నిశ్శబ్ద తరంగాలు
- Munipalle Vasundhara Rani

- 2 days ago
- 2 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #NissabdaTharangalu, #నిశ్శబ్దతరంగాలు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nissabda Tharangalu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published In manatelugukathalu.com On 01/01/2026
నిశ్శబ్ద తరంగాలు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
నా 55 ఏళ్ల జీవిత ప్రయాణంలో ఎన్నో వేడుకలు, వందల మంది మనుషులను చూశాను. కానీ ఈ రోజు నేను వెళ్లిన పుట్టినరోజు వేడుక నా జీవితంలోనే మర్చిపోలేని ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోయింది. హాల్‌లోకి అడుగుపెట్టగానే నన్ను ఒక తెలియని నిశ్శబ్దం పలకరించింది. సాధారణంగా పార్టీ అంటే ఉండే కేరింతలు, సందడికి భిన్నంగా అక్కడ అంతా "పిన్ డ్రాప్ సైలెన్స్". హాల్ నిండా మనుషులు ఉన్నా, ఎవరి నోటా మాట లేదు. వారంతా ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న బాబు తాతగారి స్నేహితులు... వీరంతా మనలాంటి శబ్ద ప్రపంచానికి దూరంగా ఉన్నవారు. వారిలో వృద్ధులే కాకుండా మధ్య వయస్కులు కూడా చాలా మంది ఉన్నారు. అంత మందిని ఒకే చోట చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి.
వారి మధ్య మాటలు లేవు కానీ, భావాల ప్రవాహం ఉప్పొంగుతోంది. చేతుల సైగలతో, కళ్లలోని మెరుపులతో వారు ఎంత వేగంగా విషయాలను పంచుకుంటున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. మనం మాటలతో చెప్పలేని ఎన్నో విషయాలను వారు కేవలం ఒక చిన్న సంజ్ఞతో, ఒక చిరునవ్వుతో పంచుకుంటున్నారు. మధ్యలో సడన్‌గా పెద్ద శబ్దంతో పాటలు మొదలయ్యాయి. బేస్ సౌండ్‌కి హాల్‌లోని కిటికీలు కూడా అదిరిపోతున్నాయి, మేమంతా అప్రయత్నంగా స్టేజ్ వైపు తిరిగాము. కానీ, అక్కడ కూర్చున్న వారిలో ఒక్కరు కూడా అటువైపు తల తిప్పలేదు. బాహ్య ప్రపంచం ఎంత గోల చేస్తున్నా, శబ్ద ప్రపంచానికి దూరంగా ఉన్న వారు మాత్రం తమ నిశ్శబ్ద ప్రపంచంలో ఎంతో ప్రశాంతంగా, ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడుపుతున్నారు.
కేక్ కటింగ్ సమయం రాగానే వారంతా ఆ చిన్నారి చుట్టూ చేరారు. బర్త్‌డే బాయ్‌ని దీవిస్తున్న తీరు చూడముచ్చటగా ఉంది. మాటలు రాకపోయినా, వారు ఆ బాబు తల నిమురుతూ, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవుడిని కోరుకుంటూ తమ రెండు చేతులను పైకి ఎత్తి సైగలతో ఆశీర్వదించారు. ఆ సైగలలో ఒక నిశ్శబ్ద ప్రార్థన, గుండె నిండా నిండిన వాత్సల్యం కనిపించాయి. ఆ తర్వాత ఫోటోల సందడి మొదలైంది. ఒకరినొకరు హత్తుకుని, గాలిలో చేతులు ఊపుతూ వారు శుభాకాంక్షలు తెలుపుకుంటున్న తీరు కళ్లకు కట్టినట్లు ఉంది.
ఆ తర్వాత భోజనాల దగ్గర కూడా అదే క్రమశిక్షణ, అదే నిశ్శబ్దం. భోజనం చేస్తూ కూడా వారు తమ సైగలతో వంటకాలు బాగున్నాయని ఒకరికొకరు చెప్పుకోవడం, ఆనందంగా నవ్వుకోవడం చూస్తుంటే, రుచిని ఆస్వాదించడానికి మాటలు అక్కర్లేదనిపించింది. భోజనాలు ముగిశాక అందరూ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వెళ్ళేటప్పుడు ఒకరికొకరు చేతులు కలుపుతూ, భుజం తడుతూ, కళ్లలోనే ఎంతో ఆత్మీయతను చూపిస్తూ వీడ్కోలు చెప్పుకున్నారు. నోటితో "బై" అని చెప్పకపోయినా, వారి కళ్లలో మళ్ళీ కలుద్దాం అనే ఒక నిశ్శబ్ద భరోసా స్పష్టంగా కనిపించింది.
ఆ వేడుక ముగిసి బయటకు వస్తుంటే నా మనసు భారంగా, అదే సమయంలో ఎంతో తేలికగా అనిపించింది. నా ఐదున్నర దశాబ్దాల జీవితంలో ఇలాంటి పార్టీని చూడటం ఇదే మొదటిసారి, బహుశా ఇదే చివరిసారేమో కూడా తెలియదు. మాటలు ఉన్న మనం అనవసరమైన గొడవలతో ప్రపంచాన్ని నింపేస్తున్నామేమో అనిపించింది. నిజమైన సంభాషణ అంటే నోటితో చేసేది కాదు, రెండు మనసులు నిశ్శబ్దంగా పంచుకునేది అని ఆ రోజు నాకు అర్థమైంది. ఆ నిశ్శబ్దంలోనే నాకు వేల మాటల అర్థం దొరికింది.
***
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments