top of page
Original.png

పొరపాటు ఎవరిది?

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #PorapatuEvaridi, #పొరపాటుఎవరిది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

ree

Porapatu Evaridi - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 30/12/2025

పొరపాటు ఎవరిది? - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

శీతాకాలం ఉదయం పది గంటలు అయింది. సూర్యకిరణాలు నులివెచ్చగా సోకుతున్నాయి.


పార్కులో మేనేజర్ అయిన 50 ఏళ్ల శరత్, రోజులాగే అటు ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక బెంచ్‌పై కూర్చుని ఉన్న అమ్మాయిని చూసి దగ్గరకి వెళ్ళి పలకరించాడు.


 "ఎక్స్యూజ్ మీ, మీరు ఎవరికోసమైనా వచ్చారా?" అని శరత్ అడిగాడు.


ఆ అమ్మాయి, "ఇది పార్క్ కదా, ఎవరైనా రావచ్చు కదా" అని సమాధానం ఇచ్చింది.


శరత్ కొంచెం కంగారు పడి, "ఓకే ఓకే, కానీ ఈ రోజు సెలవు, రిపేర్స్ ఉన్నాయి. అందుకే ఎవరికోసమైనా వచ్చారా అని అడిగాను" అన్నాడు.


"సారీ, గేటు తెరిచి ఉంటే వచ్చేశాను" అంది ఆ అమ్మాయి.


"ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. మీది ఈ ఊరేనా?" అని శరత్ అడిగాడు.


"ఇకనుంచి ఈ ఊరే. మా హస్బెండ్‌ది సాఫ్ట్‌వేర్ జాబ్. మాకు కొత్తగా పెళ్లయింది. ఇక్కడే ఇల్లు తీసుకోవాలి. ఆయన ఇల్లు వెతుకుతూ వెళ్లాడు. అంతవరకు కాలక్షేపానికి ఇక్కడికి వచ్చాను" అని ఆమె చెప్పింది.


"ఓకే, మీకు కావలసినంతసేపు ఉండొచ్చు. నేను ఇక్కడ మేనేజర్‌ని. ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చెప్పినా నా పేరు చెప్పండి" అని శరత్ అన్నాడు.


"నేను వాళ్ళకి చెప్పాలంటే మీరు నాకు చెప్పాలిగా" అంది ఆమె.


 "ఓ సారీ, నా పేరు శరత్ కుమార్" అన్నాడు శరత్.


 "నా పేరు మీనాక్షి, నన్ను మీనా అని పిలిస్తే చాలు" అంది.


 "ఓకే, మీవారు వచ్చేంతవరకు ఉంటారుగా" అన్నాడు శరత్.


 "ఉండాలి. కానీ నాకిప్పటికే బోరు కొడుతోంది. సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుందేమో" అని మీనా విసుగ్గా అంది.


"మీకు బోరు కొట్టకుండా ఇక్కడ చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది" అని శరత్ అన్నాడు.


మీనా గోముగా "అదేదో చూపించొచ్చు కదా" అంది.


 శరత్ సంతోషంగా "రండి, వెళ్దాం" అని తీసుకెళ్లాడు.


ముందుగా ఎక్సర్‌సైజ్ చేసే పరికరాల దగ్గరికి వెళ్లారు. ఒక దాన్ని ఎక్కబోతూ మీనా తూలింది. శరత్ పట్టుకున్నాడు. పట్టుకోవడంలో ఆమె నడుంపై చేయి పడింది. ఆడ స్పర్శ కొత్త కాకపోయినా గుండె జల్లుమంది శరత్ కి. ఆమె ఏమైనా ఫీల్ అయింది ఏమోనని కంగారుగా ఆమె మొహం చూశాడు. ఆమె ఏమి పట్టించుకోనట్టుగా ఉంది. 


హమ్మయ్య అనుకున్నాడు. తర్వాత ఒక్కో పరికరం ఇచ్చి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆమెకు సహాయం చేశాడు. ఆమె ఆసరాగా అతని చేయి పట్టుకుని ప్రాక్టీస్ చేస్తోంది. అతనిలో ఏదో తెలియని హాయి. భార్య తప్ప మరో స్త్రీ స్పర్శ తెలియదు అతనికి.


కాసేపటి తర్వాత "మధ్యాహ్నం అయింది. మీకింకా ఆకలి కాలేదా?" అని శరత్ అడిగాడు.


మీనా ఓరగా చూస్తూ నవ్వుతూ, "ఏంటో, మీతో ఉంటే నాకు టైమే తెలీలేదు. ఇంక ఆకలేం వేస్తుంది?" అంది.


శరత్ ముసిముసిగా నవ్వుతూ, "పదండి, రెస్టారెంట్‌కు వెళ్దాం" అన్నాడు.


ఇద్దరూ రెస్టారెంట్‌లో లంచ్ చేశారు. మళ్లీ పార్కుకు వచ్చి కబుర్లు చెప్పుకున్నారు. సరదాగా అటూ ఇటూ తిరిగారు. ఇంతలో మీనా మొబైల్ రింగ్ అయింది. తీసి మాట్లాడింది.


"మా వారు. ఇల్లు దొరికింది. ఇక నేను వెళ్లాలి" అంది మీనా.

శరత్‌లో నిరాశ. "తప్పదు కదా. వెళ్ళండి. టైం ఎలా గడిచిందో తెలీలేదు. అప్పుడే సాయంత్రం అయిపోయింది" అన్నాడు.


మీనా నవ్వింది. ఇద్దరూ పార్క్ గేటు దాకా వచ్చారు.


"ఇక్కడినుంచి ఆటోలో వెళ్లిపోతా. బై" అంది మీనా.


శరత్ తలూపాడు. "ఎప్పుడైనా మళ్లీ కలుద్దాం" అంది మీనా.


"ఎలా?" అని శరత్ అడిగాడు.


"మీ ఫోన్ నంబర్ ఇవ్వండి" అంది.


శరత్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. మీనా వెళ్లిపోయింది.


శరత్ ఇంటికొచ్చినా మీనాక్షి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతని భార్య గమనించి "ఏంటి అంత ఆలోచన?" అని అడిగింది.


శరత్ కంగారుగా, "ఏం లేదు. అబ్బాయికి ఫీజు కట్టాలి కదా, ఎప్పుడు వెళ్లాలా అని ఆలోచిస్తున్నాను" అని కవర్ చేశాడు.


భార్య, "సర్లే, భోజనానికి రండి" అంది.


శరత్ ఊపిరి పీల్చుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత శరత్ పార్కులో తిరుగుతూ ఉన్నాడు. పదేపదే మీనాక్షి గుర్తొస్తుంది. ఇంతలో మొబైల్ రింగ్ అయింది.


"హలో" అన్నాడు శరత్.


"హలో, నేను మీనా. బావున్నారా?" అని అవతలి నుంచి మీనా గొంతు వినిపించింది.


"హాయ్, ఫైన్. మీరెలా ఉన్నారు? ఏంటి, ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా?" అని శరత్ అన్నాడు.


"కొత్త ఇల్లు, కొత్త ఊరు. పనులుంటాయి కదా. అదీకాక మా ఆయనకి పరాయి వాళ్ళతో చనువుగా ఉండటం నచ్చదు. టైం దొరకాలి కదా" అంది మీనా.


"అవునులెండి. మేం పరాయి వాళ్ళం కదా, కొంచెం కష్టమే" అని శరత్ అన్నాడు.


మీనా నవ్వి, "అబ్బా, చిన్నపిల్లల్లా ఎంత ఉడుక్కుంటారో. మా ఆయనకు అన్నా కానీ నేను పరాయి వాళ్ళు అనలేదుగా" అంది.


శరత్ నవ్వాడు. ఇద్దరూ చాలాసేపు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.


మరికొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీనా, "హలో, ఎలా ఉన్నారు?" అని అడిగింది.


"ఎలా ఉంటాను? నీకు తెలియదా. ఎప్పుడూ ఫోన్ లో మాటలే కానీ దర్శనభాగ్యం లేదా?" అని శరత్ అన్నాడు.


"అయ్యో పాపం. సారు బాగా డిప్రెషన్‌లో ఉన్నారు. సర్లెండి, ఎప్పుడు రమ్మంటారు?" అని మీనా అడిగింది.


"ఇప్పుడు కుదరదా? పార్కుకు వచ్చేయ్" అన్నాడు శరత్.


"అమ్మో, ఎవరైనా చూస్తే. మా ఆయన అసలే... చెప్పాకదా" అంది మీనా.


"మరెలా?" అని శరత్ అడిగాడు.


"ఏదైనా ప్రైవేటు ప్లేస్ చూడండి" అని మీనా సలహా ఇచ్చింది.


"సరే" అని శరత్ ఒప్పుకున్నాడు.

 *********************

 రెండు రోజుల తర్వాత శరత్, మీనా ఒక ఇంటికి వచ్చారు.

 "చాలా బాగుంది. ఎవరిదీ ఇల్లు?" అని మీనా అడిగింది.


"ఫ్రెండ్ ది. వాడు ఒంటరి పక్షి. డ్యూటీకెళ్లాడు. సాయంత్రం వరకు మనకు అడ్డే లేదు" అని శరత్ చెప్పాడు.


శరత్ తలుపు వేసి మీనాక్షి దగ్గరికి వచ్చి ప్రేమగా చెయ్యి పట్టుకున్నాడు. తనేమీ అభ్యంతరం చెప్పలేదు. మరి కాస్త ముందుకెళ్లాడు శరత్. ఇంతలో ఎవరో డోర్ కొట్టారు. ఇద్దరూ కంగారు పడ్డారు. శరత్ వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా ఇద్దరు పోలీసులు.


తోసుకుంటూ వారు లోపలికి వచ్చారు. కంగారు పడ్డాడు శరత్.

ree

"ఈ ఇల్లు మీదేనా?" అని ఒక పోలీస్ అడిగాడు.


"లేదు, మా ఫ్రెండ్ ది" అని శరత్ చెప్పాడు.


"మీ పేరు?"


"శరత్".


"ఏం చేస్తుంటారు?"


"మునిసిపల్ పార్క్ మేనేజర్‌ని" జవాబు చెప్పాడు శరత్. 


అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో? ఎలా వచ్చారో? అర్థం కాలేదు అతనికి.


"ఆవిడెవరు?"


"మీనాక్షి".


"మీకేమవుతుంది?"


"ఫ్రెండ్".


"ఫ్రెండా? ఎలా? ఆవిడ వయసుకి మీ వయసుకు సంబంధం లేదు" అన్నాడు పోలీస్.


శరత్ నీళ్ళు నములుతూ మౌనంగా ఉన్నాడు.


"మాకంతా తెలుసు. మీ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోంది. వాళ్లాయన ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు, నా భార్యని ఎవరో ట్రాప్ చేస్తున్నారని. ఇప్పుడు కేసు ఫైల్ ఇస్తే ఆమెకేం కాదు, మీరే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది" అని పోలీస్ బెదిరించాడు.


శరత్ కంగారుగా, "సార్, సార్, నాకు ఇదంతా కొత్త సార్. ఎప్పుడూ ఇలా చేయలేదు. ఏదో మొదటిసారి కక్కుర్తి పడ్డాను. వదిలేయండి సార్!" అని వేడుకున్నాడు.


"మేం వదిలేసినా వాళ్ళాయన వదిలేయడే. కంప్లైంట్ ఇచ్చాడు. దాన్ని తొలగించాలంటే వాళ్లాయనతో సహా అందరినీ మేనేజ్ చేయాలి. ఎలా?" అని పోలీస్ అడిగాడు.


"ఏదో ఒకటి చేయండి. ఏదైనా ఖర్చు అయితే నేనిస్తాను" అని శరత్ బేరం మొదలుపెట్టాడు.


"అంతా లెక్కేస్తే ఓ పది పన్నెండు లక్షల దాకా కావచ్చు. భరించగలవా?" అని పోలీస్ అడిగాడు.


పక్కలో బాంబు పడ్డట్టు బెదిరిపోయా డు శరత్. ఏదో పదో పాతిక వేల రూపాయలో అడుగుతారు అనుకుంటే మరీ అంతా…


"సార్, అంతలేదు సార్. మహా అయితే లక్ష దాకా మేనేజ్ చేస్తా" అని శరత్ బేరం పెంచాడు.


"లేదయ్యా కష్టం" అన్నాడు పోలీస్.


"సార్, ఇంకేం మాట్లాడకండి. రేపు కలిసి మాట్లాడదాం" అని శరత్ అన్నాడు.


"సరే. రేపు డబ్బుతో కలవాలి" అని పోలీస్ చెప్పాడు.


మరుసటి రోజు శరత్ పోలీసులను కలిశాడు. వారి ఒంటిపై యూనిఫాం లేదు. మఫ్టీలో ఉన్నారని అనుకున్నాడు శరత్. డబ్బు ఇచ్చాడు.


"లక్ష సరిపోదు. కొంత టైం ఇస్తున్నాం. ఇంకో మూడు నాలుగు లక్షలు ఇస్తే కానీ కేసు క్లోజ్ కాదు" అని పోలీస్ అన్నాడు.


"మీరు ఏదో ఒకటి చేయండి సార్! ఇక నావల్ల కాదు" అని శరత్ నిస్సహాయంగా అన్నాడు.

"మీ ఇష్టం, మేమేం చేయలేం" అంటూ వారు వెళ్లిపోయారు.

 శరత్ ముఖంలో టెన్షన్.

 *******************

దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు శరత్. ఎక్కడి నుంచి ఎంత పోగేసినా పోలీసులు అడిగిన డబ్బు సమకూరేటట్లు లేదు. ఇంతలో హాయ్ అంటూ ఎవరో భుజం మీద తట్టారు. తిరిగి చూస్తే క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్. 


"ఏంట్రా ఏదో పోగొట్టుకున్న వాడిలా అలా కూర్చున్నావ్?" అన్నాడు ఆనంద్.


"ఏం లేదు లేరా" అంటూ శరత్ తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఫోన్ కాల్ వచ్చింది.


"సార్, మిగతా బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ఇక్కడ చాలా ప్రెజర్ ఉంది" అని పోలీస్ అడిగాడు.


"సార్, చెప్పాను కదా సార్ కష్టమని. ఎంత వెదికినా యాభై వేలకు మించి దొరికేట్లు కనబడలేదు" అని శరత్ చెప్పాడు.


"కనీసం మూడు లక్షలు లేంది కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం" అని ఫోన్ పెట్టేసాడు అవతలి మనిషి.


శరత్ కంగారు చూసి పక్కనున్న మిత్రుడు, "ఏమైందిరా? ఏంట్రా ఆ టెన్షన్?" అని అడిగాడు.


శరత్ ఇంక తట్టుకోలేక జరిగిన విషయం చెప్పాడు.

"రేయ్ ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్‌గా ఉంది. నా మాట విని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. ఇదంతా ఏదో ప్లానింగ్ లా ఉంది. నువ్వు ఆ అమ్మాయిని నా రూమ్‌కి తీసుకొచ్చినట్లు నాకు కూడా చెప్పలేదు. అలాంటిది పోలీసులకెలా తెలిసింది? ఇందులో ఆ అమ్మాయి హ్యాండ్ కూడా ఉందని నా అనుమానం" అన్నాడు ఫ్రెండ్.


"అవున్రా, నువ్వు చెబుతుంటే నాకు డౌట్ వస్తోంది. పద, కంప్లైంట్ ఇద్దాం" అన్నాడు శరత్ కాస్త ధైర్యం కూడ తీసుకుని.


ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిందంతా చెప్పారు. సరే మీరు వెళ్ళండి. నేను ఎంక్వయిరీ చేస్తా అంటూ వివరాలు తీసుకుని పంపాడు సిఐ.

 *********************

 ఒకరోజు తర్వాత....

 శరత్, ఫ్రెండ్ సీఐ ఎదుట కూర్చుని ఉన్నారు. మీనాక్షి, ఇద్దరు వ్యక్తులు నించుని ఉన్నారు.


సీఐ వారిని చూసి, "మంచి స్కెచ్ వేశార్రా. భలే అమాయకుడు దొరికాడు మీకు. చివరి నిమిషాల్లో గ్రహించి బయటపడ్డారు" అని అన్నాడు. 


తర్వాత శరత్ వైపు తిరిగి, "శరత్ గారు! మీలాంటి వాళ్ల బలహీనతే వీరి పెట్టుబడి. ఈ అమ్మాయి మిమ్మల్ని పార్కులో పరిచయం చేసుకునే దగ్గర నుంచి, రూమ్ కి వెళ్లడం, నకిలీ పోలీసులు రావడం, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం అంతా పక్కా ప్లానింగ్. మీకు ఇంకో విషయం చెప్పనా, వీరు మిమ్మల్ని మోసగించడానికి కారణం, వీరి ప్లానింగ్‌కి సాయపడింది ఎవరో తెలుసా?" అని అడిగాడు.


"ఎవరు సార్?" అని శరత్ అడిగాడు.


"మీరే" అన్నాడు సీఐ.


"నేనా?" అని శరత్ ఆశ్చర్య పోయాడు.


"అవును మీరే. ఎలాగో తెలుసా? మీరు ఒకసారి పార్కులో మీ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ మీ దగ్గర డబ్బుందని ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని, ఐడియా చెప్పమని అడిగారు గుర్తుందా?" అని సీఐ గుర్తు చేశాడు.


"అవును సార్. నెల కిందట మాట్లాడినట్లు గుర్తు" అన్నాడు శరత్.


"ఆ టైంలో మీనాక్షి, ఆమె బాయ్‌ఫ్రెండ్ మీ వెనక కూర్చుని ఉన్నారు. వారికి మీ దగ్గర డబ్బున్న విషయం అర్థమైంది. దాంతో ఈ స్కెచ్ వేశారు. మీ వీక్నెస్‌తో ఆడుకున్నారు. అర్థమైందా!" అని సీఐ వివరించాడు.


"వామ్మో! ఇక బయట అన్ని విషయాలు మాట్లాడుకోవడం కూడా డేంజరే అన్నమాట. పొరపాటు నాదే" అంటూ నివ్వెరపోయాడు శరత్.

***************


పల్లా వెంకట రామారావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page