ఓటమిలో గెలుపు పార్ట్ 2
- Kotthapalli Udayababu

- 2 days ago
- 6 min read
#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #ఓటమిలోగెలుపు, #OtamiloGelupu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Otamilo Gelupu Part - 2/2 - New Telugu Story Written By - Kotthapalli Udayababu Published in manatelugukathalu.com on 05/01/2026
ఓటమిలో గెలుపు పార్ట్ 2/2 - పెద్ద కథ
రచన : కొత్తపల్లి ఉదయబాబు
జరిగిన కథ: నా పేరు ఉదయ్. లెక్కల మాస్టారుగా పనిచేస్తున్నాను. నా కొలీగ్ ఆనందరావు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆనందరావు కొడుకు ప్రకాష్ సరిగ్గా చదవక పోయినా అతడు పట్టించుకోడు.
ఇక ఓటమిలో గెలుపు పెద్ద కథ చివరి భాగం చదవండి.
"సార్! నిన్న రాత్రి ఏమాత్రం చదవడానికి అవకాశం లేక పోయింది నాకు. ఉదయం అయిదింటికి లేచి, ఇడ్లీ పప్పు రుబ్బి, ఇడ్లీ వేసి, ఊరంతా తిరిగి అమ్మి, ఇంటికి వచ్చి వంట చేసి, రెండు మెతుకులు తిని పరీక్షకు వచ్చేశాను సార్ చదువుకుందామని ఆశ ఉన్నా చదవలేని పరిస్థితి. చదువు చెప్పే అవకాశం ఉన్నా చెప్పని మాస్టార్లు ఉంటే నాలాంటి పిల్లలు ఏదైతే అదవుతుందని ఇలాంటి ప్రయత్నం చేస్తారు సార్. పాపం ఆ అమ్మాయి జవాబుపత్రం ఇవ్వలేదు. నేనే బలవంతంగా లాక్కున్నాను. తప్పు నాది. ఆ అమ్మాయిని ఏమీ అనకండి"
అయితే అవతలి అమ్మాయి చాలా బాగా చదివే అమ్మాయి కావడంతో తీవ్రంగా భయపడిపోయి ఏడ్చేసింది. మరుసటిరోజు జ్వరం వచ్చి పరీక్ష మానేసింది.
"పిల్లలు ఏదో రాసుకుంటారు. చూసీచూడనట్లు పోవాలి సార్" అని వాళ్ళ నాన్న, విద్యా కమిటీ మెంబర్లు,
ప్రధానోపాధ్యాయుడు సమక్షంలో నాకు తల వాచేలా చివాట్లు పెట్టారు. మరి పిల్లలు అలా తయారవడానికి కారణం ఉపాధ్యాయులా? తల్లిదండ్రులా? పరిస్థితులా? ఎవరు కారణం?
'అందరమూ' అన్న సమాధానం మనసుకు తోచి సంతృప్తిగా లేచాను.
**********
అనుకున్నట్టుగా పదవ తరగతి పరీక్ష ఫలితాలు రెండవ రోజు విడుదల అయ్యాయి. నా కొడుకు ప్రదీప్ కు 557 మార్కులు వచ్చాయి. పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. మా పాఠశాలకు 90% వచ్చింది. క్లాస్ టీచర్ గా సంతోషిస్తూ ఆనందరావు ఫోన్ చేద్దాము అనుకునేంతలో అతని నుంచే ఫోన్ రావడం నాకు ఆశ్చర్యమనిపించింది.
"ఒక్కసారి అర్జెంటుగా ఇంటికి రా ప్లీజ్!" అని ఫోన్ పెట్టేసాడు.
నా మనసు కీడు శంకించింది 5 నిమిషాల్లో ఆనందంరావు ఇంటికి చేరుకున్నాను.
గుమ్మంలోనే ఎదురైన ఆనందరావు నన్ను కౌగలించుకుని చంటిపిల్లాడిలా రోదించసాగాడు.
" ఉదయ్! నేను చేసిన పాపమే నా పిల్లాడిని బలితీసుకుంది. నేను పిల్లలకు చదువు చెప్పకుండా చేసిన అన్యాయమే ప్రకాష్ ను పొట్టన పెట్టుకుంది. "
నేను కొయ్యబారిపోయాను. అప్రయత్నంగా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి క్షణాలలో జలజలా రాలిపోయియాయి.
"అసలేం జరిగింది ఆనందరావు? నువ్వు కంగారు పడకుండా స్థిమితంగా కూర్చో. ఏం జరిగిందో వివరంగా చెబితే ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు" అన్నాను లేని ధైర్యం తెచ్చుకుంటూ.
"ప్రకాష్ సోషల్ పరీక్ష పోయింది.
'మీ ఫాదర్ సోషల్ చెబుతారు కదా. కాన్వెంట్లో అర్థం కాకపోతే మీ నాన్నగారి చేత చెప్పించుకో' అనేవారట. నన్ను చదువు గురించి అడిగే ధైర్యం లేదు వాడికి. ఒకటి రెండు సార్లు 'మార్కులు తక్కువ వస్తున్నాయ్ ఏంట్రా?' అని అడిగితే, 'ఈసారి బాగా తెచ్చుకుంటా నాన్న' అనే వాడు.
ఆ కాన్వెంట్ లో టీచర్ కి అసలు పాఠం చెప్పడమే రాదట. ఇంటర్ సి. ఈ. సి. ఫెయిల్ అయిన క్యాండిడేట్ అట. పైగా మేనేజ్మెంట్ కు దూరపు చుట్టమట. పిల్లలందరూ అతనికి భయపడి కంప్లైంట్ చేసేవారు కాదట.
"పరీక్షలు రాసిన దగ్గరనుండి డల్ గా ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు. నాకు తెలియకుండా ఎంత ఫైల్ తయారు చేశాడో చూడు" అంటూ నా చేతిలో ఓ ఫైల్ పెట్టాడు ఆనందరావు.
అది వివిధ దినపత్రికలలో నేరాలు, శిక్షలు క్రైమ్ కార్నర్, ఆత్మహత్యల పేపర్ కటింగ్స్. వాటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని, పురుగుల మందు తాగి, ఎలక్ట్రికల్ ప్లగ్ లో వేలు పెట్టి.. ఇలా ఆయా వార్తలలోని వాక్యాల కింద గీతలు గీసి ఉన్నాయి. ఆ రోజు మా ఇంట్లో కూడా ఆ వార్తలు చాలా చురుకుగా చదవడం నాకు గుర్తొచ్చింది.
ఏదో వార్తలు చదువుతున్నాడు అనుకున్నాను కానీ అతనిలో ఆనాడే ఈ ఆలోచనకు బీజం పడిందని ఊహించలేదు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫలితాలు వచ్చే సమయంలో తల్లి, తండ్రి పెళ్లికి వెళ్లారట. వాళ్లు వచ్చాక తన ఫలితం చెప్పాడట ప్రకాష్. ముందు బాధపడినా పది సార్లు ఏమైనా అంటే బాధ పడతాడు అని భార్య, భర్త ఇద్దరూ ఏమీ అనలేదట. ఆ సాయంత్రం సినిమా కి వెళ్దాము అనుకున్నారట.
'ఒక అరగంటలో వస్తాను' అని బయటికి వెళ్లాడట. స్టేషన్ లో అప్పుడే బయలుదేరి వేగం పుంజుకున్న రైలుకు ఎదురుగా పరిగెత్తేశాడట. రైలు డ్రైవర్, చుట్టూ చూస్తున్న కొద్దిమంది ఎంతో వారించే ప్రయత్నం చేశారట. పోస్టుమార్టం కు తీసుకు వెళ్లారట. శవం ఇంకా అప్పగించలేదట.
ఎంత భయంకర నిర్ణయం? ఈ చావు అటెంప్ట్ లో నైనా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకున్నాడేమో ప్రకాష్.
'ఎంత పని చేసావయ్యా ?' నా మనసు మూగగా రోదిస్తూ ఉంది.
ఆ కార్యక్రమాలన్నీ అయ్యేటంతవరకు ఆనందరావు కు చేదోడువాదోడుగా ఉన్నాను. మా స్టాఫ్ కూడా కొందరు సహకరించారు.
*****
మూడు రోజుల తర్వాత సుజాత ఫోన్ చేసింది.
"సార్. సోషల్ సార్ గారి బాబు ఆత్మహత్య చేసుకున్నాడట కదండీ.. పాపం సార్ కి ఎంత కష్టం పెట్టాడు సార్ ఆ దేవుడు? చాలా బాధగా ఉంది సార్" ఆ అమ్మాయి కంఠంలో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది. నాకు గుండె బరువెక్కి పోయింది.
"నీకు ఏ సబ్జెక్ట్ లో పరీక్ష పోయిందమ్మా?" మాట మార్చడం కోసం అడిగాను.
"సోషలే సార్. 34 మార్కులు వచ్చాయి. మొత్తం ఐదుగురు పరీక్ష తప్పినట్లు తెలిసింది సార్. మా బ్యాచ్ నూటికి నూరుశాతం వస్తుందని మీరు ఎంతో కలలు కన్నారు. కృషి చేశారు. కానీ ఒట్టు వేసి చెప్తున్నా సార్. ఒక బిట్టు కూడా కాపీ చేయలేదు సార్. మాకు సోషలు పరీక్ష రెండు రోజులు సిట్టింగ్ స్వాడ్ వచ్చారు సార్. ధైర్యం చేసి రాస్తే పాసయిపోయేదాన్ని. కానీ మీరే గుర్తుకు వచ్చి మానేసాను సర్. మేము ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నారా సార్?” అడిగింది నెమ్మదిగా.
"మా కృషిలో లోపం లేనప్పుడు పిల్లలు అందరూ పాస్ అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అమ్మ" అన్నాను సాలోచనగా.
పరాజయాన్ని ఏ మాత్రం సహించలేని పిల్లల శాతం అధికంగా ఉన్న ఈ రోజుల్లో ఆ అమ్మాయి తాను బాధ పడటం మానేసి 'మీరు బాధపడుతున్నారా' అని అడగడం నాలో ఆశ్చర్యాన్ని కలిగించింది.
"అది సరే గానీ సార్.. మీ బాబుని, సోషల్ సార్ బాబు ని ఓసారి మా స్కూల్ కి తీసుకు వచ్చారు కదా సార్. వాళ్ళల్లో ప్రకాష్ ఎర్రటి అబ్బాయా? నల్లటి అబ్బాయా?" అడిగింది సుజాత.
"నల్లటి అబ్బాయి" అన్నాన్నేను.
వాళ్లకి కాన్వెంటు లేని రోజున మాకు వర్కింగ్ డే అయితే ఆ రోజు ప్రకాష్, ప్రదీప్ లను మా పాఠశాల కు తీసుకెళ్లాను, మా తెలుగు మీడియం పాఠశాల వాతావరణం పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో.
"సార్! ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. మీరు ప్రతిరోజు పాఠం ప్రారంభం చేయబోయే ముందు సుమతి శతకం లోని 'వినదగునెవ్వరు చెప్పిన' పద్యం చదివి మరీ పాఠం మొదలు పెట్టేవారు. ఆ పద్యం సోషల్ సార్ గారి అబ్బాయి కి నేర్పలేదా సార్ ? "
సుజాత అడిగింది.
ఛెళ్లున కొట్టినట్టైంది నాకు. సుజాత నా సమాధానం కోసం ఎదురు చూడలేదు.
"మీరా పద్యాన్ని అర్థవంతంగా నేర్పి ఉంటే ఆ అబ్బాయి చనిపోవడానికి అంత సాహసం చేసే వాడు కాదేమో సార్. మరో విషయం సార్. ఉపాధ్యాయులుగా మీరు, మా తల్లిదండ్రులు ఎందరు సహకరించినా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు 100% రావాలని కోరుకోవడం అత్యాశే కదా సార్. నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి సార్. నేను ఇనిస్టెంట్ పరీక్షకు కట్టి ఈసారి తప్పక పాసవుతాను సార్. అలాగే నేను ఎవరికి ఏం చెప్పాలి అనుకున్నా ముందు మీరు చెప్పిన పద్యం చెప్పి అప్పుడు మొదలు పెడతాను సార్. మీరు ఎంత సక్సెస్ సాధించారో అంతే నేను సాధిస్తాను. సోషల్ సార్ కి నా సానుభూతి తెలపండి సార్. నమస్తే. " సుజాత ఫోన్ పెట్టేసింది.
అవును. ఎవరు ఏం చెప్పినా వినాలి. అయితే తొందర పడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ కాస్త సమయం లో సవ్యంగా ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. ఆనందరావుకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకాష్ కి ప్రదీప్ తో పాటు తెలుగు పద్యాలు నేర్పించి ఉండాల్సింది. అవి నేర్పి ఉంటే ప్రకాష్ బతికి ఉండేవాడేమో. ఫెయిల్ అయిన అమ్మాయి అయినా సుజాత, నా మనసులో శాశ్వతంగా ఉండేలా తనకు తెలియకుండానే సక్సెస్ అయింది అనిపించింది నాకు!
సమాప్తం.
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్




Comments