top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 11


'Prema Chejarithe 11' New Telugu Web Series

Written By Pendekanti Lavanya Kumari

ప్రేమ చేజారితే - ధారావాహిక పదకొండవ భాగం

రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)గత భాగంలో జరిగినది: సమావేశంలో నితిన్ అందరికీ కుమార్ గురించిన జీవిత విశేషాలను చెప్పి, అతను చేయాలనుకున్న ప్రాజెక్టు గురించి ఎవరైనా ఊహించి చెప్పగలరా అని అడిగాడు. కానీ ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు.

ప్రేమ చేజారితే - 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఈ భాగం చదవండి... 'ఇంతకీ కుమార్ వాళ్ళు చేయాలనుకున్న ప్రాజెక్టు ఏదో తెలుసా?!?' అని అడిగాడు నితిన్. ఎవరూ, ఏమీ పలక లేదు... మళ్ళీ నితినే... మీకు ఆ ప్రాజెక్టు గురించిన అంచనా లేదనిపిస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు యొక్క విశేషతను మీరు అర్థం చేస్కోవాలంటే ముందుగా మీకు ఒక నలుగురిని పరిచయం చేయాల్సి వుంది. వారిలో ఒకరు నా భార్య డాక్టర్ నిధి. ఆమె చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీలో ఎమ్. డి. చేసింది. ప్రస్తుతానికి స్వచ్చందంగా ఒక అనాథాశ్రమానికి తన సేవలు అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఆవిడ కూడా పాలు పంచుకున్నారు. మిగిలిన వారిలో ఒకరు డాక్టర్ రాధ అని నిధి చూస్కునే అనాథాశ్రమంలోనే నిధికి అసిస్టెంటుగా సేవలందిస్తోంది. మిగిలిన ఇద్దరూ అక్కడ పిల్లలను చూస్కునే ఆయాలే, అయినా వారే వారికి అన్నీ కూడా. మిగిలిన విషయాలు డాక్టర్ నిధి వివరిస్తారు. ఇప్పుడే వారంతా వచ్చి పక్క గదిలో కూర్చున్నారు, వారిని పిలుస్తాను,' " అని చెప్పి నిధికి కాల్ చేసాడు నితిన్. ప్రక్క గది నుండి ఆ నలుగురూ వచ్చి "అందరికీ నమస్కారాలు తెలిపి వారి పేర్లను వారు చేస్తున్న వృత్తిని చెప్పుకుని, తమని తాము పరిచయం చేస్కున్నారు. తర్వాత నిధి మాట్లాడ్తూ, "విషయానికి వస్తే ముందుగా నేను ఈ ఇద్దరి గురించి మీకు చెప్పటానికే ఇక్కడికి వచ్చాను. వీళ్ళలో ఒకరి పేరు 'స్నేహ', ఇంకొకరి పేరు 'ప్రేమ్'. వీరిద్దరూ అనాథాశ్రమంలోని పిల్లలను చూస్కుంటుంటారు. స్నేహ నెలలు పిల్లలను చూస్కుంటుంది. ప్రేమ్ ఎనిమిదేళ్ళ లోపు పిల్లలను చూస్కుంటాడని వారిని చూపించింది నిధి. వీరు చిన్న పిల్లలను విసుక్కోకుండా, శ్రద్ధగా చూస్కుంటూ ఎనలేని సేవలు అందిస్తున్నారు. దానితో పిల్లలు మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా వుంటున్నారు. దానికి మనమంతా వీరికి కృతఙ్ఞులమే. వీరు పిల్లలను ఎలా చూస్కుంటున్నారో తెలుసుకోటానికి వీరిని మీరేమైనా ప్రశ్నలు అడగాలనుంటే అడిగి తెలుసుకోవచ్చు," అంది. తర్వాత ఒక జూనియర్ సైకియాట్రిస్టు లేచి స్నేహాను ఉద్దేశించి, "మీరు రాత్రి అనాథాశ్రమంలో పిల్లలతో పాటూ పడుకున్నాక, ఏ అర్థరాత్రో ఎవరైనా పసిబిడ్డ గుక్కపట్టుకుని ఏడిస్తే ఏం చేస్తారు?" అని అడిగాడు. దానికి స్నేహ, "మొదట ఆ పసిబిడ్డ పక్క బట్టలు కానీ చెడ్డీ కానీ తడిచి ఏడుస్తుందేమో చూస్తాను. అది కాకపోతే ఏదైనా కుట్టి ఏడుస్తుందేమోనని బిడ్డ శరీరాన్నంతా పరికించి చూస్తాను. అదీ కాకపోతే కడుపు చిన్నగా ఒత్తి అరగక ఏడుస్తుందేమో అనిపిస్తే, డైజెషన్ సిరప్ వేసి పదినిమిషాలలో ఏడుపు ఆపకపోతే డాక్టర్కు ఫోన్ చేస్తానని చెప్పింది. దానికి ఆ సైకియాట్రిస్టు, "గుడ్" అని చెప్పి కూర్చున్నాడు. తర్వాత ఇంకో జూనియర్ సైకియాట్రిస్టు లేచి ప్రేమ్ను ఉద్దేశించి, "నీవు చూస్కునే పిల్లల్లో ఓ నలుగురు ఒకే వస్తువు కోసం పోట్లాడ్తున్నారనుకో, వారి పోట్లాటను ఎలా ఆపుతావు," అని అడిగాడు. దానికి ప్రేమ్, "ముందుగా ఆ వస్తువును చూసి, ఇంకో మూడు అలాంటివే వుంటే, తలా ఒకటి ఇస్తాను. అలా కాకపోతే ఆ వస్తువు పంచటానికి వచ్చే వస్తువో, తినుబండారమో అయితే నలుగురికీ సమానంగా పంచుతాను. ఏదైనా పుస్తకమో, పెన్సిల్లాంటి అవసరమైన వస్తువైతే, అప్పటికి ఎవరికైతే అది అత్యవసరమో వాడికి దాన్నిప్పించి, మిగిలిన వారికి మళ్ళీ తెప్పించి ఇస్తానని చెప్పి, చెప్పినట్టుగానే తర్వాత తెప్పించి ఇస్తాను. అదీ కాకపోతే ముందుగా వారికి నలుగురూ పోట్లాడకుండా వాడుకోమని లేకపోతే ఎవ్వరికీ ఇవ్వకుండా తీస్కుంటానని హెచ్చరిస్తాను. వారు సరే అని ఇంకా పోట్లాడ్తూనే వుంటే తీసేస్కోనన్నా తీసేస్కుంటాను లేకపోతే దాన్ని ఒక్కొక్కరు ఒక్కో గంటసేపు వాడుకునేలా చూస్తాను," అన్నాడు. అది విన్న ఆ జూనియర్ సైకియాట్రిస్టు, "ఇన్ని ఆప్షన్స్ తో ఇంత క్లియర్గా చెప్పాక ఇంకేమంటాము, వెరీగుడ్ అంటాము," అన్నాడు. తర్వాత అందరూ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారని నిధి మరియు రాధ డాక్టర్లను మెచ్చుకున్నారు. తర్వాత నిధి, వారితో, "మీరు ఆ గదిలోకెళ్ళి కూర్చోండి, ఒక్క పది నిమిషాల్లో వచ్చేస్తాను," అని వారిని పంపింది. వాళ్ళు డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత నిధి మళ్ళీ మాట్లాడటం కొనసాగిస్తూ, " స్నేహ, ప్రేమ్లిద్దరిలో ఓ ప్రత్యేకతుంది, ఎవరైనా చెప్పగలరా? ' అంటే, ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారు. కానీ దానికి నిధి అవేవీ కాదు, అసలు వారు మనుషులే కాదు, వారు హ్యూమనాయిడ్ రోబోలు. అంటే అచ్చం మనుషుల్లా, అంటే మనలా కనిపిస్తూ, మనలాగే ప్రవర్తించే మర యంత్రాలన్న మాట," అని జూనియర్ సైకియాట్రిస్టుల వంక చూసింది. వారు, "నిజంగానా మేడమ్, వీ కాన్ట్ బిలీవిట్, రియల్లీ ఆసమ్," అని కరతాళ ధ్వనులు చేస్తూ, "మేము వీటి గురించి విన్నాము కానీ అవి యంత్రాలని కనుక్కోలేని విధంగా అచ్చు మనుషుల్లా ప్రవర్తించగలవని ఇప్పుడు చూసాకే తెలుసుకున్నాము, చేసినవారు నిజంగా ప్రశంసనీయులు," అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. మళ్ళీ డాక్టర్ నిధే మాట్లాడ్తూ, "వీటిలో ఒకటి నా పర్యవేక్షణలో, ఇంకొకటి నా అసిస్టెంటు రాధ పర్యవేక్షణలో వుండి అనాధాశ్రమంలోని పిల్లలను చూస్కుంటున్నాయి. ఈ రోబోలు మా దగ్గరకు వచ్చి పని చేయటం మొదలెట్టినప్పటి నుండి వీళ్ళు చూస్కునే పిల్లలు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. వీటికి విసుగనేది వుండదు, ఎంత పనైనా చిరునవ్వుతో చేస్తాయి. పిల్లలు అవి రోబోలని తెలియక ఎంతో ఆనందంగా వుంటున్నారు. ఇదే నన్ను ఈ ప్రాజెక్టుకు ప్రోత్సాహం అందించేలా చేసింది. కుమార్ గారి టీమే వీటిని తయారు చేసింది. వారికే ఈ ప్రశంసలన్నీ దక్కుతాయి. వీటిని ఈ స్థాయి ఆలోచనా పరిధిలోకి తీసుకురావటానికి వీరు ప్రతిరోజూ చేసిన కృషి అనన్యం, అనిర్వచనీయం. ఇది ఎంతో కష్టమైన పని, ప్రతిరోజూ మేమిచ్చే అనుభవాన్ని, మా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మలచిన అపురూపమైన టెక్నాలజీ. హాట్సాఫ్ టు దెయిర్ టీం." అనగానే అందరూ కుమార్ను చూస్తూ కరతాళ ధ్వనులతో తమ ప్రశంసలను తెలిపారు. మళ్ళీ డాక్టర్ నిధే మాట్లాడ్తూ, "ఇంకొక విషయమేమంటే, నా అసిస్టెంటు రాధ ఇంకా పెళ్ళి చేస్కోలేదు, ఒంటరిగా వుంటోంది. ప్రేమ్ రోబోను తన తమ్ముడిగా అందరికీ చెప్తూ తన ఇంటిలోనే వుండేలా ఏర్పాటు చేసింది. అలా తనకు ప్రేమ్ వల్ల సమాజంలో భద్రత ఏర్పడింది. ఈ విధంగా కూడా రోబోలను మనం ఉపయోగించుకునే అవకాశం వుందనిపించింది నాకు. రాధ ముందంతా ఈ కాలనీలోనే వుండేది, ఈ మధ్యనే కొంత కాలంగా ఊర్లోని ఒక అపార్ట్మెంట్లో వుంటోంది. ఇదే కాలనీ బయటున్న మొదటి రోబో. అయితే రాధకు తెలియకుండానే ఒక నెట్వర్క్ ఆ రోబోను అనుక్షణం పర్యవేక్షిస్తోంది. ఇంకో సంవత్సరం పాటూ ఈ పర్యవేక్షణ కొనసాగి ఎలాంటి అవాంతరాలూ జరగకపోతే వీటిని జాతికి అంకితం చేసే అవకాశం వుంది. త్వరలో ప్రేమ్ను కొంత మంది మనుషులకు పరిచయం చేసి వారి నుండి వచ్చే సమీక్షలను, అభిప్రాయాలను సేకరించి ప్రజలు దీనిని ఆహ్వానిస్తారో, లేదో తెలుసుకుని ముందుకు వెళ్తాము. ఆ అనాథ పిల్లల సంతోషాన్ని చూసాక, ఈ ప్రాజెక్టు పూర్తిగా సఫలం కావాలని కోరుకుంటున్నాను," అంటూ నిధి ఎంతో ఉద్వేగంగా చెప్పి, "ఇప్పుడు మీరు చెప్పండి వారిని రోబోలని మీరు గుర్తించగలిగారా?" అని అడిగింది. అందరూ గుర్తించలేక పోయామని తలలడ్డంగా ఊపారు. "అందుకే ఈ ప్రాజెక్టు కచ్చితంగా సఫలం అవుతుందని నా నమ్మకం. మేము వీటిని మీకు చూపించటం కోసమే ఇక్కడికొచ్చాము, మా పని పూర్తయ్యింది, ఇక మేము సెలవు తీస్కుంటాము," అని చెప్పి డాక్టర్ నిధీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ డాక్టర్ నితిన్ మాట్లాడ్తూ, " 'ఇప్పుడు మీకర్థమయ్యుంటుంది అది ఏ ప్రాజెక్టో... అది హ్యూమనాయిడ్( అంటే అచ్చం మనిషి లాగా వుండి, మనిషిలా ప్రవర్తించే) రోబోలను సృష్టించే ప్రాజెక్టు అన్నమాట' అందరూ కరతాళ ధ్వనులు చేసారు... 'ఈ ప్రాజెక్టు లక్ష్యం, తల్లులు లేని పిల్లల కోసం అచ్చం అమ్మల్లా చూస్కునే హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేయటం. ఈ ప్రాజెక్టు కోసం రోబోలను తయారు చేయటం ఒకెత్తయితే, అవి సరిగ్గా పని చేస్తున్నాయో, లేదో గమనిస్తూ, అవసరమైతే ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ లో మార్పులు చేస్తూ వుండటం ఇంకో ఎత్తు. ఇది సక్సెస్ అయ్యిందా, లేదా తెలియటానికి ఒక తరం వారైనా వీటి క్రింద పెరగాల్సి వుంటుంది. ఏ తల్లిదండ్రులైనా అలా రోబోల పర్యవేక్షణలో వారి పిల్లలను పెంచగలమో, లేదో చూడటానికి మీ పిల్లలనిమ్మంటే, సుతరామూ ఇవ్వరు. అలా కాకుండా అనాథలను తీసుకుని పెంచవచ్చు, కానీ అది ఏమాత్రం బెడిసి కొట్టినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, ఏ ప్రభుత్వమూ అందుకు ఒప్పుకోదు. అదే సమయంలో కుమార్ టీం వాళ్ళకు తెలిసిన కొందరు సాగుకు పనికిరాని భూములపై 'ఆనందలోకం' లాంటి కాలనీలు కట్టాలనే యోచనలో వున్నారు. అలాంటి కాలనీ తాము మొదలెట్టాలనుకుంటున్న ప్రాజెక్టుకు బాగా ఉపయోగపడ్తుందనిపించింది వీరికి. అప్పటికే టెస్టుట్యూబ్ బేబీలు, సర్రొగసీ (అద్దెకు గర్భం మోయటం) లాంటి పద్దతులు అందుబాటులోకి వచ్చి కూడా చాలా దశాబ్దాలే అయ్యింది. అప్పుడు వారికి తామే ఎందుకు సర్రొగసీ పద్దతిలో పిల్లలను కని, వారిపై ఈ ప్రాజెక్టు ఎలా పని చేస్తుందో ప్రయత్నించకూడదనే, ఆలోచన వచ్చింది. దానివల్ల తమకంటూ వారసులుంటారు, ఒక కుటుంబమూ వస్తుంది. అలాగే తమ వారన్న జాగ్రత్తతో ప్రాజెక్టును ఎలాగైనా సక్సెస్ చేయటానికి అహరహమూ కష్టపడ్తాము అనుకున్నారు. అనుకున్నదే తడవుగా చట్టపరిధిలో అన్ని అనుమతులు సంపాదించుకున్నారు. కాలనీని మైనింగ్ వేస్టు స్థలం మీద కట్టేప్పుడు వాళ్ళే తమ ప్రాజెక్టుకు కావాల్సిన వసతులతో పాటూ అన్ని హంగులతో కాలనీ తయారయ్యేలా శ్రమించారు. తర్వాత, పెళ్ళి వద్దు, కానీ కుటుంబం కావాలనుకునే ఒంటరి వారే కాక, పెళ్ళిళ్ళు జరగని కుమార్ లాంటి ఒంటరి వారంతా కలిసి డబ్బవసరం వుండి అద్దె గర్భం మోసేవారిని (అంటే సర్రొగసీ పద్దతికి అంగీకరించిన వారిని) సంప్రదించి తమ వీర్యకణాల (స్పెర్ముల)తో టెస్టుట్యూబ్ పిల్లలను కన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, మొదటి విడతగా పది నుండి పదహైదు మంది సర్రొగసీ పద్దతిలో పిల్లలను కన్నారు. అందులో సక్సెస్ అయ్యి, ఆరోగ్యంగా పుట్టిన వారు పదకొండు మంది మాత్రమే. ప్రతి శిశువుకు ఒక హ్యూమెనాయిడ్ రోబోను ఆ శిశువు పోలికలను కొన్ని జోడించి అమ్మగా తయారు చేసారు. ప్రతి రోబో ఎవరో ఒక మనిషి పర్యవేక్షణలో వుండే జాగ్రత్తలు తీస్కున్నారు. అలాగే ఏ హ్యూమనాయిడ్ రోబోలు కూడా ఆ కాలనీ దాటి బయటకు ఒంటరిగా వెళ్ళటానికి చట్టం అంగీకరించదు. అలా బయటకు రావాలంటే దాన్ని చూస్కునే వారు కూడా దాని వెంట కచ్చితంగా వుండాలన్న నిబంధనతోనే, ప్రభుత్వం వీరు చేసే ప్రాజెక్టును ఒప్పుకుంది. అదీగాక ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ప్రభుత్వానికి కూడా ఎంతో ఉపయోగముంటుంది. అందుకే ఇక్కడుండే పిల్లలకు వారి తల్లిదండ్రులలో ఎవరో ఒకరో, లేక వారి ప్రక్క ఇండ్లలోని వారిలో ఎవరైనా హ్యూమనాయిడ్ రోబోలై వుండవచ్చన్న నిజం తెలుసుకునే అవగాహన వచ్చే లోపలే వారికి కౌన్సెలింగ్ ప్రోగ్రాం ఇవ్వాలనేది మేము ముందుగానే అనుకున్న షెడ్యూలు. కాకపోతే అనుకోని యాక్సిడెంట్ వల్ల ఒక రోబో అమ్మ తలకు గాయం కావటం వల్ల, వాళ్ళ అబ్బాయి కౌన్సెలింగ్ స్టార్ట్ చేయకముందే ఆమె తనలాగా కాదనే అనుమానంతో ఈ ఫోబియాకు బలయ్యాడు. దాన్ని మరిచి పోయేలా చేసినా కూడా, ఆ ఫోబియా వల్ల విపరీతమైన తలనొప్పికి లోనవుతున్నాడు. అందుకే మేము ఆ అబ్బాయి బ్యాచ్ పిల్లలందరికీ కౌన్సెలింగ్ మొదలెట్టాము. ఇప్పుడిచ్చే కౌన్సెలింగ్ ద్వారా ఆ అబ్బాయి తొంబైతొమ్మిది శాతం మామూలుగా అయ్యే అవకాశం వుంది. ఈ ఫోబియా లక్షణాలు, ప్రేమించే వాళ్ళు ఎక్కడ దూరమవుతారో అనే భయం, అలాగే ఎవరు మనిషో, ఎవరు రోబోనో అర్థం కాక ఎవ్వరినీ నమ్మలేక పోవటం, దాని వల్ల విపరీతమైన అభద్రతా భావం. ఇంక ఈ అబ్బాయి విషయానికి వస్తే అమ్మ రోబోనేమో అనే అనుమానం వచ్చింది, అంటే ఇన్ని రోజుల నుండి ఆమె చూపే ప్రేమ నిజం కాదా, ఆ ప్రేమంతా అబద్దమయితే మరి నేనెవరిని?! అస్సలు నేనెవరిని?! అసలు నాన్నైనా నాన్నేనా?! ఇలాంటి అనేక ప్రశ్నలు, ఎదుగుతున్న పసి మెదడుకు తీరని బాధను, అర్థం కాని ప్రశ్నలతో తలనొప్పిని కలిగించేవి. మేము విషయం చెప్పి, అది అబద్ధమైన ప్రేమ కాదనీ, అది తన తండ్రే వాళ్ళమ్మ రోబో ద్వారా తన ప్రేమనే చూపించాడని చెప్పి ఒప్పించటానికి చాలా కష్టపడి అన్ని విషయాలను కౌన్సెలింగ్ ద్వారా ఒక పద్దతిలో వారికి చెప్పి, వారు అర్థం చేస్కుని ఆనందంగా వుండేలా మార్చటానికి ప్రయత్నాలు చేస్తున్నాము. రకరకాలుగా జీవించే పిల్లలను ఈ పదిమంది పిల్లలకు పరిచయం అయ్యేలా చేసి వారికి అవగాహన కలిగిస్తున్నాము. ఆ ఫోబియాకు గురైన అబ్బాయికి ఇది చాలా మటుకు మంచి ఫలితాన్ని ఇస్తూ వుంది. దీన్ని తెలుగులో 'ప్రేమ రాహిత్య ఫోబియా' అనొచ్చేమో,' అని చిన్నగా నవ్వాడు నితిన్. అక్కడున్న కుమార్ మాత్రం ఈ ప్రాజెక్టు మొదలయ్యింది కూడా 'ప్రేమ చేజారి' పోవటం వల్లే కదా అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ నితినే మాట్లాడ్తూ, 'దీనికి ట్రీట్మెంట్ అంటే అన్ని విషయాలను వారికి అర్థమయ్యేలా చెప్పటమే, అలాగే అన్ని రకాల జీవితాల మీద అవగాహన కలిగిస్తూ, వారిలాగే ఎంతో మందికి కావాలనుకున్న ప్రేమ లభించకపోయినా ధైర్యంగా తమని తాము ప్రేమించుకుంటూ, ఇతరులకు తమ చేతనయినంత ప్రేమనందిస్తూ ఎలా జీవిస్తున్నారో తెలిసేలా చేయాలి. అలాగే అలాంటి కొందరి పరిచయాలు ఏర్పడితే వారికి మనం చెప్పే విషయాలు నిజమేనన్న నమ్మకం కలుగుతుంది. అదే ఈ ఫోబియాకు చికిత్స. మీకు ఈ ఫోబియా గురించి నేను చెప్పిన విషయాలు కావాల్సినంత సమాచారాన్ని అందించి వుంటాయని భావిస్తున్నాను. ఒక్కోసారి ఎంతో ప్రణాళికా బద్దంగా. ముందుకు వెళ్ళినా అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. వాటికి మనం ఎప్పుడూ సంసిద్ధంగా వుండాలి. వాటిని చూసి కొత్త ఆవిష్కరణలు చేయకుండా వుండాలనుకోకూడదు అనేది నా అభిప్రాయం. ఏ ఆవిష్కరణైనా ఏ జీవికీ, ప్రకృతికీ చెడుపు చేసేది కానంత వరకు దాన్ని నేను స్వాగతిస్తాను. ఈ ప్రాజెక్టుకు నేను సహకరించటానికి కారణం, దీని వల్లనైనా దిక్కులేని ముసలి వారిని, అనాథలను, ఆసుపత్రి పాలైన వారిని ప్రేమగా చూసుకునే రోబోలొస్తాయనే ఆశతోనే. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తిగా సఫలం కావాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి నుండి కూడా అదే ఆశిస్తూ మిమ్మల్ని ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేస్తున్నాను. సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాను,' " అన్నాడు. తర్వాత నితిన్ కుమార్ను పిలిచి మాట్లాడమన్నాడు. ఇక కుమార్ ఏం చెప్తాడన్నది వచ్చే భాగంలో తెలుసుకుందాము. ============================================================

ఇంకా వుంది============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.31 views0 comments

Comments


bottom of page