రామదండు కదిలింది
- Sathyanarayana Murthy M R V
- 12 hours ago
- 7 min read
#రామదండుకదిలింది, #RamadanduKadilindi, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ramadandu Kadilindi - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 16/05/2025
రామదండు కదిలింది - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శివపురం పంచాయతీ కార్యాలయం దగ్గర ప్రజలు సమావేశం అయ్యారు. ఉదయం గుడిమీద ఉన్న మైకులో చెప్పారు, సాయంత్రం అయిదు గంటలకు పంచాయతీ కార్యాలయం దగ్గర జరిగే సమావేశానికి అందరూ రావాలని. ఏ విషయం గురించి చెబుతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కార్యాలయం ముందు ఒక టేబుల్, నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి. అందులో సర్పంచ్ రాములమ్మ, బ్యాంకు మేనేజర్ బాబ్జీ, రిటైర్డ్ మాస్టారు రామ్మూర్తి, పంచాయతి కార్యదర్శి రమణారావు కూర్చున్నారు. “మాస్టారు రామ్మూర్తి గారిని సభ నడిపించవలసిందిగా కోరుతున్నాను” అని చెప్పారు కార్యదర్శి రమణారావు.
మాస్టారు లేచి మైకు దగ్గరకు వచ్చి “అందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా ఎన్నడూ లేనిది యుద్ధాన్ని మనం టి. వి. లలో, పేపర్లలో చూస్తున్నాము. ముందుగా ఏప్రిల్ నెలలో కాశ్మీర్లోని పెహల్గం సుందర ప్రదేశాలు చూడటానికి వెళ్లి, ఉగ్రవాదుల మారణకాండకు బలి అయిపోయినవారి కోసం, తర్వాతా జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన మన తెలుగు తేజం నాయక్ ఆత్మశాంతి కోసం రెండు నిముషాలు మౌనం పాటిద్దాం” అని అన్నారు.
అందరూ లేచి నిలబడి మౌనం వహించారు. సమయం అయ్యాకా మాస్టారు “కూర్చోండి” అని చెప్పగానే అందరూ కూర్చున్నారు.
“బ్రిటిష్ వారి పాలన ముగిసాక మనం, పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాము. మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత గానీ మనం స్వాతంత్ర్యం పొందలేక పోయాము. కొంత కాలానికి పాకిస్తాన్ నుండి విడివడి బంగ్లాదేశ్ ఏర్పడింది. మనం ఎంతో శ్రమించి వైజ్ఞానికంగా, ఆర్ధికంగా ఎదిగాం. ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడ్డాం. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ గారి నాయకత్వంలో అగ్ర దేశాలతో అన్ని రకాలుగా పోటీపడ్తూ ముందుకు సాగుతున్నాము. ఇది మన దాయాది దేశానికి ఈర్ష్య కలిగిస్తోంది. అందుకే మన దేశాన్ని అస్తిరపరచాలని ఎన్నో సంవత్సరాలనుండీ కుతంత్రాలు పన్నుతోంది. మన దేశంలో అలజడులు సృష్టిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతోంది.
మన భారతదేశం ఎప్పుడూ శాంతినే కాంక్షిస్తోంది. అది అలుసుగా తీసుకుని తరుచూ కాశ్మీర్ గురించి అనవసర వివాదాలు సృష్టిస్తూ మనల్ని ఎంతో చీకాకుపరుస్తోంది. కాశ్మీర్ మీద దండెత్తి కొంత భూబాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి మన పెద్దల నిర్లక్ష్యమో, అతి మంచితనమో మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము.
మన దాయాదిదేశం ఎప్పుడూ ఉగ్రవాదుల్ని పోషిస్తూ మన దేశంలో అల్లర్లు సృష్టిస్తూ మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతోంది. గత ఏప్రిల్ లో కాశ్మీర్ అందాలు చూడటానికి వెళ్ళిన పర్యాటకుల్ని పెహేల్గాంలో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. అమాయకులైన మన వారిని చంపినందుకు మన ప్రభుత్వం పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి, వాళ్ళ దేశంలో ఉంటూ మనపై దాడులకు దిగుతున్న ఉగ్రవాద స్థావరాలమీద దాడి చేసి కొంతమంది ఉగ్రవాదుల్ని నిర్మూలించడం జరిగింది.
‘ఇదే ఆపరేషన్ సింధూర’. దీనికి సారధ్యం వహించిన వారు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మిభాయి, రాణి రుద్రమదేవిలా వీరు ఇరువురూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి మన కోసం పోరాడారు. దీనికి మన దేశం మొత్తం వారికి మద్దతు తెలిపింది, జేజేలు పలికింది. కానీ పాకిస్తాన్ మన దేశం లోని అమాయక ప్రజలమీద, ప్రజల ఆస్తులమీద దాడి చేసింది.
దానికి ప్రతిగా మన సైన్యం శత్రుదేశం విమానాల్ని కూల్చివేయడమే గాక, వారి స్తావరాల్ని నిర్దూమదామం చేసింది. అసలే ఆర్ధిక సంక్షోభంలో, అనేక సమస్యలతో ఉన్న పాకిస్తాన్ మరి కొన్ని రోజులు యుద్ధం సాగితే తాము పూర్తిగా ఓడిపోవడం ఖాయం, అని గ్రహించి ‘కాల్పుల విరమణ’ కోసం అమెరికాని ఆశ్రయించింది. అమెరికా దౌత్యంతో మనం కూడా కాల్పుల విరమణకి అంగీకరించాం.
అయితే పాకిస్తాన్ మనపై చేసిన దాడిలో దేశం కోసం పోరాడుతూ మన తెలుగు తేజం, నాయక్ వీర మరణం పొందారు. ఈరోజు నాయక్ అంత్యక్రియలలో మన మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఆయన తల్లి తండ్రులను ఓదార్చారు. ” మాస్టారు ఒక క్షణం ఆగారు.
సర్పంచ్ రాములమ్మ మంచినీళ్ళ సీసా మాస్టారికి అందించింది. కొద్దిగా మంచి నీళ్ళు తాగి మరలా చెప్పడం ప్రారంభించారు మాస్టారు.
“మనం ఆదరం ఈరోజు ఇలా సుఖంగా ఉన్నామంటే కారణం ఇద్దరు. ఒకరు స్వాతంత్ర సమరయోధులు. రెండు సరిహద్దుల్లో మన కోసం, అయిన వాళ్ళు అందరినీ విడిచి కాపలా కాస్తున్న మన సైనికులు. వారికి మనం ఎప్పుడూ రుణపడిఉంటాము. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న మాధవరం చాలా గొప్ప గ్రామం. ఎందరో మహానుభావులు అక్కడ జన్మించారు.
భారతదేశం కోసం శ్రమించిన, శ్రమిస్తున్న ఎన్నో కుటుంబాలు అక్కడ ఉన్నాయి. ప్రతీ కుటుంబం నుండి ఒకరు మిలటరీలో చేరి దేశసేవ చేస్తున్నారు. అందుకే ఆ గ్రామాన్ని ‘మిలటరీ మాధవరం’ గా పిలుస్తారు.
మన గ్రామము నుండి ఒక్కరు కూడా మిలటరీలో చేరినవారు లేరు. నాకు ఒక్కతే అమ్మాయి. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపించి ఇరవై సంవత్సరాలు అవుతున్నాయి. నాకు కొడుకు ఉంటె బహుశా మిలటరీకి పంపేవాడినేమో. ప్రస్తుతం నా వయసు డెబ్భై రెండు సంవత్సరాలు. మేము సలహాలు ఇవ్వడం తప్పితే ఏమి చేయగలము. అందుకే యువతని చేతులెత్తి ప్రార్ధిస్తున్నాను. మన గ్రామం నుండి కూడా ఎవరైనా మిలటరీలో చేరి దేశసేవ చేయమని.
నాది ఇంకో మనవి. దేశం కోసం, మన కోసం పోరాడి వీర మరణం పొందిన నాయక్ కుటుంబానికి మనం సాయం చేయాలని. ఎవరికీ తోచిన సాయం వారు చేద్దాము. నాకు నెలకు నలభై వేలు పెన్షన్ వస్తోంది.
ఈ నెలలో ఇప్పటికి పదిహేను వేలు ఖర్చు చేసాను. మిగిలిన ఇరవై అయిదు వేలు నాయక్ కుటుంబం సాయం కోసం ఇస్తున్నాను” అని పక్కనే ఉన్న బ్యాంకు మేనేజర్ గారికి ఇచ్చారు మాస్టారు.
పంచాయతీ కార్యదర్శి కాగితం మీద మాస్టారి పేరు, వారు ఇచ్చిన సొమ్ము వివరం రాసాడు. సర్పంచ్ సూచనతో ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్ తెచ్చి అక్కడ పెట్టాడు పంచాయతీ జవాను.
బ్యాంకు మేనేజర్ బాబ్జీ “మాస్టారు మంచి విషయాలు చెప్పారు. సైనికుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. మన కోసం వారు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. వారిని ఆడుకోవడం మన విధి. నా వంతుగా నేను పదిహేను వేలు ఇస్తున్నాను” అని కార్యదర్శి రమణారావు కి చూపించి, తన డబ్బు, మాస్టారు ఇచ్చిన డబ్బు బకెట్ లో పెట్టారు బాబ్జీ. సర్పంచ్ రాములమ్మ ఒకసారి తన చేతులకేసి చూసుకుంది. వెంటనే లేచి మైకు దగ్గరకు వచ్చింది.
“మీ అందరికీ నమస్కారం. నేను వ్యవసాయ కూలీని. మాష్టారు పట్టుపట్టి నన్ను సర్పంచ్ గా పోటీ చేయించి గెలిపించారు. నా కష్టార్జితంతో రెండు బంగారు గాజులు చేయించుకున్నాను. ఇవి నా చేతిని అలంకారంగా ఉండడం కంటే, ఒక కుటుంబాన్ని ఆదుకోవడంలో సాయపడితే నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ రెండు గాజుల్ని ఈ మహా కార్యక్రమంలో వినియోగించవలిసినదిగా కోరుతున్నాను” అని తన చేతికున్న రెండు బంగారు గాజులు తీసి బకెట్లో పెట్టింది రాములమ్మ. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు.
రాములమ్మ మళ్ళీ చెప్పింది “మేము ఎదో ఎక్కువ ఇచ్చామని మీరు వెనుకంజ వేయవద్దు. మీకు తోచినది వంద రూపాయలు అయిన, చివరకు పది రూపాయలు అయినా ఇవ్వవచ్చు. ఈ మహా యజ్ఞం లో మనం అందరం పాలు పంచుకుందాం. వారి కష్టం మన కష్టంగా భావిద్దాం”
కార్యదర్శి రమణారావు వేయిరూపాయలు ఇచ్చాడు. మీటింగ్ కి వచ్చిన వారు ఒక్కక్కరే వేదిక మీదకు వచ్చి తమకు తోచినది ఇస్తున్నారు. కార్యదర్శి వారి పేరు రాసుకుంటున్నాడు. డెబ్భై ఏళ్ల గంగవ్వ.
చేతికర్ర సాయంతో అక్కడికి వచ్చింది. “నాకు వచ్చిన పెన్షన్ లో పదిహేను వందలు ఖర్చు అయ్యాయి. మూడువేలు ఇస్తున్నాను తీసుకోండి. నిన్ననే కోటా బియ్యం కూడా తీసుకున్నాను. ఈనెల ఫరవాలేదు. అయినా నాకు ఒక పూట తిండి కావాలంటే మీరు పెట్టరా, ఏమిటి?” అని నవ్వుతూ మూడువేలు తీసి ఇచ్చింది. జనం మరోసారి చప్పట్లు కొట్టారు. రాములమ్మ లేచి గంగవ్వ కాళ్ళకు దణ్ణం పెట్టింది.
జనం విరాళాలతో బకెట్ సహం నిండింది. ఈలోగా ఏడవతరగతి చదువుతున్న కిరణ్ ఆయాసపడుతూ అక్కడికి వచ్చాడు. “అంకుల్. నేను క్రికెట్ బాట్ కొనుక్కోవాలని కిడ్డీ బ్యాంకు లో దాచుకున్నాను. ఈ డబ్బులు తీసుకోండి” అని కొన్ని నోట్లు రమణారావు కి ఇచ్చాడు. ఆయన అవి లెక్క పెట్టాడు. అయిదు వందల ఏభై ఉన్నాయి. ఆ సంఖ్య ఆయన మైకులో చెప్పగానే అందరూ మరోసారి చప్పట్లు కొట్టారు. బ్యాంకు మేనేజర్, కిరణ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. ఇంతలో నర్సు రమణి వచ్చి, “మాస్టారూ నా కొడుకు టౌన్ లో డిగ్రీ చదువుతున్నాడు. వాడి చదువు అవగానే వాడిని తప్పకుండా మిలటరీ కి పంపుతాను” అని చెప్పింది. అందరూ చప్పట్లు కొట్టి ఆమెని అభినందించారు.
అరగంట గడిచాకా పెద్ద పెద్ద మీసాలు ఉన్న నాగరాజు వేదిక దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాములమ్మ కంగారు పడింది, ఏం గొడవ చేస్తాడా అని. నాగరాజు పక్కా తాగుబోతు, రౌడీ. ఈ బకెట్ లాక్కుపోతాడా ఏమిటి? అని కార్యదర్శి కూడా ఆందోళన పడ్డాడు.
“మీరు ఏం కంగారు పడకండి. నేను ఏమీ గొడవ చేయడానికి రాలేదు. నేను ఇంకా సారా దుకాణానికి వెళ్ళలేదు. ఈరోజు పెద్దరెడ్డి గారి ఇంటి దగ్గర ఇటుకలు మోసాను. ఆరువందలు కూలీ ఇచ్చారు. అవి మీకు ఇద్దామని వచ్చాను” అని జేబు లోంచి ఆరు వందలు తీసి కార్యదర్శికి ఇచ్చాడు నాగరాజు. మాస్టారు, బ్యాంకు మేనేజర్ ఇద్దరూ కూడా నాగరాజు భుజం తట్టి అభినందించారు.
రాములమ్మ “అన్నా, నీ సాయం చాలా గొప్పది” అని దణ్ణం పెట్టింది. చిరునవ్వు నవ్వుతూ వెళ్లి కూర్చున్నాడు నాగరాజు. బకెట్ చాలా భాగం విరాళాలతో నిండింది. బ్యాంకు మేనేజర్, కార్యదర్శి రమణారావు డబ్బు లెక్క పెట్టడం మొదలుపెట్టారు.
మాస్టారు లేచి “ మనం ఈ డబ్బు స్వయంగా అమర జవాను కుటుంబానికి ఇచ్చి, మీకు మేము అండగా ఉంటామని చెబితే బాగుంటుంది. దానికి తగిన ఏర్పాట్లు రేపు చేసుకుని, ఎల్లుండి ఉదయం బయల్దేరదాము. ఏమంటారు?” అని అడిగారు. అందరూ దానికి అంగీకరించారు. ఈలోగా విరాళాల లెక్క పూర్తీ అయ్యింది. నాలుగు లక్షల, ఇరవై వేల రూపాయలు వచ్చాయని, రాములమ్మ బంగారు గాజులు కాకుండా, అని చెప్పారు బ్యాంకు మేనేజర్.
రాములమ్మ కోరిక మీద మర్నాడు ఆ బంగారు గాజులు మార్కెట్లో అమ్మి, ఆ సొమ్ము కూడా జమ చేస్తానని మేనేజర్ చెప్పారు. మొత్తం సొమ్ము, కార్యదర్శి సర్పంచ్ ల సహకారంతో బ్యాంకు లో భద్రపరిచారు మేనేజర్. మర్నాడు రాములమ్మ గాజులు మార్కెట్లో అమ్మగా, ఎనభై రెండు వేలు వచ్చాయి. మొత్తం అయిదు లక్షల రెండువేలు విరాళాల రూపంలో వచ్చాయని మేనేజర్ చెప్పారు.
మంగళవారం ఉదయమే శివపురం నుండి రెండు లారీలు, రెండు ట్రాక్టర్లు, ఒక మినీ వాన్, అయిదు వాహనాలలో ప్రజలు అమర జవాను ఊరికి బయల్దేరారు. పెద్దరెడ్డి గారు అందరికీ సాంబారు అన్నం, పెరుగు అన్నం పాకెట్లలో తయారు చేసి ఇచ్చారు. రాములమ్మ, మాస్టారు అందరికీ కావాల్సిన ఉప్మా తయారుచేయించారు. షావుకారు చలమయ్య రెండు వందల బిస్కట్ పాకెట్లు, రెండు వందల వాటర్ పాకెట్లు ఇచ్చాడు. బ్యాంకు మేనేజర్ అందరికీ కూల్ డ్రింక్ బాటిల్స్ ఇచ్చారు. ఎండా తగలకుండా వాహనాలకు ‘గూడులు’ కట్టారు. కూర్చోడానికి వీలుగా వాహనాలలో పరుపులు ఏర్పాటు చేసారు కార్యదర్శి రమణారావు.
శివపురం నుండి ఆ ఊరు వెళ్ళడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. నాగరాజు కూడా వారితో వచ్చాడు. అతను రెండు రోజుల నుండీ సారా తాగడం లేదు. ప్రయాణం రెండున్నర గంటలు గడిచాకా వాహనాలు ఒకచోట ఆపి అందరూ ఉప్మా తిన్నారు. తర్వాత వ్బాహనాలు బయల్దేరాయి.
‘భారత్ మాతా కి జై’ ‘నాయక్ అమర్ రహే’ అంటూ వాహనాలలోని జనం జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తన కాంప్ కార్యాలయంలో లాప్ టాప్ లో ముఖ్యమైన సమాచారం చూసుకుంటున్నారు. కలెక్టర్ పి. ఏ. గబ గబా ఆయన దగ్గరకు వచ్చి “సార్ ఈ వీడియో చూడండి” అని తన సెల్ ఫోన్ ఆయన ముందుంచాడు. శివపురం ప్రజల వాహనాలు, జాతీయ జెండాలు చేతబూని వారు చేస్తున్న నినాదానాలు చూసి “ఏమిటిది?” అడిగారు కలెక్టర్.
“మనకి చాలా దూరంలో ఉన్న శివపురం గ్రామం ప్రజలు, మన జిల్లాకి చెందిన అమర జవాను కుటుంబానికి సంఘీభావం తెలపడానికి వస్తున్నారు సార్. మీడియా వాళ్ళు దీన్ని కవర్ చేసి పోస్ట్ చేసారు సార్. వీరిలో ఇరవై మంది స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు సార్ ” అన్నాడు వినయంగా పి. ఏ.
“ఓహ్.. చాలా గ్రేట్. సైనికుల త్యాగాన్ని గుర్తించారు వారు. అక్కడ మన తహసిల్దారుకి చెప్పండి, వస్తున్నవాళ్లు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని. నేను ఒక పావుగంటలో రెడీ అవుతాను. మనం అక్కడకి వెళ్దాం” అని లోపలకు వెళ్ళారు కలెక్టర్. వెంటనే పి. ఏ. అక్కడి తహసిల్దారుకి ఫోన్ చేసి కలెక్టర్ గారు చెప్పిన విషయం చెప్పారు.
శివపురం ప్రజల వాహనాలు నాయక్ గ్రామం చేరుకోగానే గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు. అందరూ వాహనాలు దిగి వారితో కలిసి నాయక ఇంటికి వెళ్ళారు. అప్పటికే జిల్లా కలెక్టర్, పోలీసులు, తహసీల్దార్, పత్రికా విలేకర్లు అక్కడికి వచ్చి ఉన్నారు. మాస్టారు కలెక్టర్ గారికి నమస్కరించి, సర్పంచ్ ని, బ్యాంకు మేనేజర్ ని వారికి పరిచయం చేసారు. పిల్లలు అందరూ ఒక్కసారిగా ‘భారత్ మాతా కి జై’ ‘నాయక అమర్ రహే’ అని నినాదానాలు చేసారు. అది చూసి నాయక తల్లి తండ్రుల కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
రామ్మూర్తి మాస్టారు వారి దగ్గరకు వెళ్లి “అమ్మా మీరు ఒక వీరుడికి జన్మ నిచ్చి, వీరమాత అయ్యారు. మీ త్యాగం భారత జాతి మొత్తం గుర్తుంచుకుంటుంది. మేము కూడా మీకు అండగా ఉంటాము. ఈ పిల్లలు అందరూ మీ పిల్లలే అనుకోండి” అని అన్నారు. పిల్లలు అందరూ వరసగా వచ్చి వారికి పాదాభివందనం చేసారు. సర్పంచ్ రాములమ్మ, బ్యాంకు మేనేజర్, మాస్టారు కూడా వారి పాదాలకి నమస్కారం చేసారు.
అది చూసి అక్కడి వారి హృదయాలు భారంగా మూలిగాయి. జిల్లా కలెక్టర్ ద్వారా తమ సహాయాన్ని చెక్కు రూపంలో, నాయక్ కుటుంబానికి అందజేశారు సర్పంచ్, మాస్టారు, బ్యాంకు మేనేజర్.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ “ఒక దేశభక్తుని కుటుంబానికి సంఘీభావం తెలపడానికి మూడున్నర గంటలు ప్రయాణం చేసి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరు కూడా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. సైనికులు లేని నాడు మన జీవితాలకు భద్రత లేదు, శాంతి లేదు. వారి సేవలు అమూల్యమైనవి. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి.
సినిమా హీరోలు, క్రికెట్ ఆటగాళ్ళు కాదు, సిపాయిలే మనకి అభిమానులు, ఆదర్సప్రాయులు అని అందరూ తెలుసుకోవాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అందరూ భోజనాలు చేసి, ప్రశాంతంగా మీ వాహనాలలో మీ ఊరు వెళ్ళండి. మీరు క్షేమంగా చేరినట్టు మా పి. ఏ. కి ఫోన్ చేయండి” అని పి. ఏ. కేసి తిరిగారు. ఆయన వెంటనే సర్పంచ్ రాములమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఫోను నెంబర్ తీసుకుని, తన ఫోన్ నెంబర్ ఆమెకి ఇచ్చారు.
మీడియా వారు కూడా శివపురం ప్రజలకు అభినందనలు తెలిపారు.
******
సమాప్తం
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

