రామాయణంలో ఋష్యశృంగుడి పాత్ర మరియు శృంగేరి పీఠం నేపథ్యం
Ramayanamlo Rushyasrungudi Pathra Mariyu Sringeri Peetam Nepathyam - Telugu Article | R C Kumar
రామాయణంలో ఋష్యశృంగుడి పాత్ర మరియు శృంగేరి పీఠం నేపథ్యం - తెలుగు వ్యాసం | ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 19/04/2026
రామాయణంలో అనేక మహర్షులు ఉన్నా, ఒక కీలకమైన పాత్ర పోషించిన మహర్షి ఋష్యశృంగుడు.
ఆయన లేకుండా శ్రీరామ జననం కూడా సంభవించేది కాదు అని పురాణాలు చెబుతున్నాయి.
ఈ వ్యాసం ఆ మహర్షి జీవితం, ఆయన తపస్సు, మరియు శృంగేరి పీఠంతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తుంది.
ఋష్యశృంగుడి కథ రామాయణంలోని బాలకాండలో కనిపిస్తుంది. ఈ గొప్ప ఋషి యొక్క వృత్తాంతం చెప్పుకోబోయే ముందు దశరథుని కుమార్తె గురించి తెలుసుకోవాలి. దశరథుడికి అసలు కుమార్తె ఉందా? లేదా? అనే సందేహం కొందరికి కలుగక మానదు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ప్రస్తావించబడలేదు, కానీ పద్మ పురాణం, స్కంద పురాణం, విష్ణు పురాణం మరియు కొన్ని ప్రాంతీయ రామాయణాలలో విస్తృతంగా వివరించబడింది. శాంత దేవి దశరథ మహారాజు యొక్క సొంత కుమార్తె అని ఈ పురాణ గాథలు చెబుతున్నాయి. ఈమె దశరథ మహారాజు మరియు కౌసల్యల మొదటి సంతానం. దశరథునికి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించకముందే శాంత అనే కుమార్తె జన్మించింది. శాంతను, పిల్లలు లేని అంగదేశపు రాజు రోమపాదుడికి దశరథుడు దత్తతగా ఇచ్చారు. అతనికే ఎందుకు దత్తత ఇచ్చారు? రోమపాదుడు దశరథుని స్నేహితుడు మరియు అతని భార్య కౌసల్యకు సోదరి. కాబట్టి శాంత అంగదేశంలో రాజకుమారిగా పెరిగింది. ఆమె వేదవేదాంగాలు, అస్త్రవిద్యల్లో నైపుణ్యం సంపాదించింది.
ఇప్పుడు ఋష్యశృంగుడి వృత్తాంతంలోకి వెళ్దాం.
+++++++++++++++++++++++++++++++
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యావందనం చేసుకొనే సమయాన, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న అందగత్తె ఊర్వశి కనిపిస్తుంది. ఊర్వశిని చూసి విభాండక మహర్షి తన వీర్యాన్ని సరోవరంలో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ముతో పుట్టిన బాలుడికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలుడికి ఋష్యశృంగుడు అని పేరు పెట్టి పెంచుకుంటాడు విభాండకుడు. జింక ఏమిటి? వీర్యం తాగి గర్భం ధరించడం ఏమిటి? అనే సందేహం కలగడం సహజం. పురాణాల్లో మనం బాహ్యంగా చూసే సంఘటనల వెనుక లోతైన ఆధ్యాత్మిక కారణాలు ఉంటాయని తెలుసుకోవాలి. పైకి మరోలా కనిపించే సంఘటనలు లోక కళ్యాణార్థం అంతర్లీనంగా దాగి ఉన్న వాస్తవాలకు ప్రతీకగా ఉంటాయి. అందుకే పురాణ గాథల వెనుక దాగివున్న లోతైన తాత్విక, శాస్త్రీయ, చారిత్రక వాస్తవాలను వక్రీకరించి చూడకూడదు. ఆ జింక విభాండక మహర్షి వీర్యం తాగడం రామాయణ గాథకు నాంది పలికింది అనే విషయాన్ని గ్రహించాలి.
ఒకసారి చిత్రరేఖ అనే అప్సరస ఇంద్రుడి సభలో నాట్యం చేస్తోంది. ఆవిడ నాట్యానికి చాలా లేళ్ళు గుంపులుగా వచ్చేశాయి. అంత చక్కటి నాట్యం ఆవిడది. పాపం అన్ని లేళ్ళు ఒకేసారి వచ్చేసరికి చిత్రరేఖ నాట్యం చేస్తూ ఆ లేళ్ళవైపు చూసింది. ఇంద్రుడికి కోపం వచ్చి చిత్రరేఖను 'మృగంగా మారిపోదువు గాక!' అని శపించాడు. పాపం చిత్రరేఖ బాధపడి శాపవిమోచనం కోరింది. 'ఎలాగూ శపించేశాను, అది తిరిగి తీసుకోవడానికి కుదరదు. నీకు మనిషి రూపంలో ఒక అబ్బాయి పుడతాడు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది' అన్నాడు ఇంద్రుడు. ఆ చిత్రరేఖే ఈ మృగం అన్నమాట. మృగానికి పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయికి ఒక చిన్న కొమ్ము కూడా ఉంది. ఆ బాలుడే ఋష్యశృంగ మహర్షి. (ఋష్యం = జింక, శృంగం = కొమ్ము). ఋష్యశృంగుడు పుట్టాక, చిత్రరేఖకు శాపవిమోచనం కలిగి మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది.
ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై విభాండక మహర్షి నేర్పుతాడు. విభాండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకంలోని స్త్రీపురుష తారతమ్యాలు కూడా తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో అసలే తెలియదు. కొన్ని సందర్భాల్లో స్త్రీలతో పరిచయం లేని అమాయకుడిని లేదా స్త్రీలకు దూరంగా పెరిగిన వారిని ఉద్దేశించి సరదాగా లేదా వెటకారంగా "ఆయనో ఋష్యశృంగుడు" అని వాడుతుంటారు (ప్రవరాఖ్యుడు అని కూడా అంటారు). ఋష్యశృంగుడు మండుతున్న అగ్నిగుండం వలె తేజస్సు కలిగి ఉండేవాడు. ఆయన తపశ్శక్తి ఎంత గొప్పదంటే, ఆయన అడుగుపెట్టిన చోట ప్రకృతి అనుకూలించడమే కాకుండా దేవతలు కూడా ప్రసన్నులవుతారు.
ఇలా ఉండగా, అంగరాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. దశరథుడి నుంచి దత్తతగా పొందిన శాంత తప్ప అతనికి పుత్ర సంతానం లేదు. రోమపాదుడు సంతానం కోసం బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక బ్రాహ్మణుడు తాను దానం తీసుకుని మళ్ళీ తన కొడుకును తీసుకువచ్చి అతనికి ఒక గోవునిమ్మన్నాడు. దానికి రోమపాదుడు 'ఈ బ్రాహ్మణులకు ఆశ ఎక్కువ, ఎంత ఇచ్చినా చాలదు' అని నిందించాడు. ఆగ్రహించిన ఆ బ్రాహ్మణుడు 'తన కొడుక్కి ఒక్క గోవు ఇమ్మని అడిగితే మొత్తం బ్రాహ్మణ జాతినే అవమానించావు కాబట్టి నీ రాజ్యంలో వర్షాలే లేకుండా పోతాయి' అని శపించి, తండ్రీ కొడుకులిద్దరూ వెళ్ళిపోతారు. ఆ కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో కరువు వస్తుంది. రోమపాదుడు దిక్కుతోచక పశ్చాత్తాపంతో మిగిలిన బ్రాహ్మణులను, పండితులను, మంత్రులను సంప్రదించాడు. వాళ్ళు రోమపాదుడికి ఋష్యశృంగ మహర్షి పవిత్రతను, తపోశక్తిని వివరించి, ఆయన్ని రాజ్యంలోకి రప్పిస్తే మేలు జరుగుతుందని, అతను అడుగుపెట్టిన ప్రాంతంలో వర్షాలు పడతాయని సలహా చెబుతారు.
రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుతున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించడం కష్టతరమని కూడా వివరిస్తారు. దానికి తరుణోపాయంగా విభాండక మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వేశ్యలను పంపి ప్రేరేపించమని సలహా ఇస్తారు. మహారాజు అందుకు అంగీకరించి అందమైన వేశ్యలను పిలిపించి ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు. ఆ వేశ్యలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ ఆడుతూ పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభాండక మహర్షి ఆశ్రమంలో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని, స్త్రీపురుష భేదం తెలియని ఋష్యశృంగుడు వేశ్యలకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకువచ్చిన కామ ప్రేరేపితమైన ఆహార పదార్థాలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలుగా భావించి సేవిస్తాడు. వేశ్యలు విభాండక మహర్షి వచ్చే సమయం అయిందని తెలుసుకొని వెళ్ళిపోతూ పోతూ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకొంటారు. మన సినిమాల్లో వాంప్ పాత్రలు చేసే పని అదే కదా. వారు కౌగిలించుకొన్న తరువాత విషయ వాంఛలు లేని ఋష్యశృంగుడికి ప్రేమ తెగులు పుడుతుంది. వాళ్ళని చూడాలి అనే కోరికతో వారికోసం వెతుకుతూ వెళ్ళగా ఒకచోట ఆ వేశ్యలు కనిపిస్తారు. వారు ఋష్యశృంగుడిని తమ ఆశ్రమానికి రమ్మని ఆహ్వానిస్తారు. ఋష్యశృంగుడు అంగీకరించి వారి వెంట అంగదేశంలో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షం పడుతుంది. ఆ విధంగా రోమపాదుడి కోరిక నెరవేరింది.
కపట నాటకం ద్వారా ఋష్యశృంగుడిని తీసుకువచ్చిన విషయాన్ని రోమపాదుడు ఆయన తండ్రి అయిన విభాండక మహర్షికి చెప్పి ఆయనను క్షమించమని కోరుకొంటారు. రోమపాదుడు తన పెంపుడు కుమార్తె అయిన శాంతను (దశరథుని కుమార్తె) ఇచ్చి ఋష్యశృంగుడికి వివాహం చేశాడు. ఋష్యశృంగుడు ఎంత గొప్ప ఋషో, అతని వల్ల కలిగే మేలు ఏమిటో తెలిసినవాడు కనుక విభాండకుడు కోపగించక ఋష్యశృంగుణ్ణి, శాంతను ఆదరించాడు. దశరథ మహారాజుకు పుత్రకామేష్ఠి యాగం చేయాలనే సంకల్పం కలిగినప్పుడు, ఈ యాగాన్ని నిర్వహించడానికి అత్యంత పవిత్రుడు, గొప్ప తపోశక్తి కలవాడైన ఋష్యశృంగుడు మాత్రమే సరైనవారని మంత్రి సుమంతుడు గుర్తు చేశాడు. దశరథుడి కోరిక మేరకు అల్లుడైన ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి సరయూ నదీ తీరంలో అత్యంత నిష్ఠతో పుత్రకామేష్ఠి యజ్ఞాన్ని (అశ్వమేధ యాగం తర్వాత) నిర్వహిస్తాడు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో యజ్ఞకుండం నుండి ఒక దివ్య పురుషుడు (అగ్ని దేవుడు) బంగారు పాత్రలో దివ్యమైన పాయసాన్ని తెచ్చి దశరథ మహారాజుకు ఇస్తాడు. ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలకు (కౌసల్య, కైకేయి, సుమిత్ర) సమానంగా పంచి ఇస్తాడు. దీని ఫలితంగానే కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు కవలలైన లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు జన్మించారు. ఆ విధంగా ఋష్యశృంగుడు గొప్ప తపస్సంపన్నుడే కాకుండా శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడిని లోకానికి అప్పగించి, రామరాజ్యాన్ని ప్రసాదించి, రాక్షసబాధలతో సతమతమవుతున్న ప్రజలను కాపాడిన గొప్ప పుణ్యాత్ముడు.
ఇక ఋష్యశృంగుడికి శృంగేరి మఠానికి ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం !
+++++++++++++++++++++++++++++++++++++++++++++++
ఋష్యశృంగుడు తీవ్రమైన తపస్సు చేసిన ప్రదేశం కావడం వల్ల, ఈ ప్రాంతాన్ని మొదట్లో "ఋష్యశృంగగిరి" అని పిలిచేవారు, కాలక్రమేణా అది "శృంగగిరి"గా, ఆపై "శృంగేరి" గా మారింది. ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరికి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. ఈ ఆలయంలో శివలింగానికి శృంగం ఉండడం గమనించవచ్చు. శృంగేరికి ఆ పేరు ఋష్యశృంగ మహర్షి వల్లే వచ్చింది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ తీవ్ర క్షామం అనుభవిస్తున్న ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి జగద్గురువుల ఆదేశాల మేరకు పూజలు చేస్తూవుంటారు. ఫలితంగా వారి ప్రాంతాలలో చక్కగా వానలు పడి సుభిక్షమవుతాయి. అద్వైత సిద్ధాంత స్థాపన కోసం అనువైన, పవిత్రమైన ప్రదేశం కోసం శంకరాచార్యులు అన్వేషిస్తూ శృంగేరి చేరుకున్నప్పుడు, ఆయన పవిత్రమైన తుంగ నది ఒడ్డున ఒక అసాధారణ దృశ్యాన్ని చూశారు. ప్రసవ వేదనతో ఉన్న ఒక కప్పను, మండే మధ్యాహ్నపు ఎండ నుండి కాపాడటానికి ఒక నాగుపాము తన పడగను విప్పి నీడను ఇస్తోంది. ప్రకృతి వైరుధ్యాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పిన ఆ ప్రదేశం యొక్క పవిత్రతకు ముగ్ధులై, శంకరాచార్యులు తన మొదటి మఠాన్ని స్థాపించడానికి అదే ప్రదేశాన్ని ఎంచుకున్నారు.
కృష్ణార్పణం
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్ |






Comments