పావురం తీర్పు

Pavuram Teerpu - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
పావురం తీర్పు- తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 28/08/2026
పావురం తీర్పు ఒక హృదయాన్ని హత్తుకునే తెలుగు నీతి కథ. రాళ్ళబండి సంగంనాయుడు రచించిన ఈ కథలో క్రూరమైన వేటగాడు, గాయపడిన పావురం, మారువేషంలో ఉన్న రాజు చుట్టూ కథనం సాగుతుంది. వేటగాడి బాణానికి గాయపడిన పావురం తన ప్రాణాలను కాపాడిన రాజును శరణు కోరుతుంది. పక్షి ఎవరిదనే వివాదం కథలోని ప్రధాన మలుపు.
అనగనగా ఒక వేటగాడు. మహా కిరాతుకుడు. రోజూ అడవికి పోయి పక్షులను, జంతువులను వేటాడేవాడు. దయదాక్షిణ్యాలు ఇంచుకైనా లేని క్రూరుడు. జీవుల పచ్చి నెత్తురు తాగేవాడు. కనికారం కలలోనైనా ఎరుగనివాడు. హింసను తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నవాడు. అహింసకు ఆమడ దూరం. పక్షులను పట్టుకోవడం, చంపడం నిత్య కృత్యం. వేట తప్ప వేరే దినచర్య లేనివాడు. పాపాత్ముడు. ఆ బోయవాడు వేటాడిన జీవులను అమ్మి ఆ డబ్బుతో మద్యపానం, గంజాయి, మత్తు పదార్థాలు సేవించేవాడు. జూదం లాంటి ఆటలు ఆడేవాడు.
అతనికి లేని వ్యసనం లేదు. ఎవరైనా ఇంతపాపం ఎవరికోసం చేస్తున్నావని అడిగితే భార్యాపిల్లలను పోషడానినని చెప్పేవాడు. కుటుంబానికి పైసా ఇచ్చేవాడు కాదు. కుటుంబాన్ని గాలికొదిలి జల్సాలు చేసేవాడు. ఇలా ఎన్నో జీవుల ఉసురు తీశాడు. ఇంకెన్నో ప్రాణులను పొట్టనపెట్టుకున్నాడు. ఈ వేటగాడు వస్తున్నాడంటే అడవిలోని జీవులు ప్రాణభయంతో గజగజలాడేవి. ఆ వేటగాని పీడ విరగడ కావాలని భగవంతుణ్ణి నిత్యం ప్రార్థించేవి.
ఒక రోజు వేటగాడు విల్లు ఎక్కుపెట్టి చెట్టుమీదనున్న ముక్కపచ్చలారని, ముద్దుకొల్పే ఒక పావురాన్ని గురిచూసి బాణం వదిలాడు. ఆ బాణం సరాసరి వెళ్లి పావురం రెక్కలో గుచ్చుకుంది. పావురం పక్కలో గుచ్చుకున్న బాణంతో విలవిలాడుతూ అడవి మార్గం గుండా పోతున్న మారువేశంలో ఉన్న రాజు భుజంపై వాలింది. ఆ దేశాన్ని పాలించే రాజు మారువేశంలో తన పాలన గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం పరివారం లేకుండా దేశ పర్యటన చేస్తూ అడవి మార్గం గుండా పోతున్నాడు.
తన భుజంపై వాలిన పావురాన్ని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు. భయపడవద్దని పావురానికి ధైర్యం చెప్పాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తానన్నాడు. రెక్కలను సంవరిస్తూ వొడుపుగా గుచ్చుకున్న బాణాన్ని నెమ్మదిగా తీసి ఆకుపసరుతో కట్టుకట్టాడు. చెట్టు నీడకు తీసుకువెళ్లి సేదతీర్చాడు. నీళ్లు పట్టాడు. ఇలా ఎన్నో సేవలు రాజు చేసిన పిదప పావురం కొంచెం కోలుకుంది.
ఇంతలో వేటగాడు పక్షి నాదంటూ అక్కడికి వచ్చి పావురాన్ని ఇమ్మని అడిగాడు. వేటే తన జీవనాధారమని, తన పొట్టకొట్టొద్దని అబద్ధం ఆడాడు. కుటుంబ పోషణ కోసమే వేటని నమ్మబలికాడు. రాజు "కాళ్లలో చిన్న ముళ్ళు విరిగితేనే మనం విలవిలాడిపోతాము, అలాంటిది వాడి అయిన బాణంతో పావురాన్ని కొట్టడానికి నీ చేతులు ఎలా వచ్చాయి? పక్షి తనకు తానుగా వచ్చి నన్ను శరణు వేడింది. పక్షిని ఇవ్వన"న్నాడు.
పక్షి నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు. కొంత గొడవ జరిగిన తరువాత ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. పక్షి ఇద్దరిలో ఎవర్ని కోరుకుంటే వారిదేనని తీర్పు పావురానికి వదిలేశారు. ముందు వేటగాడు పావురాన్ని చేతులు చాచి రమ్మని పిలిచాడు. వేటగాడి పిలుపుకి పావురం భయపడి వెనక్కు తగ్గింది. ఇప్పుడు మారువేశంలో ఉన్న రాజు పావురాన్ని రమ్మని పిలవగానే ఆనందంగా అతని చేతుల్లో వాలింది. వేటగాడు పావురం మారువేశంలో ఉన్న రాజుదేనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఊహించని ఈ సంఘటనతో వేటగాడు వేటకు స్వస్తి పలికాడు. రాజు ఆ పావురానికి కొన్ని రోజులు చికిత్స చేసి దెబ్బ నయం అయిన తరువాత అడవిలో వదిలిపెట్టాడు. అలా అడవిలోని జీవులకు వేటగాడి పీడ విరగడ అయింది.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments