ఆర్థిక సంబంధాలు

Arthika Sambandhalu - Telugu Family Story | Penumaka Vasantha
ఆర్థిక సంబంధాలు - తెలుగు కుటుంబ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 09/10/2026
“ఆర్థిక సంబంధాలు” కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, ఆస్తి కోసం మారుతున్న మనుషుల మనస్తత్వాన్ని ప్రతిబింబించే హృదయస్పర్శి కథ.
సుమన్, తన నాన్నకు చెప్పినట్లే, ఐదేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి ఇండియా వచ్చాడు. వచ్చేప్పుడు భార్య ప్రణవి, "ఎందుకు? ఇండియా పోవటం మళ్ళీ మీ నాన్న బాధ్యత మన మీద పడుతుంది" అంది.
"లేదు డియర్..! పిల్లలు చిన్న పిల్లలపుడే మనం ఇండియా వెళ్ళాలి. తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత, అసలు ఇండియా వెళ్ళలేము. అక్కడ నాన్నకు పెద్ద వయసై, పొలాలు అవి చూసుకోలేకపోతున్నాడు.
వాటిని కాస్తా, 'మా చెల్లెళ్ళు..! నాన్నను మేము చూస్తున్నాంగా?' అని తీసుకున్నా తీసుకుంటారు. నీకు సిటీలో పెద్ద విల్లా కొనే తీసుకెళ్తాను.
మీ అమ్మ వాళ్ళకు దగ్గరలోనే విల్లా తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ పనివాళ్ళు ఉండరు. అక్కడ మీ అమ్మ వాళ్ళ దగ్గర పిల్లలను వదిలి, మనం ప్రతి సమ్మరుకు కాశ్మీర్ కానీ, ఊటీ కానీ వెళ్దాం, సరేనా?" అన్నాడు.
భర్త అలా కన్విన్సింగ్‌గా మాట్లాడేసరికి చివరికి ఒప్పుకుంది ప్రణవి. ఇండియాకు పూర్తిగా వచ్చారు సుమన్, ప్రణవి, పిల్లలు ఆశిష్, ఆనిష్‌లూ. ఒక వారం రెస్ట్ తీసుకుని తన ఊరికి వెళ్ళాడు నాన్న దగ్గరికి సుమన్. నాన్న సోమేశ్వరరావు పెద్ద వయసు వల్ల కొంచెం నీరసంగా ఉన్నాడు.
సుమన్‌ను చూసి ఆనందపడ్డాడు సోమేశ్వరరావు.
"ఇల్లు బాగు చేయించాను. ఇక్కడే ఉంటారుగా..!" అన్న నాన్నతో, "లేదు నాన్నా..! నేను సిటీలో పెద్ద విల్లా తీసుకున్నాను. నువ్వు అక్కడికి రా..! మా దగ్గర ఉందువుగానీ. పిల్లలను సిటీ స్కూల్‌లో జాయిన్ చేశాము.
నువ్వే మాతో వచ్చేయి..." అన్నాడు సుమన్. చేసేది లేక సోమేశ్వరరావు వాళ్లతో కలిసి సిటీకి బయలుదేరాడు.
దారిలో వెళ్తూ, ఏదో హోటల్‌లో అన్నం తిని సిటీకి వెళ్లారు. హోటల్‌లో తిండి సయించి చావదు, వాటిల్లో ఎక్కువ మసాలాలు వేస్తారని ఏదో తిన్నాడు.
మరుసటి రోజు పొద్దునే లేచి కాఫీకి ఎదురు చూశాడు సోమేశ్వరరావు. ఎంతకీ కోడలు లేవలేదు, ఇవ్వలేదు. వాళ్ళు పదింటికి కాఫీ తాగుతూ ఇచ్చారు, చేసేదిలేక తాగాడు.
వంట ఎప్పుడో రెండింటికీ చేస్తే వెళ్ళి తిన్నాడు. భార్య గుర్తు వచ్చింది. వెంటబడి కాఫీ, టిఫిన్ అని పెడుతూ ఉండేది. అన్నం ఒంటిగంట అయ్యేసరికి, "వస్తున్నారా..! అన్నం వడ్డించనా..." అంటే, "ఆగు కాసేపాగి తింటాను" అనేవాడు. ఇప్పుడు ఈమధ్య ఊరికే గుర్తు వస్తుంది భార్య భూదేవి.
ఇలా పది రోజులు గడిచిన తర్వాత, "ఇల్లు ఎలా ఉందో? వెళ్తాను" అన్నాడు సోమేశ్వరరావు. "అద్దెవాళ్ళు ఉన్నారుగా..! నాన్న ఎందుకు ఈ వయసులో అటూఇటూ తిరుగుతారు?" విసుక్కున్నాడు సుమన్.
"లేదులేరా..! తోచటం లేదు, పొలాలు ఏమయ్యాయో? నిన్న పొలం చేసే కామయ్య ఫోన్ చేశాడురా." ఏదో నోటికి వచ్చిన అబద్ధం ఆడి ఇంటికి బయలుదేరాడు. సోమేశ్వరరావు సొంత ఇంట్లో హాయిగా పొద్దునే లేచి, కాఫీ తాగుతూ, ప్రశాంతంగా ఉన్నాడు. వంటామెను రమ్మని కబురు చేశాడు.
సుమన్, సోమేశ్వరరావును రమ్మని చెప్పలేదు. సోమేశ్వరరావు సిటీకి వెళ్లనూ లేదు. తన పెన్షన్, పొలం కౌలు వస్తుంటే తిని కాలక్షేపం చేస్తున్నాడు.
పెద్ద కూతురు అమెరికా నుండి ఫోన్ చేసింది. "నాన్నా..! అదేంటి, అన్నయ్య దగ్గర ఉండకుండా వచ్చావు?" "ఏమీ లేదమ్మా..! వాళ్ళు త్వరగా లేవరు, అన్నాలు తినటం కూడా ఒక వేళా పాళా లేదు.
ఇక్కడ నేను పొద్దునే లేస్తాను. లేవగానే వెధవ ప్రాణానికి కాఫీ లేకపోతే బండి నడవదు. ఎందుకు వాళ్ళను ఇబ్బంది పెట్టడమని వచ్చానమ్మా..!" "ఇక్కడకు వస్తావా..! టికెట్ బుక్ చేయనా..?" "వద్దులే తల్లీ..! ఈ వయసులో ఎక్కడికీ ప్రయాణం చేయలేను."
"నాన్నా..! మా ఆయన పొలంలో వాటా ఇమ్మని అడుగుతున్నారు. మా ఆడపడుచుకు ఈమధ్యే పొలం అమ్మితే డబ్బు ఇచ్చాం. నీకు పొలం అమ్మటం ఇష్టం ఉండదు కాబట్టి ఒక ఎకరం రాయి నాన్నా..!" అంది. "పెళ్లికే ఇచ్చేదేదో ఇచ్చాను. ఇక నా వల్ల కాదు.
మీ అన్న అమెరికా నుండి రాగానే పొలం దస్తావేజులు తీసుకున్నాడు. ఇంకోసారి పొలం మాట ఎత్తకు. నువ్వు ఫోన్ చేయకపోయినా పర్లేదు!" అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు సోమేశ్వరరావు.
చిన్న కూతురు దగ్గర్లో ఉంటుంది. ఒక నాలుగు రోజులు తండ్రిని చూసి పోదామని వచ్చింది. "నాన్నా..! అన్నయ్య వచ్చి కనీసం ఫోన్ చేయటం కానీ, ఇంటికి రమ్మనటం కానీ చేయలేదు నన్ను."
"వాడు ఆఫీసు వర్క్‌తో బిజీగా ఉన్నాడు లేమ్మా..!" అంటూ కొడుకును వెనకేసుకొచ్చాడు.
"నాన్నా..! మా ఆయనకు బిజినెస్‌లో లాస్ వచ్చింది. కొంచెం డబ్బు ఏమన్నా సర్దమను, లేదా పొలం మీద లోను పెట్టి డబ్బివ్వమను మీ నాన్నను అన్నాడు మా ఆయన."
"పొలం దస్తావేజులు ఎక్కడున్నాయి? మీ అన్న తీసుకుపోయాడు. నాకు తెలీక అడుగుతాను, నా దగ్గర చెట్లకు డబ్బులు కాస్తున్నాయా?" కోపంగా అన్నాడు సోమేశ్వరరావు.
ఇంకా నాలుగు రోజులు ఉందామనుకుని, నాన్న డబ్బులు ఇవ్వకపోతే ముందే వెళ్ళింది చిన్న కూతురు. భార్య ఉన్నన్నాళ్ళు ఇదే గోల చేసేది— "కనీసం ఆడపిల్లలకు ఇళ్ల స్థలమన్నా ఇవ్వండి. తర్వాత అల్లుళ్లు పొలం అడిగే స్థితికి తెచ్చుకోకండి.
మా నాన్న నాకిచ్చిన స్థలం కాస్తా అప్పుడు అమ్ముకున్నారు. ఇప్పుడు వాళ్లకు అదిస్తే, ఆడపిల్లలు మనం చస్తే కనీసం చూడటానికి వస్తారు. ఇప్పుడు మన చిన్నప్పుడు లాగా ప్రేమలు, ఆప్యాయతలు లేవు" అనేది.
'దాని మాట ఎక్కడ విన్నాను? కొడుకును కని వాడికి ఆస్తి ఇవ్వకుండా ఈ ఆడవాళ్లకు ఇవ్వటం ఏంటి?' మనసులో తిట్టుకున్నాడు. 'ఆడవాళ్లని మాట్లాడనిస్తే ఇదిగో, పొలాలు, ఇల్లు మిగలవు' అనుకున్నాడు మనసులో.
సుమన్, పిల్లలు పడవలు చేసి ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నాడు. ఒక పడవ వచ్చి సుమన్ కాళ్ల దగ్గర పడింది. ఆ కాగితం మీద అమ్మ రైటింగ్ కనపడితే తీసుకుని చూశాడు.
ఆ కాగితంపై, సుమన్ ఫోన్ చేస్తే తీయడు, దూరాన ఉన్నాడు, వాడు బావుండాలి, వాడు బావుండాలి... అని రామకోటి రాసినట్లు ఆ పేజీ మొత్తం రాసి ఉంది.
"అరేయ్ ఏది, ఆ కాగితాలు ఇటు ఇవ్వండి..." ఇంకా పిల్లల దగ్గరున్న కాగితాలు తీసుకున్నాడు సుమన్. దాంట్లో అంతా అమ్మ తన గురించే రాసుకుంది. ఎక్కడ దొరికాయి ఇవి అంటే, ఒక పాత డైరీ తెచ్చిచ్చారు.
మొన్న తెచ్చిన పొలం కాగితాలతో పాటు ఈ డైరీ కూడా వచ్చింది. దాంట్లో తన ఆవేదన రాసుకుంది అమ్మ.
'ఒక తల్లి తను కన్న ముగ్గురు పిల్లలే మాట్లాడుకోకపోతే ఇక ఈ సమాజం ఎటు పోతుంది? ఎవరూ డబ్బు పెట్టుకోక్కరలేదు, వారానికి ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటే ఎంత బావుంటుంది? ఎంతకీ 'నేను గొప్ప' అనే ఈ అహంకారం పోనన్నాళ్లు మనుషుల మధ్య సంబంధాలు ఎక్కడ ఉంటాయి? అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం లాగా అయిపోయింది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయ్యాయి. పోయేటప్పుడు ఈ డబ్బు తీసుకుని పోము కదా?' ఇక డైరీ చదవలేక తన రూంలోకి తీసుకెళ్లాడు.
పిల్లలు పుట్టిన తర్వాత తెలిసింది పిల్లల పెంపకం ఎంత కష్టమైనదని. అప్పుడు పేరెంట్స్ విలువ తెలిసింది. "నా పెళ్లికి ముందు అమ్మని ఎన్నో మాటలు అన్నాను, నాన్నకు చెప్పి నాకు డబ్బు పంపమని." "అరె, ఆయన నా మాట వినడు.
అయినా డబ్బులిస్తే తల్లితండ్రులను చూసే బంధాలు ఎక్కువ కాలం నిలబడవురా."
"అమ్మా, ఎప్పుడూ సూక్తులు చెప్పకు, వినడానికి విసుగ్గా ఉంది." ఒకసారి భరించలేక, "నీ పెళ్లయ్యేదాకా నన్ను బతకనివ్వరా..." అంది అమ్మ.
మా నాన్నకు లాగా నాకు కోపం ఎక్కువ. అమ్మ అది వద్దని చెప్పేది. "నీలాగా అందరి దగ్గరా తలవంచుకు బతకను, మా నాన్నలాగా తలెత్తుకుని బతుకుతాను" అని చెప్పాను.
మా నాన్న "దాని మాటలు వినకండి, ఎవరి దగ్గరా తలవంచకండి" అనేవాడు. ఆయన ప్రవర్తన వల్ల ఎక్కువ మంది ఎవరూ ఇంటికి వచ్చేవారు కారు, చుట్టుపక్కల కూడా ఎవరూ పలికేవారు కారు.
ఇంతలో పిల్లలు వచ్చి మళ్ళీ కాగితాలు ఇమ్మని సుమన్ దగ్గరికి వచ్చారు. "ఇది వద్దు! ఇంకోటి ఇస్తాను" అని న్యూస్ పేపర్ ఇచ్చాడు వాళ్లకు సుమన్.
పిన్ని వాళ్ళింట్లో ఫంక్షన్‌కు వెళ్లాడు సుమన్. సుమన్‌కు పెద్దగా ఫంక్షన్స్‌కు వెళ్లటం ఇష్టం ఉండదు. కానీ భార్య, "మీ ఇంట్లో అందరూ ఎవరితో ఎక్కువ మాట్లాడరు, ఎక్కడికీ వెళ్లరు" అని ఎక్కిరిస్తుందని పిల్లల్ని తీసుకుని ఫంక్షన్‌కెళ్లాడు. అక్కడ పిన్ని, మామయ్యలు కలిసారు.
అందర్నీ పలకరించాడు.
"ఏరా..! బావున్నాడా మీ నాన్న?" అడిగాడు పెద్ద మామయ్య. ఆ మాటలో వ్యంగ్యం ధ్వనించింది. "బావున్నాడు మామయ్య..!" అన్నాడు సుమన్.
"ఎందుకు బావుండడు? మీ అమ్మను కాల్చుకు తిన్నాడు ఉన్నన్నాళ్ళు. మా ఇళ్లకు రానిచ్చాడా, మాతో మాట్లాడనిచ్చాడా? నువ్వైనా మీ చెల్లెళ్లతో మాట్లాడుతున్నావా? అది ఉన్నన్నాళ్ళు మీ ఫ్యామిలీ కలిసికట్టుగా ఉండాలని తాపత్రయ పడింది.
'పిల్లల్తో కూడా సరిగా మా ఆయన మాట్లాడడు' అని మీ అమ్మ వాపోతుండేదని..!" మామయ్య అన్నాడు.
"ఆ..." అని తల ఊపాడు సుమన్. ఇదంతా తన భార్య గమనిస్తుందని టాపిక్ మార్చాడు సుమన్. ప్రణవి ఇంటికొచ్చిన తర్వాత అంది— "అందరూ మీ అమ్మ మంచితనం గూర్చి చెప్పేవారే. పాపం, అత్తయ్యగారితో నేను ఎక్కువ టైం గడపలేకపోయాను."
దానికి ఏమీ జవాబివ్వకుండా మౌనంగా ఉన్నాడు. ఒక వారం తర్వాత పెద్ద మామయ్య కాల్ చేస్తే ఎత్తాడు సుమన్.
"సుమన్..! మీ అమ్మ చనిపోయిందని కాశీ నుండి ఆశ్రమం వాళ్ళు ఫోన్ చేశారు. మేము వెళ్తున్నాం" అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే బయలుదేరాడు సుమన్. నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు అమ్మ చనిపోయిందని.
"నా ఇంటినుండి నాకు చెప్పకుండా వెళ్లిన రోజే అది నా దృష్టిలో చచ్చింది. నేను రాను..!" అన్నాడు సోమేశ్వరరావు.
"సరే, నేను వెళ్తున్నా...!" అని భార్య, పిల్లలతో కలిసి కాశీ వెళ్లాడు. సుమన్‌కు చెప్పకుండా వెళ్లినందుకు అమ్మ మీద కోపంగా ఉన్నా, ఎక్కడో మనసులో తనను ఎంత ప్రేమగా చూసిందో గుర్తుకు వచ్చింది. ఒక్కసారి అమ్మ స్మృతులు వెంటాడాయి.
అమ్మకు లౌక్యం తెలియదు, ముక్కుసూటిగా మాట్లాడటం, తప్పుంటే మొహాన చెప్పటం— ఇది ఆమె నైజం. ఇదే ఆమె లక్ అండ్ బ్యాడ్‌లక్. నాన్నకు ఎవరైనా తనని విమర్శిస్తే ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చేది.
ఒకరోజు నాన్న ఫోన్ చేశాడు. "మీ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిందో తెలియదు.
కోపిష్టిది, మీ అమ్మకు తలపొగరు, నాకు తగ్గట్లుగా ఉండదు. ఆ మనిషిని భరించలేక నిన్న నేను ఇంటికి తాళం వేసుకుని మీ అమ్మను బయట ఉండమని చెప్పాను.
మన పొలాలు చూద్దామని వెళ్ళి వచ్చేసరికి మీ అమ్మ లేదు, శని వదిలింది. 'ఎప్పుడు బాధ్యతలు తీరే వరకు నేనుంటాను, మీరు వెళ్లగొట్టినా...' అనేది. ఇప్పుడు చెప్పకుండా పోయింది. ఇంట్లోకి రానివ్వను దాన్ని."
మామయ్యలకు ఫోన్ చేస్తే, "మా ఇంటికి రాలేదు, పోనీరా..! అది మీ నాన్న దగ్గర కాకుండా ఎక్కడున్నా హాయిగా బతికిపోతుందిలే...!" అన్నారు. చెల్లెళ్లకు చేస్తే, "మా దగ్గరికి రాలేదు" అన్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత అమ్మ జాడ తెలిసింది.
అప్పటికే మామయ్యలు, పిన్ని, సుమన్ చెల్లెళ్లు కాశీకి వచ్చారు. ఆశ్రమం బయట ఫ్రీజర్ బాక్స్‌లో ప్రశాంతమైన వదనంతో పడుకుని ఉంది. మామయ్యలు, పిన్ని అడిగారు ఆశ్రమవాసుల్ని— "ఎలా చనిపోయింది?" అని.
"మొన్న సాయంత్రం నుండి ఛాతీలో నొప్పుగా ఉందంటే, ఆశ్రమానికి వచ్చే డాక్టర్ చూసి ఏవో మందులిస్తే తగ్గింది.
నిన్న తెల్లవారుజామున పోయింది. ఆవిడ తల కింద ఒక పుస్తకం ఉంటే తీసి చూస్తే మీ నంబర్ ఉంది" అని సుమన్ మామయ్య వైపు చూసి చెప్పాడు ఆశ్రమంలోని క్లర్క్. "ఇక్కడికి ఆరేళ్ల క్రితం వచ్చారండి. ఎవరో ఫ్రెండ్ ఈ ఆశ్రమంలో ఉన్నారని చెప్పారు. ఈవిడే ఆవిడ" అని చూపించారు రాజమ్మను ఆశ్రమం వాళ్ళు.
రాజమ్మ ఏడుస్తూ ఉంది. "మా చెల్లెలు మీకు ఏమన్నా చెప్పిందా?" అని అడిగారు సుమన్ మామయ్యలు.
"ఏమీ చెప్పలేదు, నిన్న బాగానే మాట్లాడింది. 'మీ పిల్లలకు కాల్ చేయమంటావా?' అంటే... 'వద్దు, వాళ్ళు తల్లిని పట్టించుకోలేని బిజీలో ఉంటారు. నేను పోతే ఒక్క మా అన్నయ్యకి చెప్పండి, చాలు' అంది."
ఆ మాటలకు సుమన్, చెల్లెళ్లు సిగ్గుతో తలవంచుకున్నారు. వాళ్ళు భూదేవి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాళ్ళు కారు. "అమ్మా..! మా అత్తగారు ఇంట్లో ఉన్నారు. తర్వాత చేస్తాం నీకు ఫోన్..." అనేవారు.
అక్కడ అందరూ, "భూదేవమ్మగారు ఎంత మంచి మనిషో..! ఆవిడ 'నాకు ఎవరూ లేరు' అన్నారు. ఆశ్రమంలో వంట చేసేవారు, సాయంత్రం భగవద్గీత చెప్పేవారు, అందర్నీ ప్రేమగా పలకరించేవారు" అని చెప్పారు.
ఒక చిన్న ఉత్తరం, పర్సు సుమన్ మామయ్యకు ఇచ్చారు. "అన్నయ్యా..! నేను పోతే నువ్వు వచ్చి తలకొరివి పెడితే మంచిది. నా కొడుకు అమెరికాలో బిజీగా ఉంటాడు, రాడు.
నాకు అమ్మ ఇచ్చిన హారం, గాజులు నా ఆడపిల్లలకు ఇవ్వు. వాళ్లకు నేనేమీ పెట్టడం లేదని నా మీద చిన్నచూపు, ఇవి వాళ్లకు ఇవ్వు. నా తలకొరివి పెట్టినందుకు ఆశ్రమం వాళ్లిచ్చిన డబ్బులుంటే నీకివ్వమని చెప్పాను, అవి తీసుకో. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు చెల్లెలుగా పుట్టాలని నా ఆశ." అది చదివి అందరూ ఏడ్చారు.
సుమన్ పెద్ద మామయ్య, "నువ్వు రావని నాకు బాధ్యతను ఇచ్చింది. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వే తలకొరివి పెట్టి నీ రుణం తీర్చుకో...!" అన్నాడు.
ఇప్పటికైనా అమ్మ విలువ తెలిసి రావడం వల్ల దహనక్రియలు చేశాడు సుమన్.
"ఇప్పటికైనా మీ అమ్మ ఆఖరి కోరిక తీర్చండి. 'ఎప్పుడూ మా పిల్లలు మనలాగా కలిసికట్టుగా ఉండాలి' అని కోరుకుంటే, 'వాళ్ళ ముగ్గురికీ పడదు' అని మీ అమ్మ ఏడ్చేది..." అంది పిన్ని.
"తప్పకుండా మా అమ్మ చెప్పినట్లుగా మా అన్నయ్య, మేము బావుంటాం" అన్నారు ఆడపిల్లలు కన్నీళ్లతో.
"అమ్మ కోరికను ఇప్పటికైనా తీరుద్దాం" కన్నీళ్లు తుడుచుకుంటూ చెల్లెళ్లను దగ్గరకు తీసుకున్నాడు సుమన్.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.












Comments