top of page
Original.png

ప్రేమమందిరం

#Premamandiram, #ప్రేమమందిరం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Premamandiram - New Telugu Story Written By Dr. Brinda M N

Published in manatelugukathalu.com on 07/02/2026

ప్రేమమందిరం - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


చందన, చికీర్ష్ ఇద్దరూ సాఫ్ట్వేర్లుగా, వేర్వేరుగా కంపెనీలో పని చేస్తున్నారు. నాలుగేళ్ల పరిచయం, స్నేహంగా మారి తర్వాత ప్రేమగా పరిణితి చెందింది. పెళ్లిపీటలు ఎక్కాలని ఇద్దరూ పెద్దల్ని ఒప్పించారు.


"చందన, ఈరోజు నుండి మనిద్దరం ఒకటే. ఇరు మనసులు ఒక మనస్సుగా, ఒక తనువుగా ఉండాలి" అని ప్రమాణం చేసుకున్నారు.


"మనం పెళ్లికి ముందే మన అభిరుచులు, అలవాట్లు, ఆర్థికంగా మన సంసారాన్ని ఆనందంగా మలచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి"


"చిత్తం! మహారాణి గారు, మీ ఆజ్ఞకు బద్దుడను."


"మన ఇద్దరి తల్లిదండ్రులను కూడా మనము సమానంగా, సాదరంగా స్వాగతించాలి, తక్కువ, ఎక్కువ ఉండకూడదు సుమా!"


"చందన, నేను ముందు నుండీ నియమ నిబద్దతతోనే జీవితాన్ని కొనసాగించాను. భవిష్యత్తులో నన్ను అర్థం చేసుకునే సహచరి అన్నిటిలో తోడునీడై ఉండాలని కోరుకున్నాను తెలుసా!"


"ఓహ్! అందుకే కదా, మహాశయా,నేను వరం ఇచ్చాను" అంది సహజమైన తన చిరునవ్వుతో చందన


"ఏయ్! అల్లరి పిల్ల మనం బ్రతికున్నంత కాలం నువ్వు ఇలానే ఉండాలి. నీ దరహాసమే అతిపెద్ద సంపద. దీని ముందు వేలకోట్లు కూడా దిగదుడుపే." బుగ్గ మీద చిన్న చిటికె వేశాడు హెచ్చరింపుగా చికీర్ష్.


"చిక్కు! భవిష్యత్తులో ప్రణాళికలు, ఏమీ చేయకూడదో, ఏమి చేయాలో అన్నీ పట్టీలో రాసి పెట్టు."


"అలా ఏమీ వద్దు చందన, కాలం మన చేతిలో ఉండదు, మనమే కాలం చేతుల్లో ఉంటాం, ఆ సమయానికి తగ్గట్టుగా వ్యవహరిస్తే చాలు."


"అబ్బా! దిగివచ్చారండి వేదాంతం స్వామి గారు, రాయలేక తప్పించుకు తిరుగువారు మహిలో సుమతి అన్న పద్యాన్ని తలపిస్తున్నారు ప్రభో!"


"అదేం కాదు, నీకు కొన్ని,,,,,,,, వదిలేయ్"


"ఏంటండీ, మన ప్రేమమందిరం పదిలంగా ఉండడానికి ఇవి కూడా అవసరమే కదా!" అన్నది బుంగమూతితో


"ఏంటి! దీనికి ఇప్పుడు పని అప్పచెప్పాలా?"


"వద్దు, వద్దు, దూరం,,,,, దూరం" రివ్వున వెళ్లిపోయింది.


"చందన, ఎలాగూ మూడు నెలల పాటు ట్రైనింగ్ కి వెళ్తున్నావు కదా, ఆ తీపిగుర్తుని అప్పుగా ఇవ్వొచ్చుగా!"


"ఆ,,,,ఆ పప్పులేవి ఉడకవు. టైంకి భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి."


"మీ ఆరోగ్యము జాగ్రత్త"


ఇలా అప్పుడప్పుడు పెద్దవారి అనుమతి తీసుకుని ముచ్చటించడం పరిపాటే. కాల ప్రవాహం తన పని తాను చేసుకోవడం అలవాటే కదా! అనుకోకుండా ఒక రోజు ఉపద్రవం వచ్చి పడింది. పెద్ద యాక్సిడెంట్ జరిగి చికీర్ష్ కళ్ళకు బాగా దెబ్బ తగిలింది.

ఆస్పత్రిలో పరీక్షలన్నీ చేసిన పిదప బయటపడింది చికీర్ష్ కు చూపు పోయిందని. చందన తల్లిదండ్రులు వచ్చి చూసి పరామర్శించి వెళ్లిపోయారు. ట్రైనింగ్ లో బాగా బిజీగా ఉండడం చేత నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసింది చికీర్ష్ కు, వారి తల్లిదండ్రులకు సమాధానం లేదు.


"అమ్మ, ఏమైంది? ఎలా ఉన్నారు? చికీర్ష్ ఫోన్ ఎత్తట్లేదు. ఇంటి దగ్గరకు రాలేదామ్మా?"


"లేదమ్మా! అబ్బాయి కూడా ఏదో అర్జెంటు పని మీద ఊరికి వెళ్ళారంట."


"నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లడు. ఏదో నా మనసు ఒకలా ఉందమ్మా."


"అబ్బా! ఎందుకే అంత పట్టు, చేస్తాడులే"


తల్లి ఏదో దాస్తోందని గ్రహించిన చందన ఆ కంపెనీ మేనేజర్ కి ఫోన్ చేసింది. విషయం విన్న చందన కుప్పకూలిపోయింది, నోట మాట రాలేదు. కొన్ని గంటల అనంతరం ఇంటికి ఫోన్ చేసి తల్లిని నిలదీసింది బాధతో


" చందన ఆ రోజే ఆసుపత్రిలో చికీర్ష్ ను చూసి బయటికి వస్తుండగా వారి అమ్మ నీ వల్లనే తన కొడుక్కి ఇలా అయిందని, ఇలాంటి ముదనష్టపు దాన్ని చేసుకుంటే, కొడుకే కాటికి పోతాడని, ఇక మన మధ్య వియ్యం కల్ల గుర్తుంచుకోండని ఘాటుగా చెప్పిందమ్మా. అది విన్న తర్వాత నేను నాన్న, అన్నయ్య నీకు విషయం చెప్పకూడదని అనుకున్నాం అంతే."


"అమ్మ మళ్లీ మాట్లాడుతాను" అంది కంటనీరు ఆగకుండా ప్రవహిస్తూ ఉంటే చందన


డాక్టర్ల సలహా మేరకు చికిత్స కొరకు అమెరికా పంపించారు పెద్దలు. అక్కడే ఆసుపత్రి వారే అన్ని చర్యలు తీసుకుంటారని సపర్యలు చేస్తారని చెప్పడంతో మానసికంగా కృంగిపోయిన చందన ట్రైనింగ్ తర్వాత కంపెనీకి వెళ్లలేకపోయింది.


"అన్నయ్య! నాకు వీసా ఏర్పాటు చెయ్, నేను కూడా అమెరికాకు వెళ్లి అక్కడే కంపెనీలో జాయిన్ అవుతాను."


"ఒసే నీకు పిచ్చా, వారి పెద్దలు నిన్ను వద్దంటున్నా, నువ్వు కావాలనుకోవడం మూర్ఖత్వం" తల్లి మందలింపు


"నీకు రాజాలాంటి సంబంధం రెడీగా ఉందమ్మా, చక్కగా పెళ్లి చేసుకుని మా కళ్ళముందు తిరుగుతుంటే ఆ ఆనందం చాలు తల్లి" నాన్న బుజ్జగింపు


"గుండెలో పెట్టుకోవాల్సిన వాడు గుడ్డివాడయ్యాడు, అలాంటి వాడితో ఎలా కాపురం చేస్తావమ్మా, గుడ్డివాడితో నీ జీవితం అంధకారం అవుతుంది." అన్నయ్య చీత్కారం


"మీకందరికి ఒకటే ప్రశ్న, పెళ్లయిన తర్వాత తనకు ఇలా జరిగి ఉంటే లేక ఆ దారుణం నాకే జరిగి ఉంటే మీరు ఇలా చెప్పేవారా?"


ఒక్కసారిగా ఇంటిలో మౌనం తాండవించింది. చందన అంతరార్ధాన్ని అర్థం చేసుకుని అందరూ సరేనన్నారు. అన్నయ్య కూడా తోడుగా వెళ్లి కంపెనీలో చేరిన తర్వాత చందనకు అక్కడ అన్ని విధాలా బావుంటుందనుకున్న పిదప ఇండియాకు వచ్చాడు. ఎంతో కష్టపడి చికీర్ష్ చిరునామా సంపాదించింది. కంపెనీ వారితో మాట్లాడి వర్క్ ఫ్రొం హోమ్ చేస్తానని అనుమతి తీసుకుంది. ఆసుపత్రి అధికారులతో తన విషయాన్ని కూలంకషంగా వివరించి, గోప్యంగా ఉంచమని వేడుకుంది.


"అయ్యా నీకు కూతుర్లాంటి దాన్ని ఇక ఆయనకు సపర్యలన్నీ నేనే చేస్తాను," చికీర్ష్ ను చూసుకునే పెద్దాయనను అర్థించింది


"అమ్మ, దీనితో వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా కడుపు కొట్టకమ్మ"


"అయ్యా జీతం నేనే ఇస్తాను, నాకు చిన్న చిన్న పనులకు తోడుగా ఉండండి చాలు"


చికీర్ష్ ఇంట్లో మూగ హోం మేకర్ గా చేరింది చందన. ప్రొద్దున పళ్ళు తోమడం మొదలు స్నానం చేయించడం అల్పాహారం, భోజనం, రాత్రి ఔషధ సేవనం వరకు అన్ని తానే ప్రేమతో మర్యాదపూర్వకంగా చేసింది చందన. నరాలు బాగా దెబ్బతినడం వలన చికీర్ష్ మాటలు కొద్దికొద్దిగా మాట్లాడేవాడు, మధ్యలో పెద్దాయన మాటలు కలుపుతూ ఇద్దరినీ సమన్వయం చేసేవాడు. జాగురూకతతో చందన చేతులకు గ్లోవ్స్ కూడా ధరించేది. చికీర్ష్ కోసం బ్రెయిలీలిపి కూడా నేర్చుకుంది. అంతేకాక తనకు కూడా నేర్పించింది పెద్దాయన సహకారంతో. నాలుగేళ్లు గడిచిపోయాయి అయినా చికీర్ష్ కోలుకోలేకపోయాడు పూర్తిస్థాయిలో.

ఓ రోజు నవ్వుతూ అడిగాడు పెద్దాయన


"బాబు, మీరేమీ అనుకోకపోతే ఓ చిన్న మాట చెప్తాను. బిజినెస్ పేరుతో మీ పెద్దవారు బిజీ అయ్యి ఇటువైపు తిరగలేదు, ఫోన్లో మీ గురించి అడగడం తప్ప, ఈ మూగ పిల్ల ఇన్నేళ్లుగా సేవ చేస్తోంది కదా, పెళ్లి చేసుకోరాదా బాబు"


"తాత, ఇన్నేళ్లు మీ పెద్దరికానికి మర్యాదనిచ్చాను. దాన్ని కాపాడుకోండి. ఎప్పుడు ఇలాంటి ప్రస్తావన తీసుకురాకండి. అంతగా అయితే ఆ పిల్లకు మంచి సంబంధం చూడండి. నేనే దగ్గర ఉండి సకల లాంఛనాలతో పెళ్లి చేసి పంపుతాను." బాధ నిండిన కోపంతో చికీర్ష్


"అది కాదు బాబు, మిమ్మల్ని నమ్ముకుని,,,,,,"


"ఆపండి! నేను రమ్మన్నానా? సేవ చేయమన్నానా? మీరే ఎవరూ లేరని పిలుచుకొచ్చారు, అయినా ఒక సిస్టర్ పేషెంట్ కు సేవ చేస్తుందనే భావనతోనే చూశాను, ఇక వాదించకండి, నేను ఇలాగే ఉంటాను, అంతే" అన్నాడు దుఃఖం తన్నుకొస్తుంటే.


కొన్ని ఆవేశాలు, కోపాలు కూడా మంచి చేస్తాయేమో అన్న చందాన ఒక్కసారిగా కళ్ళు పటపట కొట్టేశాడు, మసక మసకగా అనిపించింది. పెద్దాయన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.


"వండర్ఫుల్, వండర్ఫుల్, వాట్ ఏ సర్ప్రైజ్! వి ఆర్ ఈగెర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్."

వెంటనే ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు


"అయ్యో! తాత ఎంత పని చేశావు ఆయన ప్రాణానికి ఏమైనా జరిగితే" బాధపడింది చందన


"ఆపరేషన్ సక్సెస్ బట్ అప్ టు టూ డేస్ వి హావ్ టు వెయిట్" అన్నారు డాక్టర్లు.


చందన దేవుని ముందే దీక్ష చేపట్టింది. ప్రేమ పరీక్షలో నెగ్గడం అంత సులభం కాదు కదా మరి, మూడు రోజుల అనంతరం కట్లు విప్పబోతున్నారు.


"మిస్టర్ చికీర్ష్ ! వాట్ డు యు వాంట్ టు సీ ఫస్ట్"


"ప్లీజ్! వెయిట్ డాక్టర్, తాత నేను వచ్చిన మొదటి రోజున ఒక వాలెట్ ఇచ్చాను. అది ఇవాళ తీసుకురమ్మన్నాను, తెచ్చారా?"


"ఆ బాబు,,,,, ఆ బాబు తెచ్చాను"


"ఎస్ డాక్టర్, నౌ యు కెన్ రిమూవ్"


మెల్లగా కళ్ళు తెరచి వాలెట్లోని చందన ఫోటో చూశాడు మొదటగా, అక్కడున్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాతకు అంతా అర్థం అయింది. ఇంటికి వచ్చిన వెంటనే తనకు సేవ చేసిన పిల్లకు సారె ఇచ్చి పంపాలని నిశ్చయించుకున్నాడు, కానీ చందన వారి అమ్మ ఆరోగ్యం బాలేనందున హుటాహుటిన వచ్చేసింది. పెద్దాయన చికీర్ష్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు, వారు వెంటనే వాళ్ళ నాన్నగారి అసిస్టెంట్ను పంపించారు, తనకు సేవ చేసిన పిల్లకు కృతజ్ఞతలు చెప్పడానికి అవకాశం లేనందున విపరీతంగా బాధపడ్డాడు చికీర్ష్.


"తాత, ఇదిగో ఇవన్నీ ఆ పిల్లకు ఇవ్వండి తన పెళ్లికి నేను కచ్చితంగా వస్తాను"


ఆస్పత్రి అధికారుల ద్వారా విషయాన్ని అడిగి తెలుసుకుంది చందన. తాతకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపింది. వీలు చూసుకుని వస్తానని చెప్పింది. చికీర్ష్ తల్లిదండ్రులు పెళ్లి సంబంధం ఖాయం చేశారు. తను వద్దంటున్నా వినలేదు.


"ఏంట్రా! నీకు చూపు పోయిందని తెలిసిన వెంటనే వాళ్ళ పెద్ద వాళ్ళు పెళ్లి చేసి పంపించారు. ఇంకా బుద్ధి రాలేదా? ఇన్నేళ్లుగా ఒక్కసారైనా నీ దగ్గరకు వచ్చిందా? ఫోన్ చేసిందా? మరి ఎందుకు ఆరాటం" తల్లి గాండ్రింపు


"అమ్మ! చందన గురించి బాగా తెలుసు తన వ్యక్తిత్వం చాలా గొప్పది."


"నువ్వు అనుకుంటే సరిపోదు, అవతలి వారికి ఉండాలి"


"నాన్న! నిజమా చెప్పు,,,,, చెప్పు నాన్న చెప్పు!" తండ్రి అవునన్నట్టు తలూపాడు.

చికీర్ష్ కు నమ్మకం కలగలేదు. చందన వారి ఇంటికి వెళ్ళాడు. ఇరుగుపొరుగు వాళ్ళు ఇల్లు మారారు అడ్రస్ తెలియదన్నారు, కంపెనీ వారు, స్నేహితులు, ఎవ్వరూ తెలియదన్నారు. మనసులో శంకతోనే పెళ్లికొప్పుకున్నాడు అయిష్టంతో. పెళ్లి పత్రికలు పంచారు. శుభఘడియ రానే వచ్చింది. మంగళసూత్ర ధారణ జరగబోతోంది.


" ఒక్క నిమిషం ఆగండి, మిస్టర్!"అన్న గంభీర స్వరం వినిపించింది. అందరూ ఒక్కసారి ఆశ్చర్యంతో తలతిప్పారు.


" మీరు ఆపరేషన్ తర్వాత చూసిన ముఖం, ఈ ముఖం వేర్వేరుగా ఉందే? ఆమెను ఎందుకు చూశారు? ఈమెను ఎందుకు వివాహం చేసుకుంటున్నారు?" అన్నది ఆ స్వరం


మౌనం కూడా అతి భయంకరంగా ఉంటుందని దానికి నిదర్శనం ఈ సంఘటన. తల్లిదండ్రులు మాట్లాడబోతుంటే వారించాడు ఆయన


"కమాన్ స్పీక్ ఔట్" చికీర్ష్ నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాడు


"శభాష్! గ్రుడ్డివాడైన కొడుకును గొడ్డులాగా అమెరికాలో కట్టేసి, బిజినెస్ పేరుతో సమయం లేదని చెప్పుకుంటూ, కొడుకు ముఖం చూడలేని వారు, అనుకున్న సంబంధం ఆవిరై పోయిందన్న అబద్ధపు అలంకారాన్ని జోడించి, కళ్ళు వచ్చాక కట్నం కోసం కలవారి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటుంటే, ప్రేమించిన వాడితోనే పది కాలాలపాటు పచ్చగా ఉండాలనుకున్న అమ్మాయి గ్రుడ్డివాడైనా, కుంటివాడైనా తన జీవితం నాతోనే అనుకుంటూ, మూగదానిలా మారి మమతానురాగాలు పంచి, సెకను కూడా వృధా చేయకుండా సపర్యలు చేసి, కంటిచూపు తెప్పించి తన ప్రాణం బాగుంటే చాలునని, ప్రేమించినవాడి తల్లిదండ్రులను దూరం చేసే పాపం తనకు వద్దని, తనతో గడిపిన క్షణాలే జీవితానికి చాలునని, ఒంటరిగా మిగిలిపోయిన ఆ అపురూప త్యాగ మూర్తిని తోసి పారేస్తుంటే తట్టుకోలేక వచ్చానండి ఇక్కడికి! చికీర్ష్, ఇదిగో ఈ ఫోటో ఆమె, నీకు సేవ చేసిన మూగపిల్ల, చూడు బాగా,,,, చూడు వీరిద్దరూ ఒక్కరే బాబు."


"చంద,,,,,,, నా" ఆనందమాశ్చర్యం అద్భుతంతో పలికాడు


" అవును బాబు, ఇది నిజం, ఇదే సత్యం" తాత వంత పాడాడు


చికీర్ష్ కు ఏమీ అర్థం కాలేదు. ఆరోజున ఆపరేషన్ అయిన తర్వాత తెలుగు అధికారికి తాత విషయం చెప్పాడు. బిజినెస్ మాన్ రూములో ఉన్నట్టుండి పెళ్లిపత్రిక చూసిన అధికారి తాతను, చందనను వెంటబెట్టుకు వచ్చాడు. చికీర్ష్ తల్లిదండ్రులు తలదించుకున్నారు. చందన మాతాపితరులు తన కూతురు అందనంత ఎత్తుకు ఎదిగిపోయిందని సంతోషించారు. ఇక భాజా భజంత్రీలు మ్రోగించండి అంటుంటే


"చందన! ఎందుకు ఇంత త్యాగానికి ఒడిగట్టావు?"


"చికీర్ష్ ! ప్రేమ నమ్మకానికి పునాది. మనం ప్రమాణం చేసుకున్న రోజే సర్వస్వం, నాతిచరామి అనుకున్నా. జీవితాంతం తోడునీడగా కలిసి ఉండాలని అనుకున్నాము. మన ప్రేమమందిరాన్ని ఆప్యాయత, అనురాగాలతో నిర్మించుకున్నాం. ఇప్పుడు ఆత్మీయతతో పంచుకుందాం. నువ్వే నా సంపద." అమాంతంగా ఎత్తుకుని వచ్చాడు పీటలపైకి చికీర్ష్. ఆనంద క్షణాల్ని కళ్ళతో కట్టేసింది చందన.


నీతి: భార్యాభర్తలకు ఉండవలసినది అర్ధనారీశ్వర తత్వం. నిజమైన ప్రేమకు పునాది నమ్మకం. నాకు నీవు నీకు నేను అన్నదే సర్వస్వం. ఇలా మసలిన జీవితాలకు విడాకులు వారధి కావు, కాలేవు.


 "జై తెలుగుతల్లి! జై భరతమాత"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page