top of page
Original.png

సాధన

6 hours ago
3 min read

గురుకులంలో నలుగురు రాజకుమారులు సాధన చేస్తున్న దృశ్యం – కృషి పట్టుదలతోనే విజయం అనే సందేశాన్ని వివరిస్తున్న గురువు

Sadhana - Telugu Moral Story | Ganti Asa Padmini

సాధన - తెలుగు నీతి కథ | గంటి ఆశ పద్మిని

Published in manatelugukathalu.com on 09/10/2026


“సాధన” కేవలం రాజకుమారుల కథ కాదు… విజయం వెనుక దాగి ఉన్న కృషి, పట్టుదల, ఏకాగ్రతకు అద్దం పట్టే ప్రేరణాత్మక నీతి కథ.


అనగనగా ఒక రాజు. ఆ రాజుకి నలుగురు కొడుకులు. ఆ నలుగురిని మంచి విద్యావంతులను చేయడానికి గురుకులానికి పంపించాడు ఆ రాజు. గురువుగారు అన్ని విద్యలు నేర్పుతున్నారు.


కొంత కాలం తర్వాత రాజు 'నా కుమారులు అన్ని విద్యలు నేర్చుకుని ఉంటారు' అని తలచి... ఒక రోజు రాణితో సహా గురుకులానికి వచ్చాడు.


గురుకులంలో ఆ రోజు పిల్లలందరికీ వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి. పిల్లలందరూ అన్ని పోటీల్లో పాల్గొన్నారు.


“ప్రశ్న, సమాధానం” పోటీలో రాజుగారి మొదటి కుమారుడు అందరి పిల్లలకన్నా బాగా, అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నాడు.


“విలువిద్యల” ప్రదర్శనలో రాజుగారి రెండో కుమారుడు అందరికన్నా బాగా ప్రదర్శన ఇచ్చి మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.


“ప్రశ్న, సమాధానం” పోటీలో, “విలువిద్యల ప్రదర్శనలో” రాజుగారి మూడో కుమారుడు రెండో స్థానాన్ని సంపాదించాడు.


అన్ని పోటీల్లో పాల్గొని ఎందులోనూ ఏ స్థానమూ సంపాదించలేకపోయాడు రాజుగారి నాలుగో కుమారుడు.


పోటీలు ముగిసిన అనంతరం రాజుగారు గురువు దగ్గరకు వచ్చారు. గురువు రాజుగారికి సకల మర్యాదలు చేశారు. గురువు చేసిన మర్యాదలు స్వీకరించిన తర్వాత రాణి గురువును ఇలా ప్రశ్నించారు:


‘నా నలుగురు కుమారులు ఒకే గురుకులంలో, ఒకే విద్యను, ఒకే గురువు దగ్గర నేర్చుకుంటున్నారు. మరి పోటీ విజయ ఫలితాల్లో ఇంత వ్యత్యాసం ఎలా, ఎందుకు వచ్చింది?’ అని అడిగారు.


రాణిగారి ప్రశ్నకు, గురువు ‘మహారాణీ! మీరు వచ్చే పౌర్ణమినాటి సంధ్య సమయమున ఇక్కడకు రండి, మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను’ అని బదులిచ్చారు. రాజు సరేనని రాజ్యానికి తిరిగి వెళ్లిపోయారు.


రోజులు గడిచాయి, పౌర్ణమి రోజు రానే వచ్చింది. రాణి తన ప్రశ్నకు సమాధానం కోసం గురుకులానికి రాజుగారితో బయలుదేరారు. ఉదయాన్నే బయలుదేరిన రాజు సాయంత్రానికి సరిగ్గా గురువు చెప్పిన సమయానికి గురుకులానికి చేరుకున్నారు.


రాణి గురుకులానికి చేరే సమయానికి సరిగ్గా గురువు “రేపు ప్రతి మాసము మల్లే ఈ బహుళ పాడ్యమికి మీకు పోటీ పరీక్షలు అని గుర్తుంది కదా, అందరూ బాగా సాధన చేయండి” అని చెప్పి విద్యార్థులందరినీ తమ తమ గదుల్లోకి పంపించేశారు.


గురువు మాటలు విని, 'ఏమిటి! ప్రతి బహుళ పాడ్యమి నాడు విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తారా! మరి నన్ను ఎందుకు ఇవాళ రమ్మని చెప్పారు?' అని ప్రశ్నించింది రాణి.


'మీ ప్రశ్నకు సమాధానం ఈ రోజే దొరుకుతుంది' అని బదులిచ్చాడు గురువు. 'చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం ఏమిటి?' అని అడిగింది రాణి.


ఇంతలో ఒక శిష్యుడు వచ్చి రాత్రి అల్పాహారం సిద్ధమని చెప్పాడు. పిల్లలందర్నీ అల్పాహారం ముగించుకుని వెళ్ళి పడుకోమని ఆదేశించాడు గురువు. అందరూ అల్పాహారం ముగించుకుని పడుకునేందుకు వెళ్లారు.


కొంతసేపు తర్వాత గురువు, రాజును, రాణిని తమతో పాటు రమ్మని పిలిచారు. ముగ్గురూ విద్యార్థుల పడక గది వద్దకు వెళ్లారు.


అక్కడ రాజుగారి పెద్ద కుమారుడు, “ఎలాగైనా వేదాల పైన పట్టు సాధించాలి అనే గట్టి పట్టుదలతో ‘ప్రశ్న జవాబు’ అనే పోటీలో ఎలాగైనా తానే మొదటి స్థానం పొందాలి అనుకుని కేవలం తాళపత్ర గ్రంథాలు చదువుతూ” సాధన చేయసాగాడు.


అలా ఇంకొంచెం ముందుకు వెళితే రాజుగారి రెండో కుమారుడు, “నేను యుద్ధంలో ఓడిపోకూడదు అంటే ఈ విలువిద్యలు బాగా నేర్చుకోవాలి.


రేపు ‘విలువిద్యల’ పోటీలో ఎలాగైనా నేనే గెలవాలి అనుకుని మిగతా పోటీల గురించి వదిలేసి, కేవలం విలువిద్యల పోటీ గురించి ఆలోచించి కత్తిని ఎలా తిప్పాలి, ఎదుటివారి నుంచి తనని తాను ఎలా రక్షించుకుంటూ పోటీ గెలవాలి అని సాధన చేస్తున్నాడు”.


ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ రాజుగారి మూడో కుమారుడు, “కూర్చొని తాళపత్ర గ్రంథాలు చదువుతున్నాడు. ఒక ప్రశ్నకు జవాబు చదవగానే వెళ్ళి విలువిద్యల పోటీకోసం సాధన చేస్తున్నాడు. కానీ రెండింట్లో ఓడిపోతానేమో?” అని భయపడుతున్నాడు.


ఇంకా ముందుకు వెళ్తే అక్కడ రాజుగారి నాలుగో కుమారుడు, “ఏ విద్యను అభ్యసించకుండా, ఏ సాధన చెయ్యకుండా నిద్రపోతున్నాడు”.


రాణికి తన నలుగురు కుమారుల్నీ చూపించి, “మహారాణీ! మనం ఏది సాధించాలన్నా మనకు ఆ పనిపైన ఇష్టం, ఆ ఇష్టానికి తగ్గ సాధన, కృషి, పట్టుదల చాలా అవసరం.


ఎవరు ఏ స్థానం సొంతం చేసుకున్నా వాళ్ళ సాధన, కృషి, పట్టుదల వలనే” అని రాణిగారి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు గురువు.

*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.

నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page