top of page
Original.png

న్యాయదేవత నవ్వింది

న్యాయదేవత నవ్వింది, తెలుగు కథ, అవినీతి న్యాయమూర్తి కథ, జైలు కథ, న్యాయం మరియు ధర్మం, పశ్చాత్తాపం కథ, ప్రేరణాత్మక తెలుగు కథ, సామాజిక కథ, మధుపత్ర శైలజ ఉప్పలూరి, తెలుగు సాహిత్యం

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ న్యాయదేవత నవ్వింది కథలో జైలులో తన తప్పులను గ్రహించి పశ్చాత్తాపంతో నిలుచున్న మాజీ న్యాయమూర్తి లక్ష్మీధర్, పక్కన నిర్దోషులైన ఖైదీలు స్వామి మరియు బిక్షపతి, న్యాయం మరియు మార్పును సూచించే భావోద్వేగ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ న్యాయదేవత నవ్వింది కథలో జైలులో తన తప్పులను గ్రహించి పశ్చాత్తాపంతో నిలుచున్న మాజీ న్యాయమూర్తి లక్ష్మీధర్, పక్కన నిర్దోషులైన ఖైదీలు స్వామి మరియు బిక్షపతి, న్యాయం మరియు మార్పును సూచించే భావోద్వేగ దృశ్యం.

Nyayadevatha Navvindi - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri

న్యాయదేవత నవ్విందితెలుగు ప్రేరణాత్మక కథ| మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 15/06/2026


తన తీర్పులతో అనేక మందికి న్యాయం చేశానని భావించిన ఒక న్యాయమూర్తి, జీవితాంతంలో తనే చేసిన అన్యాయాల భారాన్ని మోసుకోవాల్సి వస్తే? అధికారం, అవినీతి, పశ్చాత్తాపం, విముక్తి అనే భావోద్వేగాల చుట్టూ తిరిగే ఈ హృద్యమైన కథలో, ఒక మాజీ న్యాయమూర్తి తన తప్పులను గుర్తించి నిజానికి ఎలా తలవంచాడో చదవండి. "న్యాయదేవత నవ్వింది" కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది—చట్టం నుండి తప్పించుకోవచ్చు, కానీ మనసాక్షి నుండి కాదు.


ఉదయం ఆరుగంటలయ్యింది. సెంట్రల్ జైల్లో ఖైదీలంతా టీ త్రాగి, తమకప్పగించిన పనులు చేయటానికి సిద్ధమవుతున్నారు.  ఖైదీలతో వడ్రంగి పనులు, చెప్పులు కుట్టటం, రేకుసామాన్లు తయారుచేయడం, తివాచీలు అల్లడం, పట్టు వస్త్రాలు నేయడం, సబ్బులు తయారు చేయటంవంటి పనులు చేయిస్తూంటారు వార్డెన్. 

ఏ ఖైదీ ఊరికే ఉండటానికి వీలులేదు. తమకి నచ్చినపనులలో ఏదో ఒక పని చేయాలి. ఇట్లాంటి పనులు చేసినందుకు ఖైదీలకు కొద్దిపాటి డబ్బులు కూడా ఇస్తారు. 


పదకొండు గంటలకు భోజనం పెడతారు. తిరిగి 12.30కి టీ ఇస్తారు. సాయంకాలం 4 గంటలకు ఈ పనులు ముగించి భోజనం చేసిన తరువాత ఖైదీలనందరిని సాయంత్రం ఆరుగంటలకు బ్యారక్స్‌లోకి పంపి తాళాలు వేస్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం వరకు వారు ఆ బ్యారక్స్‌లోనే ఉండాలి.   


కొందరు ఖైదీలు తోటపని చేస్తున్నారు. వాళ్ళల్లో స్వామి, బిక్షపతి అనే ఖైదీలు చాలా సన్నిహితంగా మెసలుతున్నారు. ఇద్దరూ ఒకే నెలలోనే జైలు కొచ్చారు. వీళ్ళతో పనిచేయిస్తున్న కానిస్టేబుల్ పేపరు చదువుతూ ఓ వార్తని చూసి, “ఛ! ఎంతటి దౌర్భాగ్యపు పనులు చేస్తున్నారు. మామూలు వ్యక్తులుగానీ, సామాన్య జనంగానీ ఏదో పిల్లల చదువుకోసమో, కుటుంబ పోషణకొరకో ఏదో నేరం చేసి జైలుకు రావటం సహజమే.


కానీ నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులే అవినీతిదారుల్లో అడుగులేస్తే? ఛీ! ఎందుకిన్ని కోర్టులు? ఇందరు న్యాయమూర్తులు? న్యాయమూర్తులే న్యాయదేవత తలదించుకునేలా ప్రవర్తిస్తూంటే  ప్రజలు, ఈ దేశం ఏమైపోవాలి?” అని తన మనసులో అనుభవిస్తున్న వేదననంతటినీ అప్రయత్నంగా బయటకి వెళ్ళగక్కుతున్నాడు.  


పనులుచేస్తున్న స్వామి, బిక్షపతులు అతని మాటలను విని, “సారూ! నిజమా ఇది?” అంటూ గబగబా వచ్చి అడిగారు.


“మీకివన్నీ అవసరమా? మీ పని మీరు చేసుకోండి” అంటూ వాళ్ళని ఓ కసురు కసిరి, పేపరక్కడి బెంచీపై కోపంగా పడేసి మరో ప్రక్కకు వెళ్ళాడా కానిస్టేబుల్. 


“సారు పేపర్లో ఏ వార్తని చదివి అంతగా బాధ పడ్డారో?” అని స్వామి పేపరు తీసి చూశాడు.


ముందు పేజీలోనే హెడ్‌లైన్స్‌లో ఉందా వార్త. ఓ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లక్ష్మీధర్ అవినీతి బట్టబయలయ్యింది. ఆ లక్ష్మీధర్ రకరకాలైన మార్గాల ద్వారా తాను తీసుకున్న అవినీతి సొమ్మును తన ఇంటిలోనే ఓ గదిలో దాచి ఉంచాడు. తనకు తప్ప మరెవరికీ ఆ గదిలో ఏముందో తెలియకుండా ఇన్నేళ్ళూ రహస్యంగా జాగ్రత్తపడ్డాడు. ఆ ఇంట్లో పనిచేసే నౌకర్లనేకాదు చివరకు తన కుటుంబ సభ్యులను కూడా ఆ గది పరిసరాలకు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు.  


కానీ నిజం నిప్పులాంటిది. అది ఏదో ఒకనాడు బట్టబయలవ్వక తప్పదు. ఆ లక్ష్మీధర్ పాపంపండి, నిన్న రాత్రి ఆ ఇంటినుండి పొగరావటం గమనించిన ఇరుగుపొరుగు వారు అగ్నిమాపక దళం వారికి సమాచారం అందించారు. వారు వచ్చి నిప్పును ఆర్పే క్రమంలో ఆ రహస్యగది తలుపులు తెరచి చూసి నిర్ఘాంత పోయారు. 


ఆ గది నిండా కరెన్సీ నోట్ల కట్టలే ఉన్నాయి. కాలిపోతున్న నోట్ల కట్టలను ఆర్పి, మిగిలిన వాటిని ఫోటోలు తీశారు. సమాచారమందుకున్న పోలీసువారు, ఆదాయపు పన్ను శాఖ వారు రంగంలోకి దిగి, లక్ష్మీధర్‌ని అదుపులోకి తీసుకున్నారు. 


విచారణాధికారులు అడిగిన ప్రశ్నలకు లక్ష్మీధర్ పొంతనలేని సమాధానాలనిచ్చాడు. పెద్దహోదాలో ఉన్న వ్యక్తి కావటంతో న్యాయవ్యవస్థలో పెద్ద దుమారమే రేగింది. వెంటనే పదవి నుండి తప్పించి విచారణ మొదలుపెట్టారు.  ఆయన అవినీతి పనులపై ఓ కమిటీని వేశారు.  


స్వామి  చదువుతున్న వార్తను వింటున్న  బిక్షపతి  “ఓసారి ఆయన్ని చూడనీరా!” అంటూ పేపర్లోకి తొంగి చూసి ఆ అవినీతి న్యాయమూర్తిని చూసి షాకయ్యాడు. 


“ఒరే స్వామీ! నన్ను గుడి దగ్గరనుండి లాక్కొచ్చి ఇక్కడ జైల్లో పడేయటం అంతా ఈ పెద్దాయన చలవేరా. లంచాలు తినమరిగి అవినీతిపరులకు కొమ్ముకాస్తూ, చివరకి గుడి దగ్గరే సూట్‌కేసులందుకోవటం, అమాయకులను జైల్లో పెట్టించటంవంటి పనులు చేస్తున్న ఇలాంటి పాపిష్టి మనుషులను దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? 


ముష్టివాణ్ణి అందునా ముసలివాణ్ణి అని కూడా చూడకుండా నాపై చేయని నేరాన్ని మోపి నాకు శిక్ష వేశాడా దొర” అంటూ స్వామికి తనకు జరిగిన అన్యాయం అంతా చెప్పి, “పెద్ద నేరాలు చేసే వాళ్ళంతా ఈ జైలుకే వస్తారట కదా. రానీ, మనం చూడకపోం ఆయనగారి కష్టాలను” అంటూ పనిలోకి వెళ్ళటానికి తయారయ్యాడు.


“ఔను బాబాయ్! నీ జీవితంలాగానే నా జీవితాన్ని కూడా బుగ్గిపాలు చేశాడు ఈ లక్ష్మీధర్. ఆటోనడుపుతూ  కుటుంబాన్ని పోషించుకుంటున్న నాపై అన్యాయంగా గంజాయి ముఠాతో కలసి పని చేస్తున్నానని తీర్పుచెప్పిన పెద్దమనిషి ఈయనే! 

ఆరోజు ‘నాకేం తెలియదు బాబూ! ఆ అట్టపెట్టెల్లో గంజాయి ఉందని నాకు తెలియనే తెలియదు. నా భార్యాపిల్లలమీద ఒట్టేసి చెపుతున్నా. నాకు ఆ గంజాయి స్మగ్లింగ్‌కు ఏవిధమైన సంబంధం లేదు’  అని నెత్తినోరూ బాదుకుని చెప్పినా వినలేదు. 


ఈ మహానుభావుడే నేను గంజాయి అమ్మే స్మగ్లర్‌నని తీర్పు చెప్పి ఆరేళ్ళ శిక్షవేశాడు. నీతి, నిజాయితి, పాపం, పుణ్యం అన్నీ ఆ దేవుడు ఎప్పటికప్పుడు లెక్కరాసుకుంటూనే ఉంటాడు.  ఇప్పుడు ఆయన పాపం పండింది. తొందరలోనే ఈ జైలుకే రాబోతున్నాడు” అంటూ కదిలాడు. 


ఆరోజు రానే వచ్చింది. అంత పెద్ద న్యాయమూర్తి లక్ష్మీధర్ జైలులో సాధారణ ఖైదీలా మిగిలిన వారితో కలసి కష్టపడుతున్నాడు. ఓ రోజు తోటపనిలో లక్ష్మీధర్‌ని కలిశాడు స్వామి. “దొరా! బాగున్నారా! నిర్దోషినైన నన్ను దోషిగా తీర్పిచ్చి ఇక్కడికి పంపారు మీరు. బీదవావాడినైన నాకు సాయం చేసే వాళ్ళెవరూ లేకపోయారు ఆరోజు. కానీ మీరు పెద్దోళ్ళు. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. పైగా మీ ఇంటిలో డబ్బులకే ఓ గది ఉందట కదా. మరి ఆ డబ్బునుపయోగించి తప్పించుకోకుండా ఇక్కడిదాకా ఎందుకొచ్చినట్లు? నేనిక్కడ ఎట్లా ఏడుస్తూ రోజులు గడుపుతుతున్నానో ఓసారి చూసి పోవడానికి వచ్చారా?” అంటూ ఈసడింపుగా పలకరించాడు.  


స్వామిని గుర్తుపట్టాడు లక్ష్మీధర్. “ఔను! గంజాయి స్మగ్లింగ్ కేసులో అసలు నేరస్థుణ్ణి తప్పించటానికి 50 లక్షలు లంచం తీసుకుని ఈ స్వామిని అన్యాయంగా ఇరికించి దోషిగా ఆరేళ్ళ జైలు శిక్షను విధిస్తూ తీర్పుచెప్పాను. పాపం అతని కుటుంబం ఎంత బాధ పడుతోందో? నాలాంటివాళ్ళకి ఇలాంటి అవమానం జరగాల్సిందే” అని మనసులో వేదనను అణచుకుంటూ “నీ పేరు స్వామి కదా! నన్ను క్షమించు”  అంటూ పక్కకు వెళ్ళిపోయాడు లక్ష్మీధర్. 


వెళ్తున్న ఆయనను ఆపి “సార్! ఒక్క మాట. మీరు గొప్పోళ్ళు. డబ్బులున్నోళ్ళు. ఒకటి రెండు రోజులలో బెయిల్‌మీద బైటకెళ్ళిపోతారు. కానీ మేం పేదోళ్ళం. రెక్కల కష్టం మీద బ్రతికేటోళ్ళం. అది కూడా మీరు పోగొట్టేశారు. నా భార్యాపిల్లలు ఎంతగా కష్టపడుతున్నారో?” అంటూ గద్గదస్వరంతో పలికాడు స్వామి. అతని మాటలు లక్ష్మీధర్ గుండెలకి శూలాల్లా గుచ్చుకున్నాయి. 


ఇంతలో వార్డెన్ వచ్చి “మీ పనులు మీరు చేసుకోక ఈ సార్‌తో మాటలేమిటి?” అంటూ స్వామిని గదమాయించి “సార్! టీ తెమ్మంటారా?” అని లక్ష్మీధర్‌ని వినయంగా అడిగాడు. 


అప్పుడే అక్కడికి వచ్చిన బిక్షపతి “ఈ సార్‌కి టీలెందుకంట? పెద్దపెద్దవాళ్ళు ఇచ్చేమందు పార్టీలు కావాలిగాని” అన్నాడు. 


వింటున్న వార్డెన్ “చిన్నాపెద్దా తేడాలేకుండా ఏమిటా మాటలు?” అని  కోపంగా అన్నాడు. 


బిక్షపతి రూపం చూసిన లక్ష్మీధర్‌ “ఇతను..ఇతను..  ఆ గుర్తుకొచ్చాడు. గుడిమెట్ల దగ్గర కూర్చునే బిచ్చగాడేగా. గుడి దగ్గర జరిగిన తమ లావాదేవీలు తెలిసి కంప్లయింట్  ఇచ్చినవాడే కదా. తనవల్లనే పాపం అన్యాయంగా ఇతను జైలు పాలయ్యాడు. ఏదో గుడి మెట్లపై కూర్చుని బిచ్చం ఎత్తుకునే ఇతనిపై లేని నేరం మోపి ఈ జైల్లో పడేసాం”  అని మదనపడుతూ ఆలోచనల్లోకి జారుకున్నాడు. 


ఆరోజు దైవదర్శనానికి భార్య పద్మతో కలసి గుడికొచ్చిన తనని ఈ బిక్షపతి ‘ధర్మం చేయమని’ అడిగాడు. పద్మ తన పర్స్‌లోని పదిరూపాయిలను అతని జోలెలో వేసింది. ‘వెయ్యేళ్ళు చల్లగా ఉండు తల్లి’ అంటూ మనసారా దీవించాడు బిక్షపతి. 


“పద్మా! ఇలాంటి ముష్టివాళ్ళకు డబ్బులేసి వీళ్ళని సోమరిపోతులుగా తయారు చేయకూడదు” అన్నాడు లక్ష్మీధర్.


“ఏమండీ! ఒకసారి అతని వాలకం చూడండి. ఎముకలగూడులాంటి శరీరంతో  ఈ  వృద్ధుడు  ఏం పనులు చేయగలడు చెప్పండి” అంటూ గుడిలోకి దారితీసింది పద్మ. 

ధ్వజస్తంభం దగ్గరకు రాగానే లక్ష్మీధర్‌కి ఫోను వచ్చింది. గబగబా వెనక్కివెళ్ళి ఫోను మాట్లాడటం మొదలుపెట్టాడు. “ఈ పాడు ఫోన్లకి గుడిలేదు, బడిలేదు” అని విసుక్కుంటూ తాను ఒక్కత్తే గుడిలోకి వెళ్ళింది పద్మ. 


ఓ వ్యక్తి “సార్! నమస్కారం. నా పేరు రమణమూర్తి. కాంట్రాక్టర్‌గా నాకు ఈ ఊళ్ళో పలుకుబడి ఉంది. మా అబ్బాయి రాత్రి పార్టీకి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ చేశాడు.  ఆ యాక్సిడెంట్‌లో ఓ ఏడేళ్ళ పిల్లాడి ప్రాణం పోయింది. పోలీసులు కేసు ఫైలు చేసారు. రోడ్డుప్రక్కన  నివసిస్తున్న వలస కార్మికుల గుడిసెలోకి మా వాడు తాగిన మైకంలో కారు పోనివ్వటంతో ప్రమాదం జరిగింది. 


సార్! మీరిలాంటి కేసుల్లో బాగా తీర్పు చెప్తారని చాలామంది లాయర్లు  నాకు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకండి నాకు. ఎంత డబ్బయినా ఖర్చుపెడతాను.  మీరు..” నసుగుతూ చెపుతున్నాడు. 


“ముందు మీరు ఓ అయిదు లక్షల రూపాయిలు ఆ పిల్లాడి కుటుంబానికి ఇచ్చేయండి. ఆ తరువాత విషయం నేను చూసుకుంటాను. మనం రేపు సాయంత్రం ఈ గుడి దగ్గరే తిరిగి కలుద్దాం. పర్సనల్‌గా మాట్లాడుకుందాం. పోనులో వద్దు” అంటూ ఫోను కట్ చేశాడు లక్ష్మీధర్. ఎవరైనా తమ మాటలను వింటున్నారేమోనని  చుట్టూ చూశాడు లక్ష్మీధర్. ఎవరి ధ్యాసలో వాళ్ళున్నారు. 


ఇంతలో పద్మ వచ్చి “ఏమండీ! గుడికొచ్చి మనసారా దేవుడికి దణ్ణమైనా పెట్టుకోకుండా, ఏమిటండీ ఆ ఫోనులో మాటలు? పదండి” అంటూ కారు దగ్గరకి నడిచింది.   


తనకిరువైపులా నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరి సంభాషణలను వింటున్న బిక్షపతికి కొన్ని మాటలు అర్ధమయ్యాయి. వాళ్ళ కారు వెళ్ళాక “ఏమిటో ఈ మాయదారి ఫోన్లు. ఆ బాబు ఎంత గొప్పవారైనా అంత కష్టపడి కారులో వచ్చి, కనీసం దేవుడికి దణ్ణమైనా పెట్టుకోకుండా వెళ్ళారు” అనుకున్నాడు. 


ఆ రాత్రి గుడి నుండి తన గుడిసె దగ్గరకెడుతూంటే తన వాడకట్టంతా జనంతో నిండిపోయింది.  ఏమయ్యిందోనని కంగారుగా అనిపించి వాళ్ళ సంభాషణలను వినసాగాడు. పొట్టకూటికోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన జనం, రాత్రివేళ ఆదమరచి నిద్రపోతున్న వేళ తాగుబోతు వెధవ పసివాడి ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఎంత ఉన్నవాడయినా పేదోళ్ళ ప్రాణాలంటే లెక్కలేదా? కోపంతో రగిలి పోతున్నారు పేట జనం. 


“రేపోసారి వెళ్ళి మనమంతా ఆ కుటుంబానికి కాస్త మాట సాయమన్నా చేద్దాం” అంటూ నిర్ణయానికొచ్చారు. 


“పేదోళ్ళ ప్రాణాలు గాలికి ఊగే దీపాలని ఊరికే అంటారా” అనుకుంటూ తన గుడిసెకెళ్ళి పడుకున్నాడు బిక్షపతి. మర్నాడుదయం బిక్షపతి గుడి దగ్గర కూర్చున్నాడు. నిన్న కారులో వచ్చిన పెద్దమనిషితో పాటు మరో పెద్దాయన వచ్చి బిక్షపతి వెనుకనే ఉన్న బెంచిమీద కూర్చున్నాడు. వాళ్ళ మాటలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి బిక్షపతికి. 


“మీ కేసు చాలా కష్టమవుతుంది, ఎందుకంటే ఆ ప్రమాదం వార అన్ని పేపర్లలోను వచ్చింది” అన్నాడు కారులో వచ్చిన పెద్దాయన. 


“మీరీ కేసునుండి మా వాణ్ణి బయట పడేస్తే కోటి రూపాయలిచ్చుకుంటాను” అని బ్రతిమాలుకుంటున్నాడు ఆ కాంట్రాక్టర్.


ఇక బిక్షపతికి రాత్రి తమ వాడకట్టులో పిల్లగాడి చావుకి, వీళ్ళు మాట్లాడుకునే కేసుకి  సంబంధముందనిపించ్చింది. అనుమానం తొలిచివేయటంతో గబగబా దగ్గరలోని బడ్డీకొట్టుకెళ్ళాడు. “ఏం తాతా! టీ తాగుతావా?” అభిమానంగా అడిగాడా బడ్డిషాపతను.  


“డబ్బుంటేనే ‘టీ’ అయినా ‘రొట్టె’ అయినా. ‘అరువు’ అనే మాట లేదు బిక్షపతి దగ్గర.  అందుకే   బిక్షపతంటే అంత అభిమానమతనికి. 


“రాత్రి మా వాడకట్టులో ఓ కారు ప్రమాదం గురించి మాట్లాడుకున్నారు. ఆ వార్త ఈ రోజు పేపర్లో వచ్చిందా? కాస్త చూసి చెప్పు” అన్నాడు బిక్షపతి. 


షాపతను పేపర్లో చూసి “నువ్వు చెప్పింది నిజమే తాతా. ఎవరో పెద్ద కాంట్రాక్టర్  కొడుకు తప్పతాగి పార్టీనుండి వస్తూ రోడ్డుపక్కనే ఉన్న గుడిసెలో నిద్రపోతున్న వాళ్ళపై పోనిచ్చాడుట. ఓ ఏడేళ్ళ పిల్లవాడు పాపం చనిపోయాడట. ఇదిగో చూడు” అంటూ బిక్షపతికి పేపరందించాడు.


“గుడి దగ్గరకొచ్చిన కాంట్రాక్టర్ కొడుకే ఆ పిల్లగాడి చావుకు బాధ్యుడు”. తన వాడకట్టు వాళ్ళందరికి ఈ విషయం చెప్పి “ఆ కుటుంబానికి న్యాయం చేయాలి” అంటూ వారినందరినీ తీసుకుని పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి “యాక్సిడెంట్ చేసిన అబ్బాయిని కఠినంగా శిక్షించాలని, ఆ పేదపిల్లాడి కుటుంబానికి  తగిన నష్టపరిహారం ఇవ్వాలని” ఆందోళన చేశాడు. 


SI గారి జోక్యంతో ఆ కాంట్రాక్టర్ స్టేషన్‌కి వచ్చాడు.  ఓ అయిదు లక్షల రూపాయిలను ఆ కుటుంబానికి ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదిరింది.  


బిక్షపతి, మరికొందరు పెద్దలు మాత్రం “ఆ యాక్సిడెంట్ చేసిన వాడికి కఠిన శిక్ష పడేలా హామీ ఇస్తూ కాగితం రాసి ఇవ్వండి” అంటూ పట్టుబట్టారు. ఆ కాంట్రాక్టర్ కనుసైగతో SIగారు అప్పటికేదో కాగితం రాసి ఇచ్చారు. బాధిత కుటుంబానికి నగదు రావటం, ప్రమాదానికి కారణమైన వాని శిక్ష పడుతుందనే హామీ పత్రం ఇవ్వటంతో అంతా సంతోషించి వెళ్ళిపోయారు. 


కానీ కొన్ని రోజులకు యాక్సిడెంట్ చేసిన యువకుడు బెయిల్ మీద హాయిగా AC రూంలో  సేదతీరుతూంటే, బిక్షపతి మాత్రం గుడిమెట్లనుండి జైలుగదికి మారాడు. జనాల్ని పోగేసుకుని పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి కాంట్రాక్టర్ కొడుకుపై ఆరోపణలు చేసినందుకు, ఆ ఆరోపణలను వెనకకు తీసుకోవడానికి డబ్బులిస్తామన్నా నిరాకరించినందుకు ప్రతిఫలంగా తప్పుడు కేసులో ఇరికించి, సాక్ష్యాధారాలు లేకుండా పన్నిన ఉచ్చులో బిగించి ఆ బిచ్చగాడిని జైలుకి పంపారు  పెద్దలు.


లక్ష్మీధర్‌కి ఇవన్నీ గుర్తుకొచ్చాయి. బిక్షపతిని చూసేటప్పటికి ఆ బాధ ఇంకా పెరిగింది. ఎవరో ముక్కుమొహం తెలియని పిల్లవాడి చావు గుడిమెట్లమీద అడుక్కునే బిచ్చగాడిని కదిలించింది. వయస్సులో పెద్దవాడైనా జరిగిన సంఘటనకు మనసు కరిగి, నిజాయితీగా తన వంతు ప్రయత్నం చేసి ఆ పిల్లవాడి కుటుంబానికి నష్టపరిహారం వచ్చేలా చేశాడు.  


ఆ బిక్షపతికున్న మానవత్వంలో లేశమంతైనా, ఎంతో పవిత్రమైన పదవిలో ఉన్న తనకు లేకపోయింది. ఉన్నత స్థానంలో ఉండి అనేక తీర్పులిస్తూ అనుభవం గడించిన నేను చేసిందేమిటి? న్యాయదేవత ముందు తలవంచుకుని నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. ప్రజలంతా ఛీ కొడతారు. నాకు బెయిల్ వద్దేవద్దు. కఠిన కారాగార శిక్షను అనుభవించాల్సిందే. నేను చేసిన పాపాలకు అదే తగిన శిక్ష.  అతని కళ్ళవెంట అప్రయత్నంగా కన్నీళ్ళు వస్తున్నాయి.


ఆ కన్నీటితెరల మధ్యనుండి బిక్షపతి “బాబూ! అమ్మగారు, బిడ్డలు గుర్తుకొచ్చి బాధ పడుతున్నారా? నేనయితే ఒంటిగాణ్ణి. ముందు వెనుక ఎవరూ లేని అనాథను. నాకు గుడి దగ్గర అడుక్కున్న రోజున కూడా ఏ దేవతకో దయగలిగి నా జోలెలో ఓ ముద్ద వేసిన రోజునే అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్ళేవి. ఇక్కడ నాకు రెండుపూటలా తిండి పెడుతూ, టీలు కూడా ఇస్తున్నారు. ఇక్కడకు వచ్చినందుకు నేనేమీ బాధపడటంలేదు. 


మీరు, అదిగో ఆ స్వామి, కుటుంబాలు ఉన్నవాళ్ళు. మీకైతే ఉన్న డబ్బయినా మీ కుటుంబాన్ని ఆదుకుంటుంది. కానీ ఆ స్వామికి అలా కాదు. అతను ఇక్కడకు రావటంతో అతని కుటుంబం చిందరవందరయ్యింది. భార్యాపిల్లలు ఎలా ఉన్నారోనని అతను కన్నీరు పెట్టని రాత్రి లేదు. మీకు బెయిల్  దొరికి బయిటకు వెళ్ళేటప్పుడు, ఆ స్వామికి కూడా బెయిల్ దొరికే అవకాశం గురించి ఆలోచించండి” అని వేడుకున్నాడు.  


లక్ష్మీధర్ అంతర్మధనానికి గురయ్యాడు. మరునాడుదయం జైలర్‌గారితో “సార్! పేరుకే నేనిన్నాళ్ళు న్యాయమూర్తిని. కానీ అసలైన న్యాయమూర్తి, నిజాయతీపరుడు ఎవరో తెలుసునా? ఆ బిక్షపతే. అందుకే మీ ముందు నా మనసులో దాచిన నిజాలను, నేను చేసిన మోసాలను వెల్లడిచేస్తున్నాను.  వీటిని రికార్డ్ చేసి కోర్ట్‌వారికి సమర్పించండి. 

నేను ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయి, నేనొక ధర్మదేవతకు ప్రతినిధిని అన్న సత్యాన్ని  మర్చిపోయి, నా అవినీతి పనులతో అక్రమార్జనకు పాల్పడ్డాను.


అమాయకులను, నిర్దోషులను అన్యాయంగా జైలుకు పంపేలా తీర్పులిచ్చాను. కానీ ఆ ధర్మదేవతకు కోపంవస్తే ఏమవుతుందో ఇప్పుడు  ఈ నేరస్థుల మధ్య కాలం గడుపుతూంటే నాకు అర్థమవుతోంది. 


ఇప్పటికైనా నేను మారకపోతే ఈ జైలు శిక్షకు అర్ధమేలేదు.  నేను మనస్పూర్తిగా చెపుతున్నాను. నేను నిర్దోషులను దోషులుగా జైలుకు పంపిన ఆ నాటి లక్ష్మీధర్‌ను కాదు. నా మూలంగా జైలుకొచ్చిన బిక్షపతి, స్వామిలు నిర్దోషులు. 


అన్యాయంగా దొంగ కేసుల్లో ఇరికించి వాళ్ళకి తీరని ద్రోహం చేశాను. వాళ్ళని విడుదల చేయమని నా కోరిక. నాకు బెయిల్ అవసరంలేదు. కోర్టువారు ఎంతకాలం శిక్ష వేస్తే అంత కాలం ఆ శిక్షను అనుభవిస్తాను” అంటూ చెప్పాడు. 


లక్ష్మీధర్ చెప్పినవన్నీ రికార్డ్ చేసిన జైలర్‌ వాటిని కోర్ట్‌వారికి తప్పక అందజేస్తానని చెప్పాడు.


లక్ష్మీపతిలో వచ్చిన ఈ మార్పుకు న్యాయదేవత మనసు నిండా నవ్వుకుంది


*****     

మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు: 


మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


మధుపత్ర శైలజ ఉప్పలూరి
మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page