నిజమైన ఆభరణం

Nijamaina Aabaranam - Telugu Family Story | Chilakamarri Padmavathi
నిజమైన ఆభరణం - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి పద్మావతి
Publishes in manatelugukathalu.com on 18/11/2026
బంగారం కంటే ప్రేమ, మంచితనం, మానవత్వమే గొప్ప ఆభరణాలని చెప్పే హృదయస్పర్శి కథ “నిజమైన ఆభరణం”. జీవన, ఆనంద్‌ల దాంపత్య ప్రేమతో పాటు పేద పిల్లల విద్య కోసం వారు చేసే సేవ ఈ కథకు ప్రత్యేకత.
"రైలు ప్రయాణికులు అందరూ వినండి... మీ దగ్గరున్న విలువైన బంగారం, డబ్బు లాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి... జేబుదొంగలు ఉన్నారు... మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి..." ఖంగుమనే కంఠంతో, ఉద్యోగరీత్యా వచ్చిన కరకుదనంతో చేతిలో లాఠీని ఊపుకుంటూ చెప్తున్న మహిళా కానిస్టేబుల్ వైపు చూసింది జీవన.
అప్పుడే ఆ కానిస్టేబుల్ దృష్టి కూడా ఆమెపై పడింది... జీవననే చూస్తూ దగ్గరకి వచ్చిన కానిస్టేబుల్ ప్రత్యేకంగా ఆమె వంటి మీద ఉన్న బంగారం చూస్తూ, "ఏమిటి ఇంత బంగారం పెట్టుకుని ఇలా వస్తారా ఎవరైనా... కొంగు కప్పుకుని జాగ్రత్తగా ఎక్కండి... తర్వాత ఏమన్నా జరిగితే మా చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఇబ్బంది పెడతారు" ఒకలాంటి నిర్లక్ష్యం నిండిన స్వరంతో ఒకటికి రెండుసార్లు అదే మాట చెప్తూ జీవన వైపే చూసుకుంటూ మిగిలిన ఇద్దరు పోలీసులతో కలిసి ముందుకు వెళ్లింది.
ఆ కానిస్టేబుల్ మాటలకి భార్యాభర్తలు ఇద్దరూ అనుకోకుండా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు... అదే సమయంలో మరి ఇంకెంతమంది కళ్లు జీవన మీద పడ్డాయో...
ఇంతలో మైక్‌లో రైలు రాబోతోంది అనే ప్రకటన వినబడటంతో అందరూ అప్రమత్తం అయ్యారు.
రైలు ఎక్కి వాళ్ల సీట్లలో కూర్చున్న వెంటనే ప్లాట్‌ఫారం మీద తననే చూస్తూ వెళ్లిన కానిస్టేబుల్ చూపులు గుర్తొచ్చి కొద్ది క్షణాలు భయం వేసింది. వెంటనే తన వంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ తీసి చేతిలో ఉన్న బ్యాగ్‌లో జాగ్రత్తగా పెట్టుకుంది.
ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఏదన్నా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాం అనుకుని భర్త ఆనంద్ వైపు చూసిన జీవన, బాగా అలసిపోయి అప్పటికే పై బెర్త్ ఎక్కి పడుకున్న అతని ముఖం చూసి ఏమీ మాట్లాడలేకపోయింది.
అతని విశ్రాంతికి భంగం కలిగించకుండా నిశ్శబ్దంగా కళ్లు మూసుకుంది. నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తోంది కానీ కళ్లు మూసుకోగానే మళ్లీ ప్లాట్‌ఫారం మీద కానిస్టేబుల్ అన్న మాటలు గుర్తొచ్చి ఉలిక్కిపడి లేచింది.
అసంకల్పితంగా తన చేతిలో బంగారు ఆభరణాలు పెట్టిన బ్యాగ్‌ను గట్టిగా నొక్కి పట్టుకుంది.
'అమ్మో... ఈ పోలీస్ వాళ్లకి, దొంగలకి మధ్య ఏదన్నా లాలూచీ ఉందేమో... వాళ్లే దొంగలకి ఫలానా రైల్లో ఫలానా వాళ్లని ఒక చూపు చూడండి అని పంపుతారేమో... అలా అయితే ఇవాళ వాళ్ల చూపు నా మీద పడిందా... అయ్యో! పెళ్లి వాళ్ల అంతస్తుకి తగ్గట్టు ఉండాలని లేని గొప్పలకి పోయి ఈయన చెప్తున్నా వినకుండా అక్క ఆభరణాలు అడిగి మరీ తీసుకుని వేసుకొచ్చాను.
ఇప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే... అసలే వాళ్ల అమ్మాయి పెళ్లి కూడా ఉంది వచ్చే నెలలో...' అని అనుకుంటుంటే దుఃఖం ఆగలేదు జీవనకి.
అడగ్గానే తీసుకెళ్లు అని ఎంతో ప్రేమగా ఇచ్చిన అక్క మీద కోపం వచ్చింది. ఎవరికైనా ఇలా కూడా కోపం వస్తుందా అని నవ్వు కూడా వచ్చింది మరుక్షణం లోనే.
ఇంతలోనే ఎదురు సీట్లలో కూర్చున్న వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి.
వాళ్లు ఈ రూట్‌లో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, పోలీస్ శాఖ వారు ఆ దొంగల ముఠాను పట్టుకోలేకపోతున్నారని... అలా ఏవో దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నారు.
ఆ మాటలు విన్న జీవనకి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆ కానిస్టేబుల్ గురించి, రక్షణ శాఖ గురించి తప్పుగా అనుకున్నందుకు బాధపడుతూ చుట్టూ చూసింది.
అందరూ ఎవరి గోలలో వాళ్లున్నారు. 'వాళ్లకి ఏమీ నాకున్న భయాలు లేవా... ఈ రాత్రి జాగరణ తప్పదు... ఇంక నాకు ఆ దేవుడే దిక్కు' అనుకుంటూ మనసులో తను రోజూ పారాయణ చేసుకునే స్తోత్రాలు వల్లె వేసుకుంటూ రాత్రంతా మేలుకునే ఉంది క్షణక్షణం భయంతో ఎప్పుడు రైలు దిగుతామా అని ఎదురుచూస్తూ... ఏది ఎలా ఉన్నా గమ్యస్థానానికి చేర్చడం ఒకటే నా పని అన్నట్టు ముందుకు సాగుతూనే ఉంది రైలు.
చివరికి జీవన, ఆనంద్ దిగవలసిన గమ్యం రానే వచ్చింది. హమ్మయ్య అనుకుంటూ బ్యాగ్ పదిలంగా పట్టుకొని రైలు దిగి పెళ్లి జరిగే కళ్యాణ మండపం చేరుకున్నారు.
అక్కడ పాత మిత్రుల పలకరింపుల వల్ల, జీవన రాత్రంతా పడిన మనోక్షోభ నుంచి కాస్త ఉపశమనం పొందింది.
పెళ్లి మండపం అలంకరణ మరియు అక్కడకి విచ్చేసిన బంధుమిత్రులు అన్నిటిలోనూ కనిపిస్తున్న దర్పం... ఒక రకంగా లక్ష్మీదేవి అక్కడే నడయాడుతున్నట్టు ఉంది.
అంత గొప్ప వాళ్లు తమని గుర్తు పెట్టుకుని పెళ్లికి పిలవటం... ఫోన్ చేసి మరీ మరీ రమ్మని చెప్పడం... ఇదంతా తన భర్త మంచితనానికి ఇచ్చిన బహుమతి అని చాలా ఆనందంగా అనిపించింది జీవనకి.
అక్కడ కలిసిన ప్రతి వారూ ఆనంద్‌తో కరచాలనం చేసి మాట్లాడటం చూస్తుంటే జీవనకి గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అంతకంటే గొప్ప ఆభరణం ఏం కావాలి అని అనుకుంది.
అందరినీ పలకరించి ఆనంద్ ఇంకా ఎవరితోనో మాట్లాడుతుండటం చూసి, "ఒక పది నిమిషాలలో రెడీ అయి వస్తా" అని చెప్పి వాళ్లకు కేటాయించిన గదికి నడిచింది జీవన.
స్నానం చేసేటప్పటికి ప్రయాణ బడలిక అంతా పోయి పూర్తి ఉత్సాహంతో పెళ్లికి పట్టుచీర కట్టుకుని సిద్ధం కాసాగింది జీవన.
అంతా రెడీ అయ్యాక చేతి సంచీలోంచి నగలను బయటికి తీసి మెడలోనూ, చేతులకు వేసుకుని అద్దంలో చూసుకుంది.
స్వతహాగా తెల్లగా అందంగా ఉండే జీవన, బంగారు ఆభరణాలతో ఇంకా మెరిసిపోయింది. అద్దంలో తన ప్రతిరూపాన్ని చూసుకుని తనే మురిసిపోయింది.
ఇంతలోనే తను రాత్రి పడిన వేదన అంతా మదిలో కదలాడింది. వెంటనే ఒకటొకటిగా నగలు అన్నీ తీసేసి తనవైన నల్లపూసల గొలుసు, చిన్న నెక్లెస్, రెండు చేతులకు నాలుగేసి గాజులు మాత్రం ఉంచుకుంది.
మిగిలిన వాటినన్నిటిని జాగ్రత్తగా చేతి సంచీలో సర్ది భుజానికి తగిలించుకుని ఒకసారి అద్దంలో చూసుకుని, 'బానే ఉన్నాలే' అనుకుంటూ పెళ్లి జరుగుతున్న హాల్ వైపు నడిచింది.
నడుస్తోందే కానీ ఆలోచనలు ఎటో వెళ్లిపోతున్నాయి... జీవన, ఆనంద్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం, ప్రేమ. భగవంతుడు అన్నీ ఇచ్చినా వాళ్లకు పిల్లల్ని మాత్రం ఇవ్వలేదు.
ఎంతమంది డాక్టర్స్‌ను కలిసినా, ఎన్ని దేవాలయాలను దర్శించినా ఫలితం లేకపోయింది.
పిల్లలు లేని ఆనంద్, జీవన తాము సంపాదిస్తున్న డబ్బుల్లో సగభాగం పేద పిల్లల విద్యాభ్యాసం కోసం ఖర్చుపెడుతుంటారు. స్థిరాస్తులు, బంగారం, వెండి లాంటివి ఎక్కువ కూడబెట్టటం కన్నా విద్య నేర్చుకోలేని వారికి చేయూత నివ్వటంలోనే ఎక్కువ ఆనందం, తృప్తి కలుగుతాయని ఇద్దరి భావన. ఆ క్రమంలోనే జీవన ఎక్కువ బంగారం కొనుక్కోలేదు.
జీవితం మరెవరికోసమో కాదు మన కోసం మనం బ్రతకాలి అని తృప్తిగా జీవించే కొద్దిమందిలో వీరిద్దరూ ముందుంటారు.
ఎప్పుడూ అలవాటు లేని జీవన మొదటిసారి తనవి కాని బంగారు నగలు ధరించి పెళ్లివాళ్లకు తగ్గట్టుగా ఉండాలని అనుకుంది.
ఆ విషయం గురించే మనసులో అనుకుంటూ తనని తానే తిట్టుకుంది. ఆనంద్‌కి ఇష్టం లేని పని చేసినందుకు బాధపడింది.
ఇంతలోనే, "ఏయ్ జీవనా... ఎటు వెళ్లిపోతున్నావ్... నేను ఇక్కడే ఉన్నాను" అంటున్న ఆనంద్ వైపు నడిచింది ఆలోచనల్లోంచి తేరుకుని.
జీవన వైపు తేరిపార చూసిన ఆనంద్, జీవన వాళ్ల అక్క దగ్గర్నుంచి తెచ్చుకున్న నగలు ఏవీ వేసుకోలేదని గుర్తించాడు.
మొహంలో ఆశ్చర్యం, సంతోషం స్పష్టంగా కనిపిస్తూ ఉండగా, "జీవనా... ఏమైంది? నువ్వు ఇంకా పూర్తిగా తయారవలేదా... పోనీ నన్ను సాయం చేయమంటావా..." అంటూ కొంటెగా అడిగాడు.
"ఆనంద్... సరిగ్గా చూసి చెప్పు నేను ఎలా ఉన్నానో..." నవ్వుతూ అతని కొంటెతనాన్ని ఇంకొంచెం రెచ్చగొడుతున్నట్టుగా అంది జీవన. "నా జీవన ఎలా ఉన్నా నా కళ్లకి దేవతలానే కనిపిస్తుంది...
ఇంతకీ ఏమిటి విషయం?" మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు ఆనంద్.
"అబ్బో... అలానా... అయితే వినండి... నా దేవుడే నాకు గొప్ప ఆభరణం అని తెలుసుకున్నా... అందుకే అవన్నీ మళ్లీ జాగ్రత్తగా సర్దేశా..." అని చేతిసంచీని చూపించింది జీవన.
"ఏమండీ... ఈ బరువు నేను మోయలేకపోతున్నాను... మనం రేపు ఉదయమే బయల్దేరి మన ఊరు వెళ్లిపోదాం... వెళ్లగానే అక్క నగలు అక్క చేతిలో పెట్టేస్తాను..." అని జీవన అనగానే, "నువ్వంటే నాకు అందుకే అంత ఇష్టం జీవనా" అంటూ ప్రేమగా జీవన చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆనంద్.
ఇంతలోనే అటువైపు వస్తున్న ఒక స్నేహితుడు, "హే హనీమూన్ కపుల్... ఎక్కడికి వచ్చినా మీ ఇద్దరే కబుర్లు చెప్పుకుంటారా... అక్కడ మన బ్యాచ్ అంతా గానా బజానా మొదలు పెట్టారు... మీ కోసమే వెతుకుతున్నా... రండి... రండి... పదండి" అంటూ తొందర చేశాడు.
ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుని కళ్లతోనే నవ్వుకుంటూ అతన్ని అనుసరించారు సంతోషంగా.
***************************************
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
చిలకమర్రి పద్మావతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి పద్మావతి
నా పేరు చిలకమర్రి పద్మావతి
నేను విజయవాడ ఆంధ్రా బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ చేశాను.. మా వారు శ్రీ మరింగంటి సుందర శ్రీనివాస్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ నుండి రిటైర్ అయ్యాక ఇద్దరం విశ్రాంతి జీవితం గడుపుతున్నాము .మాకు ఇష్టమైన ప్రదేశాలన్నీ తిరగటం ,మా పిల్లల, మనవరాళ్ళ ఫోటోలు వీడియోలు చూడటం..ఇవే మా ఆనందాలు.. మొదటి నుంచి (పుస్తకాలు) కథలు నవలలు చదవటం అలవాటు..చిత్ర కళ లో కొద్దిగా ప్రవేశం వున్నా అన్ని లలిత కళలను ఆస్వాదించడం చాలా ఇష్టం..
మా మనవరాళ్ళకి కథలు చెప్పటం ఇంకా ఇంకా ఇష్టం.










Comments