ఓటమిలో గెలుపు పార్ట్ 1
- Kotthapalli Udayababu

- Jan 3
- 7 min read
Updated: Jan 5
#KotthapalliUdayababu, #కొత్తపల్లిఉదయబాబు, #ఓటమిలోగెలుపు, #OtamiloGelupu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Otamilo Gelupu Part - 1/2 - New Telugu Story Written By - Kotthapalli Udayababu Published in manatelugukathalu.com on 03/01/2026
ఓటమిలో గెలుపు పార్ట్ 1/2 - పెద్ద కథ మొదటి భాగం
రచన : కొత్తపల్లి ఉదయబాబు
"గుడ్ మార్నింగ్ అంకుల్!" హాల్లో పేపర్ చదువుతున్న నన్ను విష్ చేసి పేపర్ లో కొంత భాగాన్ని తీసుకుని చదవసాగాడు ప్రకాష్ నా పక్కన నేలమీద కూర్చుని.
ప్రకాష్ నా కొలీగ్ ఆనందరావు కొడుకు. ఆనందరావు, నేను జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, పాఠశాల సహాయకులుగా పని చేస్తున్నాం. నేను లెక్కల ఉపాధ్యాయుడిగా.. అతడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా.
ఆనందరావుకు పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టాడు ప్రకాష్. వాడు అడిగిందే తడవుగా తన ప్రాణమైన ఇచ్చేసేటంతగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఏడు మల్లెల ఎత్తుగా పెంచుతున్నారు వాడిని.
వాడికి అసలు నేలమీద కూర్చోవడం ఇష్టం ఉండదు. నేను, నా క్రమశిక్షణ వలన నా ముందు ఉన్నంతసేపు తప్పదన్నట్లు నేలమీద, అదీ.. అంపశయ్య మీద భీష్ముడీలా కూర్చుంటాడు.
ఎందుకంటే వాడి ఇంట్లో వాడికి ఒక ప్రత్యేకమైన గది ఆ గదిలో కంప్యూటర్, వీడియో గేమ్స్, ఏసి, అత్యాధునిక ఆడియో సిస్టమ్, పాప్ మ్యూజిక్ ఆల్బమ్స్, గిటార్, ఇంకా ఎన్నెన్నో ఖరీదైన బొమ్మలు. వాడి ఆ ఒక గదే ఐదు లక్షలు చేస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు. పైగా రిజర్వేషన్ కులం.
పేపర్ చదువుతూ వాడిని గమనించడం నాకు అలవాటు. హఠాత్తుగా వాడి ముఖం లో ఉత్సాహం కనిపించింది ఏమిటా? అని చూశాను.
వాడు చదువుతున్నది క్రైమ్ కార్నర్ పేజీ. ఎవరో ఇంజనీరింగ్ విద్యార్థి మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రేమ విఫలం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ పేజీ లోని మరొక వార్త!అక్కయ్య పెళ్ళికి వెళ్లి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఇంటికి వచ్చాక ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.
ఆ వార్తలు నేను చదివాను.
తమ మీదే ఆశలను, నమ్మకాలని పెట్టుకుని తమ కష్టార్జితం అంతా, వారి భవిష్యత్తు బాగుండాలని ధారపొసే తల్లిదండ్రులకు చావాలనుకునే తమ నిర్ణయం ఎంతటి సూన్య భవిష్యత్తును మిగుల్చుతుందో ఈ తరం పిల్లలు ఎందుకు అర్థం చేసుకోరు?
జీవితం అన్నాక ప్రతిక్షణం గెలవడమే ఉండదు. కొన్ని పరాజయాలు కూడా ఉంటాయి. అతి చిన్న పరాజయాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో పిల్లలు పెరుగుతున్నారు అంటే కారణం ఎవరు? ఆటుకి పోటుకి తట్టుకునేలా, కనీస మౌలిక విలువలు తెలుసుకునేలా పెంచని తల్లిదండ్రులదే లోపం ఏమో అనిపిస్తుంది. తమ పిల్లలు ఎక్కడో ఉన్నతస్థితిలో ఉండాలనుకునే అత్యాశే కారణం కావచ్చునేమో.
పేపర్ తిరగేస్తూ అడిగాడు ప్రకాష్
" అంకుల్ ! ప్రదీప్ ఇంట్లో ఉన్నాడా?"
"ఉన్నాడు" అని వాడికి సమాధానం చెప్పి "ప్రదీప్! నీ కోసం ప్రకాష్ వచ్చాడు" అని అరిచాను.
" వస్తున్నా నాన్న గారు!" అని సమాధానం వచ్చింది.
" ఏమి? ఈవేళ క్రికెట్ కి వెళ్ళరా?" అడిగాను.
" నీరసంగా ఉంది అంకుల్. " అంటూ నేను అందించిన మెయిన్ పేపర్ ఫస్ట్ పేజీలో బాక్స్ ఐటమ్ ని చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి చదవసాగాడు.
" రెండు రోజుల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాలు " అన్న మకుటం అది.
"నేను వెళ్తాను అంకుల్. ప్రదీపంకి చెప్పండి" నల్లబడిన ముఖంతో ప్రకాష్ నా సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు గబగబా.
అప్పుడే వచ్చిన ప్రదీప్ "అదేం నాన్న గారు? వాడు వెళ్ళిపోతున్నాడు ఏం?" అని అడిగాడు.
" నీరసంగా ఉందట. అది సరేగాని, వాడు నీకు పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా పేపరు పాడు చేసాను అని చెప్పాడా!" అనుమానంగా అడిగాను.
" నాకు తెలియదు నాన్నగారు. వాడి సెంటర్ మున్సిపల్ హైస్కూల్. నా సెంటర్ పోస్ట్ బేసిక్ స్కూల్. "అన్నాడు ప్రదీప్.
"డాడీ. మీ స్టూడెంట్ అట. మీకు ఫోను" తెచ్చి అందించింది అనూష.
అనూష నా కూతురు.
నేను అనూషను సీరియస్ గా చూస్తూ ఫోన్ అందుకున్నాను.
"హలో ఎవరు?"
"సార్!నేను సుజాతను. ఎలా ఉన్నారు సార్?"
"బాగున్నానమ్మా? ఏంటి విశేషాలు?"
"సార్! రెండు రోజుల్లో పదవ తరగతి ఫలితాలు వస్తాయట సార్"
"అవునమ్మా. ఈసారి పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో, అధికారుల నుంచి ఏ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆరాటంగా ఉంది"
"మీరు, మీ ఉపాధ్యాయులు అందరూ చాలా కష్టపడి, మా చదువు పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చదివించారు సార్! తప్పకుండా మేమందరం పాస్ అవుతాం.. కానీ.. "
"చెప్పమ్మా.. ఏమీటి నీ సందేహం?"
"సాంఘిక శాస్త్రం సబ్జెక్టు అనుమానం సార్. మీ ఫ్రెండ్ గారని మీకు నేరం చెబితే నామీద కోపం వస్తుందేమో గానీ అన్ని క్వశ్చన్ బ్యాంకులో టిక్కులు పెట్టి చదివేయండి అనేవారు. ఒక్క ప్రశ్న అంటే ఒక్క ప్రశ్న కూడా వివరించి చెబితే ఒట్టు. ఇంట్లో పరీక్ష ఫెయిల్ అయితే కోప్పడతారు సార్. అందుకని భయంగా ఉంది సార్!"
"చూడమ్మా ! ఏమీ భయంలేదు. నువ్వు తప్పక పాసావుతావ్. ఒకవేళ ఫలితం మరోలా వచ్చినా ఆవేశంతో తొందర నిర్ణయాలు తీసుకోవద్దు" అన్నాను అర్ధోక్తిగా.
సుజాత పకపకా నవ్వింది.
"మీ చేత ఒకసారి గడ్డి పెట్టించుకున్నాక కూడా అలా ఎందుకు చేస్తాను సార్?అయినా దేవుడు మనకి ఆలోచించే మనిషి జన్మనిచ్చింది.. ఏదో ఒక చిన్న పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చి పోవడానికి కాదు కదా సార్.
చదువు బాగా చదివే వారికి చదువే జీవనాధారం. చదువు మాలాంటి పేద వాళ్ళ జీవితంలో ఒక భాగం మాత్రమే. మాలాంటి వాళ్ళకి చదివే జీవితం కాదు సార్. అందుకని నేను అలాంటి పిచ్చి పనులు చేయను. సరే ఉంటాను సార్. ఫలితాలు వచ్చాక ఫోన్ చేస్తాను సార్. " సుజాత ఫోన్ పెట్టేసింది.
ఫోన్ ప్రదీప్ చేతికిచ్చాను.
"ఫోన్ నేను తెస్తే అన్నయ్యకి ఇస్తారే?''మూతి ముడుచుకుంటూ అడిగింది అనూష.
"నాన్నగారికి 'డాడీ' అని పిలవడం ఇష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకు అలా పిలిచావు? తెలుగు వాళ్లమైన మనమే మన తెలుగును మనం గౌరవించుకోకపోతే ఎలా? అని నాన్న గారు ఎన్ని సార్లు చెప్పాను నీకు? అందుకే నాన్నగారికి నీ మీద కోపం వచ్చింది. " ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ప్రదీప్.
"సారీ డాడీ.. " అనబోయి నాలుక కరుచుకొని "నన్ను క్షమించండి నాన్నగారు. ఇంకోసారి అలా పిలవను. నిజంగా." అని నా గడ్డం పట్టుకుని బతిమాలింది. నా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది.
అనూష గదిలోకి నిష్క్రమిస్తూ నాకు కోపం పోయిందా లేదా అని అని వెనక్కి తిరిగి చూసింది.
నన్నెలా చల్లబరచాలో దానికి బాగా తెలుసు. నా కోపం పోయినట్లుగా చిరునవ్వు నవ్వి తనకు ఫ్లయింగ్ కిస్ విసిరాను. సంతృప్తి గా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది అనూష.
********
శ్రీమతి టి ఇచ్చి వెళ్ళిపోయింది.
దాన్ని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాను. నేను, ఆనంద్ రావ్ పనిచేసేది తెలుగు మాధ్యమ పాఠశాలలో. మా పిల్లలు చదివేది మాత్రం పేరుమోసిన ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో.
వారికి పునాది బాగుండటం కోసం ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నా, తెలుగు భాష పట్ల ఉపాధ్యాయుడిగా, తండ్రిగా నా బాధ్యత ఏనాడు మర్చిపోలేదు.
ప్రతి రోజు మా అమ్మ నా చిన్నతనంలో ఏ పని చేసిందో అదే పని నేను చేశాను. రామాయణ, భారత, భాగవత కధలు ప్రతిరోజు సాయంత్రం పిల్లలిద్దరికీ పార్కు తీసుకువెళ్లి చెప్పేవాణ్ని. ఈనాడు ఆ పాత్రలు సమాజంలో ఉంటే వారు ఎలా ప్రవర్తిస్తారో అని చెప్పమనేవాడిని. ప్రదీప్ నా ఆలోచన తో క్రియేటివిటీ డెవలప్ అయి పిల్లల మాస పత్రికలకు లాజిక్ తో కూడిన చిన్న చిన్న కథలు రాసి పంపే స్థాయికి ఎదిగాడు.
వాడి ఉత్సాహం చూసి ప్రోత్సహించి తప్పులు సరి చేసి పంపిస్తూ ఉంటాను. సుమారు 20 కథల దాకా ప్రచురించబడ్డాయి. ఇప్పుడు తెలుగు వ్యాకరణం మీద పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడు.
తాను స్వతంత్రంగా తెలుగులో ఒక పద్యం రాయాలి అన్నది వాడి అభిలాష. ఎన్నో పద్యగాన పోటీలలో ప్రథమ బహుమతి పొందాడు. సుమారు ఆరేడు శతకాలు అనర్గళంగా అర్థసహితంగా చెప్పగల సమర్ధుడు.
తరగతిలో తెలుగు ఫస్ట్ మార్క్ వాడిదే. మన మాతృభాషను మనం కాపాడుకోవాలంటే మన పిల్లలలో దాని బీజాలు శ్రద్ధగా నాటాలి. ఆ శ్రద్ధకు సానపెట్టి వారిలో భాష పట్ల మమకారాన్ని పెంచాలి. మమకారం పెరిగితే భాష పట్ల అభిరుచి, అభిమానాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది. భాష పట్ల అభిమానంతో దాని లోతులు పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు విద్యార్థి. ఇది మన తెలుగు రాష్ట్రాలలో పుట్టిన ప్రతి పౌరుడి బాధ్యత. మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తే తెలుగు భాష ఎప్పటికీ అమృత భాషే.
"దేశభాషలందు తెలుగు లెస్స! ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా కీర్తింప బడ్డ తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా రావాలన్నా కృషి అభినందనీయం".
"నువ్వు లెక్కల వాడివై వుండి తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఏమిటయ్యా అసహ్యంగా?" అంటాడు ఆనందరావు.
"ఎవరి పిచ్చి వారికి ఆనందం " అని నవ్వి ఊరుకుంటాను నేను.
"పిల్లలు ఎప్పుడు లెక్కలే చేస్తూ ఉంటారు. మా సోషల్ కూడా చదవమని, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవయ్య బాబు పిల్లలకి" అని నన్ను కోరుతూ ఉంటాడు.
నాకు ఒళ్ళు మండిపోయి అన్నాను "సబ్జెక్టును పిల్లల హృదయాలకు హత్తుకునేలా మనం బోధిస్తే, ఏ సబ్జెక్ట్ అయినా పిల్లలు ఆనందంగా స్వీకరిస్తారు. నీ సబ్జెక్టు చదవమని నేను రికమండేషన్ చేయడం చాలా తప్పు. అది పిల్లలకు నీ పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. నన్ను క్షమించు" అన్నాను.
"అంటే పిల్లలకు నీ అంత బాగా నేను పాఠాలు చెప్పడం లేదు అనేగా నీ ఉద్దేశం. ఒకటి గుర్తుంచుకో ఉదయ్. పిల్లలు నీ లెక్కలు బాగా చేస్తూ ఉండి ఉండవచ్చు. కానీ వాళ్ళు పాసవాల్సింది లెక్కలు ఒక్కటే కాదు. ఐదు సబ్జెక్టులతో పాటు సోషల్ కూడా పాస్ అయితేనే మొత్తం ఫలితం వచ్చేది గుర్తుపెట్టుకో. అసలు ఆ పిల్ల గాడిదలకు సోషల్ అంటే లెక్కలేదు. ఏ చెత్త రాసినా జానా, బెత్తెడు కొలతలతో కొలిచి మార్కులు వేస్తారు అనే నమ్మకంతో ఉన్నారు నేను ఇక్కడ మార్కులు వేస్తాను. ఈ పబ్లిక్ పరీక్షల్లో ఎవరేస్తారు మార్కులు?" అన్నాడు కోపంగా.
"నువ్వు ఇక్కడ ఏ చెత్త రాసిన మార్కులు వెయ్యకు. పాయింట్ ప్రకారం రాస్తేనే మార్కులు పడతాయి అనే నమ్మకాన్ని వారిలో పెంచు. అప్పుడు తప్పకుండా నీ సబ్జెక్టు అంటే ప్రాణం గా భావించి చదువుతారు" అన్నాను.
"నాకు అంత ఓపిక లేదు గురు. వాళ్ళు పాసయితే సంతోషం. పరీక్ష తప్పితే వాళ్లే ఫీజులు కట్టుకుంటారు. ఇవన్నీ లెక్కలు సైన్సు సబ్జెక్టుల రోజులు. ఏదో చెప్పాలి కాబట్టి మా కోర్సులు మేము పూర్తి చేసాము. చదవమన్నాము. ఆ పైన వాళ్ళ అదృష్టం"
ఇంక నేను సంభాషణ ముందుకు పొడిగించ లేదు.
మనం చేస్తున్న తప్పుల్ని గుర్తించకుండా అభం శుభం ఎరుగని పిల్లలపై నేరం మోపడం అన్యాయం. అలా పిల్లలకు సబ్జెక్టు పట్ల అన్యాయం చేయడం వల్లనే కదా సుజాత సోషల్ పరీక్ష పోతుందేమో అని భయపడుతోంది.
ప్రీ పబ్లిక్ పరీక్షలలో పక్క అమ్మాయి రాసిన ఆన్సర్ షీట్ తీసుకొని రాస్తున్న సుజాతను పట్టుకున్నాను. ' పబ్లిక్ లో ఇలా చేస్తే డిబార్ అవుతావు' అని తీవ్రంగా మందలించాను.
అయితే సుజాత ధైర్యంగా చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.
ఇంకా ఉంది.
కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు
తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.
*వృత్తి పరంగా :
*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.
*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.
*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.
*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.
*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి
ప్రవృత్తి పరంగా :
*కథా రచయితగా రచనలు :
1. అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు మాస్టారి' కధానికలు - ఉదయకిరణాలు (2015) 4. అమ్మతనం సాక్షిగా... కవితా సంపుటి (2015) 5. నాన్నకో బహుమతి - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )
నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )
2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)
ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)
*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .
తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,
పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*
2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య 2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం 2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*
పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం.
*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..
Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.
2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.
3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన
ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.
చివరగా నా అభిప్రాయం :
ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.
కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.
కొత్తపల్లి ఉదయబాబు
సికింద్రాబాద్




Comments