ఒంటరి

Ontari - Telugu Social story | Venkat Manthripragada
ఒంటరి - తెలుగు సామాజిక సందేశాత్మక కథ | వెంకట్ మంత్రిప్రగడ
Published in manatelugukathalu.com on 08/09/2026
ఒంటరితనం మనిషిని ఎంతగా లోపలికి ముడుచుకుపోయేలా చేస్తుంది? కుటుంబం దూరమై, ఉద్యోగం ముగిసి, పలకరించే మనుషులు తగ్గిపోయినప్పుడు జీవితం ఎలా మారుతుంది? వెంకట్ మంత్రిప్రగడ రచించిన “ఒంటరి” కథ ఈ ప్రశ్నలకు హృదయాన్ని తాకే సమాధానం.
నారాయణరావు చనిపోయిన సంగతి మొదటగా ఎవరికీ తెలియలేదు.
వినడానికి అది ఒక విషాదగాథలా అనిపిస్తుంది. కానీ ఆ విషాదం తన నీడను వెంటనే విసరలేదు. తెలియాల్సిన అవసరం కూడా ఎవరికీ కనిపించలేదు.
మూడు రోజుల పాటు పాలవాడు గుమ్మం దగ్గర పాలప్యాకెట్లు పెట్టి వెళ్లిపోయాడు. పేపరు కుర్రాడు పేపరు విసిరేశాడు. బ్యాంకు నుంచి లోన్ ఆఫర్లు వచ్చాయి. బీమా కంపెనీ వాళ్లు ఫోన్ చేసి, “మీ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే...” అని మొదలుపెట్టారు. ఈ ప్రపంచంలో మనిషి లేకపోయినా వ్యవస్థ తన పని ఆపదని నిరూపించడానికి ఇవన్నీ సరిపోయాయి.
చావు అనేది ఒక్క మనిషి జీవితంలోనే పెద్ద సంఘటన. ప్రపంచానికి కాదు. అది జీవన చక్రంలో భాగం.
ఆ నిజం నారాయణరావుకు ఆలస్యంగా అర్థమైంది. అర్థమయ్యేసరికి అతడు దాన్ని ఎవరికీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. అతని ఇంటి గోడలు, కిటికీలు, పాత కుర్చీలు మాత్రం ఆ విషయాన్ని నిశ్శబ్దంగా తెలుసుకుని ఉన్నాయి.
అరవై ఎనిమిదేళ్ల జీవితంలో అతడు చావు గురించి అంతగా ఆలోచించలేదు.
కానీ ఒంటరితనం గురించి మాత్రం తెలియకుండానే జీవితాంతం సాధన చేశాడు. తల్లిదండ్రులు పోయారు. తమ్ముడు కెనడాలో స్థిరపడ్డాడు. చెల్లెలు ఆస్ట్రేలియాలో పిల్లలతో బిజీ అయిపోయింది. ఫోన్లు వచ్చేవి. పండగల శుభాకాంక్షలు వచ్చేవి. ప్రేమ కూడా ఉండేది. కానీ ఆ ప్రేమకు వేడి ఉండేది కాదు.
మనుషుల మధ్య దూరాన్ని కిలోమీటర్లు కొలవవు; అవసరాలు కొలుస్తాయి.
నారాయణరావుకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోలేదు అని అతననుకుంటాడు. “వాడికెలా పిల్లనిస్తారండీ? ఎప్పుడు చూసినా అప్పుడే వాన వచ్చి వెలిసినప్పటి ఆకాశంలా వెలిసిపోయిన భావనలతో తిరుగుతూంటాడు” అంటారు తెలిసినవాళ్ళు.
అది అతని అదృష్టమో, దురదృష్టమో, లేక అతని అహంకారమో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు సంబంధాలు వచ్చాయి. ఫోటోలు వచ్చాయి. ఒక అమ్మాయి ఎక్కువగా నవ్విందని నచ్చలేదు. ఇంకో అమ్మాయి తక్కువగా నవ్విందని నచ్చలేదు. ఒకరికి కళ్లద్దాలు ఉన్నాయట, మరొకరికి కళ్లద్దాలు లేవట.
అతడు జీవితాన్ని ఎంచుకుంటున్నాననుకున్నాడు. నిజానికి జీవితం అతన్ని తిరస్కరిస్తోందని గ్రహించలేదు.
కాలం గడిచాక ఆ ఫోటోలు గుర్తుకొచ్చేవి. ఒకోసారి అల్మారాలో పాత కాగితాలు వెతుకుతుంటే, ఆ అమ్మాయిలలో ఎవరో ఒకరు ఇప్పుడు అమ్మమ్మ అయ్యి ఉండొచ్చని అనిపించేది. ఎవరో ఒకరు మనవడికి కథలు చెబుతూ ఉండొచ్చు. ఎవరో ఒకరు భర్తతో తగువులాడుతూ ఉండొచ్చు. ఎవరో ఒకరు ఇప్పటికే ఈ లోకం వదిలి ఉండొచ్చు.
వాళ్ల జీవితాలు జరిగిపోయాయి. తనది మాత్రం ఎదురు చూస్తూనే మిగిలిపోయిందేమో అన్న అనుమానం అప్పుడప్పుడూ గుండెలో గుచ్చుకునేది.
అయితే ఉద్యోగంలో ఉన్నంతకాలం అతనికి ఆ బాధ కనిపించలేదు.
ఉద్యోగం అనేది మనిషికి జీతం మాత్రమే ఇవ్వదు, గుర్తింపునూ ఇస్తుంది. ఉదయం కార్యాలయానికి వెళ్లగానే “సార్” అని పిలిచే వాళ్లు ఉంటారు. ఫోన్ మోగుతుంది. మీటింగులు ఉంటాయి. ఫైళ్లు ఉంటాయి. సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్న చోట మనిషి తన శూన్యతను గుర్తించడు.
ఎవరో మనల్ని వెతుకుతున్నారంటే మనం అవసరమైన వాళ్లమని అనిపిస్తుంది. అదే ఉద్యోగం చేసే గొప్ప మాయాజాలం.
రిటైర్మెంట్ రోజు ఘనంగా జరిగింది.
పూలదండలు. ప్రసంగాలు. కేక్. జ్ఞాపిక. జీవితాంతం స్నేహం కొనసాగుతుందని హామీలు. “సార్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం” అని చాలామంది అన్నారు. ఫోటోలు దిగారు. కళ్లలో నీళ్లు తెచ్చుకున్నారు.
మరుసటి సోమవారం ఉదయం ఒక్క ఫోన్ కూడా రాలేదు. జీవితం కొన్నిసార్లు చాలా వేగంగా పేజీ తిప్పేస్తుంది. మొదట్లో అతడు ఆనందించాడు.
ఆలస్యంగా లేచాడు. పేపర్లు చదివాడు. టీవీ చూశాడు. యోగా మొదలుపెట్టాడు. మూడో రోజుకే నడుం నొప్పి వచ్చి మానేశాడు. ధ్యానం మొదలుపెట్టాడు. వారం రోజుల్లో దాన్నీ వదిలేశాడు.
ఎందుకంటే ధ్యానం అంటే తనతో తాను ఒంటరిగా కూర్చోవడమేనని తెలుసుకున్నాడు. తన ఆలోచనలు తనకు మంచి స్నేహితులు కావు. అవి ఎప్పుడూ పాత విషయాలనే తీసుకొచ్చేవి.
“ఆ అమ్మాయిని ఎందుకు తిరస్కరించావు? ఆ స్నేహితుడికి ఎందుకు ఫోన్ చేయలేదు? ఆ రోజు ఎందుకు అలా మాట్లాడావు?”
మొదట్లో అతడు కళ్లుమూసుకుంటే శ్వాస వినిపించేది. తర్వాత జ్ఞాపకాలు. వాటి తర్వాత పశ్చాత్తాపాలు. ధ్యానం చేయాలని కూర్చున్న ప్రతి రోజు అతని మనసు పాత ఫైళ్ల అల్మారాగా మారేది. తెరవకూడదనుకున్న డ్రాయర్లు ఒక్కొక్కటిగా తామే తెరుచుకునేవి. కొన్ని జ్ఞాపకాలు నవ్వించేవి. మరికొన్ని అతని ముందే నిలబడి, “ఇప్పుడు చెప్పు... అప్పుడు ఎందుకు అలా చేశావు?” అని ప్రశ్నించేవి. వాటికి సమాధానం చెప్పలేక అతడు మళ్లీ టీవీ ఆన్ చేసేవాడు.
మనసు అనేది విచిత్రమైన కోర్టు. నేరస్తుడూ అదే. న్యాయమూర్తీ అదే. శిక్ష అనుభవించేది కూడా అదే.
ఒక సాయంత్రం అతడు తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా కూర్చున్నాడు.
ఫ్రిజ్ గుసగుసలాడుతోంది. ఫ్యాన్ తిరుగుతోంది. గడియారం టిక్ టిక్ అంటోంది. చాలాసేపు విన్నాక అతనికి ఒక్కసారిగా భయం వేసింది. ఆ ఇంట్లో తనతో మాట్లాడుతున్నవి ఆ మూడు మాత్రమేనని అర్థమైంది.
ఆ రాత్రి నిద్రపోలేదు. మరుసటి రోజు కూడా అలాగే గడిచింది. మూడో రోజు ఉదయం బాల్కనీలో నిలబడి కిందకు చూస్తూ చాలాసేపు ఉన్నాడు. పార్కులో వృద్ధులు నవ్వుకుంటూ నడుస్తున్నారు. ఒక చిన్న పిల్లాడు సైకిల్ నేర్చుకుంటున్నాడు. పక్కనే ఎవరో భార్యాభర్తలు ఏదో చిన్న విషయానికి తగువులాడుతున్నారు. జీవితం అంతా తన కళ్లముందే నడుస్తోంది. కానీ అందులో తన పాత్ర ముగిసిపోయిన నాటక నటుడిలా తాను ప్రేక్షకుడిగా మాత్రమే మిగిలిపోయాననే భావన అతన్ని లోపల కలచివేసింది.
ఆ రాత్రే అతడు నిర్ణయం తీసుకున్నాడు. జ్ఞాపకాలతో నిండిన ఊరిని వదిలేయాలి.
ఇల్లు అమ్మేశాడు. మరో నగరానికి వెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ అతన్ని గుర్తుపట్టరు. ఎవరూ అతని గతాన్ని అడగరు. అపరిచితులతో నిండిన నగరం, జ్ఞాపకాలతో నిండిన నగరంకంటే మెరుగని అతనికి అనిపించింది.
కొన్ని వారాల తరువాత ఒక సూపర్ మార్కెట్ బయట బోర్డు కనిపించింది. “పార్ట్ టైం ఉద్యోగాలు – సీనియర్ సిటిజన్లకు స్వాగతం.”
అతడు నవ్వుకున్నాడు.
నలభై ఏళ్ల పాటు కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిర్వహించిన మనిషి ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు సర్దే ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాడు. జీవితం కొన్నిసార్లు హాస్యరచయిత చేతిలో పడిన నవలలా ఉంటుంది.
మేనేజర్ ఇంటర్వ్యూ చేశాడు. “ఎక్స్‌పీరియన్స్?”
“నలభై ఏళ్లు కార్పొరేట్ మేనేజ్‌మెంట్.”
“కూరగాయలు సర్దగలరా?”
“అంతర్జాతీయ ప్రాజెక్టులు నడిపాను.”
“బాక్సులు మోయగలరా?”
“వార్షిక అప్రైజల్స్ భరించాను.”
మేనేజర్ వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ సూపర్ మార్కెట్ అతని జీవితాన్ని మళ్లీ మనుషుల దగ్గరకు తీసుకొచ్చింది.
రోజూ వందలమంది వచ్చేవారు. ఎక్కువమంది అతన్ని మరచిపోయేవారు. కానీ అది ముఖ్యం కాదు. “టూత్‌పేస్ట్ ఎక్కడ ఉంది?” అని ఎవరో అడుగుతారు.
“మూడో వరుసలో” అని అతడు చెబుతాడు.
“థాంక్యూ” అని వాళ్లు నవ్వుతారు.
కొన్నిసార్లు ఒక “థాంక్యూ” కూడా మనిషిని సాయంత్రం వరకు బతికిస్తుంది. అక్కడే అతనికి ఇద్దరు స్నేహితులు దొరికారు.
ఒకరు ఫెర్నాండెస్. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ప్రపంచంలో జరిగే ప్రతి సమస్యకూ ఎవరో ఒకరు బాధ్యులని నమ్మే మనిషి. రాజకీయాలు, వాతావరణం, ద్రవ్యోల్బణం, మొబైల్ ఫోన్లు, యువత—ఏ విషయం అయినా అతనికి ఫిర్యాదు సిద్ధంగా ఉండేది.
మరొకరు లీలా కృష్ణన్. డెబ్బై ఏళ్ల వితంతువు. పదునైన నాలుక. ఇంకా పదునైన బుద్ధి. ప్రతి మంగళవారం వచ్చి ఆరు వస్తువులు కొనేది. ఎప్పుడూ అదే ఆరు. తరువాత బ్రెడ్ సెక్షన్ దగ్గర నిలబడి నలభై నిమిషాలు తత్వశాస్త్రం మాట్లాడేది.
“మీరు ప్రతి మంగళవారం ఇదే వస్తువులు కొనడం ఎప్పుడైనా మార్చాలనిపించదా?” అని ఒకసారి అడిగాడు నారాయణరావు.
“మార్చాల్సింది కొనుగోలు జాబితా కాదు. ఒంటరితనం,” అంది లీల.
“అది సూపర్ మార్కెట్లో దొరుకుతుందా?”
“దొరికితే నేను ఇన్ని సంవత్సరాలు వెతికేదాన్నా?”
ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ నవ్వు ముగిసిన తరువాత కూడా ఇద్దరూ అక్కడి నుంచి కదల్లేదు. కొన్నిసార్లు సంభాషణ ముగిసినా, మనుషులు వెళ్లిపోవడానికి తొందరపడరు.
ఒకరోజు నారాయణరావు అన్నాడు. “ఈ బ్రెడ్ రేపటితో ఎక్స్‌పైర్ అవుతుంది.”
లీల నవ్వింది. “మనమూ అవుతాం. తేడా ఏంటంటే మన మీద తేదీ ముద్రించరు.”
ఆ సమాధానం విన్న తరువాత అతడు చాలాసేపు నవ్వుాడు. చాలాకాలం తరువాత గుండెల్లోంచి వచ్చిన నవ్వు అది.
జీవితం మళ్లీ పట్టాలెక్కిందని నారాయణరావు అనుకున్న రోజుల్లోనే మొదటి పగుళ్లు పడ్డాయి. ఒక మంగళవారం లీల రాలేదు.
అతడు గమనించాడు. ఎందుకంటే ఆమె రాకముందు నుంచే బ్రెడ్ సెక్షన్ దగ్గర అతనికి ఒక ఎదురుచూపు మొదలయ్యేది. గడియారం నాలుగు కొట్టగానే ఆమె కనిపించేది. అదే నడక. అదే సంచి. అదే చిరునవ్వు.
ఆ రోజు రాలేదు. “ఏదో పని వచ్చి ఉంటుంది” అనుకున్నాడు. మరుసటి మంగళవారం కూడా రాలేదు. మూడో మంగళవారం కూడా. అప్పటికి అతని మనసులో ఒక చిన్న ఆందోళన పుట్టింది. ఫోన్ నంబర్ అడిగుంటే బాగుండేదేమో అనిపించింది.
కానీ మనుషులు కొన్ని సంబంధాలను అర్థాంతరంగా ఉంచడానికే ఇష్టపడతారు. దగ్గర కావాలనుకుంటారు. కానీ పూర్తిగా దగ్గర కావడానికి భయపడతారు. ఎందుకంటే ప్రతి పరిచయం వెనుక ఒక విడిపోవడం దాగి ఉంటుందని వారికి తెలుసు.
లీల గురించి అడగాలని అనిపించింది. అయితే ఒక భయం అడ్డొచ్చింది. “ఆమె చనిపోయింది” అని ఎవరైనా చెబితే?
ఆ వాక్యం వినడానికి తనకు ధైర్యం లేదని అతడు గ్రహించాడు. అందుకే అడగలేదు. అది ప్రేమో, స్నేహమో కాదు... భయపడే మనసు.
ఒకరోజు వర్షం కురుస్తోంది. కస్టమర్లు ఎవరూ లేరు. ఫెర్నాండెస్ రెండు కాఫీలు తీసుకొచ్చి ఒకటి అతని చేతిలో పెట్టాడు. “నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు?” అని అకస్మాత్తుగా అడిగాడు. నారాయణరావు నవ్వి తప్పించుకోవాలని చూశాడు.
ఫెర్నాండెస్ మాత్రం మెల్లగా అన్నాడు—"మనుషులు జీవితంలో చేసే పెద్ద తప్పులు చాలావరకు అప్పట్లో నిర్ణయాల్లా కనిపిస్తాయి."
నెల రోజుల తరువాత ఫెర్నాండెస్ కూడా కనిపించకుండా పోయాడు.
మొదట్లో అతడు గమనించలేదు. ఎందుకంటే ఫెర్నాండెస్ లేకపోవడం అంటే ప్రపంచంలో శబ్దం కొంచెం తగ్గినట్టే. కానీ వారం గడిచాక అతనికి అర్థమైంది. సూపర్ మార్కెట్‌లో రాజకీయ విశ్లేషణలు వినిపించడం లేదు. ప్రభుత్వం పడిపోవడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదు.
ఫెర్నాండెస్ కనిపించడం లేదు. ఆ సూపర్ మార్కెట్ ఒక్కసారిగా పెద్దదిగా, ఖాళీగా అనిపించింది. అక్కడి లైట్లు, ర్యాకులు, వస్తువులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ మనుషులు లేకపోతే స్థలాలు ఎంత పెద్దవిగా మారిపోతాయో అతడు మొదటిసారి గుర్తించాడు.
ఆ ఖాళీ ఒక దళసరి నల్ల మేఘంలా కనిపించింది. నేరుగా లోపలికి వచ్చి కూర్చుంది. ఉదయం టీ తాగేటప్పుడు ఎదురుగా కూర్చుంది. సూపర్ మార్కెట్‌లో అతని వెంట నడిచింది. రాత్రి మంచం మీద పక్కనే పడుకుంది.
ఒక సాయంత్రం అతనికి అకస్మాత్తుగా భయం వేసింది. మూడు రోజులుగా తాను ఎవ్వరితోనూ అర్థవంతమైన మాట మాట్లాడలేదని గుర్తొచ్చింది. మాట్లాడకపోవడం కంటే, అది తనకు సహజంగా అనిపించడం అతడిని ఎక్కువ భయపెట్టింది.
అదే రోజుల్లో మొదటి సందేశం వచ్చింది. “గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే.” ☀️🌸
తెలియని నంబర్. అతడు నవ్వుకున్నాడు. “మోసగాళ్లు అయి ఉంటారు” అనుకున్నాడు. డిలీట్ చేశాడు.
మరుసటి రోజు మరో సందేశం వచ్చింది. వేరే నంబర్. “గుడ్ మార్నింగ్. స్టే హెల్తీ అండ్ స్మైల్.” 😊🌿☀️
ఈసారి కూడా పట్టించుకోలేదు. కానీ సందేశాలు ఆగలేదు. రోజూ వస్తూనే ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు. వాన పడినా. ఎండ వచ్చినా. పండగైనా. ఆదివారం అయినా. రోజూ అదే సమయానికి.
మొదట్లో అతడు విసిగిపోయాడు. తర్వాత అలవాటు పడిపోయాడు. చివరికి ఎదురుచూడటం మొదలుపెట్టాడు. మనిషి హృదయం విచిత్రం. పట్టించుకోనని చెప్పిన వాటినే ఎక్కువగా పట్టించుకుంటుంది.
నెలలు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. ఆ రెండు సందేశాలు అతని జీవితంలో భాగమయ్యాయి. ఉదయం కళ్లుతెరిచిన వెంటనే ఫోన్ చూసేవాడు. ఎప్పుడూ సమాధానం పంపలేదు. ఎప్పుడూ “మీరు ఎవరు?” అని అడగలేదు. అయినా వాళ్లు అతనికి దగ్గరయ్యారు.
ఎందుకంటే కొన్నిసార్లు మనం మాట్లాడే వాళ్ల కంటే మన గురించి ఆలోచించే వాళ్లు ముఖ్యమవుతారు. ఒకరోజు మొదటి సందేశం ఆగిపోయింది.
ఒక వారం. రెండు వారాలు. ఒక నెల. ఏమీ రాలేదు. అతనికి అసౌకర్యంగా అనిపించింది. ఎప్పుడూ కలవని ఒక మనిషి గురించి ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. “అతనికి ఏమై ఉంటుంది? ఆసుపత్రిలో ఉన్నాడా? చనిపోయాడా?” ఇలాంటి ప్రశ్నలు మనసులో తిరగసాగాయి.
రెండేళ్ల తరువాత రెండో సందేశం కూడా ఆగిపోయింది. ఈసారి అతడు తట్టుకోలేకపోయాడు. ఉదయం ఫోన్ చూస్తాడు. ఏమీ ఉండదు. సాయంత్రం చూస్తాడు. ఏమీ ఉండదు. రాత్రి పడుకునే ముందు చూస్తాడు. ఏమీ ఉండదు.
ఖాళీ స్క్రీన్ అతనికి అద్దంలా కనిపించసాగింది. ఆ స్క్రీన్‌లో తన ఒంటరితనమే కనిపించేది. రెండు నెలలు గడిచాయి. ఆ సమయంలో అతని మనసు మెల్లగా కూలిపోవడం మొదలుపెట్టింది.
ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అది కల కాదేమో, నిశ్చయంగా చెప్పలేం. తాను మంచం మీద పడుకుని ఉన్నానని అనిపించింది. అప్పుడే ఎవరో తనను లాగుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా తన శరీరం కింద మిగిలిపోయింది.
తాను మాత్రం వెలుగులా పైకి వెళ్తున్నాడు. ముందు ఒక పొడవాటి సొరంగం. అందులోంచి ప్రయాణం. చుట్టూ జ్ఞాపకాలు. చిన్నప్పుడు తల్లి చేతిలో తిన్న అన్నం. పాఠశాల. మొదటి ఉద్యోగం. ప్రమోషన్. కొత్త కారు. కొత్త ఇల్లు. అన్నీ కనిపించాయి.
తర్వాత మరచిపోయిన జ్ఞాపకాలు వచ్చాయి. పెళ్లి ప్రపోజల్స్‌తో వచ్చిన ఫోటోలు. తాను ఎగతాళి చేసిన అమ్మాయిలు. స్నేహం చేయకుండా దూరం పెట్టిన మనుషులు. ఫోన్ చేయకుండా వదిలేసిన స్నేహితులు. అవకాశం ఉన్నా దగ్గరవ్వని మనసు. అన్నీ వరుసగా కనిపించాయి.
మొదటిసారి అతడు తన జీవితాన్ని మొత్తం చూశాడు. సౌకర్యంగా జీవించాడు. గౌరవంగా జీవించాడు. కానీ పూర్తిగా జీవించలేదు. ఎప్పుడూ ఏదో వెలితి.
నలభై ఏళ్లు గోడలు కట్టాడు. తర్వాత “ఎవరూ నన్ను చూడటానికి రాలేదు” అని బాధపడ్డాడు. ఆ నిజం అతని గుండెను పగలగొట్టింది.
సొరంగం చివర ఒక పెద్ద వెలుగు సముద్రంలా విస్తరించింది. ఆ వెలుగులోకి వెళ్తూ అతనికి ఒక్కసారిగా ఒక విషయం అర్థమైంది.
ఒంటరితనం అనేది మనుషులు లేకపోవడం కాదు; కొన్నిసార్లు మనుషులను అంగీకరించకపోవడం. కొన్నిసార్లు భయాన్ని స్వాతంత్ర్యం అని పిలవడం. కొన్నిసార్లు గర్వాన్ని ఆత్మగౌరవం అని భావించడం. కొన్నిసార్లు జైలు తలుపు తెరిచి ఉన్నా బయటకు రాకపోవడం. ఆ నిజం అతని జీవితంలో చివరి పాఠం.
మరుసటి ఉదయం నారాయణరావు లేవలేదు.
ఆ ఉదయం కూడా సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. పక్కింటి పిల్లలు స్కూల్‌కి వెళ్లారు. సూపర్ మార్కెట్ తెరుచుకుంది. నగరం తన పనిలో పడిపోయింది. ప్రపంచం తన గడియారాన్ని ఆపలేదు.
మూడో రోజు సాయంత్రం సూపర్ మార్కెట్ మేనేజర్‌కు అనుమానం వచ్చింది.
నారాయణరావు సెలవు పెట్టకుండా రాకపోవడం అతని స్వభావం కాదు. ఫోన్ చేశాడు. ఎవరూ ఎత్తలేదు. మరోసారి చేశాడు. మళ్లీ లేదు. చివరకు ఇద్దరు ఉద్యోగులతో కలిసి అతని ఇంటికి వెళ్లాడు. తలుపు లోపల నుంచి లాక్ అయి ఉంది.
పోలీసులు వచ్చారు. తలుపు పగులగొట్టారు. లోపల నిశ్చబ్దం తప్ప ఇంకేమీ లేదు. మంచం మీద నారాయణరావు ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. ముఖం మీద భయం లేదు. ఆశ్చర్యం లేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రయాణానికి చివరికి టికెట్ దొరికిన మనిషిలా కనిపించాడు.
అతని అంత్యక్రియలకు పెద్దగా జనం రాలేదు. పక్కింటి వాళ్లు. సూపర్ మార్కెట్ మేనేజర్. ముగ్గురు ఉద్యోగులు. ఒక ప్రభుత్వ అధికారి. అంతే.
అరవై ఎనిమిదేళ్ల జీవితానికి వచ్చిన జనసందోహం అది.
అయితే కథ అక్కడితో ముగియలేదు. అసలు కథ అక్కడే మొదలైంది. అతని ఇంటిని శుభ్రం చేస్తుండగా ఒక పాత ట్రంక్ పెట్టె దొరికింది. అందులో డైరీలు ఉన్నాయి. ఒకటి కాదు. రెండు కాదు. పదిహేను.
ప్రతి డైరీలో ఒకే విషయం. ఒంటరితనం. తాను అర్థం చేసుకున్న విషయాలు. తనతో తాను చేసిన సంభాషణలు. వీధిలో కనిపించిన వృద్ధుల గురించి రాసిన నోట్లు. బస్ స్టాండ్‌లో ఒంటరిగా కూర్చున్న ఒక మహిళ గురించి. పార్కులో ఎవరూ పలకరించని ఒక రిటైర్డ్ టీచర్ గురించి. రోజూ ఫోన్ కోసం ఎదురుచూసే ఒక తాత గురించి.
చిన్న చిన్న జీవితాలు. పెద్ద పెద్ద నిశ్శబ్దాలు. ఆ డైరీలు చదువుతున్న వాళ్లకు విచిత్రంగా అనిపించింది.
ఎందుకంటే అవి కథలు కావు, కానీ కథలే. వ్యాసాలు కావు, కానీ జీవితాలే. మరొక ఆశ్చర్యం ఎదురైంది. అందులో యాభై కథలు ఉన్నాయి.
చాలా చిన్నవి. కొన్నింటికి రెండు పేజీలు. కొన్నింటికి ఐదు. కానీ ప్రతి కథలో ఒక మనిషి.
ప్రతి మనిషిలో ఒక చీకటి. ప్రతి చీకటిలో ఒక అరుపు. ఒక కథలో ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. ఇంట్లో అందరూ ఉన్నారు. కొడుకు. కోడలు. మనవళ్లు. కానీ అతనితో మాట్లాడడానికి ఎవరికీ సమయం లేదు. అతను ప్రతిరోజూ కుక్కతో మాట్లాడేవాడు. చివరికి కుక్క చనిపోయిన రోజు అతను మొదటిసారి తనను తాను అనాథగా భావించాడు.
మరొక కథలో ఒక మహిళ ఉంది. ఫేస్‌బుక్‌లో ఐదు వేల మంది స్నేహితులు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక్క మనిషి లేదు.
మరొక కథలో వృద్ధ దంపతులు ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటారు. ఒకే టేబుల్ దగ్గర భోజనం చేస్తారు. కానీ పదేళ్లుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.
ఆ కథలు చదివినవాళ్లు రాత్రిళ్లు నిద్రపోలేకపోయారు. ఎందుకంటే ఆ కథల్లో వాళ్లే కనిపించారు. కొన్ని నెలల తరువాత ఆ కథలను ఒక ప్రచురణకర్తకు పంపించారు.
మొదట్లో ఎవరూ ఆసక్తి చూపలేదు. “ఒంటరితనం గురించి ఎవరు చదువుతారు?” అన్నారు.
కానీ ఒక యువ సంపాదకుడు చదివాడు. మొదటి కథ చదివాడు. తర్వాత రెండోది. ఆ తరువాత రాత్రంతా నిద్రపోకుండా మొత్తం చదివేశాడు.
అలా నారాయణరావు డైరీ ఒక పుస్తకమైంది. పుస్తకం బయటకు వచ్చింది. మొదటి ముద్రణ అయిపోయింది. రెండో ముద్రణ వచ్చింది. మూడోది వచ్చింది. దేశమంతా చదవడం మొదలుపెట్టింది. విచిత్రమేమిటంటే—బతికున్నప్పుడు అతని మాట వినడానికి ఎవరూ లేరు. చనిపోయిన తరువాత లక్షలమంది అతని మాటలు చదివారు. అదే జీవితపు వ్యంగ్యం. అదే సాహిత్యపు శక్తి.
ఒక టెలివిజన్ కార్యక్రమంలో ఒక మనోవైద్యుడు అన్నాడు. “ఈ పుస్తకం ఒక మనిషి డైరీ కాదు. ఆధునిక సమాజం మెడికల్ రిపోర్ట్.”
ఆ వాక్యం దేశమంతా తిరిగింది. ప్రజలు తమ తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది పాత స్నేహితులను వెతికారు. కొంతమంది వృద్ధాశ్రమాలకు వెళ్లారు. కొంతమంది మొదటిసారి తమ ఒంటరితనాన్ని అంగీకరించారు.
అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.
నారాయణరావు ఇంటిని అమ్మేయకుండా ఉంచాలని. అక్కడ ఒక వృద్ధాశ్రమం ప్రారంభించారు. “శుభోదయం” అనే పేరు పెట్టారు; ఎందుకంటే ఆ పేరు అతని జీవితాన్ని మార్చిన రెండు తెలియని సందేశాల జ్ఞాపకం.
ఆ వృద్ధాశ్రమంలో ఒక నియమం పెట్టారు. ఎవరూ ఒంటరిగా భోజనం చేయకూడదు. ఎవరూ మూడు రోజులు కనిపించకుండా పోకూడదు. ఎవరైనా రాకపోతే వాళ్ల గురించి అడగాలి. ఎవరైనా మౌనంగా ఉంటే వాళ్ల పక్కన కూర్చోవాలి. ఎందుకంటే మనిషికి ఎప్పుడూ సలహా అవసరం ఉండదు; కొన్నిసార్లు పక్కన ఒక మనిషి చాలు.
పుస్తకం ప్రచురితమైన కొన్ని నెలల తరువాత ప్రచురణ సంస్థకు చిన్న చిన్న ఉత్తరాలు రావడం మొదలైంది. "ఈ కథలో నేనే ఉన్నాను" అని కొందరు రాశారు. "నా తండ్రి కూడా ఇలాగే చనిపోయారు" అని మరికొందరు రాశారు. ఒక కవర్ మీద మాత్రం పంపిన వారి పేరు లేదు. లోపల ఒక్క వాక్యం మాత్రమే ఉంది—"ప్రతి ఉదయం శుభోదయం చెప్పే వాళ్లను కూడా ఎవరో ఒకరు గుర్తు చేసుకుంటారని నాకు ఈ పుస్తకం చెప్పింది."
సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ వృద్ధాశ్రమానికి ఒక వృద్ధుడు వచ్చాడు. లైబ్రరీలో నారాయణరావు పుస్తకం కనిపించింది. చదివాడు. చదువుతుండగా ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు.
వాళ్లు కారణం అడిగారు. అతను జేబులోంచి ఒక పాత మొబైల్ తీసి చూపించాడు. “ఈ నంబర్ గుర్తుందా?” అన్నాడు.
అది ఆ రెండు నంబర్లలో ఒకటి. అందరూ ఆశ్చర్యపోయారు. “మీరు ఎవరు?” అతను నవ్వాడు.
“నాకూ ఒంటరితనమే. ప్రతి ఉదయం నా ఫోన్‌లో ఉన్న వంద నంబర్లకు శుభోదయం పంపేవాడిని. చాలామంది నన్ను బ్లాక్ చేశారు. కొందరు తిట్టారు. కానీ ఒక నంబర్ మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది.”
“నారాయణరావు?”
“అవును.”
“మీరు ఎందుకు ఆపేశారు?”
వృద్ధుడు కిటికీ బయట చూశాడు.
“ఆసుపత్రిలో ఉన్నాను. తరువాత నా భార్య చనిపోయింది. కొంతకాలం ప్రపంచాన్ని మర్చిపోయాను. మళ్లీ ఫోన్ తీసుకునేలోపు అతను ఈ లోకం వదిలేశాడు.”
అందరూ మౌనంగా నిలబడ్డారు. ఆ సమయంలో వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. “మనిషి జీవితంలో కొన్ని సంబంధాలకు పేర్లు ఉండవు. కానీ అవే చాలా నిజమైనవి.”
సాయంత్రం అయింది. వృద్ధాశ్రమం ఆవరణలో చెట్లు కదిలాయి. గాలిలో ఆకులు రాలాయి. గోడ మీద నారాయణరావు ఫోటో ఉంది. దాని కింద అతని డైరీలోని చివరి వాక్యం చెక్కించారు.
“ఒంటరితనం అనేది మనుషులు లేకపోవడం కాదు. మనుషులు అవసరం లేదని మనసును నమ్మించడం.”
ఆ వాక్యం కింద మరో వాక్యం కూడా ఉంది.
“పెట్టుబడిదారీ సమాజం మనకు ఇళ్లు ఇచ్చింది. గదులు ఇచ్చింది. గాడ్జెట్లు ఇచ్చింది. కానీ పొరుగువారిని తీసుకుపోయింది.”
నారాయణరావు చనిపోయాడు. కానీ అతని ఒంటరితనం చనిపోలేదు. అది పుస్తకమైంది. ప్రశ్నగా మారింది. అద్దంగా మారింది. దానిలో చూసుకున్న ప్రతి మనిషి తన ముఖాన్ని చూసుకున్నాడు. ఎందుకంటే చివరికి—మనిషిని చంపేది వృద్ధాప్యం కాదు, వ్యాధి కాదు, మరణం కూడా కాదు.
“నన్ను ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారా?” అనే ప్రశ్నకు సమాధానం దొరకకపోవడమే.
అందుకే ప్రతి ఉదయం ఎవరికైనా ఒక సందేశం పంపండి. ఒక ఫోన్ చేయండి. ఒకసారి పలకరించండి. ఎందుకంటే మీకు అది రెండు సెకన్ల పని మాత్రమే. కానీ ఎవరికో అది బతకడానికి మరో రోజుకు కారణం కావచ్చు.
*****
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
వెంకట్ మంత్రిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వెంకట్ మంత్రిప్రగడ

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్ లో, చాలా కాలంగా బెంగళూరు లో ఉంటున్నాను...సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది...లాక్ డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను...తెలుగు సాహిత్య ప్రపంచంలో గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, జలంధర, కేశవరెడ్డి గార్లు అభిమాన రచయితలు, శ్రీ శ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు...
ఇతర భాషా సాహిత్యాలలో మున్షీ ప్రేమ్ చంద్, మాక్సిం గోర్కీ, దోస్తోయ్వస్కీ, మొరావియా, ఆల్బర్ట్ కామూ, పౌలో కొయిలో, కన్నడం లో భైరప్ప లు కూడా చాలా ఇష్టమైన రచయితలు...
ఆధునిక రచయితల్లో యువల్ నోవా హరారీ, రాజా ఇవటూరి, సత్యం మందపాటి, అనిల్ అనంతస్వామి అభిమాన రచయితలు ...







Comments