top of page
Original.png

నిప్పుల వర్షం

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #NippulaVarsham, #నిప్పులవర్షం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nippula Varsham - New Telugu Story Written By - Veluri Prameela Sarma

Published In manatelugukathalu.com On 26/01/2026

నిప్పుల వర్షం - తెలుగు కథ

రచన: వేలూరి ప్రమీలాశర్మ

చలిగాలుల తీవ్రతకి ఎముకలు కొరుకుతున్నట్టు మంటపుడుతుంటే.. అస్థికి కవచంగా ఉన్న ఎర్రటి నెత్తుటిముద్దల మాంసభాగం గడ్డకట్టిపోతోంది. గొంతులోకి చుక్కనీరు ఒంపుకుందామన్నా ఘనీభవించిన నదిలోని నీరు దాహార్తిని తీర్చడానికి పనికిరావట్లేదు. 


టార్పాలిన్ కప్పుకున్న డేరాల ఇరుకుగదిలో ఓ గంటసేపైనా నిద్రకుపక్రమిద్దామని కటికనేలపై దుప్పటిపరుచుకుని వెచ్చదనంకోసం ముడుచుకుని పడుకున్నాడు శ్రీసేన్. మిణుగురుపురుగుల మెరుపుకాంతులు తప్ప గుడారంబయట అంతా కన్నుపొడుచుకున్నా కనపడనంత చీకటిగా ఉంది. 


కొద్దిసేపటి తర్వాత తూనీగలగుంపు ఒక్కసారిగా తరుముకొస్తున్నట్టు గాలిని చీల్చుకుంటూ శబ్దం చెవులకి తాకుతుంటే ఉలిక్కిపడిలేచాడు శ్రీసేన్. గుడారంలోంచి తల బయటకుపెట్టి ఆకాశంవైపు చూసి తుళ్లిపడ్డాడు. చిక్కటి చీకటిలో నిప్పులు మోసుకొస్తున్నట్టు పైన పదికి పైగా డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. సైనిక స్థావరాలకు పైన ఎగురుతూ పేలోడ్ లలోనించి పేలుడు పదార్థాలు కిందకు జారవిడుస్తున్న డ్రోన్లను చూసి ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాడు. 


 తమకు ఆహార పదార్థాలను తీసుకువచ్చిన ఆర్మీ వాహనం.. పేలుడు ధాటికి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కిందపడటం చూసి సైనికుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అంతవరకూ ట్రక్కులోపలే పడుకుని నిద్రపోతున్న డ్రైవరు శరీరం ఛిద్రమయ్యింది. మృతదేహం చిందరవందరగా పడి ట్రక్కు విడి భాగాల మధ్య చిక్కుకుంది. ఆకాశంనుంచి నిప్పులవర్షం కురిపిస్తూ ఎగురుతున్న డ్రోన్లే కాకుండా కృత్రిమమేధతో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నేరుగా ఢీ కొట్టడానికి దూసుకువస్తున్న శత్రుదేశపు యూఏవీ డ్రోన్లను నిలువరించేందుకు ఫిరంగితో మెరుపు దాడికి దిగాడు శ్రీసేన్. 


ఇరవై అడుగులదూరంలో ఉన్న మరో రెండు గుడారాలలోని సైనికులు కూడా ఈ శబ్దాలకు అప్రమత్తమయ్యారు. తమ సైనికస్థావరాలపై నిప్పులు కురిపిస్తూ పడుతున్న బాంబులను లెక్కచెయ్యకుండా ధీటుగా ఎదుర్కొంటున్నవారిలో.. నలుగురు సైనికులు డ్రోన్ల దాడిలో మరణించడంతో అక్కడున్న సైనికులందరిలోనూ ఆవేశం కట్టలుతెంచుకుంది. తలవాల్చిన సైనికుల శరీరం నుండి చిందే మరో రక్తపుబొట్టు మట్టిలో ఇంకకముందే.. శత్రుదేశం వ్యూహాన్ని చిత్తుచెయ్యాలనే గట్టి తలంపుతో గుండెలపై చెయ్యివేస్కుని ప్రతిజ్ఞ చేసుకున్న శ్రీసేన్ కంట కారిన కన్నీరు.. ఉప్పొంగిన లావాయే అయ్యింది. 


మరో నిమిషానికి సైనికుల గుడారాలే లక్ష్యంగా డజన్లకొద్దీ డ్రోన్లు దూసుకురాసాగాయి. కొద్ది నిముషాల వ్యవధిలోనే అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. అప్రమత్తమైన సైనికులు ఒక్కొక్కరుగా ఆయుధాలు చేతపట్టి ముందుకి దూకుతున్నారు. ఆకాశంలో ఎగురుతున్న డ్రోన్లు జనావాసాలవైపుకి గురిపెడితే తీవ్రమైన నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన సైనికులు సైరన్లుమోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. 


గుడారాలు వదిలి బయటకు వస్తే తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసినా సైనికులు వెనుకడుగు వెయ్యలేదు. తూటాలతో ఎదురుదాడికి ఇది సమయం కాదని, మరఫిరంగులు చేతబట్టారు సైనికులు. శ్రీసేన్ లక్ష్యం గురి తప్పలేదు. ఫిరంగి నుండి వెలువడిన గుండు ధాటికి డ్రోన్లు చెల్లాచెదురయ్యి.. రెండు డ్రోన్లు ధ్వంసమయ్యాయి. పదిమందికి పైగా సైనికులు ప్రాణాలతో బయటపడ్డారు. చూస్తుండగానే సైనికుల ప్రతిదాడిలో మరో నాలుగు డ్రోన్లు నేలకూలాయి. డ్రోన్లను ధ్వంసం చేస్తూ వీరోచితంగా పోరాడుతున్న సైనికుల్లో మరో ఇద్దరు మందుగుండు తాకిడికి నేలకూలారు. ఆ ఇద్దరిలో శ్రీసేన్ కూడా ఒకడు. 


ఆ వీర సైనికుడు.. మాతృభూమికి వందనం అంటూ నేలను ముద్దాడుతూ తన తుదిశ్వాసను విడిచాడు. 

****

దేశంకోసం శ్రీసేన్ ఎలా పోరాడాడో, తన ముద్దుల కుమారుడు శ్రీతేజ్ కి ప్రతిరోజూ కళ్ళకు కట్టినట్టు వివరించి చెబుతూనే ఉంది హనీష. అనంత్ నాగ్ లో శాలువాలు అమ్మే చిన్న దుకాణం నడుపుకుంటున్న హనీష.. తన భర్త వీరమరణాన్ని గురించి అక్కడి చిన్నపిల్లలకు కథలు కథలుగా చెబుతుండేది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన కొందరు యాత్రికులు కూడా ఆమె మాటలను ఆసక్తిగా వినేవారు. 


 ఆరోజు యాత్రికులు గుమిగూడి ఉన్న ఆప్రాంతం వివిధ భాషలకు చెందిన టూరిస్టులతో కోలాహలంగా ఉంది. చాలా కాలం తర్వాత తాము నేసిన శాలువాలకు మంచి గిరాకీ దొరకడంతో హనీషా ఉత్సాహంగా వాటిని యాత్రికులకు చూపిస్తోంది. దుకాణం పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీలో కూచుని క్లాసు పుస్తకాలు చదువుకుంటున్నాడు శ్రీతేజ్. 


ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉగ్రవాదుల తుపాకీమోతలతో దద్దరిల్లిపోయింది. కకావికలైన టూరిస్టులు భయంతో చెట్లు, దుకాణాల వెనక దాక్కుని నక్కినక్కి చూస్తున్నారు. కనికరంలేని ఉగ్రవాదులు దొరికినవారిని దొరికినట్టుగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతున్నారు. తూటాల వర్షంతో రక్తం ఏరులై పారింది. తమ కళ్ళఎదుటే తమవారిని కాల్చి చంపుతున్నా.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని పంటిబిగువున అదిమిపట్టి నోటినుండి కేకలు బయటకి రాకుండా చేతితో నోరు నొక్కుకుని, భయంతో వణికిపోతున్నారు అక్కడున్నవారు. క్షణాల్లో ఆ ప్రాంతమంతా తెగిపడిన శరీరభాగాలు, ఛిద్రమైన తలలతో రక్తం ఎగజిమ్ముతుండగా మరుభూమిలా మారిపోయింది. 


తన తండ్రి ఏ విధంగా శత్రువులపై పోరాడాడో, తల్లి చెప్పినదంతా శ్రీతేజ్ కి కళ్ళముందు కదలాడింది. ఆవేశంతో ఆ పసిమనసు రగిలిపోయింది. క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. జూలు విదిల్చిన సింహంలా ముందుకు దుమికిన శ్రీతేజ్.. ఉగ్రవాదులమీదకు మెరుపు వేగంతో దూకి, ఒక ఉగ్రవాది చేతిలోని తుపాకీ లాక్కుని వారిపై తూటాల వర్షం కురిపించాడు. ఐదు, ఆరు రౌండ్లు కాల్చినా ఆ పసిమనసు ఉద్రేకంతో ఎగిరెగిరిపడుతూనే ఉంది. 


పిట్టల్లా రాలిపోయిన తమదళం సభ్యుల్ని వదిలి నలుదిక్కులకీ పారిపోతున్న ఉగ్రవాదుల్ని చూసి గర్వంగా తల ఎగరేసాడు శ్రీతేజ్. పూలవర్షం కురిసినట్టు మేఘాలనుంచి సన్నని ఝల్లులు ఒంటిని తడుపుతుంటే.. మేఘాలనడుమ నీడలా కనపడుతున్న తనతండ్రి చిత్తరువుకి సెల్యూట్ చేసాడు శ్రీతేజ్. ఇంట్లోకి వెళ్ళి, తన తండ్రి ఫోటోకి కిందనున్న బల్లపై ఉంచిన రైఫిల్ ని ప్రేమగా స్పృశించి, “నేను నీ బిడ్డని నాన్నా!” అన్నట్టు గర్వంగా తలెత్తి కన్నీటితో తండ్రి ఫోటో వైపు చూసాడు. ఉద్విగ్నతతో హనీషా బిడ్డను గుండెలకు హత్తుకుంది. 

****

జనవరి 26వ తేదీ.. పెరేడ్ గ్రౌండ్స్ లో వందన సమర్పణ పూర్తయ్యింది. రాష్ట్రపతి చేతులమీదుగా అత్యున్నత పురస్కారాలను అందుకోవడానికి అక్కడికి చేరుకున్న త్రివిధ దళాలకు చెందినవారి కుటుంబ సభ్యుల హృదయాలు ఆర్ద్రతతో బరువెక్కాయి. కొందరికి తమవారి మరణానంతరం, మరికొందరికి తాము ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా పరమవీరచక్ర, అశోక చక్ర పురస్కారాలు అందజేయబడుతున్నాయి. 

పిన్న వయస్కుడైన శ్రీతేజ్.. తాను ప్రదర్శించిన ధైర్య సాహసాలకు అశోక చక్ర పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. తన భర్త ప్రతిరూపమైన పులిబిడ్డ శ్రీతేజ్ వెనుకనే నిలబడి రాష్ట్రపతికి వందనం చేసిన హనీషా.. మాతృభూమి రక్షణకై తన బిడ్డను మరో సైనికుణ్ణి చేసిన వీరమాతగా నిలిచింది. 

 

 —----సమాప్తం—----


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@PramiTalks

•7 hours ago

నా రచనలోని భావాలను మీ స్వరంలో వినడం చాలా సంతోషం కలిగించింది.

Like

@arunaavadhanula1536

•6 hours ago

రచన దానికి తగ్గ స్వరం చాలా బాగుంది👏

Like
bottom of page