top of page
Original.png

ప్రజల కవి - కాళోజీ

10 hours ago
4 min read

ప్రజల కవి - కాళోజీ art

Prajala Kavi Kaloji - Telugu Inspirational Article | Thokala Rajesham

ప్రజల కవి - కాళోజీ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | తోకల రాజేశం

Published in manatelugukathalu.com on 24/09/2026


ప్రజల జీవితమే తన సాహిత్యానికి ప్రేరణగా, సామాజిక చైతన్యమే తన రచనలకు లక్ష్యంగా సాగిన ప్రముఖ తెలుగు కవి కాళోజీ నారాయణరావు. కవిగా మాత్రమే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారుడిగా, సామాజిక సంస్కర్తగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.


ప్రజల కవి - కాళోజీ


ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్కెట్ సంస్కృతి ప్రభావం వల్లనో, మరే కారణాల వల్లనో మనిషి రానురాను సమిష్టి జీవితం నుంచి దూరమవుతున్నాడు. సంఘంలో ఉంటూనే ఒంటరి జీవిగా బతకటానికే ఇష్టపడుతున్నాడు. 


అస్తిత్వోద్యమాలలాంటివి సామూహిక చైతన్యాన్ని కలిగించినా, వాటికి గల ఉద్యమావసరాల దృష్ట్యా అవి మొత్తంగా మనుషులందరినీ సామాజికీకరణం చేయలేకపోయాయి. వివిధ అస్తిత్వ ఉద్యమాల ప్రభావం వల్ల సమాజం నేడు అనేక సమూహాలుగా పరిణామం చెందిన మాట కూడా నిజం. 


అయితే, ఒక సమూహానికో లేదా ఒక సమూహానికి చెందిన మనిషికో అన్యాయం జరిగితే ఆ సమూహం మాత్రమే స్పందించటం, మిగతా సమూహాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి కూడా మన కళ్ళముందుంది. సరిగ్గా ఇక్కడే కాళోజీ లాంటి మనిషి అవసరం ఏర్పడుతుంది. ఆయన లాంటి కవి అవసరం ఏర్పడుతుంది. 


ఆయన గనుక ఇప్పటికీ ఉండి ఉంటే— ఈనాటి పరిస్థితుల మీద ఆయన ప్రభావం పడితే— కలిగే మార్పులను ఊహించుకుంటేనే శరీరం పులకరిస్తుంది. ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్లే సమాజంలో ఆయన కలిగించగల మార్పును పసిగట్టగలుగుతారు. 


కాళోజీ గుండెల నిండా మనిషిని ప్రేమించినవాడు. ఆ మనుషులు ఎవరని అడిగితే శ్రీశ్రీ భాషలో "దీనులు, హీనులు, బాధాసర్పద్రష్టులు". బహుశా! మనిషిని ప్రేమించటం మొదలుపెట్టిన తర్వాతనే కవిత్వాన్ని ప్రేమించడం నేర్చుకున్నాడు కాళోజీ. మనిషిని ప్రేమించడంలో భాగంగా అనివార్యంగా కవిత్వాన్ని ప్రేమించాడని అర్థం చేసుకుంటే కాళోజీ మనిషికి ఇచ్చే విలువ ఏమిటో స్పష్టమవుతుంది. 


తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నిజాయితీగా మనిషిని ప్రేమించిన కవి మరొకరు లేరు. వ్యక్తిగత జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని ఒకే లక్ష్యం కోసం— అంటే మనుషులుగా వాళ్ళు కోల్పోతున్న హక్కుల కోసం, మనుషులుగా వాళ్ళు దూరం చేసుకుంటున్న మానవీయ విలువల కోసం పోరాడేలా మార్చుకోవడం ఆనాటికి కాళోజీకి తప్ప ఇతరులెవ్వరికీ సాధ్యం కాని విషయం. 


కాళోజీకి కుటుంబం ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం లేదు. ఆయనకు ఉన్నదంతా సామాజిక జీవితమే. అలాగే ఆయనకు సొంత ఆస్తి లేదు. కుటుంబ భారం అంతా ఆయన అన్నగారు రామేశ్వరరావు తీసుకోవడం వల్లనే కాళోజీకి అంత స్వేచ్ఛ లభించింది అన్న వాదనలో నిజం ఉన్నప్పటికీ, అది మాత్రమే పూర్తి నిజం కాదు. 


ఒక విషయానికి లొంగి ఉండకపోవటమనే కారణం వల్ల, ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకమైనదేదో దినుసు వల్ల ఆయన అంత స్వేచ్ఛాపిపాసిగా మారాడు. అట్లా దొరికిన స్వేచ్ఛను సంపూర్ణంగా ప్రజలకు సేవ చేయటం కోసం కేటాయించడం వల్ల కాళోజీ ప్రజల మనిషిగా మారాడు. ప్రజాకవిగా రూపాంతరం చెందాడు. 


అందుకే దాశరథి 'నా గొడవ' (మొదటి ముద్రణ) పీఠిక రాస్తూ "కాళోజీ 20వ శతాబ్దంలో తెలంగాణ ప్రప్రథమ ప్రజాకవి" అన్నాడు. 


స్వయంగా కాళోజీ గారే అనేక సందర్భాలలో చెప్పినట్టు ఆయనది 'కమ్యూనికేటివ్ కవిత్వం'. తాను కవిగా ఒక సమస్య పట్ల ఎట్లా స్పందించాడో, ఆ స్పందన నుంచి పుట్టిన కవిత్వాన్ని చదివిన వాళ్ళు కూడా అట్లాగే స్పందించాలని కోరుకున్నవాడు కాళోజీ. అంటే కవిత్వానికి అదనపు బరువులు తగిలించటం ఆయనకు ఇష్టం ఉండదు. 


కాళోజీ కవిత్వం మంచినీళ్ళంత శుభ్రంగా, స్పష్టంగా ఉంటుంది. ఏ ఇబ్బంది లేకుండా మంచినీళ్లు అరిగిన విధంగానే ఎవరి (అంటే విమర్శకుల) సహకారం లేకుండానే ఆయన కవిత్వం మనకు జీర్ణం అవుతుంది. అట్లా అది కలిగించగల చైతన్యాన్ని అది కలిగిస్తుంది. 


కాళోజీ ఆత్మకథ 'ఇదీ నా గొడవ' ముందుమాటలో వరవరరావు గారు అన్నట్లు "కాళోజీకి కవిత్వం పరమావధి కాదు, మానవత్వమే పరమావధి". 



మొదట్లో విశాలాంధ్రను సమర్థించినా, తనకు గల భ్రమలు తొందర్లోనే పటాపంచలైన తర్వాత తెలంగాణ కోసం బలమైన గొంతుకగా అవతరించాడు కాళోజీ. తెలంగాణ ప్రాంతీయ చైతన్యాన్ని వ్యక్తం చేయడానికి బలమైన సాధనంగా ఏ మొహమాటాలు లేకుండా తెలంగాణ భాషనే స్వీకరించాడాయన. 


భాష విషయంలో కాళోజీ చూపించిన ఈ ముందుచూపును ఇప్పటికీ చాలామంది తెలంగాణ కవులు అలవార్చుకోవాల్సి ఉన్నది. 


"రెండున్నర జిల్లాలది/ దండి భాష అయినప్పుడు/ తక్కినోళ్ళ నోళ్ళ యాస/ నొక్కి పెట్టబడ్డప్పుడు"—చాలా సాహసంగా తెలంగాణ భాషలోనే మాట్లాడిండు. అందులోనే రాసిండు. కాళోజీ కవిత్వం దగ్గరికి వచ్చేసరికి అందులోని శిల్పం గురించి కానీ, కవిత్వ దినుసుల గురించి కానీ ఎవ్వరూ పరిశోధించరు. 


ఎందుకంటే వాటికన్నా ఎక్కువ ఆయన కవిత్వంలో జీవితం ఉంటుంది. జీవభాష ఉంటుంది. ఈ రెంటి మేలు కలయిక వల్ల మాత్రమే ఆయన కవిత్వం గొప్పదయింది. తన జీవితం పొడవునా కేవలం తెలంగాణ భాషనే వాడి కవిత్వం రాసిన మొట్టమొదటి కవి కాళోజినే కావచ్చు. 


ఆనాటికే కాళోజీకి, ఇప్పటికీ చాలామంది విద్యావేత్తలకు లేని భాషా పరిజ్ఞానం ఉంది. ఆయన "బడి పలుకుల భాష కాదని, పలుకుబడుల భాష కావాల"న్నాడు. ఇప్పటికీ అది సాధించుకోవాల్సిన ఆశయంగానే మిగిలిపోవడం విషాదం. 


"నిజాన్ని, సత్యాన్ని అన్ని సమయాల్లోనూ చెప్పాలి. అయితే ముఖ్యంగా నిజం పలకడమే ప్రమాదకరమైన సందర్భంలో ఆ నిజాన్ని మరీ చెప్పి తీరాలి" అంటాడు ఆంగ్ల కవి కోల్రిడ్జ్. 


ఈ నియమాన్ని తన జీవితంలో అక్షరాలా పాటించినవాడు కాళోజీ. సాహిత్య రంగంలోనూ, దాని బయటా తాను నిజమని నమ్మిన ఏ విషయాన్నయినా చెప్పడానికి ఆయన ఎటువంటి సందర్భంలోనూ వెనుకాడలేదు. అధికారంలో ఉన్నవాళ్ళు తన మిత్రులైనా సరే, ఆయన ప్రజల పక్షమే వహించాడు. 

ప్రభుత్వాల చేత సన్మానాలు, పురస్కారాలు పొందినా, భూస్వాములైనవాళ్ళు స్నేహంతో తమ ఇళ్లలోకి ఆహ్వానించినప్పుడు వెళ్లి భోజనం చేసినా— భవిష్యత్తులో వీళ్ల వల్ల ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం నిస్సంకోశంగా ప్రజల వైపు నిలబడి వాళ్ల మీద పోరాడటం కాళోజీలోని నిబద్ధతకు నిదర్శనం. 


ఆయన కాలంలో తెలుగు నేలల మీద ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రజల హక్కులకు విఘాతం కలిగినా కాళోజీ అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. అన్యాయం మీద కవిత్వమై పేలేవాడు. వారికి మద్దతుగా నిలబడి కొట్లాడేవాడు. 


కవిగా కాళోజీ స్థానాన్ని భర్తీ చేయగలవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు కానీ, ఒక వ్యక్తిగా, ప్రజాపక్షపాతిగా వ్యక్తిగత జీవితాన్ని, సౌఖ్యాలను త్యాగం చేసినవానిగా, సమాజం కోసం వలవలా ఏడ్చే మెత్తని గుండె గలవాడుగా కాళోజీ స్థానాన్ని పూరింపగలవారు ఉన్నారనడానికి ఈ కాలంలో మాత్రం సాక్ష్యాలు లేవు. 

తన జీవితాచరణ ద్వారా చూసినా, కవిత్వాన్ని పరిశీలించినా సాహిత్యకారులలో నిజంగా కాళోజీ ఏనాటికైనా ప్రజలకవే. 


***



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



తోకల రాజేశం

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page