ఫోన్ బ్రతుకు
- Vemparala Durga Prasad

- May 7
- 3 min read

Phone Brathuku - Telugu Comedy Story | Vemparala Durga Prasad
ఫోన్ బ్రతుకు - తెలుగు హాస్య కథ | వెంపరాల దుర్గాప్రసాద్
Published In manatelugukathalu.com On 07/05/2026
“ఫోన్లు మాట్లాడితే… మన గురించి ఏమంటాయి?”
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ఫోన్ బ్రతుకు హాస్య కథలో తెలుసుకోండి.
-------------
అది ఒక పెద్ద దేవాలయం. జనాలు తమ జేబులోంచి ఫోన్లు తీసి కౌంటర్‌లో ఇస్తున్నారు. కౌంటర్‌లోని వ్యక్తులు తీసుకున్న ఫోన్‌కి ఒక టోకెన్ ఇచ్చి, ఆ ఫోన్లని ఒక టికెట్‌తో రబ్బర్ బ్యాండ్ కట్టి, అరలలో పెడుతున్నారు.
అప్పుడే అరలోకి చేరిన ఒక శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ "అమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుని, పక్కకి చూసింది. అప్పటికే అక్కడ చేరిన మరో మోటోరోలా ఫోన్ కనపడింది.
"ఏం అక్కా! నువ్వు కూడా నీరసంగా కనపడుతున్నావు?" అంది పలకరింపుగా.
“ఏం చేయమంటావు చెల్లీ.. ఈ ముదనష్టపు వాడు నా ఒళ్ళు హూనం చేస్తున్నాడు. రాత్రి ఒంటి గంట దాకా పడుకోడు. వాట్సాపు, యూట్యూబ్ వీడియోలు అనుకుంటూ నన్ను తెగ నలిపేస్తున్నాడు. నాకు రెస్ట్ ఇవ్వడు. వీడి భక్తి వల్ల కనీసం ఈ గుడులలోనైనా కొద్దిసేపు రెస్ట్ దొరుకుతోంది. ఇప్పుడు కూడా జనం ఎక్కువ ఉంటే, దర్శనం లేటయితే, కాస్త వెంటనే రాడు. లేకపోతే, ఈ రెస్ట్ కూడా దొరకదు” అంది మోటోరోలా ఫోన్.
" నా సంగతి మరీ ఘోరం అక్కా.. మా వాడు బాత్రూంకి కూడా నన్ను తీసుకుపోతాడు. వీడితో చస్తున్నాను. ఈ గుళ్ళలో మొబైల్స్ అనుమతించరు కనుక సరిపోయింది. లేకపోతే, క్యూ లైన్లో కూడా నన్ను నలిపేసేవాడు” అంది శాంసంగ్, విచారంగా. పక్క అరలలో ఉన్న మిగిలిన ఫోన్లు కూడా "మా పరిస్థితీ ఇంచుమించు ఇంతే" అని నిట్టూర్చాయి.
వీటి పక్కన ఉన్న షెల్ఫ్‌లోంచి తొంగి చూసిన “వన్ ప్లస్” ఫోన్, ”చూడండి అక్కాయిలు, మీ సంగతి చెప్పారు. మా మహాతల్లి సంగతి మీకు తెలియదు. ఆమె నా ప్రాణం తీస్తున్నది కాక, మధ్యలో తన పిల్లలు తీసుకుపోయి చేసే హంగామా అంతా ఇంతా కాదు. వాళ్ళు గేములను, పబ్జీలను, రకరకాలుగా నన్ను పట్టుకు కొడుతూ ఉంటారు” అంది దిగాలుగా.
శాంసంగ్, మోటోరోలా ఫోన్లు రెండూ వన్ ప్లస్ కేసి జాలిగా చూశాయి.
ఇంతలో ఇటుపక్క నున్న షెల్ఫ్‌లోంచి తొంగి చూసింది ఆపిల్ ఫోన్. “ఆపిల్”ని చూసి, “అక్కా, నీ సంగతి మా కంటే బెటరేమో.. నీ ఆపరేషన్ కాస్త కష్టం అని, కొద్దిగా తక్కువ వాడతారేమో నిన్ను” అంది వన్ ప్లస్ .
" ఏమీ లేదు చెల్లీ, ఈ మధ్య మేము జేబులో ఉండడం వాళ్ళ స్టేటస్‌కి బలం అని, తెగ కొని, తెలిసీ తెలియని ఆపరేషన్లు చేసి, మా ఒళ్ళు విరగ్గొడుతున్నారు” అంది ఆపిల్ ఫోన్.
“నా వరకు వస్తే, మా తింగరి బుచ్చిది పనిచేసేది బట్టల షాపులో. కానీ, రీల్స్, షార్ట్స్ అంటూ... ఖాళీ దొరికినప్పుడల్లా నా ప్రాణం తీస్తోంది” అంది వాళ్ళ యజమానురాలి గురించి తలచుకొంటూ.
“నిజానికి ఫీచర్ ఫోన్ పిన్ని బ్రతుకే బావుంది ఈ రోజుల్లో..” అంది పక్కన ఉన్న ఫీచర్ ఫోన్ కేసి చూస్తూ.
" మీతో పోలిస్తే, నయమే కానీ... మా యజమాని కంటే, వాడి పిల్లలు నన్ను చితక్కొట్టేస్తూ ఉంటారు. వాడు స్మార్ట్ ఫోన్ కొనడం లేదని, మధ్య మధ్యలో నన్ను నేలకేసి కొట్టి, గాయపరుస్తున్నారు” అంది తన బాధలు చెప్పుకుంటూ ఫీచర్ ఫోన్.
ఇంతలో దర్శనాలు అయిపోయి వస్తున్న భక్తులు మళ్ళీ తమ టోకెన్లు ఇచ్చి, ఫోన్లు తిరిగి తీసుకోవడం మొదలెట్టారు. వాళ్ళ యజమానులని చూసిన ఫోన్లన్నీ, నీరసంగా.. "చచ్చాం బాబోయ్! మళ్ళీ మా తిప్పలు మొదలు" అని మూలిగేయి.
ఈ కథ నేడు చర్వాణి వాడకం జనాల్లో ఎలా ఉందో తెలియజెప్పాలని చేసిన వ్యంగ్య ప్రయత్నం.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.











Comments