ప్రేమ కోసం సరసం
- Dr. C S G Krishnamacharyulu

- 1 day ago
- 4 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #ప్రేమ కోసం సరసం, #PremaKosamSarasam, #ప్రేమకథలు, #LoveStories

Prema Kosam Sarasam - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu Published in manatelugukathalu.com on 06/01/2026
ప్రేమ కోసం సరసం - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
“అఖిలా… మనం పెళ్లి చేసుకుందామా?”
“ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా, మనం ప్రేమించుకోకుండానే పెళ్లా?”
ఆమె మాటలకు శంకర్ చిన్నబుచ్చుకున్నాడు.
“అదేమిటి అఖిలా! ఒక ఏడాదిగా నీ వెంటపడి చెబుతున్నాను కదా… ఐ లవ్ యూ అని!”
“నిజమే. కానీ ఆ మాట నేను ఎందుకు అనలేదు? చెప్పనా? ఎప్పుడూ మితభాషిగానే ఉంటావు. ఒక్కరోజైనా… సరసంగా నా మనసు తాకే మాటలు చెప్పి, నన్ను సంతోషపరిచావా?”
“నువ్వు అందంగా ఉన్నావని మాటల్లో చెప్పలేక పోయానేమో, కానీ నా చూపులు ఆ నిజాన్ని ఎప్పుడూ దాచలేదు కదా?”
“చూపు చాలదు. మాట కావాలి. కాలేజీ రోజుల్లో చిరంజీవి అనే కుర్రాడు ప్రతి వారం ఒక కవిత్వం నాకు మెసేజ్ చేసేవాడు.”
“నీ కోరిక నాకు అర్థమైంది. చిరంజీవికన్నా మంచి కవిత్వం చెప్పి నీ మనసు గెలుచుకుంటాను.”
“పోటీ పడమని కాదు. సరసంగా ఉండాలన్నదే నా కోర్కె.”
“సరసమూ నేర్చుకుంటాను… కవిత్వమూ చెబుతాను. నీ మెప్పు సాధిస్తాను.” అని చెప్పి, లక్ష్యసాధన దిశగా అడుగులు వేసాడు శంకర్.
@@@
శంకర్, కాలేజ్ మాగజైనుకు కవితలు వ్రాసిన సుందరాన్ని తన గురువుగా ప్రకటించి ప్రశ్నలడిగాడు.
“సరసంగా మాట్లాడటమెలా?”
సుందరం ఇలా చెప్పాడు. సరసం అంటే గొప్ప గొప్ప మాటలు చెప్పడం కాదు. ఆమెను గమనించి, ఆమెకి నచ్చేలా మృదు స్వరంతో మాట్లాడటం, గిలిగింతలు పెట్టేలా కొంచెం సరదాగా మాటలాడటం. ఉదాహరణకి, నీ భార్య నిన్ను రోజూ అడిగే ప్రశ్న: ‘నాకీ చీర ఎలా ఉంది?’
దానికి నువ్వు రోజుకొక సమాధానం చెప్పాలి.‘మనోహరంగా ఉంది’, ‘అదిరింది’, ‘కనులకు ఇంపుగా ఉంది’, ‘దివ్యంగా ఉంది’… నాలుగు ప్రేమ కథలు చదివితే, మరింత తెలుస్తుంది.”
“సరే అర్థమైంది. మరి కవిత్వం చెప్పడం యెలా?”
“కవిత్వం అంటే యేముందిరా? నిన్ను నేను ప్రేమించాను. నీవు లేకుండా బ్రతకలేను. నీకోసమే జీవిస్తాను’ అన్న వాక్యాలను ఇలా విరిచి విరిచి చెప్పు.
‘ప్రేమించా నిన్నే, బ్రతుక లేను, నీవు లేక, జీవిస్తా నీకై.’
ఇలా మరో పది పాదాలు వ్రాసి దాని చుట్టూ పూలతో అలంకరణ చెయ్యి. మంచి పెర్ఫ్యూం జల్లు. ఆమెకివ్వు. ఆమె నీకిస్తుంది లవ్వు.”
“ఏడ్చినట్లుంది. నా ప్రేమను ముక్కలుగా విరిచేస్తుంది.”
“సరే! ఇంకో ఐడియా! చాట్ జీపీటీ నడుగు. అదే వ్రాస్తుంది. ఇదిగో చూడు.” అని చాట్ జిపిటిని ఇలా అడిగాడు. “అఖిల పైన మంచి ప్రేమ కవిత వ్రాయి.” సెకన్లలో ఇలా జవాబు వచ్చింది.
“అఖిలా… నీ నవ్వు తాకితే వసంతం వస్తుంది, నీ చూపు తగిలితే చంద్రుడు తడబడుతాడు. నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ప్రపంచం అందంగా ఉంది, నువ్వు లేని క్షణం, కవితకే అక్షరాలు దొరకవు.”
అది చదివి శంకర్, అసంతృప్తితో ఇలా అన్నాడు.“తాకితే వసంతం, చంద్రుడు తడబడటం చూసి, అఖిల ఇది చాట్ జీపీటీ పని అని కనిపెట్టేస్తుంది. దాన్నే పెళ్లాడుతానంటుంది. చాట్ జీపీటీ వ్రాయలేనిదైతే బాగుంటుంది.”
“చాట్ జీపీటీ ఛందోబద్ధమైన కవిత వ్రాయలేదు.”
“మరింకేం. అలాంటి కవిత వ్రాసే కిటుకు చెప్పు.”
“పద్యాలలో సులువైనది తేటగీతి. అది వ్రాయి. అయితే కవిత్వం వ్రాయడానికి, మంచి భావాలుండాలి. అవి తెలిపే పదాలుండాలి. వున్నాయా?”
“ఆయనే వుంటే మంగలి ఎందుకు. లేకనే ఈ తిప్పలు.”
“ఇప్పుడు నీ ముందున్నవి రెండు మార్గాలు. ఒకటి నేర్చుకోవడం, రెండవది కాపీ కొట్టడం.”
“సరే! ఎలా కాపీ కొట్టాలో చెప్పు.”
“పద్య సాహిత్యంలో తేటగీతి పద్యాలు చదువు. వాటిలో స్త్రీని వర్ణించే పద్యాలను ఎంచుకో. ఆ భావాల్ని కాస్త కలగలిపి ఒక పద్యం తయారు చేసి, మంచి పూల డిజైన్‌లో బంధించి, నీ ప్రియురాలికి కానుకగా ఇచ్చేయి.”
“కలగలుపు పద్యమా? అది అంత తేలికగా అవుతుందా?”
“అదే నీకున్న ఏకైక మార్గం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పిన ఒక జోక్ విను.
ఒక పేద విప్రుడు భోజరాజును మెప్పించి బంగారు నాణాలు సంపాదించాలనుకుని ఒక శ్లోకం వ్రాయడానికి పూనుకున్నాడట.
‘భోజనం దేహి రాజేంద్ర’ అని మొదటి చరణం,‘ఘృత సూప సమన్వితం’ అని రెండో చరణం వ్రాసాక అతనికి ఇంకేమీ తట్టలేదట.
అప్పుడతని భార్య, ‘ఏమండీ, మీరు రోజూ గాయత్రి జపం చేస్తారు కదా! అందులోంచి ఒక చరణం తీసుకోండి’ అని సూచించిందట.
ఆ బ్రాహ్మణుడు భార్య తెలివిని మెచ్చుకుంటూ,‘శహబాష్ నే భళా ముండా’ అని మూడో చరణం వ్రాసి,‘ధియో యో నః ప్రచోదయాత్’ అన్న చరణంతో శ్లోకాన్ని పూర్తి చేసాడట.”
“మార్గం చూపావుగా. ఒక మంచి పద్యం తయారు చేసి ఆమెను మెప్పిస్తాను.” అని చెప్పి, శంకర్ తెలుగు గ్రంథాలయం వైపు అడుగులు వేసాడు.
@@@
మిత్రుడి సలహా మేరకు శంకర్ సాహిత్య పఠనం మొదలు పెట్టాడు.ప్రణయం, విరహం వంటి అనుభూతులను వర్ణించిన సంభాషణలను, పద్యాలను ఆసక్తిగా చదివాడు.
నెలరోజుల అధ్యయనం తర్వాత, అతనికి సరస సంభాషణ అంటే యేమిటో అర్థమైంది. ఛందస్సు అంటే ఏమిటో స్పష్టంగా తెలిసింది. తేటగీతి నడకలను కూడా ఆకళింపు చేసుకున్నాడు.
అంతటితో సంతృప్తి చెంది, శ్రీనాథుని చాటువులలో నుంచి మూడు పద్యాలను ఎంచుకున్నాడు.ఆ పద్యాలలోని కొన్ని చరణాలను స్వల్పంగా మార్చి, ఒక కొత్త పద్యాన్ని తయారు చేశాడు.
మురిసిపోతూ ఆ పద్యాన్ని సుందరానికి చూపించాడు.
“శభాష్! దీన్ని పరీక్షించడానికి, ‘ఛందం యాప్’ అనే ఒక సాఫ్ట్‌వేర్ వుంది.” అంటూ ఆ యాప్‌ని తెరిచి, ఈ పద్యాన్ని అందులో కాపీ పేస్టు చేసి, గణించు అనే బటన్ నొక్కాడు.
ఫలితాలు చూసి, “విజయుడా! ఇంక నువ్వువెళ్ళి నీ ప్రేయసి మ్రోల నిలిచి, ఈ పద్య కుసుమాన్ని సమర్పించు.” అని అన్నాడు ఉత్సాహంగా.
@@@
మరునాడు శంకర్, అఖిలను ఆఫీసు లిఫ్టు దగ్గర కలిసాడు. నీలిరంగు చీరలో మెరిసిపోతున్న ఆమె చెంత చేరి,“సొగసైన నీలాంబరీ! నా జీవన మాధురీ! నా ప్రేమ తేటగీతి ఆలకించి, నన్ను కరుణించు.” అని ఇలా చదివాడు.
తే.గీ వన్నెచిన్నెలు చిందించు వారి జాక్షి మధురిమము లొల్కు నీ ముద్దు మాట లెపుడు కాళ్ళ పట్టీలు మెల్లగ గల్లనంగ చేరి మాటాడు సొగసైన చిన్న దాన.
అది విని పులకించిన ఆమె, ‘ఐ లవ్ యూ’ అంది.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).




Comments