top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 10


'Prema Chejarithe 10' New Telugu Web Series

Written By Pendekanti Lavanya Kumari

ప్రేమ చేజారితే - ధారావాహిక పదవ భాగం

రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)


గత భాగంలో జరిగినది: నితిన్ కుశాల్తో మాట్లాడటం పూర్తవగానే కుమార్ వచ్చి కుశాల్కు క్యారియర్ ఇచ్చి క్లాసుకు పంపుతారు. ఆ తర్వాత డాక్టర్ నితిన్, కుమార్ను వెంట తీస్కొని కాన్ఫరెన్స్ హాలు కెళ్తూ కుమార్తో, "నీతో ఒక విషయం చెప్పాలనే పిలిచాను," అన్నాడు.

ప్రేమ చేజారితే - 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఈ భాగం చదవండి... నితిన్, కుమార్తో కలిసి కాన్ఫరెన్స్ హాలుకు వెళ్తూ ఇలా మాట్లాడసాగాడు, " నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనే నిన్ను ఇక్కడికి పిలిచాను. అదేమంటే, ఇప్పుడు మీ ప్రాజెక్టులో మా ప్రమేయముండే అసలైన ఘట్టం మొదలయ్యింది, ఇంతకాలం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు నాకూ, నిధికి మాత్రమే తెలుసు. ఇప్పుడు కాలనీలో చాలా మంది పిల్లలు కౌన్సిలింగ్ ఇచ్చేంత పెద్దయ్యారు. ఇంక ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వుంటుంది. దానికి ఇంకొంత మంది సైకియాట్రిస్టుల ప్రమేయ, సహాయాలు అవసరపడ్తాయి. అందుకే ఈ రోజు నా దగ్గర చదువుకున్న మరియు నాకు అసిస్టెంట్లలా వుండటానికి ఒప్పుకున్న ఒక ఆరుగురు సైకియాట్రిస్టులకు ఈ ప్రాజెక్టు గురించి వివరించాలనీ, దానికి మీరు కూడా వుండి మాట్లాడితే బాగుంటుందనీ మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించాను. మీరు భయపడక్కరలేదు వీళ్ళందరూ అన్ని విషయాలను రహస్యంగానే వుంచుతారు, అది వారి నైతికబాధ్యతగా భావించి, అన్నీ గోప్యంగా వుంచే వారినే వడగట్టి ఎంచుకున్నాను. మీరు ఏమాత్రం సందేహపడక్కరలేదు," అన్నాడు నితిన్ కుమార్తో. దానికి కుమార్, "సరే అయితే, వీరికి పిల్లల గురించిన డీటైల్స్ అయితే ఇవ్వద్దు జనరల్గానే పిల్లలందరికీ కౌన్సెలింగ్ ఇమ్మని చెప్పండి. కుశాల్ ఎవరు, ఏమిటీ అనే విషయం అందరికీ తెలియటం నాకేమాత్రం ఇష్టం లేదు. దీనివల్ల అందరికీ మా కుటుంబంలో జరిగినవి తెలియడం వలన కుశాల్ మనసు బాధపడుతుందేమో అన్నదే నా ఆలోచన, కొంచెం పెద్దయ్యాక తన ఇష్టంతో బయటపడితే పర్వాలేదు. అందుకే సాధ్యమైనంత వరకూ నేను వారితో కుశాల్కు తండ్రిగా కాకుండా ఈ ప్రాజెక్ట్ ను స్థాపించిన వ్యక్తిగానే మాట్లాడ్తాను, తెలిసిప్పుడు తెలుస్తుంది. అయినా మనం బయటపడలేదంటే అది గోప్యంగా వుంచాలనుకుంటున్నామనేది కూడా వారికి అర్థమవుతుంది," అన్నాడు. " 'కుమార్ గారూ! మీరు వీరి గురించి అస్సలు సందేహపడవద్దు,' అంటూ చేతిలో చేయి వేసి భరోసా ఇస్తున్నట్టుగా సున్నితంగా నొక్కి చెప్పాడు... 'అంతేకాక, కుశాల్ కూడా నా కౌన్సెలింగ్తో చాలా పరిణితితో ఆలోచిస్తున్నాడు, ఈ విషయం తెలిసినా కూడా ఇంతకు ముందులా బాధపడడని నేను కచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసి ఆ రోజు జరిగిన ప్రమాదంలో కుశాల్కు షాలినిని అలా చూసి అర్థం కాని సందిగ్ధంలోనే మూర్చపోయాడనిపిస్తుంది. అంతేకాక కుశాల్ని హిప్నోథెరపీతో మర్చిపోయేలా చేసిన విషయాలు పదే, పదే అర్థం అయ్యీ కాని కలలుగా వస్తూ కుశాల్ను కలవరపరుస్తూ తలనొప్పిని కలిగిస్తున్నాయి. అందుకే ఇక కుశాల్కు అన్నీ చెప్పి కౌన్సెలింగ్ పూర్తి చేసే సమయం ఆసన్నమైంది,' " అని అన్నాడు నితిన్ ఎంతో దృఢంగా. అంతలో ఇద్దరూ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకున్నారు. వారిని చూడగానే అక్కడ కూర్చున్న ఆరుగురు అసిస్టెంటు డాక్టర్లు గౌరవంగా లేచి నిల్చున్నారు, వారిని కూర్చోమని నితిన్, కుమార్ వారి దగ్గరకు చేరారు. నితిన్, కుమార్ను కూడా కూర్చోమని చెప్పి తనూ కూర్చున్నాడు. వారంతా ఒక పది మంది సమావేశము కాగల టేబుల్ చుట్టూ కూర్చుని వున్నారు. నితిన్ కూర్చునే తామందరమూ ఇక్కడ సమావేశం కావటానికి గల కారణమేంటో చెప్పసాగాడు. "డియర్ జూనియర్స్! మిమ్మల్ని ఇక్కడికి ఒక సీక్రెట్ ప్రాజెక్టులో పాలుపంచుకుని మీ సైకియాట్రీ సేవలు ఆ ప్రాజెక్టు కోసం అందించటానికి పిలిపించాను. దానికి మీ సేవలెంతవసరమో అంతే గోప్యంగా దాన్ని వుంచటము కూడా అవసరమే, దానికి మీరు సమ్మతించి ప్రమాణం చేసాకే నేను ప్రాజెక్టు గురించిన విషయాలు మీకు చెప్పగలను. ఈ ప్రాజెక్టు పూర్తి కావటానికి అయిదు నుండి ఎనిమిదేళ్ళ సమయం పట్టవచ్చు, అందుకు అంగీకరించిన వారు మాత్రమే ప్రమాణం చేసి మా ప్రాజెక్టులో భాగస్వామ్యం కావచ్చు. మీరు చేసిన ఆ ప్రమాణాన్ని వీడియో తీసి ప్రభుత్వానికి పంపటం జరుగుతుంది, దీనిలో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యమూ మరియు ప్రోత్సాహమూ వుంది. ఇది ప్రజల కొరకు చేస్తున్న ప్రాజెక్టు, దీని గురించిన విషయాలు చాలా గోప్యంగా వుంచాల్సి వుంది. ఈ ప్రాజెక్టును మేమై మేము ప్రజలకు చెప్పేంత వరకు ఇక్కడ జరిగే విషయాలు కానీ, పేషెంట్ల గురించి కానీ చెప్పటానికి బయటికి రావటానికి వీలు లేదు. అలా అని ఇది ఇల్లీగల్ అనుకునేరు, అలాంటిదేమీ లేదు, కాకపోతే ఇది సక్సెస్ అయితేనే ముందుకు వెడతాము, లేకపోతే జరిగినంత వరకు ఎలాగో కంటిన్యూ చేసి అక్కడితో ఆపేస్తాము. దీనికి అంగీకరించినట్లైతేనే ఈ సమావేశంలో పాలుపంచుకోండి లేకపోతే నిరభ్యంతరంగా వెళ్ళి పోవచ్చు. అంతేకాక ఇది ప్రభుత్వపు అండతో జరుగుతున్నది కాబట్టి మీరు ఈ విషయాలను లీక్ చేస్తే శిక్షలు కఠినంగా వుండొచ్చని మరొకసారి హెచ్చరిస్తున్నాను," అన్నాడు నితిన్. అంతలో ఓ వ్యక్తి కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చాడు, ఆయనను నితిన్ అందరికీ పరిచయం చేస్తూ, "ఈయనే ప్రభుత్వం తరపున మీ ఓత్(ప్రమాణము) వీడియోలు తీస్కోని వెళ్ళటానికి వచ్చిన ప్రభుత్వాధికారి. మీకు ఒక పది నిమిషాలు టైమిస్తున్నాను ఆలోచించుకుని నిర్ణయించుకోండి," అని చెప్పాడు నితిన్. ఆ పదినిమిషాలయ్యాక, ఆ ఆరుమందిలో ఒక్కరు మాత్రమే లేచి, "నేను ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలనుకుంటున్నాను. కారణం నేను గోప్యంగా వుంచలేనని కాదు, మేమంతా డాక్టర్లుగా వృత్తి మొదలెట్టే ముందే పేషెంట్ల గురించిన విషయాలను గోప్యంగా వుంచుతామని ప్రమాణం చేసే ఈ వృత్తిని స్వీకరిస్తాము కాబట్టి ఇక్కడ వున్న వారందరూ నాతో సహా దాన్ని కచ్చితంగా పాటించగలరని నాకు తెలుసు. అయితే నేనిక్కడికి ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల పాటూ మాత్రమే చెయ్యాలన్న ఆలోచనతో వచ్చాను, కానీ ఇది చాలా కాలం కొనసాగే పెద్ద ప్రాజెక్టని ఇప్పుడే తెలిసింది. నేను సంవత్సరం తర్వాత విదేశాలకు వెళ్ళవలసి రావచ్చనుకుంటున్నాను, అందుకే దీన్నుంచి తప్పుకుంటున్నాను. నేను నితిన్ గారి ప్రాజెక్టులో పని చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. సారీ ఫ్రెండ్స్! సారీ నితిన్ సార్! అని నితిన్తో కరచాలనం తీస్కొని, మీ సమావేశానికి ఇంక ఏమాత్రం ఆలస్యం కలగకుండా నేను వెళ్ళొస్తాను," అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత మిగిలిన ఐదుమంది డాక్టర్లతో ప్రమాణం చేయించుకుని, ఆ ప్రమాణాలు చేసేప్పుడు రికార్డు చేసిన వీడియోలు తీస్కున్న ప్రభుత్వాధికారి కూడా అందరి దగ్గర వీడ్కోలు తీస్కొని నిష్క్రమించాడు. తర్వాత నితిన్ మాట్లాడ్తూ, " 'మీరు ఇప్పుడు ఏ ఫోబియా గురించి తెలుసుకోవటానికి వచ్చారో ఆ ఫోబియాకూ, ఈ కాలనీకి, ఈ ప్రాజెక్టుకు సంబంధముంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నేను ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ వీరితోనే వుండి, ఇలాంటి ప్రాజెక్టు వల్ల వచ్చే మానసిక సమస్యల గురించి చర్చించిన వ్యక్తిని. అందుకే రిటైర్మెంట్ వయసొచ్చాక కూడా వీళ్ళు నేనే చూడాలని నన్ను కట్టిపడేసారు. నాక్కూడా ఇంకా శక్తి వుండి, వీళ్ళ బాగోగులు చూడాలనే ఉత్సాహం వుండటం వల్ల ఇంకా ఇక్కడే వుండిపోయాను. మీలాంటి క్రొత్తగా వచ్చే సైకియాట్రిస్టులకు ఈ ఫోబియా గురించి, వీళ్ళకిచ్చిన ట్రీట్మెంట్ గురించి, మేము చేస్తున్న ప్రాజెక్ట్ గురించిన సమాచారం అందించటం నాకెంతో ఆనందంగా వుంది,' అన్నాడు. 'ఇక విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు చేయటానికీ, ఈ ఫోబియా రావటానికీ అసలు కారణం రెండు తరాల క్రితం భారతదేశ సమాజంలో జరిగిన ఒక అమానుషమే. అదేమంటే, అప్పట్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే కట్నం ఇవ్వాలి, పైగా వారిని భద్రతగా పెంచాల్సి వుంటుంది. ఆ బాధ్యతను, ఆ ఖర్చును మోయలేని మధ్యతరగతి తల్లిదండ్రులు కొందరు అప్పుడప్పుడే వైద్యసేవలోకి వచ్చిన ఫీటస్ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ ( కడుపులోని పిండ లింగ నిర్ధారణ పరీక్ష) ద్వారా తమ కడుపులో వున్నది ఎవరో తెలుసుకుని, అది ఆడపిల్లైతే అబార్షన్ (కడుపు తీయించు కోవటం) చేయించుకునే వారు. ప్రభుత్వము దీని గురించి కట్టుదిట్టమైన చట్టాలు చేసాక చాలా తగ్గింది కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెయ్యి మంది పురుషులకు గాను తొమ్మిది వందల మంది ఆడపిల్లలుగా నిష్పత్తి (రేష్యూ) పడి పోయింది. అలాంటి సమయంలో వుత్పన్నమయిన ఫలితాలే ఇప్పటి ఈ ఫోబియాకు ఇండైరెక్ట్ కారణం అనొచ్చు. తమాషాగా అనిపించినా ఇది నిజం. అదెలానో వివరిస్తాను. అప్పుడు పుట్టిన ఆ పిల్లలే, 2020 నుండి 2035 మధ్య కాలంలో వున్న యువతీ, యువకులు, అంటే ఇరవై నుండి ముప్పై ఐదు మధ్య వయసు వాళ్ళన్న మాట. అందుకే అప్పుడు కొంతమంది యువకులకు పెళ్ళి చేస్కోటానికి తగిన ఆడపిల్లలు దొరకటం చాలా కష్టమయ్యింది. కొందరు తమ ఇంట్లో ఆడపిల్ల వుంటే కుండ మార్పిడిలా పెళ్ళిళ్ళు చేస్కుని ఆ పరిస్థితి నుండి బయట పడ్డారు. బాగా డబ్బున్న ఎగువ మధ్య తరగతి వారు కొంత మంది కొంచెం తక్కువ వారిని పెళ్ళి చేస్కోగలిగారు కానీ దిగువ మధ్యతరగతిలోని చాలా మంది యువకులకు ఆడపిల్లలు దొరకక అలాగే మిగిలిపోయారు. అంతే కాక, ఆ సమయం లోనే వచ్చిన కరోనా వైరస్ వేరియంట్ల వల్ల ఈ దిగువ మధ్యతరగతి కుటుంబాలలోని బలహీనమైన ఆరోగ్యాలున్న మధ్య వయసు తల్లిదండ్రుల ప్రాణాలెందరివో హరించబడ్డాయి. ఇంక ఈ యువకులకు వాళ్ళ గురించి ఆలోచించి పెళ్ళి చేసే తల్లిదండ్రులు కరువై, వీళ్ళకు సరిపోయే ఆడపిల్లలను ఆకర్షించే ఆస్తి లేక ఒంటరులుగా మిగిలి పోయారు. మరి కొందరు మరేవో కారణాల వల్ల ఒంటరిగా మిగిలి పోయారు. అలాంటి ఆనాటి యువకులలో ఒకడే ఈ కుమార్,' అంటూ కుమార్ను చూపించాడు నితిన్. 'ఈయన తగిన అమ్మాయి దొరకక, ఎవరినో ఒకరిని పెళ్ళి చేస్కోటం ఇష్టం లేక జర్మనీలో తనకు ఇష్టమైన కొన్ని కోర్సులు చేయవచ్చని జర్మనీలోనే జాబ్ సంపాదించి అక్కడికే వెళ్ళిపోయారు. అంతకు ముందే ఆయన ఎలక్ట్రానిక్స్ లో, అలాగే కొన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ మరియు హాకింగ్ కోర్సులలో నిష్ణాతుడు. అక్కడికి వెళ్ళాక ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు రొబోటిక్స్ లలో కూడా కొంత శిక్షణ తీస్కున్నాడు. ఆ తర్వాత కుమార్ తనలాంటి కొంతమంది భారతీయులను ఆధరించి, జర్మనీలో ఆయనే వాళ్ళకిష్టమైన కోర్సులు చేయటానికి సహాయం చేసాడు. వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ ఉపవిభాగాలలో పట్టు సాధించారు. తర్వాత వీళ్ళందరూ ఒకటిగా ఒక సంస్థ స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎన్నో ప్రాజెక్టులు చేసారు. పెళ్ళి చేస్కోని ఒంటరి వాళ్ళవటం వల్ల రేయింబవళ్ళు బాగా కష్టపడేవారు. అలా వాళ్ళు చేసిన ఒకటి, రెండు ప్రాజెక్టులు బాగా క్లిక్ అయ్యి, వీరందరికీ చెప్పలేనంత ఆస్తిని సమకూర్చాయి. చేతిలో ఆస్తి వుంది కానీ ఎవ్వరికీ తమకంటూ పెళ్ళి, కుటుంబమనేదే లేదు. అప్పటికే అందరూ నలబై దాటారు. ఎవరో ఒకరు తమ ఆస్తులను చూసి పెళ్ళి చేస్కోవచ్చేమో కానీ తమను చూసి మాత్రం చేస్కోరనేది అందరికీ చాలా బాగా తెలుసు. అందుకే పెళ్ళి వైపు మొగ్గు చూపలేకపోయారు. కానీ తమకంటూ ఒక కుటుంబం వుండాలనిపించేది. ఆ ఆలోచన నుండి పుట్టినదే వీరి ఈ ప్రాజెక్ట్,' అని చెప్తూ ఆగిన నితిన్, మళ్ళీ తనే అందరినీ ఉద్దేశించి, ' ఆ ప్రాజెక్టు ఏమై వుంటుందో మీరేమైనా ఊహించి చెప్పగలరా?' " అని ప్రశ్నించాడు. ఎవరి నుండీ సమాధానం రాలేదు. ఆ ప్రాజెక్టు గురించి తర్వాతి భాగంలో తెలుసు కుందాము. అంతవరకు మీరు కూడా ఆ ప్రాజెక్టు దేని గురించి అయ్యుంటుందో ఆలోచించి నాకు కామెంట్ పెట్టండి... ఇక వుంటాను. ============================================================

ఇంకా వుంది============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.


40 views0 comments

Comments


bottom of page