్తే నా బాధ్యత అయిపోయినట్లే. వ్యాపారాన్ని రవికి అప్పజెప్పేసి నేను వాడి వెనుక ఉంటాను," అంది అరుంధతి.


ఒకనాడు ఒక యూట్యూబర్ వచ్చి అరుంధతితో, "మీ 'అమ్మ వంటిల్లు' గురించి విన్నాను. మీ కేటరింగ్ సర్వీస్ గురించి కవర్ చేస్తే మీకు ఇంకా వైడ్ కవరేజ్ వస్తుంది, మీకు అభ్యంతరం లేదు కదా?" అని అడిగాడు.


సరేనన్నారు అరుంధతి, రవి. ఆ కుర్రాడు వర్క్ స్పేస్ అంతా కవర్ చేసి, అక్కడ స్టాఫ్‌ని ఇంటర్వ్యూ చేసి అరుంధతితో... "మేడమ్! మీరు ఒంటి చేత్తో 'అమ్మ వంటిల్లు' పెట్టి విజయవంతంగా నడపడమే కాకుండా పది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.


ఇది ఎలా సాధ్యమైందో చెబితే మిగతా వాళ్లకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది," అన్నాడు.

అరుంధతి తాను టిఫిన్ సెంటర్ ఎలా మొదలెట్టింది, అంచెలంచెలుగా ఎలా వృద్ధి చేసిందీ చెప్పి... "సవ్యంగా సాగిపోతున్న నా సంసారంలో ఉన్నట్లుండి చీకట్లు కమ్ముకున్నాయి.


చీకటి చేసిన దేవుడే మళ్లీ వెలుగు వైపు నడవడానికి మార్గం చూపించాడు. ఆ మార్గంలోనే నేను సహాయం కోరినప్పుడు పెద్ద మనసుతో ఆదుకున్న పెద్దవాళ్లు ఉన్నారు. నా పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు అండగా నిలబడ్డారు. నా భర్త బ్రతికి ఉన్నప్పుడు నాకు బాసటగా నిలిచాడు, లేనప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు కర్తవ్యాన్ని గుర్తుచేసేవాడు.


జీవితంలో కష్టాలు ఎప్పుడూ చెప్పి రావు! కష్టం వచ్చినప్పుడు పరిస్థితులు ఎంత కృంగదీయాలని చూసినా, తట్టుకుని నిలబడి మన జీవితాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా... దిక్కుతోచక అయోమయ స్థితిలో ఉన్న వారికి చేయూతనిచ్చి వారి జీవితానికి ఒక ఆధారం చూపిస్తే, భగవంతుడు మనకి చూపించిన వెలుగు మార్గంలో పది మందిని నడిపించిన వారమవుతాము," అంది.


రవి, పల్లవి తల్లికేసి గర్వంగా చూస్తూ, "మా నాన్న లేని లోటు తెలియకుండా మమ్మల్ని నిలబెట్టడమే కాకుండా, మా అమ్మ తన జీవితాన్ని చూపిస్తూ మాకు ఎలా జీవించాలో నేర్పించింది," అని తల్లికి చెరోవైపు చేయి వేసి పట్టుకున్నారు.


***

కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కనకదుర్గా లక్ష్మీరత్న

రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page