top of page
Original.png

వన్ మినిట్

వన్ మినిట్, One Minute App, తెలుగు కథ, టెక్నాలజీ, కుటుంబ కథ, తల్లి ప్రేమ, డిజిటల్ సేవలు, గేటెడ్ కమ్యూనిటీ, స్మార్ట్ టెక్నాలజీ, ఆధునిక తెలుగు కథ, కుటుంబ బంధాలు, సాంకేతికత, ఆందోళన, తెలుగు సాహిత్యం

ఒంటరిగా ఉన్న కూతురిని సంప్రదించలేక ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, డెలివరీ యాప్ సహాయంతో ఇంటి బెల్ మోగించి ఆమె క్షేమాన్ని నిర్ధారించిన కుమారుడు కనిపించే భావోద్వేగ కుటుంబ దృశ్యం. కుటుంబ బంధాలు, తల్లి ప్రేమ, సాంకేతికత సద్వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో తెలివైన పరిష్కారాన్ని ప్రతిబింబించే ప్రతీకాత్మక చిత్రం.
ఒంటరిగా ఉన్న కూతురిని సంప్రదించలేక ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు, డెలివరీ యాప్ సహాయంతో ఇంటి బెల్ మోగించి ఆమె క్షేమాన్ని నిర్ధారించిన కుమారుడు కనిపించే భావోద్వేగ కుటుంబ దృశ్యం. కుటుంబ బంధాలు, తల్లి ప్రేమ, సాంకేతికత సద్వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో తెలివైన పరిష్కారాన్ని ప్రతిబింబించే ప్రతీకాత్మక చిత్రం.

One Minute - Telugu Inspirational Story | Sudhavishwam Akondi

వన్ మినిట్ - తెలుగు ప్రేరణాత్మక కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 04/07/2026


సాంకేతికత మన జీవితాలను సులభతరం చేస్తుందా? లేక మరింత క్లిష్టం చేస్తుందా? దానికి సమాధానమే "వన్ మినిట్" కథ. తల్లి ప్రేమ, పిల్లలపై ఆందోళన, నగర జీవనశైలి, ఒంటరిగా నివసించే యువత ఎదుర్కొనే పరిస్థితులు, అత్యవసర సమయంలో సాంకేతిక పరిజ్ఞానం ఎలా ప్రాణాధారంగా మారుతుందో ఈ కథ ఎంతో సహజంగా వివరిస్తుంది. కుటుంబ బంధాలు, బాధ్యత, డిజిటల్ యుగంలోని తెలివైన పరిష్కారాలు కలగలిసిన ఈ హృద్యమైన కథ ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.


కారిడార్ లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది కమల. మాటిమాటికి ఎవరికో కాల్ చేస్తోంది. ఆ కాల్ కనెక్ట్ అవ్వలేదో, అవతల ఫోన్ ఆన్సర్ చేయడం లేదో ఏమో కానీ ఆమె ముఖంలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. 


ఆమెను దూరం నుంచి గమనించిన ఆమె భర్త కమలాకర్ ఆమె వద్దకు వచ్చాడు. 


"ఏంటి కమలా? ఏమైంది? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు?" అని అడిగాడు భార్యను. 


వెంటనే భర్త పైకి గయ్యిమంది కమల. 


"నేను ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నారు. వన్ ఇయర్ లో ఎలాగో రిటైర్మెంట్ ఉంది కదా, ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అన్నారు.. " అంటూ అందుకుంది ఆమె


"అరె! అసలు ఏమైంది ఇప్పుడు? అక్కడ ఫ్లాట్ కొన్నందుకు ఇబ్బంది ఏమయ్యింది? నేను కారులో వెళ్లి వస్తూ ఉన్నాను. అమ్మాయికి ఎలాగో క్యాబ్ వస్తుంది ఆఫీస్ కి పికప్ అండ్ డ్రాప్ కోసం. అమ్మాయికి సంబంధం కుదిరి, పెళ్లి అయితే అప్పుడు మనిద్దరమే ఉండేది. 


అక్కడ అన్ని సౌకర్యాలతో షాపింగ్ మాల్ దగ్గరలోనే ఉంది. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సురక్షితంగా ఉంటుంది. ఇంకా అందులోనే ఎన్నో సౌకర్యాలు రెడీ చేస్తున్నారు. ఆ ఫ్లాట్ కి ఇప్పటి నీ కంగారుకు ఏమిటి సంబంధం?" అన్నాడు కమలాకర్ భార్య ఎందుకు అంత ఫైర్ అవుతుందో అర్థంకాక పోవడంతో


"ఇంకా చాలా ఫ్లాట్స్ ఖాళీగానే ఉన్నాయి. మనం ఉన్న టవర్ లో మరీ తక్కువ. సెక్యూరిటీ సిస్టమ్ కూడా అంతంత మాత్రమే.. " అని మళ్ళీ మొదలుపెట్టింది ఆమె. 


"ఎప్పుడూ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటూనే ఉన్నాడు కదా! ఇప్పుడు ఏమైంది? ఎందుకు అంతలా అరుస్తున్నావు? అసలు విషయం ఏంటి చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు.. "


"ఏమైందా? ఇంకా ఏం కావాలి.. ? అమ్మాయి ఫోన్ ఎత్తడం లేదు. ఎన్నిసార్లు చేశానో?" అంది అప్పుడు కమల. 


"నిద్రనుండి లేచి వుండదు. "


"ఈరోజు సండే! అంటే వీకెండ్ టూడేస్ సెలవే కదా! అయినా ఇవాళ పొద్దున్నే లేచి యోగా చేస్తానంది. నన్ను కాల్ చేసి లేపమంది. ఇప్పుడు కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయట్లేదు" అంది కమల.


ఆమె మాటల్లో పిల్లలపై బాగా ప్రేమ పెంచుకున్న తల్లి పడే టెన్షన్ ధ్వనించింది. 


 ***

కమలాకర్ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుక్కి ముంబైలో జాబ్ వచ్చి, కాస్త సెటిల్ అవ్వగానే కొడుకు ఇష్టపడిన అమ్మాయితో ఏడాది క్రితం పెళ్లి చేసేశారు. కూతురు ఈమధ్యే క్యాంపస్ సెలెక్షన్ లో జాబ్ సంపాదించింది. ఇన్నాళ్లు తను చేసిన సేవింగ్స్ తో తనకు అందుబాటు ధరలో ఉండడంతో సిటీకి కాస్త దూరమే అయినా ఫ్లాట్ కొన్నాడు కమలాకర్. 


గేటెడ్ కమ్యూనిటీనే అయినా ఇంకా అక్కడ అన్ని ఫ్లాట్స్ అమ్ముడు పోలేదు. కొందరు కొనుక్కున్నారు కానీ గృహ ప్రవేశం చేయలేదు. దాంతో అక్కడ ఉండడం నచ్చడం లేదు కమలకు. కొద్దిరోజుల్లో ఇంకా బాగా డెవలప్ అవుతుందని కమలాకర్ విశ్వాసం. 


ఇప్పుడు కోడలు కడుపుతో ఉందని తెలిసి, ముంబైలో ఉంటున్న కొడుకు ఇంటికి వచ్చారు దంపతులు. కోడలు ప్రసవం కోసమని భార్యని కొడుకు ఇంట్లో దిగబెట్టి వెళదామని కమలాకర్ కూడా వచ్చాడు. 

కొడుకు కౌండిన్య కోడలిని తీసుకుని వాకింగ్ కి వెళ్లాడు. అప్పుడే కూతురికి కాల్ చేయడం, రెస్పాన్స్ లేకపోవడం కమలకు భయాన్ని కలిగించింది. 

కూతురిపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల ఆమెలో ఆందోళన. కూతురు ఒక్కతే ఫ్లాట్ లో ఉంది, చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఇంకా ఎవరూ రాలేదనే భయం. అందుకని రోజూ కూతురికి కాల్ చేసి మాట్లాడేది కమల. 


"యోగా స్టార్ట్ చేస్తాను. పొద్దున్నే లేవాలి. కాల్ చెయ్యమ్మా అని చెప్పింది. ఇప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ తీయడం లేదు. ఈమధ్య నేరాలు పెరిగిపోయి ఘోరాలు జరుగుతున్నాయి. మన వైజాగ్ అందుకు మినహాయింపు ఏమీ కాదు.. " అని మళ్లీ తన టెన్షన్ వ్యక్తం చేస్తూ మాటలు మొదలు పెట్టింది కమల.


 "ఉండు! తన ఆఫీస్ లోనే పనిచేస్తున్న తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాను!" అని కమలాకర్ ఆ అమ్మాయికి కాల్ చేశాడు తనలో కూడా కంగారు పెరగడంతో.


 ***

"హలో! అంకుల్! నిన్న శనివారం కదా! ఓ ఫ్రెండ్ ఇంట్లో చిన్న పార్టీ జరిగింది. ఇద్దరం కలిసి వెళ్లాం! తనను ఫ్లాట్ వద్ద దింపేసి నేను మా ఇంటికి వెళ్లిపోయాను. అంతే! ఆ తర్వాత నాకేం తెలియదు" అని చెప్పింది ఆ అమ్మాయి.


"పోనీ! ఓసారి మా ఫ్లాట్ కి వెళ్లి చూసి చెప్పమ్మా!" అని అడిగాడు.


"మా ఇల్లు చాలా దూరం అంకుల్! ఒక గంట పడుతుంది మినిమం! అయినా వెళ్తాను లెండి! అక్కడికి వెళ్లి, కాల్ చేస్తాను!" అని చెప్పింది.


 థాంక్స్ చెప్పి పెట్టేశాడు. 

 ఈ సంభాషణ విన్న కమల ఏడుపు స్టార్ట్ చేసింది. 

 

అప్పుడే వాకింగ్ నుంచి వచ్చిన ఆమె కొడుకు కౌండిన్య తల్లిదండ్రులను చూసి టెన్షన్ కు కారణం అడిగాడు. అప్పుడు కమల విషయం చెప్పి, ఏడువసాగింది. 


"ఊరుకో అమ్మా! చెల్లికి ఏమీ కాదు. అదేమీ పిరికిపిల్ల కాదు.. " అని తల్లికి ధైర్యం చెబుతూనే ఆలోచించాడు. 


 వెంటనే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని ఏదో టైప్ చేయడం మొదలుపెట్టాడు. టెన్షన్ పట్టించుకోకుండా టైప్ చేస్తూ నిలబడిన భర్త వంక విచిత్రంగా చూసింది కౌండిన్య భార్య. 


"అత్తయ్య ఇంతగా టెన్షన్ పడుతూ ఉంటే సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నారండి?" అని భర్తతో అంది కూడా.


 "వెయిట్ అండ్ సీ!" అన్నాడు కౌండిన్య నింపాదిగా.


 ఒక్క పావుగంటలో చెల్లెలు నుంచి కాల్ వచ్చింది. 


"అన్నయ్యా! ఇంత పొద్దున్నే ఎందుకు షుగర్ బుక్ చేశావు? అయినా ఇప్పుడు ఏం అవసరం? నేనేం టీ, కాఫీ తాగను కదా! అమ్మ వచ్చాక చూసుకునేది. మంచి నిద్రలో ఉన్నాను! ఆ డెలివరీ అబ్బాయి వచ్చి బెల్ కొట్టి మంచి నిద్ర చెడగొట్టాడు.. " అని విసుక్కుంది.


"ఇక్కడ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు మొద్దు నిద్ర పోతున్నావా? నిన్న అమ్మని పొద్దున్నే కాల్ చేయమని చెప్పావట! కాల్ చేస్తే ఎత్తవేంటి? " అని అన్నాడు కోపంగా.


"అయ్యో! మర్చిపోయాను అన్నయ్యా! బాగా నిద్ర పట్టేసింది. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాను నిన్న. మార్చడం మర్చిపోయా!"


ఆ ఫోన్ తీసుకుని కమల మాట్లాడింది. కూతుర్ని చడామడా నాలుగు తిట్లు తిట్టింది. అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. 


"ఇంతకీ ఏం చేశావురా?" అని అడిగాడు కమలాకర్ కొడుకుని.


"వన్ మినిట్ యాప్ లో షుగర్ బుక్ చేశా! ఆ డెలివరీ బాయ్ కి వివరాలు ఏమీ చెప్పకుండా ఇంటి డోర్ తెరిచేవరకూ బెల్ కొట్టమని, డోర్ తెరిచాక కాల్ చేయించమని మెసేజ్ పెట్టాను. 


అతడు బెల్ కొట్టి నిద్ర లేచేలా చేశాడు. మీ అన్నయ్య బుక్ చేశాడని చెబితే, తను కాల్ చేసింది" అని వివరంగా చెప్పాడు.


'వన్ మినిట్ ' యాప్ ఇలా కూడా ఉపయోగపడిందని అందరూ సంతోషించారు. 


టెక్నాలజీ ఇలా మంచికి కూడా ఉపయోగపడుతుంది కరెక్టుగా ఉపయోగించుకుంటే.. ! అంతేకదా!


కృష్ణార్పణం

🙏🙏🙏🙏🙏

సుధావిశ్వం 


  


-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page