top of page
Original.png

గాంధారి అనంత విలాపం - అనంతర ప్రలాపం

12 hours ago
5 min read

కురుక్షేత్ర యుద్ధానంతరం నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి, పశ్చాత్తాపంతో నిలిచిన ధర్మరాజు మరియు ప్రశాంతంగా ఉన్న శ్రీకృష్ణుడి దృశ్యం

Gandhari Ananta Vilapam - Anantara Pralapam - Telugu Mythological Article | Bhattu Venkata Rao

గాంధారి అనంత విలాపం - అనంతర ప్రలాపం - తెలుగు పౌరాణిక వ్యాసం| భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 24/09/2026


“గాంధారి అనంత విలాపం – అనంతర ప్రలాపం” మహాభారతంలోని అత్యంత విషాదభరితమైన ఘట్టాల్లో ఒకటైన కురుక్షేత్ర యుద్ధానంతర గాంధారి శోకాన్ని ఆవిష్కరించే పౌరాణిక కథనం. నూరుగురు కుమారులను కోల్పోయిన గాంధారి భీముడిపై వ్యక్తం చేసిన ఆవేదన, ధర్మరాజు పశ్చాత్తాపం, యుద్ధభూమిలో కనిపించిన వీరుల పార్థివ దేహాలు మరియు స్త్రీల రోదనలు ఆమె హృదయవేదనను మరింత తీవ్రం చేస్తాయి.


"నాయనా భీమసేనా, పరాజయం అంటే ఏమిటో తెలియని వీరుడివి నువ్వు. ఈ ధృతరాష్ట్ర మహారాజు నూరుగురు కొడుకులూ నీ చేతిలో వీరగతిని పొందారు. ఒక్కడిని కూడా మిగల్చకుండా నూరుగురినీ యమపురికి పంపావు కదా, అంత మందిలో కనీసం ఒక్కడంటే ఒక్కడి విషయంలో కూడా కనికరం కలగి ప్రాణాలతో వదిలేయాలనిపించలేదా నీకు? నువ్వు నా నూరుగురు కొడుకుల పాలిటి యముడివయ్యావు కదా! నీవు ధర్మంగా యుద్ధం చేసి వారిపై విజయం సాధించి ఉన్నా, లేక వందమందిలో కనీసం ఒక్కడినన్నా ప్రాణాలతో వదిలేసినా నాకు ఇంత చేటు దుఃఖం కలిగేది కాదు కదా నాయనా!" అన్నది గాంధారి.


కురుక్షేత్ర సంగ్రామంలో తన పుత్రశతం మొత్తాన్నీ పోగొట్టుకుని అనంత దుఃఖంలో మునిగి ఉందామె. ధృతరాష్ట్రుడు, పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు అక్కడే నిలబడి నిశ్శబ్దంగా ఆమె మాటలను వింటున్నారు. గాంధారి మాట్లాడుతుండగా అడ్డు తగిలి మాట్లాడే ఆలోచన ఎవరూ చేయలేదు.


కొంతసేపటి తరువాత, ఒక్కసారిగా పెరిగిన కోపంతో రగిలిపోతూ "ఏరీ, ఆ యుధిష్ఠిర మహారాజుగారేరీ? ఎక్కడ?" అన్నది గాంధారి.


మరుక్షణం చేతులు కట్టుకుని, తలవంచి గాంధారి ఎదుట నిలబడ్డాడు ధర్మరాజు. "తల్లీ, మీ నూరుగురు కొడుకుల మరణానికి కారకుడను, క్రూరకర్ముడను అయిన యుధిష్ఠిరుడను నేనే! భరతఖండంలోని రాజులెందరి మరణానికో కారకుడను కూడా నేనే. ఆ కారణంగా నేను నిశ్చయంగా శాపార్హుడను! నీ శాపంతో నన్ను శిక్షించు తల్లీ! గుణాలలో నా కంటే శ్రేష్ఠులైన ఎందరెందరో వీరుల మరణానికి కారకుడను నేను. నాకు ఇప్పుడు ఈ రాజ్యంతోను, ఈ అధికారంతోను, ఈ సంపదతోను ఏమీ సంతోషం లేదు!" అన్నాడు ధర్మరాజు.


దగ్గరగా వినిపిస్తున్న ధర్మరాజు మాటలు గాంధారి హృదయంలో మంటలు రేపాయి. క్రోధంతో మనసు రగిలిపోతుండగా, శ్వాస ఉధృతి హెచ్చి గబగబా ఊపిరి పీల్చి వదలసాగిందామె. ఆమె ఆ స్థితిని చూసి, మరింత దగ్గరగా వెళ్ళి గాంధారి పాదాలపై పడాలనుకున్నాడు ధర్మరాజు. అంతలో కనులకు కట్టి ఉన్న పట్టీ క్రింద నుంచి ధర్మరాజు పాదాలను తీక్షణంగా చూసింది గాంధారి. అత్యంత క్రోధంతో నిండి ఉన్న ఆ చూపుల్లోని వేడి తగిలి ధర్మరాజు పాదాల వేళ్ళు కమిలి నల్లబడ్డాయి.


అలా నల్లగా మారడాన్ని చూసిన అర్జునుడు భయపడి, నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళి శ్రీకృష్ణుడి వెనుకకు చేరి నిలబడ్డాడు. కనులను మూసివున్న పట్టీ కింద నుండే, అర్జునుడు శ్రీకృష్ణుడి వెనుక దాక్కోవడాన్ని గమనించిన గాంధారి కోపం క్రమంగా తగ్గి, కొంతసేపటికి పూర్తిగా ఉపశమించింది. ఆమె మామూలు స్థితికి చేరుకుంది. దానితో అందరి మనసులూ కుదుటపడ్డాయి.


శాంతం నిండిన కంఠస్వరంతో "అయినదేదో అయింది. వెళ్ళి మీ అమ్మకు కనపడి, ఆమెతో ఇక్కడికి రండి!" అని పాండవులను ఆజ్ఞాపించింది గాంధారి.


ఆమె చెప్పినట్లు చేశారు వారు. ఆ తరువాత అందరూ కలిసి యుద్ధభూమికి వెళ్ళారు. వేల కొలదిగా మృతవీరుల శరీరాలతోను, యుద్ధంలో మరణించిన గుర్రాలు, ఏనుగుల మృత కళేబరాలతోను, ముక్కలైన రథాలు, ఖడ్గాలు మరియు ఇతరాలైన యుద్ధసామగ్రితోను నిండి ఉన్న యుద్ధభూమిని శోకతప్త హృదయాలతో చూశారు.


"ఈ సర్వవినాశకారియైన మహాయుద్ధంలో జయద్రథుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, అభిమన్యుడు వంటి వీరులు ప్రాణాలు పోగొట్టుకుంటారని ఎవరు ఊహించారు. ఎవరైతే అజేయులుగా, అవధ్యులుగా భావించబడ్డారో వారೇ ప్రాణాలు పోగొట్టుకుని, ఈ యుద్ధభూమిలో ఇప్పుడు అచేతనంగా పడి ఉన్నారు. దుర్యోధనుడి ఆధీనంలో ఉండి ఓర్వలేని శౌర్యంతో వెలుగుతూండిన ఈ వీరగణాలు, ఆరిపోయిన అగ్నిశిఖల వలె ఈ యుద్ధభూమిలో పడి ఉన్నాయి.


ఒక్కసారి అటువైపు దృష్టి సారించి చూడు మాధవా! కౌరవకుల స్త్రీలు రోదిస్తూ వారివారి వీరపతుల, తండ్రుల, అన్నల, తమ్ముళ్ళ పార్థివ శరీరాలను, చెల్లాచెదురుగా పడివున్న కళేబరాల మధ్యలో తిరుగుతూ వెదికి గుర్తుపట్టడంలో నిమగ్నమై ఉన్న ఆ దృశ్యాన్ని చూడు జనార్దనా! నా వందమంది కోడళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారి భర్తలను తలుచుకుని ఇలా రోదించడం చూడడాన్ని మించిన దుఃఖభరిత సన్నివేశం నాకు మరేది ఉండగలదు కేశవా!


ఈ మహా సంగ్రామం మొదలు కావడానికి ముందు, నా పెద్దకొడుకు దుర్యోధనుడు నా వద్దకు వచ్చి, చేతులు జోడించి నిలబడి 'కుటుంబ జనుల మధ్య మొదలైన ఈ మహాసంగ్రామంలో నాకు విజయం చేకూరేలా ఆశీర్వదించు తల్లీ!' అని నన్ను అడిగినప్పుడు 'ధర్మం ఎక్కడుంటుందో, అక్కడ విజయం ఉంటుంది నాయనా!' అని చెప్పాను నేను.


యుద్ధభూమిలో ధర్మం తప్పితే నిశ్చయంగా శస్త్రధారులైన వీరులు పొందే గతినే నీవూ పొందుతావని చెప్పాను. కనుకనే ఈ రోజు దుర్యోధనుడిని గురించి నాకు శోకం లేదు. నా శోకం అంతా యుద్ధంలో కొడుకులందరినీ పోగొట్టుకుని ఒంటరై మిగిలిన ఈ ధృతరాష్ట్రమహారాజు గురించే!


దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణకుమారుడి పార్థివదేహం వద్ద రోదిస్తున్న వాళ్ళ అమ్మను చూడు. భర్త కోసం రోదిస్తున్నదో, లేక పుత్రుడి కోసం రోదిస్తున్నదో తెలీకుండా ఉంది ఆమె రోదన కృష్ణా! ఆ స్థితిలో నా కోడలిని చూడాల్సిరావడాన్ని మించిన దుర్గతి నాకు వేరే ఏముంది చెప్పు!


ఆ విరాటరాజు కూతురు వైపు ఒక్కసారి దృష్టి సారించి చూడు మాధవా! బలంలోను తేజస్సులోను అర్జునుడి కంటే, నీ కంటే కూడా ఒకటిన్నర రెట్లు అధికుడిగా భావింపబడిన అభిమన్యుడి ముఖంలో ఇంకా తగ్గని తేజస్సును చూస్తూ ఎలా రోదిస్తున్నదో చూడు! నా కూతురు దుఃశ్శల ఎలా రోదిస్తున్నదో చూడు! ఇంకా పూర్తిగా యవ్వనంలోకి అడుగు పెట్టకుండానే ఈ గతి పట్టిన ఆమెను అలా రోదిస్తుండగా చూడవలసిరావడాన్ని మించిన దుర్దశ ఏముంది చెప్పు నాకు!


శ్రీకృష్ణా నీవు తోడుగా ఉండగా పాండవులు అజేయులు. లేకుంటే ఈ సమరంలో ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, జయద్రథుడు, సోమదత్తుడు, వికర్ణుడు, కృతవర్మ వంటి వీరుల నుండి వారు ఎలా తప్పించుకోగలరు చెప్పు?! దైవం తలిస్తే, కాని కార్యం ఏమి ఉండగలదు? సంధి పొసగే మార్గం వీగిపోయి, నీవు ఏరోజు తిరిగి వెళ్ళిపోయావో, ఆరోజుననే నా పుత్రులు విగతజీవులుగా మారిపోయారు.


వారి పట్ల మాతృభావనను ఇక మానుకోవడం మొదలుపెట్టమని ఆరోజుననే భీష్ముడు, విదురుడు నాకు చెప్పారు. వారి మాటలు అబద్ధాలు కావని ఇంతలోనే నిరూపితమైంది. జనార్దనా! పాండురాజు పుత్రులు, ధృతరాష్ట్ర కుమారులు సఖ్యత కోల్పోయి వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకున్నారు. దీనిని నీవు చూస్తూ ఎందుకు ఉపేక్షించి ఊరుకున్నావు? ఇది నీ తప్పు కాదా?


పతిసేవాపరాయణత తప్ప అన్యం తెలియని నేను, నా పతి సేవలో సంపాదించుకున్న తపోబలంతో చెబుతున్నాను. నేటి నుండి సరిగ్గా ముప్పది ఆరవ సంవత్సరానికి నీ కుటుంబంలోనూ అతఃకలహం పుట్టి, మీలో మీరు పోట్లాడుకుని నశిస్తారు. ఆ సమయానికి నీవు నీ బంధుజనులకు దూరమై ఒంటరిగా అడవిలో అనాథ మరణం పొందుతావు. ఈ భరతవంశ స్త్రీల వలెనే నీ కుటుంబంలోని స్త్రీలు వారి భర్తల కోసం, పుత్రుల కోసం, అన్నదమ్ముల కోసం రోదిస్తారు!" అని తనలో రగిలిన శోకాన్ని తీవ్రమైన శాపంతో తీర్చుకుని, తన మాటల ప్రవాహాన్ని ఆపింది గాంధారి.


గాంధారి శాపనార్థల మాటలు విన్న శ్రీకృష్ణుడు వెంటనే ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపు మౌనంగా ఉండి, తరువాత చిరునవ్వు నవ్వుతూ, గాంధారి మాటలకు సమాధానం చెబుతున్నట్లుగానే "గాంధారీదేవీ! అది నీవన్నట్లుగానే జరగనున్నదని నాకు తెలుసు. జరిగేదిగా నియతమై ఉన్నదానినే నీవు చెప్పావు తప్ప, కొత్త సంగతేమీ నీవు చెప్పలేదు. ఇక మాట్లాడింది చాలు, లే లే, మరీ అంతగా శోకంలో మునిగిపోనవసరం లేదులే! మీరు చేసిన అపరాధాల వలననే కౌరవుల వినాశనం జరిగింది. అంతే తప్ప వేరు కారణం కాదు సుమా!" అన్నాడు గంభీరంగా.


శ్రీకృష్ణుడి ఆ మాటలను విన్న గాంధారి, మరింకేమీ మాట్లాడక, మౌనంగా ఉండిపోయింది.


[వ్యాసభగవానుడి శ్రీ మహాభారతం, స్త్రీపర్వం, 15వ అధ్యాయం 21-32 శ్లోకాలు; 16వ అధ్యాయం 28, 29, 30, 59 శ్లోకాలు; 25వ అధ్యాయం 35-48 శ్లోకాలు; 26వ అధ్యాయం 1, 6 శ్లోకాలు ఈ కథనానికి ఆధారం]


సమాప్తం



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page