top of page
Original.png

పెద్ద దిక్కు

#GSSKalyani, #GSSకళ్యాణి, #PeddaDikku, #పెద్దదిక్కు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pedda Dikku - New Telugu Story Written By - G. S. S. Kalyani

Published In manatelugukathalu.com On 01/12/2025

పెద్ద దిక్కు - తెలుగు కథ

రచన: G. S. S. కళ్యాణి

ఉయ్యాలలో గుక్కపట్టి ఏడుస్తున్న మనవడి ఏడుపుతో తెల్లవారుఝామున మూడింటికి మెలకువ వచ్చింది శేషాద్రికి. 


ఏడాదికూడా నిండని పసివాడికి ఏమైందో తెలియక కంగారుపడుతూ, "ఏంటమ్మా మానసా? మనవడికి ఏమైందీ? ఎందుకలా ఏడుస్తున్నాడూ?", అని తన కోడలు మానసను అడిగాడు శేషాద్రి. 


"ఏమో తెలియదు మామయ్యగారూ. పాలు కూడా తాగట్లేదు!", పిల్లవాడికి బాటిల్ తో పాలు తాగించేందుకు ప్రయత్నిస్తూ అంది మానస. 


"ఏదీ? ఓసారి నన్ను చూడనీ…", అంటూ శేషాద్రి తన మనవడి పొట్టను నిమిరి చూసి, "అజీర్ణం చేసినట్లుందమ్మా! నీళ్లల్లో వాము వేసి మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు వేసి చల్లార్చి తాగించు. అప్పటికీ తగ్గకపోతే ఏంచెయ్యాలో ఆలోచిద్దాం", అన్నాడు. 


"అబ్బబ్బ! అలాంటివన్నీ పాతకాలపు పద్ధతులు మామయ్యగారూ. ఇప్పుడు ఆన్లైన్లో డాక్టర్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. డాక్టర్ను అడిగి ఆవిడ చెప్పిన మందులు వాడదాం", అంది మానస చిరాకుపడుతూ. 


అనుభవజ్ఞానంతో చెప్పిన సలహాను కోడలు కొట్టిపారేయడంతో శేషాద్రి మనసు నొచ్చుకుంది. తెల్లవారుతూనే మార్నింగ్ వాక్ పేరుతో ఇంటినుంచీ బయటపడ్డాడు శేషాద్రి. ఒకప్పుడు ఏ కష్టమొచ్చినా పంచుకునేందుకు శేషాద్రి పక్కనే అతని అర్ధాంగి ఉండేది. ఇప్పుడు ఆవిడ లేని లోటును ప్రతి క్షణం అనుభవిస్తున్నాడు శేషాద్రి. వయసు మళ్ళడంతో ఊళ్ళో ఒంటరిగా ఉండలేక కొడుకు దగ్గరకు వచ్చి ఉంటున్నాడు శేషాద్రి. 


వీధి వెంట నడుచుకుంటూ వెడుతున్న శేషాద్రికి ఒక ఇంటి అరుగుపైన ఒక పదేళ్ళ పిల్లవాడు కూర్చుని తన కాలు పట్టుకుని ఏడుస్తూ కనపడ్డాడు. ఆ పిల్లవాడి తల్లి దుఃఖం ఆపుకుంటూ ఆ పిల్లవాడిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తోంది. పాడుబడిన ఇంటినీ, తల్లీబిడ్డల మాసిన బట్టలనూబట్టి వాళ్ళు పేదవాళ్ళై ఉంటారని అనుకున్నాడు శేషాద్రి. 


"ఏమైందమ్మా? బాబు కాలు ఎర్రబడిందే! ఏం జరిగిందీ?", విషయం తెలుసుకోవాలని పిల్లవాడి తల్లి త్రివేణిని అడిగాడు శేషాద్రి. 


"బాబు ఆడుతూ కిందపడ్డాడండీ. మావారి స్నేహితుడొకరు ఆన్లైన్లో కారణం చూసి కాలు విరిగిందని చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నా దగ్గర డబ్బుల్లేవు. ఏం చెయ్యలో తెలియట్లేదు!", అంది త్రివేణి. 


శేషాద్రి బాబు కాలిని పరిశీలనగా చూసి అక్కడక్కడా నొక్కుతూ పాదాన్ని ఇటూ అటూ తిప్పాడు. 


 బాబు ఏడుపాపి కాలివంక చూస్తూ ఉండటం గమనించిన శేషాద్రి, "ఎముక విరిగుండదమ్మా! కంగారు పడకండి. కాలు బెణికినట్లుంది. ఎర్రబడింది తప్ప వాపు లేదు. కాపడం పెట్టి చూడండి", అన్నాడు. 


త్రివేణి గబగబా ఇంట్లోకి వెళ్ళి వేన్నీళ్ళు పట్టుకొచ్చి బాబు కాలికి కాపడం పెట్టింది. బాబుకు నొప్పి తగ్గింది. కాలును ఇబ్బంది లేకుండా కదపగలిగాడు. 


అది చూసిన త్రివేణి శేషాద్రికి దణ్ణం పెడుతూ, "దేవుడల్లే వచ్చి నా బిడ్డ నొప్పి తగ్గించారు. మీలాంటి అనుభవం ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లో లేక చిన్న సమస్యలకు కూడా ఆన్లైన్ మీద ఆధారపడి ఇబ్బందులపాలౌతున్నాం. అప్పుడప్పుడూ మా ఇంటికొస్తూ ఉండండి బాబూ", అంది త్రివేణి కన్నీళ్ళతో. 


"అలాగే! తప్పకుండా వస్తూ ఉంటానమ్మా. బాబు జాగ్రత్త!", అని అక్కడినుంచీ ముందుకి నడిచాడు శేషాద్రి. 


శేషాద్రి మనసంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది. మెల్లిగా నడుస్తూ శ్రీరాముడి ఆలయం చేరుకుని, స్వామి దర్శనం చేసుకుని, తీర్థప్రసాదాలు తీసుకుని ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాడు శేషాద్రి. తెల్లవారుఝామున మానస అన్న మాటలూ, కృతజ్ఞతతో త్రివేణి అన్న మాటలూ శేషాద్రికి పదే పదే గుర్తుకొస్తున్నాయి. 


దీర్ఘాలోచనలో ఉన్న శేషాద్రిని గమనించిన ఆ ఆలయ నిర్వహణాధికారి రాధారమణ, "ఏమిటండీ? ఏదో సమస్య గురించి ఆలోచిస్తున్నట్లున్నారూ? ఏమిటి సంగతీ?", అని అడిగాడు శేషాద్రిని. 


“అదేనండీ! ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందని ఆనందపడాలో భయపడాలో అర్థం కావట్లేదు! నేటి తరానికి ఇంటర్నెట్లో కావలసిన దానికన్నా వందరెట్లు ఎక్కువ సమాచారం అందుబాటులోకి వచ్చింది. 


ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేక సతమతమవుతున్నవాళ్ళు కొందరైతే, చిన్న చిన్న అనారోగ్యాలకు కారణాలు వెతుకుతూ రకరకాల వెబ్సైట్లన్నీ చూసి విపరీతమైన ఆందోళన చెంది ఆరోగ్యం నిజంగానే పాడుచేసుకుంటున్నవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఒకప్పుడు ఇంట్లో సలహాలు చెప్పేందుకు పెద్దదిక్కు లేదని బాధపడేవాళ్ళు. 


కానీ ఇప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళని భారంగా భావిస్తూ ఆన్నింటికీ ఆన్లైన్లో ఇచ్చిన సమాచారాన్ని నమ్మి కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు ఈ తరం పిల్లలు. ఏదేమైనా మా తరం అనుభవంతో సంపాదించిన జ్ఞానం మాత్రం ఎవ్వరికీ ఉపయోగపడకుండా వృధా అయిపోతోంది!”, అని నిట్టూర్చాడు శేషాద్రి. 


అందుకు రాధారమణ చిన్నగా నవ్వి, "సరిగ్గా నా మనసులో మాటలే మీరన్నారు. నేను ఈ ఊళ్ళో కాలేజీ ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యాను. నా మాటకు మా ఇంట్లో విలువలేదు. చెప్పాలంటే అందరికీ నేను ఏదో పనిలేకుండా ఊరికే తిని కూర్చుంటున్నానన్న భావన ఉండేది. నాకంటూ ఒక వ్యాపకం ఉండాలని నిర్ణయించుకుని ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను తీసుకున్నాను. 


శ్రీరాముడి సేవలో కాలం గడపుతున్నానన్న తృప్తి ఇప్పుడు నాకుంది. మీకున్న జ్ఞానం ఈ తరంతో పంచుకోవాలంటే నేనొక మార్గం చెప్పగలను. మా ఆలయానికి ఒక వెబ్ సైట్ ఉంది. అందులో ప్రతినెలా ఒక అంతర్జాల పత్రిక విడుదల చేస్తూ ఉంటాం. ఆ పత్రికలో ఆధ్యాత్మిక విషయాలతోపాటూ నలుగురికీ పనికొచ్చే సమాచారాన్ని కూడా అందిస్తూ ఉంటాం. మీకున్న జ్ఞానాన్ని రచనల రూపంలో మాకిస్తే మేము మా పత్రిక ద్వారా దాన్ని అందరికీ అందేలా ఏర్పాటు చెయ్యగలం", అన్నాడు. 


"అద్భుతమైన ఆలోచన ఇచ్చారు రాధాకృష్ణగారూ! అసలు నా బాధ తెలుసుకుని మీ చేత ఆ రాముడే ఇలా పలికించాడేమో! మీరు సూచించిన విధంగా రచనలు చెయ్యడం నేను ఇవాళే మొదలుపెడతాను. నేను సంపాదించిన అనుభవజ్ఞానం భావితరాలకు ఏ మాత్రం ఉపయోగపడినా నాకది సంతోషమే!", అంటూ నూతనోత్సాహంతో ఇంటికి బయలుదేరాడు శేషాద్రి. 


*****


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@GSSKalyani05

•14 hours ago

కథను అద్భుతంగా చదివారండీ. ధన్యవాదాలు!

Like
bottom of page