top of page

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 7


'Prema Chejarithe 7' New Telugu Web Series

Written By Pendekanti Lavanya Kumari

రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)



గత భాగంలో జరిగినది: ఐదేళ్ళ కాలంపాటూ భారతీయ కంపెనీ ఉద్యోగిగా జర్మనీలో పని చేసిన కుమార్ ఇండియాకు వచ్చి ఆ కంపెనీ ఉద్యోగానికి రాజీనామా చేసి జర్మనీ దేశపు కంపెనీలో జాబ్ సంపాదించి జర్మనీకి వెళ్ళి పోయాడు. అప్పుడు కూడా రాఘవరావు, "తనకు చేతనయినన్ని రోజులు వుండి, చేతకానప్పుడు నీ దగ్గరకు వస్తా"నని చెప్పి, కుమార్ని జర్మనీకి పంపాడు.

ప్రేమ చేజారితే - 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక చదవండి... అలా గతం గుర్తొస్తుంటే, ఆలోచిస్తూ కూర్చున్న కుమార్కు రాఘవరావు గొంతు దగ్గుతూ షాలినీని పిలిచినట్టు వినబడి గతం తాలూకు ఙ్ఞాపకాల నుండి బయటపడి రాఘవరావు పడక గది వైపుకు కదిలాడు. వెళ్తూ షాలినీనడిగి మంచి నీళ్ళు తీస్కుని రాఘవరావు దగ్గరకు చేరాడు కుమార్. "ఏంటి నాన్నా! ఏదో ఇబ్బంది పడ్తున్నారు," అని అడిగి, ‘దగ్గొస్తున్నట్టుంది నీళ్ళు త్రాగండ’ని రాఘవరావును లేపి మెల్లిగా నీళ్ళు త్రాగించాడు. “ఏంటి నాన్నా!? ఏమాలోచిస్తున్నారు? నేను చాలా వయసయ్యాక పెళ్ళి చేస్కున్నానని షాలిని గురించి, కుశాల్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి... నేటి కాలంలో మహిళా సాధికారతంటూ, మేము మాత్రమే ఎప్పుడూ ఇంట్లోనే వుండి ఇంటిని చూస్కోవాలా అంటూ, సొంత తల్లులే పిల్లలను వేరే వారికి అప్పజెప్పి ఉద్యోగాలు చేయాలనుకునే కాలం. పెద్ద వారిని వృద్దాశ్రమాలలో, పిల్లలను హాస్టల్లల్లో వుంచుతూ తాము కూడా ఉద్యోగాలు చేసి ఏదైనా సాధించాల్సిందే అనుకునే కాలం. షాలినితో మనకు ఆ ఇబ్బందే లేదు, చూస్తున్నారు కదా కుశాల్ని, మిమ్మల్ని ఎంత బాగా చూస్కుంటుందో, ఆపైన నేనుండనే వున్నాను. మీరు నిశ్చింతగా పడుకోండి” అని చెప్పి కుమార్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. తర్వాత షాలిని మద్యాహ్నము నాలుగింటికి స్కూలుకు వెళ్ళి కుశాల్ని ఇంటికి తీస్కొచ్చింది. మళ్ళీ వాడికి స్నానం చేయించి, స్నాక్స్ తినిపించి, హోమ్ వర్కు చేయించి, మధ్య, మధ్యలో రాఘవరావుకు కావాల్సినవన్నీ చూస్కుంటూనే వుంది. ఇంతలో కుమార్ ఆఫీసు నుండి వచ్చాడు, అది చూసి కుశాల్ పరుగెత్తుకుంటూ కుమార్ దగ్గరకు వెళ్ళి లోపలికి వస్తున్న కుమార్ను పలకరిస్తూ, ఆ రోజు తాను చేసినవన్నీ ఏకధాటిన చెప్తూ లోపలికి తీస్కొచ్చాడు. అదంతా లోపలున్న రాఘవరావుకు వినిపిస్తుంటే, ఎంతో ఆనందపడిపోయాడు... కుటుంబము, పిల్లలు వుంటే ఆ ఆనందమే వేరు... ఇన్నాళ్ళూ, దీనికోసమేగా నా ఎదురు చూపు... హమ్మయ్య! నాకింకే కోరికా లేదని మనస్పూర్తిగా అనుకున్నాడు రాఘవరావు. కుమార్ వెళ్ళి ఫ్రెషప్ అయ్యివచ్చి, తండ్రి రాఘవరావుతో, కొడుకు కుశాల్తో కాసేపు గడిపాడు. తర్వాత రాత్రికి షాలిని చేసిన చపాతీలను, షాలిని, కుశాల్కు తినిపిస్తే, కుమార్, రాఘవరావుకు తినిపించి, తర్వాత తనూ తిన్నాడు. షాలిని, కుశాల్ని వాడి రూమ్కు తీస్కెళ్ళి కథలు చెప్తూ పడుకో బెట్టి, నిద్ర పోయాక తన రూమ్కు వెళ్ళి పోయింది. కుమార్ రాఘవరావుకు కాసేపు ఏదో చదివి వినిపిస్తూ, ఆయన నిద్రపోగానే తన రూమ్కెళ్ళి తన ఆఫీసు పనులన్నీ చూస్కోని ఎప్పటికో పడుకున్నాడు. ఇది ఆ ఇంట్లో ప్రతిరోజూ జరిగే మామూలు దినచర్య. వారి జీవితం గత కొద్ది కాలంగా ఇలా ఆనందంగా గడిచి పోతోంది. అలాగే కుశాల్ ముద్దు, ముద్దు మాటలతో, వాడు అడిగే ఎక్కడలేని డౌట్లతో గిర్రున కాలం తెలీకుండానే గడిచిపోసాగింది. ఇప్పుడు కుశాల్కు ఏడేళ్ళు వచ్చాయి. స్కూల్నుంచి వచ్చాక తన హోంవర్కులు చేస్కుంటూ అప్పుడప్పుడూ వెళ్ళి గ్రాండ్పా తో ఏదో ఒకటి మాట్లాడి రావటం, మళ్ళీ కాసేపు వాళ్ళమ్మ వెనకెంబడే తిరుగుతూ ఏం చేస్తున్నా గమనిస్తుండటం చేసేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే వాళ్ళమ్మ చపాతీలను కాలుస్తూ, కాలినవాటిన వాటంగా విసిరి కొంచెం దూరంలో పెట్టిన ప్లేట్లలోకి పడేలా వేయటం గమనించాడు. హే! భలే! భలే! నీవు కరెక్టుగా ప్లేట్లో పడేలా వేస్తున్నావు కదమ్మా, నేను వేస్తాను అని పట్టుపట్టాడు. కాల్తుందనీ, పడేస్తావనీ చెప్పినా వినకుండా ఒక్కసారి వేస్తానని పట్టుపట్టి వేసి క్రిందపడేసాడు. ఇంకొక్కసారి వేస్తా, ఇదే చివరిసారి, ఈసారి క్రిందపడ్తే మళ్ళీ వేయనని బ్రతిమాలి మళ్ళీ వేసి, మళ్ళీ క్రింద పడేసాడు. ఇంక అవి క్రిందపడ్డాక మొహమంతా అదోలా పెట్టుకుని నీవైతే వేయగలవు, నేనెందుకు నీలా కరెక్ట్గా వేయలేకపోతున్నాను? నేను నీలా ఎందుకు లేనమ్మా? అంటూ అడిగితే, పెద్దయ్యాక నీవు వేయగలవు అని సర్ది చెప్పింది షాలిని. అప్పటికి కన్విన్సయ్యి వెళ్ళి పోయాడు. మరోరోజు, కుశాల్ స్కూలుకు సెలవుండటంతో ఇంట్లోనే వున్నాడు. షాలిని రోజూలాగా తన పనులు తను చేసుకు పోతోంది, అలాగే ఉతికిన బట్టల్ని వాషింగ్ మెషిన్ నుండి బకెట్లోకి తీసి ఆరేయాల్సిన చోట పెట్టి, ఆరిన బట్టలను తీసి లోపలపెట్టటానికి వెళ్ళింది. అప్పుడు మన కుశాల్ ఆమె లేనిది గమనించి, రోజూ ఆమె బట్టలు వాటంగా ఎత్తున కట్టి వున్న తాడుపై విసిరి ఆరేయటం గమనించివున్నందున, అదో ఆటలా భావించి, ఆమె లాగే ఆరేయాలని పైకి విసుర్తూ అన్నిటిని క్రిందేసి మట్టసంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చపాతీలు వెయ్యనివ్వలేదని, ఇవి వాళ్ళమ్మ లేనప్పుడు వేయాలని వాడి ఉబలాటం. షాలిని వచ్చి చూసేసరికి, ఏముంది అన్నీ క్రిందపడివున్నాయి, ఏమి జరిగిందో ఆమెకర్ధమయ్యి కుశాల్ను పిల్చి నీకు అప్పుడే వేయటానికి రాదు, పెద్దయ్యాక వస్తుంది, ఇలా అడగకుండా చెయ్యటం తప్పు, చూడు అన్నీ క్రిందపడేసావు, వీటిని మళ్ళీ పిండటానికి మెషీన్లో వెయ్యాలి. వేస్టు పని కదా... ఒక్కోసారి పెద్దవారికి చెప్పకుండా చేసే పని ప్రమాదం కలిగించ వచ్చు కూడా, ఇంకెప్పుడూ ఇలా చేయకు అని కఠినంగానే కానీ నెమ్మదిగా అర్థమయ్యేలా అంటుండగా కుమార్ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని అలా చేయకూడదని కుశాల్కు చెప్పి, ఇలాంటి పనులను వాడి ముందు చేయవద్దని చెప్పాగా అని షాలినిని మందలించి కుశాల్ను తీస్కుని క్రిందికి వెళ్ళాడు.. రాఘవరావుకు ఏదో జరుగుతున్నట్టుగా వినిపించి, కుమార్ను పిలిచి అడిగితే కుమార్ విషయమంతా చెప్పాడు. అది విని రాఘవరావు కులాసాగా నవ్వుతూ అదేరా పిల్లలుంటే ఇలాంటివన్నీ చూసి ఆనందించవచ్చు, అందుకే కుటుంబమని అంతగా నిన్ను పోరుబెట్టింది. కుశాల్ను దగ్గరకు తీస్కుని, "భలేవాడివిరా నీవు, అంతా మీ నాన్న నుండి వూడిపడినట్టుగానే వున్నావు. చిన్నప్పుడు మీ నాన్న కూడా అంతే, మేము చేసేవి చూసి చేతకాక పోయినా తనూ చేయటానికి తెగ ప్రయత్నించేవాడు," అంటూ నవ్వసాగాడు రాఘవరావు. "అవునా! అలాంటి పనులు నాన్న ఏం చేసాడు గ్రాండ్పా," అని కుతూహలంగా అడిగుతూ వచ్చి వాళ్ళ గ్రాండ్పా పక్కన కూర్చున్నాడు కుశాల్. రాఘవరావు మళ్ళీ నవ్వుతూ, "నీ అంతప్పుడొకసారి మీ నాన్న, తన బంతి బావిలో పడిందని దానిలోకి త్రాడు పట్టుకుని దిగబోయాడు, వెంటనే మేము చూసాము కాబట్టి సరిపోయింది, లేకపోతే దిగేప్పుడు పట్టు జారివుంటే బావిలో పడిపోయే ప్రమాదం వుండేది కదా," అన్నాడు. "ఎందుకు చేసాడలా గ్రాండ్పా," అంటూ అడిగాడు కుశాల్. "ఎందుకంటే, నీవు మీ అమ్మను చూసి ఎలా చేయబోయావో, అలానే అన్నమాట... వేరే అతను ఇంతకు ముందెప్పుడో బావిలోకి దిగటం చూసిన మీ నాన్న , అలాగే దిగొచ్చు అనుకుని దిగబోయాడు, కాకపోతే అతనికి ఈత వచ్చు, అంతేకాక దిగే ముందు తగిన జాగ్రత్తలు తీస్కొని దిగాడు. అలాగే అతనికి అంతకు ముందు ఎన్నో సార్లు బావిలో దిగిన అనుభవముంది కాబట్టి పడే అవకాశం లేదు అందుకే ఎవరి సహాయం తీస్కోకుండా దిగేసాడు. అచ్చంగా మీ అమ్మలాగే, అంటే మీ అమ్మకు కూడా చేసే పని చాలా సార్లు చేసిన అనుభవం వుండటం వల్ల తప్పు జరగకుండా పనులు చేసినట్టు. పిల్లలెవరైనా సరే ఏ పనైనా వచ్చేంత వరకు పెద్ద వారి సహాయంతో చాలా సార్లు ప్రయత్నించి నేర్చుకుని, పెద్దవాళ్ళు ఒప్పుకున్నాకే ఒక్కరుగా చేయాలి, అని నిశితంగా వివరించి, ఇప్పుడు చెప్పు నీవు చేసిన పని తప్పే కదా?" అని అడిగాడు రాఘవరావు. కుశాల్ అదంతా విని బుంగమూతి పెట్టుకుని,"'అవును తప్పే,' అని ఒప్పుకుని, 'ఇంకెప్పుడూ చేయనులే గ్రాండ్పా," అని బాధగా చెప్పాడు. ప్రక్కనే అదంతా వింటూ నిల్చున్న కుమార్ కూడా కొద్దిగా నవ్వుతూ, " ఇట్సోకే కుశాల్! తప్పులందరూ చేస్తారు, తప్పుల నుండి నేర్చకుని మళ్ళీ ఆ తప్పు చేయకుండుండటమే కావాలి, ఐ నో! యూ ఆర్ ఏ గుడ్ బాయ్ అండ్ యూ విల్ నాట్ డూ ఇట్ ఎగయిన్," అని తల నిమిరాడు. ఇలా కుశాల్ చేసే సందడితో సంతోషంగా వారి జీవితం సాగుతోంది. ఇంతలో ఒకరోజు నిద్రలోనే రాఘవరావు ప్రాణం పోయింది. ఈసారి కుమార్ తన తల్లి చనిపోయినప్పుడు పడినంత వేదన పడలేదు, వయసు మీద పడ్డాక అందరికీ తప్పదని, బాధ వున్నా తట్టుకుని తండ్రికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనంగా వీడుకోలు పలికాడు. కుమార్ ఇప్పుడు చాలా పెద్దరికం వచ్చినందుకో, లేక తనకంటూ వున్న వంశాంకురాన్ని చూస్కోవాల్సిన బాధ్యతున్నందువల్లో, లేక వాడికి ఎలాంటి సందర్భాలలోనైనా ధైర్యంగా వుండాలని నేర్పించటం కోసమో లేక ఈ అన్ని కారణాలవల్లనో తెలీదు కానీ ఈసారి కుమార్ తండ్రి మరణాన్ని భరించగలిగాడు... అలా భగవంతుడు ఏదో ఒక కారణంతో తమ వారు దూరమైనదాన్ని భరించగలిగే శక్తిని అందరికీ ఇస్తుంటాడేమో అనిపించింది కుమార్కు. కుశాల్కు రోజూ కనిపించే గ్రాండ్ పా కనిపించక పోయేసరికి, గ్రాండ్ పా ఆరోజు ఆచికి పోయాడు కదా మళ్ళీ రాలేదెందుకని అడుగుతూనే వున్నాడు. వాడు అడుగుతూనే వుంటే కుమార్ వాడికి అర్థమయ్యేట్లుగా ఎలా చెప్పాలో అర్థం కాక, "ఇంక గ్రాండ్ పా రాడు దేవుడి దగ్గరకు వెళ్ళాడు" అని చెప్పేసాడు అందరూ చెప్పినట్లుగానే. దానికి కుశాల్, "ఎందుకు రాడు మనము దేవుడి దగ్గరకు వెళ్ళి తిరిగొస్తాము కదా, గ్రాండ్ పా ఎందుకు రాడు," అని మళ్ళీ అడిగాడు... దానికి కుమార్కు ఏమి చెప్పాలో అర్థం కాలేదు, అయినా ఏదో చెప్పాలని పైన ఆకాశంలోని దేవుడి దగ్గరకు వెళ్ళి పోవడం అని చెప్దామనుకున్నాడు కానీ వాడు ఫ్లైట్లో వెళ్ళాడా లాంటి ప్రశ్నలు అడుగుతాడేమోనని, "ఇది గుడిలోని దేవుడి దగ్గరకు పోయి రావటం కాదు, కనిపించని దేవుడిలో కలిసిపోయి ఇంక కనిపించకుండా పోవటం, ఇవన్నీ నీకు పెద్దయ్యాక అర్థమవుతాయి వెళ్ళు... వెళ్ళి ఆడుకోపో," అన్నాడు కుమార్. వాడికి ఏమర్థమయ్యిందో ఏమో కొంచెం సేపు అలాగే వుండి తిరిగి అడిగాడు కుమార్ని, "నీకు గ్రాండ్ పా నాన్న కదా," అని అడిగాడు, దానికి కుమార్, "అవున"ని తల వూపాడు... తర్వాత వాడు వాళ్ళ నాన్న వైపు భయంగా చూస్తూ, అయితే "మీ నాన్న నిన్ను వదిలి వెళ్ళి పోయినట్టు, నీవు కూడా నన్ను వదిలి పెట్టి వెళ్ళి పోతావా", అని అడిగాడు... అది విని కుమార్కు చాలా బాధనిపించి తల ప్రక్కకు తిప్పి కళ్ళ నీళ్ళు తుడుచుకుని, "నిన్నెందుకు వదిలి వెళ్తాను, ఏమీ వదిలి వెళ్ళన"ని చెప్పాడు. దానికి కుశాల్, "మరి మీ నాన్న నిన్నెందుకు వదిలి వెళ్ళాడు," అని అడిగాడు కుమార్ని. దానికి కుమార్, "మీ గ్రాండ్ పా ముసలివాడు అయినందుకు నడవలేక, ఏ పనులు చేస్కోలేక దేవుడి దగ్గరకు వెళ్ళి పోయాడు, అక్కడైతే మీ గ్రాండ్ పాకు అలాంటి ఇబ్బందులేవీ వుండవు," అని చెప్పాడు... దానికి కుశాల్, "అయితే నీవూ, అమ్మ ఎప్పటికీ ముసలివాళ్ళు కాకుండా నా దగ్గరే వుండాలని చెప్పి, దానికి మీరు ఇప్పటి నుండి మంచి మందులు వేస్కుంటూ వుండండి," అంటూ ఏదో పెద్ద ఆరిందలా చెప్పాడు. అప్పుడు కుమార్ మనసులోనే నేను వెళ్ళినా, మీ అమ్మైనా వుండేలా చూస్తానురా అనుకున్నాడు. నేను చాలా వయసొచ్చాక నిన్ను కని తప్పు చేసానేమోనని ఇప్పుడనిపిస్తుంది, ఎంతో పేరు, డబ్బు సంపాదించాక నాకూ నావారంటూ కావాలన్పించింది, అదీ కాక మా నాన్న కూడా పెళ్ళి, పిల్లలు అని ఎప్పుడూ అంటుంటే, నా వయసు గురించి పట్టించుకోకుండా, నీ గురించి కూడా ఆలోచించకుండా నిన్ను కన్నానని మనసులోనే బాధపడ్డాడు కుమార్. అలాగే నా తర్వాత నీకే ఇబ్బందులు రాకుండా వుండేలా ఏర్పాట్లన్నీ చేసే వుంచుతానురా అని మనసులోనే మరోసారి అనుకున్నాడు కుమార్. అలా మూడేళ్ళ కాలం తిరిగిపోయింది... ఇప్పుడు కుశాల్ పదేళ్ళ వాడయ్యాడు... వాడికి అవగాహనాశక్తి బాగా పెరిగి పోయింది. ఎన్నో విషయాలను అర్థం చేస్కోగల్గుతున్నాడు. కాలనీలోని వారు అప్పుడప్పుడూ చిన్న, చిన్న గ్రూపులుగా జూ, మ్యూజియమ్ లాంటివి చూడటానికి ఊర్లోకి పిక్నిక్లా వెళ్తుంటారు. అలాగే ఒకసారి, ప్రభుత్వపు అనుమతితో, ఊరి ప్రక్కనే వున్న కౄర జంతువులు లేని చిన్న అడవికి, అక్కడున్న జలపాతము, దాని ప్రక్కనే పారుతున్న సెలయేరును చూసి కాసేపు ఆ ప్రకృతివడిలో గడిపి రావటానికి కుమార్ కుటుంబం, కుమార్ స్నేహితుల కుటుంబాలు కలిసి వెళ్ళారు. అక్కడ జలపాతం చూస్తూ దాన్ని దాటిన కుశాల్, కుతూహలంతో ఇంకా అలాగే కాస్తా ముందుకు వెళ్ళసాగాడు, వాళ్ళమ్మానాన్నా కూడా వెనకాలే వస్తున్నారు... అకస్మాత్తుగా కుశాల్ కాలు జారింది, వెనకొచ్చే వాళ్ళమ్మను పట్టుకున్నాడు. జారిన కుశాల్ అలా జారి అక్కడే వుండి పోయాడు కానీ షాలిని వాడితో పాటూ జారి, అక్కడే వున్న పెద్ద రాయికి కాలు కొట్టుకుని ఎగిరి ప్రక్కనే వున్న పెద్ద గోతిలో పడటంతో అక్కడున్న బండరాయికి తల గుద్దుకుని చిట్లింది. అది చూసిన కుశాల్, అమ్మా! అని అరుస్తూ మూర్చపోయాడు. అక్కడే వున్న కుమార్ ఇద్దరినీ హాస్పిటల్కు తీస్కెళ్ళాడు. అక్కడ కుశాల్కు మెలకువచ్చి లేచి అమ్మా! అనగానే, అమ్మకేమీ కాలేదు అని చెప్పే లోపే, వాడికి చూసినది గుర్తొచ్చి మళ్ళీ మూర్చపోయాడు. ఇలా రెండు సార్లు జరిగాక, అక్కడి డాక్టర్లు, "కుశాల్ ఏది చూసాడో అది మెదడుకు బాగా షాక్ ఇచ్చింది. అందుకే అది గుర్తుకు రాగానే మళ్ళీ, మళ్ళీ మూర్చపోతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ముంది, దీన్ని కొంచెం సీరియస్గానే తీస్కోవాల్సి వుంటుందని చెప్పి, మేము ఈ విషయంగా వెంటనే న్యూరాలజిస్ట్ తో డిస్కస్ చేసి తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుని మీకు చెప్తాము, కాసేపు వెయిట్ చేయండి," అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకిక్కడ కుమార్ డాక్టర్ల రాక కోసం ఎదురు చూస్తూ క్షణమొక యుగంలా గడపసాగాడు. ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. కుశాల్కు డాక్టర్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలుపుతూ మరో భాగంతో మళ్ళీ కలుస్తాను. వుంటాను. ============================================================

ఇంకా వుంది



============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.







35 views0 comments

Comments


bottom of page