top of page
Original.png

విజయానంతర దుఃఖం!

53 minutes ago
4 min read

కురుక్షేత్ర యుద్ధం అనంతరం కర్ణుడు తన అన్న అని తెలిసి దుఃఖిస్తున్న ధర్మరాజు, అతనికి కర్ణుడి జన్మరహస్యం వివరిస్తున్న నారదమహర్షి

Vijayanantara Dukham! - Telugu Mythological Article | Bhattu Venkata Rao

విజయానంతర దుఃఖం! - తెలుగు పౌరాణిక వ్యాసం| భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 23/09/2026


“విజయానంతర దుఃఖం!” మహాభారతంలోని అత్యంత విషాదభరితమైన ఘట్టాలలో ఒకటైన కర్ణుడి మరణానంతర ధర్మరాజు వేదనను ఆవిష్కరించే పౌరాణిక కథనం. విజయం, ధర్మం, బంధుత్వం, విధి, పశ్చాత్తాపం వంటి గాఢమైన అంశాలను స్పృశించే ఈ కథనం కర్ణుడి విషాద జీవితాన్ని, మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన మానసిక వేదనను ఆలోచింపజేస్తుంది.


"కౌరవులకు పోయినదేముంది? ప్రాణాలు పోవడంతో పాటు వాళ్ళ సకల ప్రయోజనాలు గాలిలో కలిసిపోయి సుఖప్రాప్తిని పొందారు వారు. బంధుజనాలను అందరినీ పోగొట్టుకుని మనం కదా ఆ దుఃఖాన్నంతా భరిస్తున్నది? మన చేతులతోనే మన వాళ్ళను అంతం చేసుకుని ఏ గొప్ప ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళమయ్యాం మనం?" అని కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన అనంతరం ధర్మరాజు ప్రశ్నించి విలపించాడు.


కురుక్షేత్ర మహా సంగ్రామంలో నిహతులైన బాంధవులందరికీ అపరకర్మలు నిర్వర్తించి, తిలోదకాలు ఇచ్చిన తరువాత, అనంత శోకం అంతరంగాన్ని కమ్మేయగా మాట్లాడలేని స్థితిలో మౌనంగా కూర్చుని ఉన్న ధర్మరాజు వద్దకు నారదమహర్షి వచ్చాడు.


తిలోదకాలిచ్చే సందర్భంలో కర్ణుడు తమ అందరి కంటే పెద్దవాడు, తమ ఐదుగురికి అన్న అనే ఆశ్చర్యకరమైన నిజం నిర్ధారణగా తెలిసిన తరువాత, ధర్మరాజు దుఃఖానికి అంతం లేకుండాపోయింది. తమ చేతులతోనే తమ అన్నను చంపుకుని సంపాదించిన విజయం, హేయమైనదిగా ధర్మరాజుకు కనిపించింది. ఆ బాధను నారదమహర్షితో పంచుకున్నాడు:


శ్లో. అజానతా మయా భ్రాత్రా రాజ్యలుబ్ధేన ఘాతితః

తన్మే దహతి గాత్రాణి తూలరాశిభివానలః||


(శాంతి-ప్రథమ-24)


“రాజ్యాధికారం మీద అంతులేని కాంక్ష నా మనసును కమ్మేయగా, అజ్ఞానంలో పడి, నాకు తెలియకుండానే అయినప్పటికీ, సొంత తమ్ముడి చేతిలో అన్న మరణం పొందేలా చేశాను. ఎంత పెద్ద రాశిగా పడి ఉన్నదైనప్పటికీ, ఒక పత్తికుప్పను అగ్ని అతి సుళువుగా, సంపూర్ణంగా, అతి వేగంగా, దహించి భస్మీపటలం చేసినట్లుగా, ఆ పాపం నా అంతరంగాన్ని దహించివేస్తోంది.”


శ్లో. నహి తం వేద పార్థోఽపి భ్రాతరం శ్వేతవాహనః

నాహం న భీమో న యమౌ సత్వస్మాన్ వేద సువ్రతః|| 25 ||


కర్ణుడు తన అన్న అన్న విషయాన్ని అప్పటికి అర్జునుడు ఎరుగడు. నాకు, భీముడికి, నకుల సహదేవులకు కూడా ఆ విషయం తెలియదు. కాని, పాండవులం మేమైదుగురం అతడి తమ్ములమని కర్ణుడికి ముందే తెలుసును.


మా అమ్మ మాకు కర్ణుడితో సంధి కుదిర్చాలనే కోరికతో అతడి వద్దకు ఒకసారి వెళ్ళిందని, 'నీవు నా కుమారుడివే!' అని ఆ సందర్భంలో కర్ణుడితో చెప్పిందని నేను విన్నాను. అయితే మహామనస్వియైన కర్ణుడు ఆమె సంధి ప్రయత్నాన్ని తిరస్కరించాడు. మరికొన్ని రోజులలో యుద్ధం జరగబోతున్నదనగా అప్పుడు తాను దుర్యోధనుడి సాంగత్యాన్ని వదలబోనని, అలా చేస్తే దానిని మించిన నీచత్వము, క్రూరత్వము మరొకటి లోకంలో ఉండబోదని తెగేసి చెప్పాడని విన్నాను.


యుద్ధానికి కొన్ని రోజుల ముందు పాండవులతో సంధికి అంగీకరిస్తే తాను అర్జునుడికి భయపడి అలా చేసినట్లుగా లోకం భావిస్తుందని, ఒకవేళ ఆమె కోరిక తీర్చడం కోసం సంధి చేసుకోవాల్సి వచ్చినా, యుద్ధంలో అర్జునుడిపై విజయం సాధించిన తరువాతనే అలా చేస్తానని కర్ణుడు ఆమెకు చెప్పాడు.


ఆ మాటలను విన్న మా అమ్మ కర్ణుడితో ‘అలా అయితే, నీ కోరిక ప్రకారమే అర్జునుడితో యుద్ధం చెయ్యి. కాని, మిగిలిన నలుగురి జోలికి మాత్రం వెళ్ళనని మాటయివ్వు!’ అని కర్ణుడిని అభ్యర్థించగా, కరుణించిన కర్ణుడు ‘మిగిలిన నలుగురూ యుద్ధరంగంలో నా వశమైనప్పటికీ, వారిని వధించక వదిలిపెడతాను. కుంతీదేవికి అయిదుగురు కుమారులు అన్నది అలా ఎప్పటికీ నిశ్చయమై నిలిచి ఉంటుంది.


అర్జునుడు మరణిస్తే కర్ణుడితో కలిపి అయిదుగురు పుత్రులుగా, తాను మరణిస్తే అర్జునుడితో కలిపి అయిదుగురుగా అది సిద్ధిస్తుంది!’ అని చెప్పాడని విన్నాను.


ఇందంతా అలా జరిగిన విషయాన్ని కర్ణుడు బయటకు చెప్పలేదు. మా అమ్మ కూడా చెప్పలేదు. అలా అది చివరిదాకా వారిరువురి హృదయాలలోనే రహస్యంగా ఉండిపోయింది. కర్ణార్జునులు ఇరువురూ నాతో ఉంటే, ఇంద్రుడిని సైతం ఓడించగలిగేవాడిని అని నేను భావిస్తాను. కపటజూదంలో నన్ను ఓడించి దుర్యోధనుడు ఎంతో అవమానానికి గురిచేశాడు. అనరాని మాటలను ఆ సమయంలో, మా అయిదుగురి గురించి, ద్రౌపదిని ఉద్దేశించి, కర్ణుడు అన్నాడు.


అయినప్పటికీ కర్ణుడిపై నాకు కోపం కలిగేది కాదు. పోలికలో అచ్చంగా మా అమ్మ పాదాలను పోలి ఉండేవి కర్ణుడి పాదాలు. వారిరువురి పాదాలలో కనిపించే ఆ పోలిక, సారూప్యత నన్ను ఆశ్చర్యానికి గురిచేసేది. ఎంత ఆలోచించినా దానికి కారణం అర్థమయ్యేది కాదు. కాని వారిరువురి పాదాలలో కనిపించిన ఆ సారూప్యత, కర్ణుడిని నిందిస్తూ ఒక్క మాట కూడా నా నోటి వెంట రాకుండా చేసేది.


భీష్మద్రోణాది కురువృద్ధులతో సమానమైన ప్రతిభ కలిగిన మహావీరుడైన కర్ణుడి రథచక్రాలు యుద్ధరంగంలో ఆశ్చర్యకరంగా భూమిలో క్రుంగాయి. అది ఒక హటాత్పరిణామం. ఆ పరిణామం యుద్ధభూమిలో అతడిని మళ్లీ కోలుకోనివ్వలేదు. అది అలా ఎందుకు జరిగిందో కారణం తెలియదు!" అని, మాట్లాడడం ఆపి నారదుడి వైపు చూశాడు ధర్మరాజు.


అలా చూడడంలో ధర్మరాజు ఆంతర్యాన్ని గ్రహించిన నారదుడు ఇలా చెప్పాడు:

"వీరత్వంలో, యుద్ధకుశలతలో కర్ణార్జునులిరువురూ సమానమైన ప్రతిభ కలిగినవారే! వారు సాధించలేని విజయాలు లేవు. అయితే ఇందులో ఒక దేవ రహస్యం దాగి ఉంది. ఒకానొక సమయంలో దేవతలందరూ ఒకచోట సమావేశమై భూలోకంలోని క్షత్రియ సముదాయం అంతా శరీరంపై శస్త్రఘాతాలతో పవిత్రులై స్వర్గలోకానికి చేరుకోవాలని కోరి, అందుకు మార్గం ఏమిటని ఆలోచనలో పడ్డారు. అలా కొంతకాలం దీర్ఘంగా ఆలోచించగా వారికి ఒక ఉపాయం తోచి, సూర్యుడి ద్వారా మీ అమ్మ గర్భం నుంచి ఒక తేజస్వి అయిన బాలుడిని ఉద్భవింపజేశారు.


ఆ బాలుడు సూతపుత్రుడుగా ప్రసిద్ధుడయ్యాడు. ఆ బాలుడు ఒక మహా సంఘర్షణానికి కారణమయ్యాడు. శారీరక బలంలో భీముడితో సమానమైన బలం, శస్త్రవిద్యలో అర్జునుడితో సమానమైన నేర్పు, బుద్ధిలో నీతో సమానమైనవాడు, వినయవిధేయతలలో నకుల సహదేవులను పోలినవాడు అయిన ఆ బాలుడు కర్ణుడు.


అర్జునుడికి శ్రీకృష్ణుడి మిత్రత్వం లభించడాన్ని చూసి ఈర్ష్యపడిన కర్ణుడు, దుర్యోధనుడితో అంతే గాఢమైన మిత్రత్వాన్ని తాను సంపాదించుకున్నాడు. పరిస్థితుల ప్రభావం అనుకున్నా, లేక దైవప్రేరణ వలన అనుకున్నా, బాలుడుగా ఉన్నప్పటి నుంచి అతడు మిమ్మల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు. ద్రోణుడి వద్ద, పరశురాముడి వద్ద శిష్యరికం చేసి శస్త్రవిద్యను అభ్యసించి మహావీరుడయ్యాడు.


దురదృష్టవశాత్తు వారి వద్ద శిష్యరికం చేస్తున్న రోజులలోనే కొన్ని శాపాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ శాపాలలో యుద్ధరంగంలో రథచక్రాలు కుంగిపోవడం కూడా ఒకటి. కాల ప్రభావంతో ప్రాప్తించిన ఆ శాపాలు, తల్లికి ఇచ్చిన మాట, సూర్యుడు జాగ్రత్త చెప్పినా వినక పోగొట్టుకున్న కవచకుండలాలు, యుద్ధరంగంలో అతడి శౌర్యాన్ని హీనపరుస్తూ శల్యుడు మాట్లాడిన మాటలు... ఇవన్నీ కలిసి కారణజన్ముడైన కర్ణుడి మరణానికి కారణమయ్యాయి!" అని వివరించి చెప్పాడు నారదుడు.


కర్ణుడితో తలపడడం అంటే సూర్యుడిలోని ఒక అంశతో తలపడడమే తప్ప వేరుకాదు. పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం నేలపాలవడానికి భూమిపై జరగవలసిన ఒక మహా సంగ్రామం, భూమిపై సకల చరాచర జీవకోటి మనుగడకు కారణమైన సూర్యభగవానుడి ప్రమేయం లేకుండా సాధ్యపడేది కాదని తెలిసిన దేవతలు, సూర్యుడి అంశను మానవరూపంలో కర్ణుడుగా భూమి మీదకు పంపారు.


అయితే అలా పంపినంత సుళువు కాదు భూమిపై నుండి సూర్యుడి అంశను తొలగించడం అని తరువాత తెలుసుకున్నవారై, దానిని సాధించడం కోసం ఎన్నో మాయోపాయాలు పన్ని, నానా యాతనలు పడ్డారని వ్యాసభగవానుడి సంస్కృత మహాభారతం, శాంతిపర్వంలోని మొదటి ఐదు అధ్యాయాలలోని సంగతులను చదివిన తరువాత సారాంశంగా అవగతమవుతుంది.


సమాప్తం




పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page