top of page
Original.png

పై మెరుగులు

3 hours ago
5 min read

పై మెరుగులు కథలో సాధారణ పల్లెటూరి కోడలిని ఎంచుకున్న పార్వతమ్మ

Pai Merugulu - Telugu Family Story | Ganti Asa Padmini

పై మెరుగులు - తెలుగు కుటుంబ కథ | గంటి ఆశ పద్మిని

Published in manatelugukathalu.com on 14/11/2026


పై మెరుగులు చూసి మనుషులను అంచనా వేయకూడదని చెప్పే హృద్యమైన కుటుంబ కథ ఇది. రూపం, చదువు, డబ్బు కంటే మంచి మనసు, పనితనం, సేవాభావమే జీవితంలో నిజమైన సంపద అని ఈ కథ చాటి చెబుతుంది.


“పార్వతమ్మా! ఎక్కడ ఉన్నావు?” అని పిలుస్తూ వచ్చింది పెళ్లిళ్ల పేరమ్మ.


"వస్తున్నాను," అని చేతిలో పని వదిలేసి వంటగదిలోంచి హాల్లోకి వచ్చింది పార్వతమ్మ.

పార్వతమ్మ రాగానే, "ఇగో ఈ ఫోటో చూడు," అని తన బ్యాగ్‌లోంచి ఒక అమ్మాయి ఫోటో తీసి చూపించింది పేరమ్మ. ఐదు అడుగుల పొడవు, తెల్లటి మెరిసిపోయే రంగు, అందంగా ధగధగ నగలతో మెరిసిపోతూ ఉంది ఫోటోలో అమ్మాయి.


ఆ ఫోటోను చూసి, "నాకు సిటీ అమ్మాయిలు వద్దు, ఒక మంచి పల్లెటూరి సంబంధం చూడు," అని చెప్పి లేచి వెళ్ళిపోయింది పార్వతమ్మ.


“అదేంటి, అందరూ సిటీ అమ్మాయిలు కావాలి, డబ్బు ఉన్నవారు కావాలి అని అడుగుతుంటే... ఈవిడేమో సిటీ అమ్మాయి వద్దు, పల్లెటూరి అమ్మాయి కావాలి అంటోంది!” అనుకుంటూ వెళ్ళిపోయింది పేరమ్మ.


కొద్ది రోజుల తర్వాత పార్వతమ్మ అన్న తన మనవరాలి పెళ్లికి పిలవడానికి పార్వతమ్మ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అన్నను పలకరించి సకల మర్యాదలు చేసింది.


పార్వతమ్మ భర్తకు పెళ్లి శుభలేఖ ఇచ్చి, "పెళ్లికి తప్పకుండా రావాల్సిందే," అని మరిమరీ చెప్పి వెళ్లాడు పార్వతమ్మ అన్న.


పెళ్లి రోజు రానే వచ్చింది. పార్వతమ్మ ఇంటి సభ్యులందరూ పార్వతమ్మ సొంత ఊరు “సకినేటిపల్లి”కి బయలుదేరి వెళ్లారు. పెళ్లిలో అందరూ చాలాబాగా పార్వతమ్మ కుటుంబ సభ్యులందరినీ పలకరించి మర్యాదించారు. పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.


ఇంటికి తిరిగి వచ్చారు పార్వతమ్మ వాళ్లు. పెళ్లి నుంచి వచ్చిన కొద్ది రోజుల తరువాత పార్వతమ్మ పేరమ్మను పిలిచి ఒక ఫోటో ఇచ్చి, "ఈ అమ్మాయి ఊరు సకినేటిపల్లి.


వెళ్లి పెళ్లిసంబంధం మాట్లాడు," అని చెప్పింది.


“నల్లగా, బంగారు చెవిపోగులు కూడా లేకుండా, చదువు రాని ఒక పల్లెటూరి బైతులా ఉంది అమ్మాయి ఫోటోలో!” ఆ ఫోటో చూసి, “అమ్మ! ఈ అమ్మాయిని కోడలుగా చేసుకుంటారా మీరు?” అని అడిగింది పేరమ్మ.


"వెళ్లి వాళ్ల సమాధానం కనుక్కొని వచ్చి చెప్పు," అని లేచి వంటగదిలోకి వెళ్లబోతుండగా... “అమ్మ, మరి బాబుకి ఫోటో చూపించారా?” అని అడిగింది పేరమ్మ.


"నీకు చెప్పిన పని నువ్వు చేయి," అంది పార్వతమ్మ.


‘ఎంతో మంచి మంచి సంబంధాలు వస్తుంటే ఎలాంటి పిల్లను కోడలుగా చేసుకుంటానంటోంది ఏంటి ఈ పార్వతమ్మ?’ అనుకుంటూ వెళ్లేంది పేరమ్మ.


పార్వతమ్మ చెప్పిన సంబంధం మాట్లాడడానికి వెళ్లింది పేరమ్మ. అక్కడ ఒక చిన్న పెంకుటిల్లు, ఒక ఆవు, రెండు గేదెలు ఉన్నాయి. పేరమ్మ ఆ పిల్ల తండ్రిని పిలిచింది.


పిల్ల తండ్రి వచ్చి, “ఎవరు మీరు? ఎవరు కావాలి?” అని అడిగాడు.

"నేను పెళ్లిళ్ల పేరమ్మను. పార్వతమ్మ కొడుకు వరుణ్ బాబుకు మీ అమ్మాయిని అడుగుతున్నారు. మీకు ఇష్టమైతే మాట్లాడడానికి వస్తారు," అని చెప్పింది పేరమ్మ.


“ఏంటి, మా ఊరి జమీందారు ఇంటి నుంచి సంబంధమా!” అని ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు పిల్ల తండ్రి.


"మీ సమాధానం ఏమిటి?" అని అడిగింది పేరమ్మ.


“స్వయంగా దేవతే వరం ఇస్తానంటే వద్దంటామా!” అన్నాడు పిల్ల తండ్రి.

"అయితే మీ సమాధానం పార్వతమ్మకు చెప్పి... మంచి రోజు చూసుకుని వస్తాము," అని వెళ్ళిపోయింది పేరమ్మ.


ఆ పిల్ల తండ్రికి ఈ సంబంధం ఇష్టమే అని పార్వతమ్మకు చెప్పింది పేరమ్మ.

"వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉంది. ఆరోజే పిల్లను చూసుకోవడానికి వస్తాము అని చెప్పమను," అంది పార్వతమ్మ పేరమ్మతో.


‘అమ్మ! ఇంకోసారి ఆలోచించండి,’ అంది పేరమ్మ.

‘నా నిర్ణయంలో మార్పు లేదు!’ అని గట్టిగా చెప్పింది పార్వతమ్మ.


శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లను చూడడానికి ఊరికి బయలుదేరారు. ఆడపిల్ల ఇంటికి చేరుకున్నారు. ఆడపిల్ల తండ్రి తనకు ఉన్నంతలో బాగానే మర్యాదించాడు పార్వతమ్మ కుటుంబాన్ని. ఒకరి పరిచయాలు మరొకరు తీసుకున్నాక, "పిల్లను తీసుకురండి," అని చెప్పింది పార్వతమ్మ.


“అమ్మా! అందరికీ చాయ్ తీసుకురా,” అన్నాడు పిల్ల తండ్రి.


పార్వతమ్మ కుటుంబ సభ్యులందరూ పిల్ల ఎలా ఉందో అని చూసేందుకు కుతూహలంగా ఉన్నారు. ఒక స్టీల్ ప్లేట్‌లో ఆరు చాయ్ గ్లాసులు పట్టుకొచ్చి అందరికీ అందించింది పిల్ల. ఎంతో కుతూహలంగా పిల్ల కోసం ఎదురుచూస్తున్న వారంతా ఒక్కసారిగా ముఖాలు చిట్లించారు పిల్లను చూసి.


పెద్ద కోడలు, “అత్తయ్య! మన వరుణ్‌కి ఇలాంటి పిల్లతో పెళ్లా?” అంది.

చిన్న కోడలు, “అత్తయ్య! మన ఇంటి పనిమనిషిగా కూడా సరిపోని ఈ పిల్ల మన ఇంటి కోడలా?” అంది.


మూడో కోడలు ఏమీ మాట్లాడకుండా అక్కడనుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది.

పార్వతమ్మ ఇద్దరి కోడళ్ల మాటలు, మూడో కోడలి ప్రవర్తన ఇవేవీ పట్టించుకోకుండా, “నాన్న వరుణ్! పిల్ల నచ్చిందా?” అని అడిగింది.

"వరుణ్, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే," అన్నాడు.


వెంటనే పార్వతమ్మ, "వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, వచ్చే నెలలోనే పెళ్లి," అని చెప్పింది.


ఒక శుభముహూర్తాన పార్వతమ్మ చూసిన పిల్లతో వరుణ్ పెళ్లి జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ... “అసలు ఈ పార్వతమ్మకు ఏమైంది? మంచి మంచి సంబంధాలు ఉన్నా, ఎంతో అందమైన పిల్లలు ఉన్నా... ఏరి కోరి ఇలాంటి పిల్లను కోడలుగా తెచ్చుకుంటోంది ఏమిటి?” అని ఒకటే గుసగుసలు.


పార్వతమ్మ కోరుకున్న పిల్ల ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది. పది రోజుల తరువాత కొత్త కోడలిని చూసేందుకు పార్వతమ్మ అత్తగారి అక్క వచ్చింది. పార్వతమ్మ స్వయంగా సకల మర్యాదలు చేసింది. రెండ్రోజులు గడిచాయి.


పార్వతమ్మను తన పెద్ద అత్తగారు పిలిచి, “ముగ్గురు కోడళ్లను ఎంతో అందమైన వాళ్లను, చదువు, డబ్బు ఉన్న వాళ్లను తెచ్చుకున్నావు. మరి ఎందుకు ఇంత నల్ల పిల్లను, చదువు, డబ్బు ఏమీ లేని పిల్లను నాలుగో కోడలిగా తెచ్చుకున్నావు?” అని అడిగింది.


పార్వతమ్మ ఒక చిన్న నవ్వు నవ్వి, తన నాలుగో కోడలిని పిలిచి, “ఇవాళ్టి నుంచి ఈ పెద్ద అమ్మమ్మగారి బాధ్యత నీది,” అని చెప్పింది.


పార్వతమ్మ పెద్ద అత్తగారు, “ఆమ్మో! నీ కోడలితో నాకు సేవలు చేయిస్తావా? నాకెవరూ ఏ సేవ చేయనవసరం లేదు,” అంది.


"ఒక రెండ్రోజులు ఆ పిల్లను సేవ చేయనివ్వండి, నచ్చకపోతే అప్పుడు నేనే చేస్తాను," అంది పార్వతమ్మ. భయంతోనే సరేనంది పెద్దత్తగారు.


అత్తగారు తమ పెద్దత్తగారి బాధ్యత కొత్త కోడలికి అప్పగించిన సంగతి తెలిసిన మిగతా ముగ్గురు కోడళ్లు కొత్త కోడలి దగ్గరకు వచ్చారు.


“నీకు పెద్ద అమ్మమ్మగారి బాధ్యత మన అత్తగారు అప్పగించారుటగా?” అని దీర్ఘంగా సాగదీసింది పెద్ద తోడికోడలు.


"అవును అక్క," అని సమాధానం ఇచ్చింది కొత్త కోడలు.


“నీకు ఆ ముసలిదాని గురించి తెలుసా?” అని సాగదీసింది రెండో తోడికోడలు.

"అమ్మమ్మగారికి నచ్చినట్టు, మెచ్చుకునేటట్టు సేవ చేస్తాను," అంది కొత్త కోడలు.


“ఆ ముసలిదానికి సేవ చెయ్యడం ఎంత కష్టమో నీకు తెలుసా?” అని అడిగింది మూడో తోడికోడలు.


నలుగురి కోడళ్ల సంభాషణ మధ్యలోకి పార్వతమ్మ పెద్ద అత్తగారు వచ్చి, "నిన్ను నేను మూడు ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పు," అంది కొత్త కోడలితో.

"సరే అమ్మమ్మగారు, అడగండి," అంది కొత్త కోడలు.


మొదటి ప్రశ్న:

“నీకు ఎవరికైనా ఫోన్ చెయ్యడం వచ్చా?”

సమాధానం:

“ఫోన్ చెయ్యడం రాదు. కానీ దూరంగా ఉండే వాళ్ల యోగక్షేమాలు తెలుసుకోవడం వచ్చు,” అంది.


రెండో ప్రశ్న:

“నీకు ఇంట్లో ఏదైనా వస్తువు పాడైతే వెంటనే హెల్పర్స్ కి బుక్ చెయ్యడం, గ్యాస్ బుక్ చెయ్యడం, ఇంకా చిన్న చిన్న పనులకు కూడా ఆన్‌లైన్ వర్కర్స్‌కి బుక్ చెయ్యడం వచ్చా?”

సమాధానం:

“నాకు ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చెయ్యడం వచ్చు. గ్యాస్ లేకపోయినా వండడం వచ్చు. ఎంతో పెద్ద ఇబ్బందులు వస్తే తప్ప మిగతా చిన్న చిన్న ఇబ్బందులన్నీ నాకు రిపేర్ చెయ్యడం వచ్చు,” అంది.


మూడో ప్రశ్న (అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న):

“నీకు రెస్టారెంట్స్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టడం వచ్చా?”

సమాధానం:

“నాకు ఆర్డర్ పెట్టడం రాదు. కానీ రెస్టారెంట్ స్టైల్‌లో వంటలన్నీ వండడం వచ్చు,” అంది.

ఇలా పార్వతమ్మ పెద్ద అత్తగారు అడిగిన ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానాలు చెప్పింది కొత్త కోడలు. అప్పుడే అక్కడికి వచ్చింది పార్వతమ్మ.

పార్వతమ్మను చూసి, “మొత్తానికి పై మెరుగులు చూసి మోసపోకూడదని తెలుసుకున్నావన్నమాట!” అంది పెద్ద అత్తగారు మెచ్చుకోలుగా.

పార్వతమ్మ ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది.


- గంటి ఆశ పద్మిని



*** 









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.

నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page